తిరుమల: రక్తదానంతో ప్రత్యేక ఉచిత దర్శనం, 1985 నుంచి ఉన్న ఈ పథకం గురించి మీకు తెలుసా?

తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

తిరుమలలో రక్తదానం చేస్తే ఉచితంగా దర్శనం కల్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం 37 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన ఈ పథకం గురించి చాలా మందికి తెలియదు.

రక్తదానాన్ని ప్రోత్సహించేలా తిరుమలకు వచ్చే భక్తులు రక్తదానం చేస్తే, వారికి శ్రీవారి ప్రత్యేక ఉచిత దర్శనం కల్పించడంతో పాటు ఒక ఉచిత లడ్డు, ప్రశంసాపత్రం ఇవ్వాలని టీటీటీ 1985లో నిర్ణయం తీసుకుంది.

రక్తదాతల కోసం కొండపైన అశ్విని ఆస్పత్రిలో తగిన ఏర్పాట్లు కూడా చేసింది. అదే ఏడాది దీన్ని అమల్లోకి తీసుకువచ్చి రక్తదాతలకు సెల్లార్ దర్శనాన్ని ఏర్పాటు చేశారు.

సెల్లార్ దర్శనాలు రద్దయినా, సిఫార్సుతో ఇచ్చే సుపథం దర్శనం అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఇప్పుడు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లో రక్తదాతలను అనుమతిస్తున్నారు.

అశ్విని ఆసుపత్రి

ఎక్కడ రక్తం అవసరమైనా

తిరుమలకు వచ్చే భక్తులు స్వచ్ఛందంగా వెంకటేశ్వరస్వామివారి సమీపంలో రక్తదానం చేస్తున్నారని తిరుమల, అశ్వినీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమ కుమారి చెప్పారు.

‘తిరుమలలో రక్తదానం చేసిన యాత్రికులకు ఉచితంగా శీఘ్రదర్శనం కల్పిస్తాం. దానితో పాటు ఒక ఉచిత లడ్డు, టీటీడీ తరఫున వారికి ఒక ప్రశంసాపత్రం కూడా ఇస్తాం. రక్త దానం చేసిన వెంటనే స్నాక్స్, పండ్లు ఇస్తాం. ఇక్కడ సేకరించిన రక్తాన్ని తిరుపతిలోని బర్డ్ హాస్పిటల్‌‌కు పంపుతాం’ అని కుసుమ కుమారి చెప్పారు.

తిరుపతిలోని బర్డ్(బీఐఐఆర్‌డీ) ఆసుపత్రిలో టీటీడీ బ్లడ్ బ్యాంక్ ఉంది. అక్కడకు వెళ్లి రక్తదానం చేసినవారికి కూడా తిరుమల శ్రీవారి ప్రత్యేక ఉచిత దర్శనం కల్పిస్తామని బర్డ్ ఆస్పత్రి ప్రత్యేక అధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డప్పరెడ్డి బీబీసీతో చెప్పారు.

ఆస్పత్రిలో ఆపరేషన్లు చేసే సమయంలో ఈ రక్తదాతలు ఇచ్చే ఈ రక్తం ఉపయోగిస్తామని, స్విమ్స్‌లో ఎవరికైనా రక్తం అవసరమైనా తమ దగ్గర తీసుకెళ్తారని ఆయన వివరించారు.

''మా దగ్గరకి వృద్ధులు మోకాళ్ల ఆపరేషన్ కోసం వస్తుంటారు. వారిలో పోషక లోపం వల్ల, హిమోగ్లోబిన్ లోపం ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఆపరేషన్లు చేసుకునే 80 శాతం మందిలో బ్లడ్ తక్కువగా ఉంటుంది. వారికి, తిరుమల అశ్విని ఆస్పత్రిలో, ఇక్కడ సేకరించిన ఈ రక్తమే ఉపయోగిస్తాం. పద్మావతి చిన్న పిల్లల హృదయాలయ, స్విమ్స్‌కు రక్తం అసరమైనా మా దగ్గర నుంచి తీసుకెళ్తారు" అని రెడ్డప్ప రెడ్డి చెప్పారు.

రక్తదానం

రక్తదానం చేసిన 24 గంటల్లో దర్శనం

తిరుమలలో బ్లడ్ డొనేషన్ గురించి తెలిసిన కొంతమంది భక్తులు మాత్రమే అశ్విని ఆస్పత్రిలో రక్తదానం చేసి దర్శనం చేసుకొంటున్నారు.

రక్తం తీసుకునే ముందు ఆస్పత్రి సిబ్బంది దాతలకు వివిధ పరీక్షలు చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు, రక్తదానానికి అర్హులైన వారి నుంచే రక్తం సేకరిస్తున్నారు.

ఉదయం ఎనిమిది నుంచి మద్యాహ్నం రెండు వరకు ఈ ఆస్పత్రిలో రక్తం సేకరిస్తారు. తర్వాత 24 గంటల్లో రక్తదాతలు ఎప్పుడైనా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు.

గత 15 సంవత్సరాలుగా తిరుమలలో రక్తదానం చేస్తున్నామని ఏడాదికి రెండు మూడుసార్లు ఇస్తుంటామని కొందరు రక్తదాతలు చెప్పారు.

''తిరుమలలో రక్తదానం చేయడాన్ని మా అదృష్టంగా భావిస్తాము." అంటారు మరోసారి రక్తదానం చేయడానికి వచ్చిన స్థానికుడు మోహన్ రావు.

స్వాతంత్ర్య దినోత్సవం, బ్లడ్ డొనేషన్ డే, గాంధీ జయంతి లాంటి ప్రత్యేక రోజుల్లో కూడా ఇక్కడ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. యాత్రికులతో పాటు, స్థానికులు కూడా ఇక్కడ రక్తదానం చేస్తుంటారు.

రక్తదానం వల్ల మరో ప్రాణాన్ని కాపాడిన వాళ్లం అవుతున్నామని వచ్చిన కొందరు చెబుతున్నారు.

TTD ఇచ్చే సర్టిఫికేట్

‘టీటీడీ దీన్ని మరింత ప్రచారం చేయాల్సింది’

‘నేను స్థానికుడిని. గత నాలుగైదేళ్లుగా అశ్విని ఆస్పత్రిలో రక్తదానం చేస్తున్నాను. ఇక్కడ బ్లడ్ డొనేట్ చేసిన వారందరికీ ఉచిత దర్శనంతోపాటూ, ఉచిత లడ్డూ కూడా ఇస్తున్నారు. ఇంకొకరి ప్రాణం కాపాడడం మాకెంతో ఆనందంగా ఉంది' అన్నారు తిరుమలకు చెందిన నవీన్.

''గాంధీ జయంతి సందర్భంగా నేను మొదటిసారి బ్లడ్ డొనేట్ చేసాను. ఎమర్జెన్సీఉన్న వారికి అవసరం అవుతుందని నేను రక్తదానం చేయడానికి ముందుకు వచ్చాను. బ్లడ్ డొనేట్ చేసినందుకు టీటీడీ వారు, దర్శనానికి పంపించారు, ఒక లడ్డూ ప్రసాదం కూడా ఇచ్చారు''అని స్థానికుడు అశ్విన్ కుమార్ చెప్పారు.

కానీ, తిరుమలలో రక్తదానం చేసి, ఉచితంగా శ్రీవారి దర్శనం కూడా చేసుకునే ఈ పథకం ఎన్నో ఏళ్లుగా సాగుతున్నా, టీటీడీ దీని గురించి పెద్దగా ప్రచారం చేయలేదు.

దర్శనం దొరక్క వెనుదిరిగే ఎంతోమంది భక్తులకు ఈ విషయం తెలిస్తే, వారందరికీ రక్తదానం చేసి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కలుగుతుందని, అలా రక్తం నిల్వల కొరతను కూడా తగ్గించవచ్చని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిది భాను ప్రకాశ్ రెడ్డి అన్నారు.

వీడియో క్యాప్షన్, భార్యను మోస్తూ తిరుమల మెట్లెక్కిన భర్త, ఈ వీడియోపై దంపతులు ఏమన్నారు?

''రక్తదానం చేస్తే స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. దాన్ని ప్రచారంలోకి తీసుకురావడంలో టీటీడీ ఎందుకు వెనకడుకుగు వేస్తుందో అర్థం కావడంలేదు. కోవిడ్ వల్ల రక్తదాతలు తగ్గిపోయారని రిపోర్టులు చెబుతున్నాయి. దీన్ని ప్రచారంలోకి తీసుకువస్తే రక్తదానం చేసేవారి సంఖ్య పెరుగుతుంది. అలా రక్తం కొరతను కొంతవరకైనా తగ్గించిన వాళ్లమవుతాం. ఈ పథకాన్ని బాగా ప్రచారం చేస్తే, మానవ సేవే మాదవ సేవ అంటారు కాబట్టి భక్తులకు దర్శనభాగ్యం కావడంతోపాటూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఆ రక్తం కూడా ఉపయోగపడుతుంది"అని భాను ప్రకాశ్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

అయితే, స్వామివారి సమీపంలో కొండపై రక్త దానంచేస్తే మంచి జరుగుతుందని బావిస్తున్నారు కాబట్టే ఇది కొనసాగుతోందని, ఇంకా ఎక్కువ మంది రక్తదానం చేయడానికి వీలుగా, అవసరమైన వసతులు ఎర్పాటు చేస్తామని టీటీడీ బోర్డు సభ్యులు పోకల ఆశోక్ కుమార్ బీబీసీతో చేప్పారు.

''టీటీడీ తిరుమలలోని అశ్వినీ ఆస్పత్రిలో రక్తనిధిని ఎర్పాటు చేసింది. 1985 నుంచీ ఈ స్కీం ప్రారంభం కాగా, ఇక్కడ శ్రీవారి సన్నిధిలో రక్తం ఇస్తే మంచిదనే సెంటిమెంటుతో, పదిమందికి ఉపయోగపడుతుందని రక్తదాతలు వస్తున్నారు. వారికి దేవస్థానం తరఫున సుపథం ద్వారా శీఘ్ర దర్శనం కల్పిస్తున్నాము. ఒక లడ్డు కూడా ఉచితంగా ఇస్తున్నాం. ఈ పథకాన్ని కొనసాగిస్తాం. ఇంకా ఎక్కువ సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా టీటీడీ సిద్దంగా ఉంది" అన్నారు.

రక్తదాతలు

ఏడాదికి వెయ్యిలోపే

తిరుమలలోని అశ్వినీ అసుపత్రి బ్లడ్ బ్యాంక్ వివరాల ప్రకారం, 2007 నుంచి 2022 సెప్టెంబర్ వరకు 10,600 మంది ఇక్కడ రక్తదానం చేశారు. 2021లో 918 మంది, ఈ ఏడాది అక్టోబర్ 11 నాటికి 548 మంది దాతలు రక్తదానం చేశారు.

రక్తదానం చేయాలనుకునేవారు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటలలోపు తిరుమలలో ఉన్న అశ్వినీ ఆస్పత్రిలో కానీ, తిరుపతిలో ఉన్న బర్డ్ ఆస్పత్రిలోగాని నేరుగా వెలితే పరీక్షలు నిర్వహించిన అనంతరం రక్తం సేకరిస్తారు.

వారికి టీటీడీ శీఘ్రదర్శనం టికెట్టు, ప్రశంసా పత్రం ఇస్తుంది. టికెట్టు తీసుకున్న 24 గంటల్లో ఎప్పుడైనా దర్శనానికి వెల్లచ్చు.

2000లో షిర్డీ సంస్ధాన్ కూడా ఒక బ్లడ్ బ్యాంక్ ప్రారంభించింది. షిర్డీలో రక్తదానం చేసే భక్తులకు సాయి ప్రత్యేక దర్శనం కల్పిస్తామంటూ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రక్తదాతలు సంప్రదించడానికి ఒక ఫోన్ నంబర్ కూడా ఇచ్చింది.

కానీ, షిరిడీ స్థాయిలో తిరుమలలో ఈ పథకానికి సరైన ప్రచారం లేకపోవడం వల్ల ఎక్కువమంది భక్తులు రక్తదానం చేయడానికి ముందుకు రావడంలేదనే విమర్శలు వస్తున్నాయి.

వీడియో క్యాప్షన్, తిరుపతి: మహిళలు నడిపిస్తున్న టీ షాపులు.. ‘ఇక్కడ మగవాళ్లకు ఉద్యోగాలు లేవు’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)