#Fifa2018: ఇన్సులిన్ కిట్‌తో మైదానంలో దిగే ఆటగాడు ‘అద్భుతం’ చేశాడు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పంకజ్ ప్రియదర్శి
- హోదా, బీబీసీ ప్రతినిధి
రష్యాలో జరుగుతున్న ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నీలో రెండో రోజైన శుక్రవారం (15 జూన్) మూడు మ్యాచ్‌లు జరిగాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానుల కళ్లన్నీ పోర్చుగల్-స్పెయిన్ మ్యాచ్ పైనే నిలిచాయి.
స్టార్ ఆటగాళ్లు ఉన్న జట్ల మధ్య ఈ మ్యాచ్ పోటాపోటీగా జరిగింది. ఉత్కంఠ కలిగించింది. చివరికి ఈ మ్యాచ్ 3-3తో డ్రా అయ్యింది.
ఈ మ్యాచ్ తర్వాత ఫుట్‌బాల్ ప్రేమికులు ఎక్కువగా పోర్చుగల్ కెప్టెన్, వరల్డ్ ఫేమస్ ఆటగాడు రొనాల్డో గురించే చర్చించుకున్నారు. హ్యాట్రిక్ గోల్ చేయడంతోపాటూ అతడు తన జట్టుకు ఒక పాయింట్ కూడా వచ్చేలా చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
విలన్ నుంచి హీరోగా
కానీ ఈరోజు మనం ఒక ఆటగాడి గురించి చెప్పుకుందాం. అతడి కథ వింటే ఒక కల నెరవేరినట్టే ఉంటుంది. ఆ ఆటగాడు మ్యాచ్ మొదటి నాలుగు నిమిషాలు మాత్రం విలన్ అయిపోయాడు.
కానీ మ్యాచ్ ముగుస్తోందనగా అదే ఆటగాడు దాదాపు హీరో అయిపోయాడు. అతడి పేరు జోసే ఇగ్నాసియో ఫెర్నాండెజ్ ఇగ్లేసియస్. ఈ ఆటగాడు ఫుట్‌బాల్ ప్రపంచానికి నాచోగా సుపరిచితుడు.
నాచో వయసు 28 ఏళ్లు. ఇతడు ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ అయిన రియల్ మేడ్రిడ్‌లో డిఫెండర్.
శుక్రవారం పోర్చుగల్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో నాచో మొదటి నాలుగు నిమిషాలకే విలన్ అయిపోయాడు.
నాచో ఫౌల్ వల్ల పోర్చుగల్‌కు పెనాల్టీ లభించింది. దాంతో కెప్టెన్ రొనాల్డో గోల్ వేసి స్పెయిన్ గెలుపు ఆశలపై నీళ్లు చల్లేశాడు.
కానీ నాచోకు ఈ మ్యాచ్ ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతులను అందించింది. కోస్టా స్పెయిన్ తరఫున గోల్ చేసి స్కోర్ సమం చేశాడు. కానీ హాఫ్ టైం ముందే మరో గోల్ వేసిన రొనాల్డో స్కోర్ 2-1 చేశాడు.
సెకండ్ హాఫ్‌లో స్పెయిన్ మరోసారి దూసుకువచ్చిన కోస్టా, మరో గోల్ చేసి తన స్కోర్ సమం చేశాడు.
మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో ఒక అద్భుతం నాచో, అతడి అభిమానులు నాట్యం చేస్తూ ఊగిపోయేలా చేసింది.
నాచో అద్భుతం చేశాడు
సెకండ్ హాఫ్ లో స్పెయిన్ టీమ్ పోర్చుగల్ టీమ్ ఆధిపత్యం చూపించింది. దూకుడు మీద ఉంది. పోర్చుగల్ గోల్ బాక్స్ నుంచి బంతి ఎగురుతూ నాచో దగ్గరికి చేరినప్పుడు కూడా ఒక అద్భుతం జరిగింది.
టీమ్ లెఫ్ట్ బ్యాక్ అయిన నాచోకు అది ఒక మంచి అవకాశం. అంతే అతడు దాన్ని అద్భుతమైన కిక్ కొట్టాడు. బంతి గాల్లో గిరగిరా తిరుగుతూ పోర్చుగల్ కుడి గోల్ పోస్ట్ కు తగిలింది. తర్వాత నెట్‌లోకి చేరింది.

ఫొటో సోర్స్, Getty Images
స్పెయిన్ ఆటగాళ్లు నాచోను చుట్టుముట్టేశారు, ముద్దులు పెట్టేశారు. స్టేడియంలో అతడి అభిమానులు ఆ అద్భుతమైన గోల్ చూసి ఆనందంతో చిందులు వేశారు.
అది నాచో, తన దేశం కోసం వేసిన తొలి అంతర్జాతీయ గోల్. పోర్చుగల్ కెప్టెన్ ఆఖరి క్షణాల్లో గోల్ వేసి తన జట్టును గట్టున పడేశాడు. మ్యాచ్ స్టార్ అయ్యాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా నిలిచాడు.
కానీ ఈ మ్యాచ్ చూసిన అభిమానుల మనసుల్లో నాచో చేసిన ఆ గోల్ ఎప్పటికీ నిలిచిపోయే అద్భుతం అయ్యింది.

ఫొటో సోర్స్, Getty Images
కల నెరవేర్చుకోడానికి సంఘర్షణ
ఫుట్‌బాల్ విశ్లేషకులు ఈ మ్యాచ్‌లో నాచో చేసిన గోల్ ఈ ప్రపంచ కప్‌లోనే అద్భుతం అయిన గోల్ అనవచ్చని భావిస్తున్నారు.
ఒక ఫుట్‌బాల్ ఆటగాడుగా నాచోకు స్పెయిన్‌లో చాలా పాపులారిటీ వచ్చింది. అతడి తమ్ముడు ఎలెక్స్ కూడా ఫుట్‌బాల్ ప్లేయరే. కానీ ఆ స్థాయికి చేరడానికి తను ఎన్ని కష్టాలు ఎదుర్కున్నాడో నాచో ప్రపంచానికి ఎప్పుడూ చెప్పలేదు.
2016లో తను 12 ఏళ్ల వయసు నుంచే టైప్-1 డయాబెటిస్‌తో పోరాటం చేస్తున్నట్టు నాచో ప్రపంచానికి చెప్పాడు. ఈ సమస్య వల్ల అతడి ఫుట్‌బాల్ కెరీర్ ముగిసిపోయి ఉండేది. ఆ సమయంలో అతడు రియల్ మాడ్రిడ్ యూత్ టీమ్ లో ట్రైనింగ్ తీసుకునేవాడు.
నువ్వు ఎప్పటికీ ఫుట్‌బాల్ ఆడలేవని డాక్టర్లు అతడికి చెప్పేశారు. కానీ అతడు ధైర్యం కోల్పోలేదు. స్పెయిన్ జట్టుకు ఆడాలనే తన కలను నిజం చేసుకోడానికి, పట్టుదలగా డాక్టర్ల దగ్గర సలహాలు తీసుకుని తన ప్రయత్నాలు కొనసాగించాడు.
చాలా కాలం వరకూ ఇన్సులిన్ కిట్ తీసుకుని నాచో మైదానంలోకి వెళ్లేవాడు. ప్రాక్టీస్ చేస్తూ, ఇన్సులిన్ తీసుకుంటూ, మళ్లీ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు.
ఇది 2002లో జరిగింది. 9 ఏళ్ల తర్వాత రియల్ మాడ్రిడ్ సీనియర్ టీమ్‌లో చోటు లభించినపుడు, అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిన్నప్పటి నుంచి అతడు ఏ కలను చూస్తూ వచ్చాడో అది సాకారమైంది.
రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ తమ కలలను నిజం చేసుకోలేకపోయే ఎంతో మంది పిల్లలకు ఇప్పుడు నాచో ఒక స్ఫూర్తిగా నిలిచాడు.
డయాబెటిస్ ఉన్నంత మాత్రాన సామాన్య జీవితం జీవించలేమని పిల్లలు కుంగిపోవడం సరి కాదని నాచో చెప్పాడు. ఫుట్‌బాల్ అంటే ఉన్న ఇష్టమే తను డయాబెటిస్‌పై చివరకు విజయం సాధించేలా చేసిందని అన్నాడు.
నాచో యువకుడుగా ఉన్నప్పుడు జినెదిన్ జిదాన్‌ను ఆదర్శంగా తీసుకున్నాడు. నిరాశ నుంచి బయటకు వచ్చి చివరకు తన కలను నెరవేర్చుకున్నాడు.
జిదాన్ మేనేజర్‌గా ఉన్న రియల్ మాడ్రిడ్ తరఫున ఆడడాన్ని తన జీవితంలో అద్భుతమైన క్షణంగా నిలిపాడు. ఫుట్‌బాల్ కిట్‌తోపాటూ ఇన్సులిన్ కిట్ తీసుకుని మైదానంలోకి దిగిన ఆ ఆటగాడే, ఇప్పుడు స్పెయిన్ స్టార్ ఆటగాడు అయ్యాడు.
ఇవి కూడా చదవండి:
- రామాయణంలో సీత టెస్ట్‌ట్యూబ్ బేబీనే.. మహాభారత కాలంలోనే లైవ్ టెలికాస్ట్..
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- అక్కడ లీటరు పెట్రోలు 67 పైసలే
- ఈ తెలుగు చాయ్‌వాలాకు నరేంద్ర మోదీ ‘సెల్యూట్’ చేశారు.. ఇంతకూ ఎవరాయన?
- గాంధీ మహాత్ముడిగా మారేందుకు పురికొల్పిన ఆ అవమానానికి 125 ఏళ్లు
- తాగునీరు అందని గ్రామాలు.. ఆంధ్రాలో మూడొంతులు, తెలంగాణలో సగం
- దివ్య సూర్యదేవర: ఒకప్పుడు డబ్బుల్లేక ఇబ్బందులు పడ్డారు.. నేడు రూ.లక్షల కోట్ల కంపెనీని చక్కబెడుతున్నారు
- రాషిద్ ఖాన్: పాకిస్తాన్లో క్రికెట్ నేర్చుకున్నా.. భారతీయుల ద్వారా ప్రేమించటం నేర్చుకున్నా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










