దీపావళి టపాసులే దిల్లీలో కాలుష్యం పెరగడానికి కారణమా?

ఫొటో సోర్స్, Getty Images
పడిపోయిన ఉష్ణోగ్రతలు, దీపావళి సంబరాల నేపథ్యంలో దిల్లీ, దాని సమీప ప్రాంతాల్లో గాలి నాణ్యత బాగా తగ్గిపోయింది.
ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్యం ఉన్న నగరాల జాబితాలో ప్రస్తుతం దిల్లీ రెండో స్థానానికి చేరుకున్నట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెబ్‌సైట్ తెలిపింది. అక్టోబర్ 28న ఉదయం 10 గంటలకు పరిస్థితి ఇలా ఉన్నట్లు పేర్కొంది.
అక్టోబర్ 27 రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ దిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో వాయు కాలుష్యం విపరీతంగా ఉంది.
దీపావళి తర్వాత ఉత్తర భారత్‌లోని చాలా చోట్ల పీఎం 2. 5 అత్యధిక స్థాయికి చేరుకుంది. పీఎం (పార్టిక్యులేట్ మ్యాటర్) అంటే చాలా సూక్ష్మమైన దుమ్ము, ధూళి కణాలు. ఊపిరి తీసుకున్నప్పుడు అవి శరీరంలోకి ప్రవేశిస్తాయి.

ఫొటో సోర్స్, EPA
పీఎం 2.5తో ఎంత ప్రమాదమంటే...
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం, 2016లో ఐదేళ్లలోపు వయసున్న లక్షకుపైగా చిన్నారులు వాయు కాలుష్యం వల్లే మరణించారు.
భారత్‌లో ఈ మరణాల్లో చాలావాటికి బయటి గాలిలో ఉండే పీఎం 2.5 కారణమని 'ఎయిర్ పొల్యూషన్ అండ్ చైల్డ్ హెల్త్' పేరుతో రూపొందించిన ఆ నివేదిక తెలిపింది.
వాయు కాలుష్యం వల్ల భారత్‌లో 60,987 మంది, నైజీరియాలో 47,674 మంది, పాకిస్తాన్‌లో 21,136 మంది, కాంగోలో 12,890 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు.
భారత్‌లో మరణించిన చిన్నారుల్లో అమ్మాయిల సంఖ్య (32,889) ఎక్కువగా ఉంది.
కాలుష్యం వల్ల గర్భస్థ శిశువులపైనా దుష్ప్రభావం ఉంటుంది.
నెలలు నిండకముందే ప్రసవాలు, తక్కువ బరువుతో శిశువులు జన్మించడం, పుట్టుకతోనే చిన్నారుల్లో శారీరక, మానసిక లోపాలు రావడంతోపాటు మరణాలకు కూడా కారణం కావొచ్చని ఆ నివేదిక తెలిపింది.
కాలుష్యం అందరిపై దుష్ప్రభావం చూపుతుందని, అయితే చిన్నారులపై ఇది మరింత తీవ్రంగా ఉంటుందని పేర్కొంది.

ఫొటో సోర్స్, AFP
ట్విటర్‌లో చర్చ
సోమవారం ట్విటర్‌లో #DelhiChokes, #CrackersWaliDiwali అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి.
దీపావళి టపాసుల వల్లే దిల్లీలో కాలుష్యం పెరిగిందని కొందరు ఆరోపిస్తే, కాదని మరో వర్గం వాదించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
''దీపావళి టపాసులంటేనే అందరికీ సమస్యలు వస్తాయి. ఈద్ సమయంలో కుర్బానీ పేరుతో లక్షల మేకలను బలి ఇస్తుంటే, ఎవరూ వ్యతిరేకించరేం?'' అని తోయాజ్ చతుర్వేది అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
ట్విటర్, ఫేస్‌బుక్‌ల్లో దీపావళి టపాసులు, వాయు కాలుష్యం గురించి చర్చలకు దిల్లీ కేంద్ర బిందువుగా మారింది.

ఫొటో సోర్స్, AFP
నిజంగానే దీపావళి టపాసుల వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందా?
బీబీసీ రియాలిటీ చెక్ సిరీస్ బృందం ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెలికితేసే ప్రయత్నం చేసింది.
యూనివర్సిటీ ఆఫ్ మినెసోటాకు చెందిన ధనంజయ్ ఘయీ అనే పరిశోధకుడు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ పాలసీతో కలిసి దిల్లీ కాలుష్యంలో టపాసుల పాత్రపై అధ్యయనం చేశారు.
దిల్లీ వాయు కాలుష్యంపై దీపావళి టపాసుల ప్రభావం తక్కువగానే ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. అయితే, ఆ కాస్త ప్రభావం కూడా దిల్లీ గాలిని తీవ్ర ప్రమాదకరంగా మార్చుతుందని అంచనా వేశారు.
2013 నుంచి 2016 వరకూ దిల్లీలోని ఐదు ప్రాంతాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు.

ఫొటో సోర్స్, Getty Images
అక్టోబర్ మూడో వారం నుంచి నవంబర్ మొదటి వారం మధ్యలో దీపావళి వస్తుంటుంది.
దిల్లీ సమీప ప్రాంతాల్లో రైతులు పంటలను తగులబెట్టే సమయం కూడా ఇదే. ఈ నేపథ్యంలో దీపావళి టపాసుల ప్రభావాన్ని ప్రత్యేకంగా గుర్తించేందుకు పరిశోధకులు కృషి చేశారు.
పంటలు తగులబెట్టే సంఘటనలను విడిగా గుర్తించేందుకు నాసా ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించినట్లు ధనంజయ్ చెప్పారు.
2013 నుంచి 2016 వరకూ రెండు సార్లు దీపావళి సమయం, రైతులు పంటలు తగులబెట్టే సీజన్ వేర్వేరుగా వచ్చాయి.
ఏటా దీపావళి మరుసటి రోజు దిల్లీలో గాలిలో పీఎం 2.5 పరిమాణం 40 శాతం పెరుగుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.
గంటలవారీగా సమాచారాన్ని చూసినప్పుడు, దీపావళి రోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల మధ్య పీఎం 2.5 వంద శాతం పెరుగుతోందని వారు చెప్పారు.
దిల్లీ కాలుష్య గణన సంస్థ కూడా 2016, 2017ల్లో దీపావళి తర్వాత కాలుష్యం వేగంగా పెరిగినట్లు వెల్లడించింది.
జంషెడ్‌పూర్‌లో జరిగిన ఓ అధ్యయనంలోనూ దీపావళి సమయంలో కాలుష్యం వేగంగా పెరుగుతున్నట్లు తేలింది.
టపాసులను కాల్చడం వల్ల గాలిలో పెరుగుతున్న ప్రమాదకర పదార్థాల జాబితాను కూడా వెల్లడించింది. అవి..
- పీఎం 10
- సల్ఫర్ డయాక్సైడ్
- నైట్రోజన్ డయాక్సైడ్
- ఓజోన్
- ఐరన్
- మాంగనీస్
- బెరీలియం
- నికెల్
మానవ శరీరానికి ప్రమాదకరమైన ఇలాంటి పదిహేను పదార్థాలు టపాసుల నుంచి వెలువడుతున్నట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫ్ ఇండియా చెబుతోంది.
అయితే, ఇలాంటి ప్రమాదకర పదార్థాలు రైళ్ల కారణంగా జరిగే కాలుష్యంలోనూ వెలువడుతుండటం గమనార్హం.
టపాసులు అధిక మొత్తంలో పీఎం 2.5ను వదులుతుంటాయి. పెద్ద పెద్ద టపాసుల్లో వీటి పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి
- దీపావళి రోజున గుడ్లగూబను బలిస్తే సంపద రెట్టింపు అవుతుందా
- 'మన పెద్దాపురం': 'కిలో ప్లాస్టిక్ తెస్తే... కిలో బియ్యం ఇస్తాం'
- 'రామాయణంలో సీత టెస్ట్ట్యూబ్ బేబీనే.. మహాభారత కాలంలోనే లైవ్ టెలికాస్ట్..'
- హిందుత్వ రాజకీయాలకు రామాయణం టీవీ సీరియల్ ఊపిరి పోసిందా?
- జపాన్ ఎందుకంత క్లీన్గా ఉంటుంది... ఏమిటా రహస్యం?
- ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్: పర్యావరణానికి ముప్పు తెస్తున్న ఆ ఉత్పత్తుల జాబితా ఇదే
- 'మా పంటలు పోయినట్టే... ఇంకా ఇక్కన్నే ఉంటే మనుషులం కూడా పోయేట్టున్నాం'
- దిల్లీ కాలుష్యం: దేశ రాజధానిలో వాయు కాలుష్యం తగ్గుతోందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








