తిరుమల నడకదారిలో చిరుతపులుల భయం తగ్గిందా, భక్తులు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
అలిపిరి, శ్రీవారి మెట్టు నడకదారిలో తరచూ చిరుత పులుల సంచారంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి మెట్ల దారిన వెళ్లే భక్తులను నిత్యం భయం వెంటాడుతుంటోంది.
2023లో, నడక మార్గంలో ఒక చిన్నారిపై చిరుత దాడి చేసినప్పటి నుంచి భక్తుల్లో వన్యమృగాల భయం ఎక్కువైంది.
దీంతో, భక్తులకు అలిపిరి నడక మార్గంలో భద్రత కల్పించేలా, ఆ మార్గాల్లో చిరుతల సంచారంపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టేలా టీటీడీ చర్యలు చేపట్టింది.
నడకదారిలో వెళ్లే భక్తులు ఎవరూ ఒంటరిగా వెళ్లకుండా, బృందాలుగా వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, చిరుత పులులను ట్రాక్ చేసేందుకు పెద్దయెత్తున టెక్నాలజీని కూడా ఉపయోగిస్తోంది.
మరి, ఈ భద్రతా ఏర్పాట్లపై భక్తులు ఏమంటున్నారు? టెక్నాలజీ సాయంతో చిరుతలు, మనుషులు ఎదురుపడడాన్ని ఎలా తగ్గిస్తున్నారు?

తిరుమల మెట్ల మార్గంలో భద్రతా ఏర్పాట్ల గురించి టీటీడీ, అటవీ శాఖ అధికారులతో బీబీసీ మాట్లాడింది.
అలిపిరి మార్గంలో చిరుతల సంచారం పెరిగినప్పటి నుంచి భక్తులను ఒంటరిగా పంపించడం లేదని, బృందాలుగానే పంపిస్తున్నామని తిరుపతి డీఎఫ్ఓ సాయిబాబా చెప్పారు.
''చిరుత పులి ప్రధానంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు సంచరిస్తుంటుంది. అందుకే ఆ టైంలో పూర్తి భద్రతా చర్యలు చేపడతాం.
విజిబిలిటీ కోసం నడకమార్గం చుట్టుపక్కల 10 నుంచి 15 మీటర్ల వరకూ పొదలు అన్నీ క్లియర్ చేశాం. చిరుతలకు పొదల్లో నక్కి దాడి చేసే ప్రవర్తన ఉంటుంది. వాటిని క్లియర్ చేయడం వల్ల చిరుత పులి దూరంగా ఉన్నప్పుడే భక్తులు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా ప్రమాద తీవ్రతను కాస్త తగ్గిస్తున్నాం'' అని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.

నడక మార్గంలో భక్తులు ఏమంటున్నారు?
గతంలో చిరుత పులి దాడి జరిగినప్పుడు కాలినడకన వెళ్లాలంటే భయంగా ఉండేదని, ఇప్పుడు సెక్యూర్‌గానే ఉందని ఒంగోలుకు చెందిన గోపి చెప్పారు.
"సెక్యూరిటీ ముగ్గురు నలుగురు వెనకే వస్తారు. గాలి గోపురం దగ్గర ఆపుతారు. నడక స్టార్ట్ అయ్యేటప్పుడు ఫోటో తీస్తారు. కొంతమంది వచ్చిన తర్వాత యూనిటీగా వెళ్లమని చెబుతున్నారు'' అని ఆయన అన్నారు.

చిరుత పులులు ఉండే 10 స్ట్రాటజిక్ పాయింట్లను గుర్తించినట్లు చెప్పారు సాయిబాబా. చిరుతల సంచారం ఎలా ఉంటుందో వివరించారు.
‘‘చిరుతల్లో ఏదైనా అగ్రెసెవ్‌గా ఉంటే, వాటిని పట్టుకొని రేడియో కాలర్ వేసి, ఆ చిరుతల మూమెంట్ గమనిస్తాం. ప్రస్తుతం మేం ఒక పది పాయింట్లు గుర్తించాం. దానికి అనుగుణంగానే ఎక్కడ మూమెంట్ ఉంటుందో అక్కడ నైట్ టైం రిఫ్లెక్ట్ లైట్స్ పెట్టించాం.
ఒక జంతువు బయటికొచ్చినా, అది తిరిగి వెనక్కు వెళ్లిపోయే విధంగా ప్లాన్ చేస్తున్నాం. దీనివల్ల చిరుతలు మనుషులకు ఎదురుపడటం చాలా తగ్గింది'' అని సాయిబాబా తెలిపారు.

తిరుమలకు నడకదారిన వచ్చేవారు భద్రత గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బెంగళూరుకు చెందిన చంద్రకళ అంటున్నారు.
'' చిరుత పులులు వస్తున్నాయని గతంలో న్యూస్‌లో చూశాను. డైరెక్టుగా ఇక్కడైతే ఏం కనిపించలేదు. సేఫ్టీ మెజర్స్ అంతా బాగున్నాయి. గ్రూప్‌గా పంపించడం గానీ, సెక్యూరిటీ గార్డ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం గానీ అంతా బాగుంది. భయపడాల్సిన పనేమీ లేదు.''

సెక్యూరిటీ గార్డులతోపాటు గూర్ఖా దళాలు..
అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీవీఎస్ఓ) మురళీకృష్ణ చెప్పారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సెక్యూరిటీ గార్డులతోపాటు గూర్ఖా దళాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
''కొండపై ప్రత్యేకంగా గూర్ఖాలను మోహరించాం. అలిపిరి ఫుట్‌పాత్ ఏరియాలో సెక్యూరిటీ గార్డులతో పాటు దాదాపు 40 మందిని షిఫ్టులో ఏర్పాటు చేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా భద్రత కల్పిస్తున్నాం. పెట్రోలింగ్ టీమ్స్ నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. శ్రీవారి మెట్టు దగ్గర కూడా 8 గూర్ఖా దళాలు ప్రత్యేకంగా ఉన్నాయి."
ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే భక్తుల కోసం శ్రీవారి మెట్టు దగ్గర రెండు ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, అలిపిరి దగ్గర మూడు ప్రాథమిక చికిత్సా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు మురళీకృష్ణ చెప్పారు.

ఇప్పుడు తమకు ఎలాంటి భయం లేదని హైదరాబాద్‌కు చెందిన అనూష చెప్పారు.
''కిందనే అంతా చెప్పారు, మధ్యమధ్యలో ఆపుతూ 50 మంది.. అలా వచ్చే వరకు వెయిట్ చేయించి, గుంపుగానే పంపిస్తున్నారు. బాగుంది భయమేం లేదు'' అని ఆమె అన్నారు.
''సెక్యూరిటీ అంతా బాగుంది. అందరినీ గుంపుగా పంపిస్తున్నారు. అందరూ వచ్చేవరకు రోప్స్ పెట్టి ఆపేసి గుంపుగా పంపిస్తున్నారు. ఇంతమంది ఉండగా ఏమీ భయం లేదు. సెక్యూరిటీ వాళ్లు ముందు, వెనకాల ఉంటున్నారు'' అని హైదరాబాద్‌కు చెందిన సాయి చెప్పారు.

మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కొండపైకి వెళ్లే భక్తులు సాయంత్రం వేళల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అప్రమత్తం చేస్తున్నామని, ముఖ్యంగా చిన్న పిల్లలను తీసుకెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతామని సీవీఎస్ఓ మురళీకృష్ణ చెప్పారు.
''సాయంత్రం నడకమార్గంలో వెళ్లేటప్పుడు, ఫారెస్ట్, సెక్యూరిటీ టీమ్స్ 70- 80 మంది భక్తులను ఒక బృందంగా చేస్తాయి. ఆ గ్రూప్‌కు ముందు, వెనుక, పక్కన సెక్యూరిటీని ఏర్పాటు చేసి వారికి ఎలాంటి ప్రమాదం లేకుండా ఒకచోటి నుంచి మరో చోటుకు తీసుకెళ్తాం. అక్కడ ఉన్న మరో టీమ్‌కు హ్యాండోవర్ చేస్తాం. అలిపిరి, శ్రీవారి మెట్టు రెండు నడకదారుల్లోనూ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం'' అని ఆయన వివరించారు.
మూడు రకాల కెమెరా ట్రాప్స్..
తిరుమల నడకదారిలో వన్యమృగాల కదలికల గురించి కచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి అటవీశాఖ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తోంది. వాటిలో ముఖ్యంగా మూడు రకాల కెమెరాలు ఉన్నాయి.
ఈ కెమెరాల ద్వారా చిరుతలను ఎలా గుర్తిస్తారో, వాటి కదలికలను ఎలా ట్రాక్ చేస్తారో వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ సౌజన్య బీబీసీకి వివరించారు.
''మూడు రకాల కెమెరాలు సెట్ చేశాం. వీటిల్లో కెమెరా ట్రాప్స్, వీడియో కెమెరా ట్రాప్స్, సోలార్ లైవ్ కెమెరా ట్రాప్స్ ఉంటాయి. ఎక్కడ ఎక్కువ కదలికలు ఉంటాయో అక్కడ సర్వే చేసి సోలార్ లైవ్ కెమెరాలు పెట్టాం. ఎక్కడైతే సిగ్నల్స్ లేకుండా స్టిల్ మూమెంట్ ఉంటుందో అక్కడ కెమెరా ట్రాప్స్ పెట్టాం'' అని ఆమె తెలిపారు.

ఈ కెమెరా ట్రాప్స్ ఎలా పనిచేస్తాయంటే..
అలిపిరి నడక దారిలో చిరుత దాడులకు ఆస్కారం ఉన్న 2 కిలోమీటర్ల మార్గంలోనే మొత్తం 30 కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఇక నడకదారిలో చిరుతలు సంచరిస్తాయని భావిస్తున్న 4 కిలోమీటర్ల రేంజ్‌లో లైవ్ కెమెరాలతోపాటు మొత్తం 120 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సౌజన్య వివరించారు.
''సోలార్ కెమెరాల నుంచి మాకు అప్డేట్స్ వస్తాయి. హ్యూమన్ డిటెక్టెడ్ అని, యానిమల్ డిటెక్టెడ్ అని మాకు స్క్రీన్ పైన పాప్ అవుతుంది. అప్పుడు మేం అది ఏ జంతువో చెక్ చేసి అప్‌డేట్స్ పంపిస్తాం.
ఇక్కడ మెట్ల దగ్గరే ఒక ఫోన్ ఉంటుంది. ఆ జంతువు క్రాస్ అయి వెళ్లిపోగానే మాకు ఫోన్ వస్తుంది. ఆ సమయంలో భక్తులను మెట్ల దగ్గరే ఆపేస్తాం. జంతువు లోపలికి వెళ్లిపోయింది, మార్గాన్ని క్రాస్ చేసింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్లీ భక్తులను ముందుకు వదులుతాం" అని ఆమె చెప్పారు.
కెమెరాలు ఎక్కువగా ఏడో మైలు నుంచి నరసింహస్వామి టెంపుల్ వరకు బార్డర్ లైన్ ఏరియాలో ఉన్నాయని సౌజన్య తెలిపారు.

ఈ కెమెరా ట్రాప్స్ ఎలా పనిచేస్తాయో, క్రూరమృగాల ఆచూకీని ఎలా పసిగడతాయో' సౌజన్య వివరించారు.
''కెమెరా ట్రాప్స్ అన్నింటినీ మూడు, నాలుగు రోజులకొకసారి చెక్ చేస్తుంటాం. జంతువుల కదలికలు కెమెరాలో రికార్డ్ అవుతాయి. అవి ఒక కెమెరాలో కనిపించి మరో కెమెరాలో లేకపోతే జంతువుల కదలికలను గమనించి ఆ ట్రాప్స్ మళ్లీ వేరేప్రాంతంలో సెట్ చేస్తాం.
మళ్లీ 15 రోజులకు ఒకసారి గుర్తుల కోసం సర్వే చేస్తాం. ఏదైనా స్క్రాచెస్ లాంటివి ఉంటే గమనించి, అక్కడ కదలికలు ఉంటే అక్కడ కెమెరా ట్రాప్స్ సెట్ చేస్తాం.''
''ఆధునిక టెక్నాలజీతో చాలా బాగా ఉపయోగపడుతోంది. నిఘా పెట్టిన ప్రాంతంలో ఎక్కడైనా చిరుత కనిపించగానే మా టీమ్‌కు సమాచారం ఇస్తాం" అని ఆమె చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














