Firecrackers: దీపావళి టపాసులు అమ్మితే మూడేళ్లు జైలుశిక్ష, టపాసులు కాల్చితే 6 నెలలు జైలు శిక్ష - దిల్లీ పర్యావరణ మంత్రి ఆదేశాలు

ఫొటో సోర్స్, Getty Images
దీపావళి సందర్భంగా టపాసులు కాల్చితే 6 నెలల జైలు శిక్ష తప్పదని దిల్లీ పర్యావరణ మంత్రి హెచ్చరించారు.
దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
టపాసులు కాల్చితే రూ. 200 జరిమానా విధించేలా దిల్లీలో ఇప్పటికే ఆధేశాలున్నాయి.
వాయుకాలుష్యాన్ని నివారించే చర్యలలో భాగంగా టపాసులను నిషేధిస్తూ సెప్టెంబరులో జారీ చేసిన ఆదేశాలలో భాగమే ఈ నిబంధనలన్నీ.
ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యం ఉన్న రాజధాని నగరం దిల్లీయే.
కర్మాగారాల నుంచి వెలువడే పొగ, వాహనాల నుంచి వెలువడే పొగ, ఇతర వాతావరణ పరిస్థితులు వంటివన్నీ కలిసి దిల్లీని వాయుకాలుష్యం అత్యధికంగా ఉన్న రాజధాని నగరంగా మార్చేశాయి.
దిల్లీకి పొరుగున ఉన్న రాష్ట్రాలలోని రైతులు తమ పంట పొలాలలోని వ్యర్థాలను తగలబెట్టడం వల్ల ఏటా శీతకాలంలో కాలుష్య సమస్య మరింత పెరుగుతుంది.
దీపావళి సమయంలో టపాసులు కాల్చడం వల్ల కూడా కాలుష్యం వెలువడతుంది. చలికాలంలో గాలుల వేగం చాలా తక్కువగా ఉండడం వల్ల వాతావరణం దిగువ పొరల్లోనే ఇవి పేరుకుపోయి కాలుష్య సమస్యను మరింత పెంచుతాయి.
చలికాలంలో స్మాగ్‌తో నిండిన గాలిలో ఇక్కడ పీఎం 2.5 పార్టికల్స్ తీవ్రస్థాయిలో ఉంటాయి. ఇవి శ్వాస పీల్చినప్పుడు ఆ గాలి ద్వారా ఊపిరితిత్తులలో చేరి ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఏడాది కూడా దిల్లీలో వాయు నాణ్యత బాగా దిగజారుతుందని అంచనాలున్నాయి. అక్టోబరు 24న దీపావళి పండుగకు ముందు గాలులు స్తబ్దుగా ఉండడం, వాతావరణ పరిస్థితులు స్థిరంగా ఉండడంతో వాయు నాణ్యత బాగా తగ్గనుందని భావిస్తున్నారు.
వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ)లో రీడింగ్ 300 నుంచి 400 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్నట్లు. ఈ సూచీ 50 కంటే తక్కువ చూపిస్తే వాయు నాణ్యత బాగున్నట్లు.
2023 జనవరి 1 వరకు అన్ని రకాల బాణసంచా తయారీ, అమ్మకం, వినియోగంపై నిషేధం విధిస్తూ దిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరులో ఆదేశాలు వెలువరించింది.
గత రెండేళ్లుగా ఇలాంటి ఆదేశాలు వెలువరిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ... బాణసంచా నిల్వ చేసినా, విక్రయించినా మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని, రూ. 5 వేల జరిమానా కూడా ఉండొచ్చని హెచ్చరించారు.
ఈ నిబంధనలు అమలు చేయడానికి పోలీసులు, కాలుష్య నియంత్రణ విభాగం అధికారులతో కలిసి 408 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
మంత్రి ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే పోలీసులు 2,200 కేజీల బాణసంచాను స్వాధీనం చేసుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక తెలిపింది.
కాగా టపాసుల నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అక్టోబర్ 21న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
మరోవైపు దీపావళి సందర్భంగా బాణసంచాపై నిషేధం విధించడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. ఇది హిందూ వ్యతిరేక చర్యని ఆరోపిస్తున్నారు.
'హిందువుల పండుగల వల్లే కాలుష్యం ఏర్పడుతుందా.. దీపావళి రోజున మూణ్నాలుగు గంటలు బాణసంచా కాల్చితే ఏమవుతుంది' ట్విటర్ యూజర్ ఒకరు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లో క్రికెట్‌ను భారత్ వ్యాపార సంస్థలే నడిపిస్తున్నాయా? బీసీసీఐ నిధులు ఇవ్వకపోతే పాక్ క్రికెట్ బోర్డు కూలిపోతుందా?
- ఇండోనేషియా: 99 మంది పిల్లలు చనిపోవడంతో దగ్గు మందు సహా అన్ని రకాల సిరప్‌లపై నిషేధం
- లిజ్ ట్రస్: ప్రధాని అయిన 45 రోజులకే ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది, బ్రిటన్ తాజా రాజకీయాలపై తెలుసుకోవాల్సిన 8 పాయింట్లు
- ఇండియా మోస్ట్ వాంటెడ్ పాక్ తీవ్రవాదులను చైనా ఎలా రక్షించిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















