ఆర్టీసీ బస్ నంబర్ ప్లేట్ మీద Z అక్షరానికి, నిజాం రాజుకు సంబంధం ఏమిటి

ఫొటో సోర్స్, ugc
- రచయిత, ప్రవీణ్ కాసం
- హోదా, బీబీసీ తెలుగు
ఆర్టీసీ బస్సును చూసినప్పుడు మీరు ఈ విషయం గమనించారా?
ఆదిలాబాద్ నుంచి అనంతపురం వరకు తెలుగు రాష్ట్రాల్లో మీరు ఏ ఆర్టీసీ బస్సుపై చూసినా నంబర్ ప్లేట్‌పై ఇంగ్లిష్ అక్షరం Z కనిపిస్తుంటుంది.
ఆంధ్రప్రదేశ్ అయితే అక్కడి ఆర్టీసీ బస్సు నంబర్ ప్లేట్‌పై AP తర్వాత జిల్లా కోడ్ ఆ తర్వాత Z తోపాటు రిజిస్ట్రేషన్ నంబర్ కనిపిస్తుంది. ఉదాహరణకు AP 29 Z 1234.
తెలంగాణ అయితే, AP స్థానంలో TS తర్వాత జిల్లా కోడ్ ఆ తర్వాత Z తోపాటు రిజిస్ట్రేషన్ నంబర్ కనిపిస్తుంది. ఉదాహరణకు TS 10 Z 1234.
పల్లె వెలుగు నుంచి లగ్జరీ బస్సుల వరకు ఆర్టీసీ బస్సులన్నింటిపైనా ఈ Z తప్పనిసరిగా ఉంటుంది.
అయితే, ఆర్టీసీ బస్సుపై ఈ Z రావడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. దీనికి దాదాపు 87 ఏళ్ల చరిత్ర ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
నిజాం స్టేట్ రైల్వేస్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ డివిజన్ ఏర్పాటు
Z చరిత్ర తెలుసుకోవాలంటే మనం 1879వ సంవత్సరానికి వెళ్లాలి. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ పాలిస్తున్నారు.
ఈయన పాలన కాలంలోనే 'నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే సంస్థ' పేరుతో రైల్వే వ్యవస్థ హైదరాబాద్ రాజ్యంలో ప్రారంభమైంది. తొలిసారిగా సికింద్రాబాద్ నుంచి వాడి వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేశారు.
1932లో ఏడో నిజాం మీరు ఉస్మాన్ అలీఖాన్ పాలనలో ఈ రైల్వే సంస్థలో ఒక భాగంగా 'నిజాం స్టేట్ రైల్వేస్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ డివిజన్'ను ఏర్పాటు చేశారు.
దీని కింద హైదరాబాద్ రాజ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ ప్రారంభమైంది. 22 బస్సులు, 166 మంది సిబ్బందితో ఆర్టీసీ ప్రస్థానం మొదలైంది.
ఈ బస్సులను స్కాట్లాండ్ ఆటోమొబైల్ సంస్థ అల్బైనో తయారు చేసింది.
నిజాం కాలంలో బస్సు నంబర్ ప్లేట్‌పై హైదరాబాద్ స్టేట్‌ను సూచించేలా HY తర్వాత Z ఉండేది. ఉదాహరణకు HYZ 223.
ఆ తర్వాతకాలంలో AEZ, AAZ APZ, TSZ తో రిజిస్ట్రేషన్ జరుగుతోంది.

ఫొటో సోర్స్, jangaon Depo
'అమ్మ ప్రేమకు గుర్తుగా'
ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు తల్లి మీద ఉన్న ప్రేమ కారణంగానే ఆర్టీసీ బస్సులపై Z చేరిందని హైదరాబాద్ చరిత్రకారుడు కెప్టెన్ పాండురంగా రెడ్డి (రిటైర్డ్) చెప్పారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''ఉస్మాన్ అలీఖాన్ మొదట తన తల్లి అమాత్ ఉజ్-జెహ్రా బేగం పేరు మీద రోడ్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌ను ప్రారంభించాలనుకున్నారు. కానీ, ప్రభుత్వ సంస్థకు ఓ వ్యక్తి పేరు పెట్టడం తగదని మంత్రుల నుంచి సూచన రావడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. అయితే, బస్సు నంబర్‌లలో తన తల్లిపేరు కలిసి వచ్చేలా ఆమె పేరులోని ఆల్ఫాబెట్ Z ను పెట్టించారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది'' అని వివరించారు.
ఇదే విషయాన్ని టీఎస్‌ఆర్టీసీ పీఆర్వో కిరణ్ ధ్రువీకరించారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''నిజాం తన తల్లిపై ప్రేమకు గుర్తుగా బస్సు రిజిస్ట్రేషన్ నంబర్‌లో Z వచ్చేలా చేశారనేది వాస్తవమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్‌ఆర్టీసీ ప్రారంభమైన 1958 నుంచి బస్సుల రిజిస్ట్రేషన్‌లపై ఈ సంప్రదాయం కొనసాగిస్తూనే ఉన్నాం. 2014లో ఆర్టీసీ విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ ఇలానే చేస్తున్నారు'' అని తెలిపారు.

'ఆర్టీసీ సొంత వాహనాలకే'
ఆర్టీసీ సొంత బస్సుల రిజిస్ట్రేషన్ నంబర్‌లలోనే Z ఉంటుందని తెలంగాణ ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ రామచంద్ర చెప్పారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ప్రైవేటు, అద్దెకు తీసుకున్న బస్సులపై ఇలా ఉండదని చెప్పారు. Z కొనసాగింపుపై నిజాం రాజుతో ప్రభుత్వానికి ఎలాంటి ఒప్పందం లేదని, దీన్నో సంప్రదాయంగా మాత్రమే కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.
అయితే, 1989 మోటారు వాహనాల చట్టం అమలు నుంచి తాము ఆర్టీసీ బస్సులకు Z సిరీస్‌తో నంబర్లు కేటాయిస్తున్నామని ఆర్టీవో అధికారి పాండురంగ బీబీసీతో అన్నారు.
''పోలీసు వాహనాలకు P సిరీస్‌తో రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తాం. ట్రాన్స్‌పోర్ట్ నంబర్లకు T తో ఇస్తున్నాం. అలాగే, 1989 నుంచి ఆర్టీసీ బస్సులకు Z సిరీస్‌తో నంబర్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. అంతకు ముందు నుంచి ఆర్టీసీ బస్సుల రిజిస్ట్రేషన్ నంబర్లపై Z ఎందుకు ఉండేదో నాకు తెలియదు'' అని చెప్పారు.
నిజాం వల్లే ఆర్టీసీ బస్సుల నంబర్ ప్లేట్ పై Z వస్తోందని తాను ఆర్టీసీలో చేరినప్పటి నుంచీ వింటున్నానని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నేత అశోక్ తెలిపారు. ఆర్టీసీ విభజన తర్వాత కూడా రెండు రాష్ట్రాల్లో ఇదే సంప్రదాయం కొనసాగుతుండటం మంచి విషయమని చెప్పారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఆర్టీసీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రపంచంలోనే అత్యధిక బస్సులున్న సంస్థ
ఒక దశలో ఉమ్మడి ఆర్టీసీ ప్రపంచంలోనే అతి ఎక్కువ బస్సులు కలిగిన సంస్థగా వరుసగా గిన్నిస్ రికార్డులు సృష్టించింది.
రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్ 2 నాటికి ఆర్టీసీ విభజన పూర్తికాలేదు. ఆర్టీసీ ప్రధాన ఆస్తులు హైదరాబాద్‌లో ఉండిపోవడంతో విభజన సంక్లిష్టమైంది.
హైదరాబాద్‌లో ఉన్న ఆర్టీసీ ఆస్తుల్లో తమకూ హక్కు కావాలని ఏపీఎస్ఆర్టీసీ పట్టుపట్టినా ఫలితం లేకపోయింది. రాష్ట్ర విభజన తరువాత సంస్థ పూర్తిగా చట్టపరంగా విడిపోకపోయినా, వాస్తవికంగా విభజించి నిర్వహించారు.
2015 జూన్ 30 నుంచి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీగా ఏర్పడింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు 2016 ఏప్రిల్ 27న వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
- అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం: భారత్‌లో పేదరికం తగ్గుతోందా
- సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్'
- ఉత్తర కొరియాలో అత్యంత ఎత్తైన పర్వతాన్ని గుర్రంపై ఎక్కిన కిమ్
- బీబీసీ 100 వుమన్: ఈ జాబితాలో భారతీయులు ఎంత మంది?
- గూగుల్ పిక్సెల్ 4: 'రాడార్ ఫీచర్' కారణంగా భారతదేశంలో విడుదల రద్దు
- మహిళ అంగీకారంతో సెక్స్ చేసినా మగాడి మీద 'రేప్' కేసు పెట్టవచ్చా...
- రూసీ కరంజియా: భారత మీడియాకు కొత్త నడక నేర్పిన జర్నలిస్ట్
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- సిరియాలో టర్కీ సైనిక చర్యతో ఇస్లామిక్ స్టేట్ తిరిగి పుంజుకుంటుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








