INDvPAK టీ20 ప్రపంచకప్: మెల్‌బోర్న్‌లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఆదివారం జరుగుతుందా? జరగదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, మెల్‌బోర్న్ నుంచి బీబీసీ ప్రతినిధి

- ఇండియా, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్ టికెట్లు కేవలం 10 నిమిషాల్లోనే మొత్తం అమ్ముడయ్యాయి.
- వాతావరణ శాఖ వర్ష సూచన చేయడంతో మ్యాచ్‌పై ప్రభావం పడొచ్చని భావిస్తున్నారు.
- గాయాల కారణంగా రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు
- ఈ ఏడాది భారత్ 32 టీ20 మ్యాచ్‌లో ఆడగా అందులో 23 గెలిచింది.

ఆస్ట్రేలియాలో ఈ ఏడాది జరగబోయే అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఫార్ములా వన్ గ్రాండ్ ప్రిక్సో.. లేదంటే రగ్బీ గ్రాండ్ ఫైనలో కాదు. అక్కడ ఈ ఏడాది జరుగుతున్న అతి పెద్ద క్రీడా ఈవెంట్ టీ20 ప్రపంచ కప్. అందులోనూ భారత్, పాకిస్తాన్ మధ్య మెల్‌బోర్న్ గ్రౌండ్‌లో అక్టోబర్ 23న జరగబోయే మ్యాచ్.
రెండు జట్లకూ ఈ టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్ టికెట్లు కొన్ని నెలల కిందట విక్రయం ప్రారంభించగా 10 నిమిషాల్లోనే మొత్తం అమ్ముడయ్యాయి.
90,000 మంది కూర్చునే సామర్థ్యం గల మెల్‌బోర్న్ గ్రౌండ్ సిబ్బంది కూడా ఈ మ్యాచ్ టికెట్లు అంత తక్కువ వ్యవధిలోనే విక్రయం కావడంపై ఆశ్చర్యపోయారు.
అయితే, ఇంత ఆసక్తి ఉన్న ఈ మ్యాచ్‌పై వర్షం ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా వాతావరణ విభాగం 'ఆదివారం భారీ వర్షం కురిసేందుకు 90 శాతం అవకాశాలున్నాయి. ఉదయం, సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం కురవొచ్చు' అంటూ సూచన జారీ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
మరోవైపు శుక్రవారం రాత్రి నుంచే మెల్‌బోర్న్‌లో అడపాదడపా వర్షం కురుస్తోంది. శనివారం కూడా మెల్‌బోర్న్‌లో వర్షం కురుస్తోంది.
అయితే, శుక్రవారం మధ్యాహ్నం తేలికపాటి వర్షమే పడడంతో భారత్, పాక్ జట్లు నెట్ ప్రాక్టీస్ చేశాయి.
మధ్యాహ్నం విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్‌లు పిచ్‌పై బ్యాటింగ్ చేస్తుండగా కోచ్ రాహుల్ ద్రవిడ్ చాలాసేపు అక్కడే ఉన్నారు. మరోవైపు సాయంత్రం పాకిస్తాన్ ఆటగాళ్లంతా వచ్చి చాలాసేపు ప్రాక్టీస్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
రిజర్వ్ డే లేకపోవడంతో
టోర్నీలో లీగ్ దశలో ఆడే మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేకపోవడంతో వర్షం పడితే ఎలా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
వాతావరణ శాఖ సూచిస్తున్నట్లుగా 10 నుంచి 25 మిల్లీ లీటర్ల వర్షం కురిస్తే రెండు జట్లూ కనీసం అయిదేసి ఓవర్లపాటు ఆడే అవకాశమూ ఉండదు. అప్పుడు మ్యాచ్ రద్దవుతుంది. అలాంటి సందర్భంలో రెండు జట్లకూ చెరో పాయింట్ లభిస్తుంది.
ఇలాంటి పరిస్థితి భారత్, పాక్ రెండు జట్లకూ నష్టదాయకమే. గ్రూపులోని మిగతా జట్లు ఎక్కువ పాయింట్లు సాధించే అవకాశం ఉంటుంది.
లీగ్ దశలో భారత్.. పాకిస్తాన్‌తో పాటు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వేతోనూ ఆడాల్సి ఉంది.
మరోవైపు టోర్నీ తొలిరోజు శనివారం ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మధ్య సిడ్నీలో జరగాల్సిన మ్యాచ్‌పైనా వర్షం ప్రభావం ఉండొచ్చు. అయితే, ఇదే రోజున పెర్త్‌లో ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్ మ్యాచ్‌కు ఇబ్బంది లేకపోవచ్చు. పెర్త్‌లో వర్ష సూచనేమీ లేదని వాతావరణ శాఖ చెబుతోంది.
రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రాలు గాయం కారణంగా ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు. ఈ ఏడాది టీ20 మ్యాచ్‌లో భారత్ చెప్పుకోదగినన్ని విజయాలు సాధించింది.మొత్తం 32 ట20 మ్యాచ్‌లు ఈ ఏడాది ఆడగా అందులో 23 గెలిచింది.
పాకిస్తాన్ గెలుపు ఓటముల రికార్డు ఈ ఏడాది 36-18గా ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆస్ట్రేలియా గడ్డపై ఇండియా, పాకిస్తాన్‌లు ఇంతకుముందు చివరిసారిగా 2015లో తలపడ్డాయి. 2015 వన్డే ప్రపంచకప్‌లో ఆడిలైడ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.
విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్‌లో 107 పరుగులు చేయడంతో భారత్ 7 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.
ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 76 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓటమి పాలైంది.
కాగా ఈ ఏడాది భారత్, పాకిస్తాన్ రెండు టీ20 మ్యాచ్‌లు ఆడగా ఇండియా ఒకటి, పాకిస్తాన్ ఒకటి గెలిచాయి.
ఇవి కూడా చదవండి:
- ఒక్కసారిగా గుండెపోటు, కుప్పుకూలి ప్రాణాలు వదిలేస్తున్నారు.. ఇంత సడెన్‌గా చనిపోవడానికి కారణాలేంటి?
- డెంగీ రోగికి ప్లాస్మాకు బదులు ఆరెంజ్ జ్యూస్ ఎక్కించారు
- లంపీ స్కిన్ వ్యాధి సోకిన పశువుల పాలు తాగొచ్చా? ఈ వైరస్ మనుషులకూ సోకుతోందా? దేశంలో ఎందుకిన్ని వదంతులు?
- పాకిస్తాన్లో క్రికెట్‌ను భారత్ వ్యాపార సంస్థలే నడిపిస్తున్నాయా? బీసీసీఐ నిధులు ఇవ్వకపోతే పాక్ క్రికెట్ బోర్డు కూలిపోతుందా?
- దీపావళి టపాసులు అమ్మితే మూడేళ్లు జైలుశిక్ష, టపాసులు కాల్చితే 6 నెలలు జైలు శిక్ష
- ఇండియా మోస్ట్ వాంటెడ్ పాక్ తీవ్రవాదులను చైనా ఎలా రక్షించిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













