అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం: భారత్‌లో పరిస్థితి ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పాబ్లో ఉచోవా
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్ ప్రతినిధి
ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా గడచిన 25 ఏళ్లలో 110 కోట్ల మందికి పైగా ప్రజలు 'పేదరికం నుంచి బయటపడ్డారు.'
ఈ శతాబ్ద కాలంలో ప్రపంచం సాధించిన గొప్ప విజయాలలో ఇదొకటి అనడంలో ఏమాత్రం అనుమానం లేదు.
1990 నుంచి 2015 వరకు ప్రపంచంలో అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న (రోజుకు 1.90 డాలర్లు (దాదాపు రూ.135) లేదా అంతకంటే తక్కువ ఆదాయం) వారి సంఖ్య 190 కోట్ల నుంచి 73.5 కోట్లకు తగ్గింది.
అంటే, 1990లో మొత్తం జనాభాలో 36 శాతం మంది పేదరికంలో ఉంటే, 2015 నాటికి అది 10 శాతానికి తగ్గింది.
అయితే, ప్రస్తుతం వివిధ దేశాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పేదరిక నిర్మూలన కోసం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలు నిజమైన పేదలకు అందడం లేదని దారిద్య్రరేఖను నిర్వచించిన ఆర్థికవేత్త బీబీసీతో చెప్పారు.
"పేదరిక నిర్మూలన, సామాజిక పురోగతి కోసం చేపడుతున్న కార్యక్రమాలకు, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు అతిపెద్ద సవాలుగా మారుతున్నాయి" అని ప్రపంచ బ్యాంకు పరిశోధనా విభాగం మాజీ డైరెక్టర్, సీనియర్ ఉపాధ్యక్షుడు మార్టిన్ రావల్లియన్ అభిప్రాయపడ్డారు.
భారత్, చైనా ముందడుగు
సమగ్ర వృద్ధి లేకపోవడం, ఆర్థిక మందగమనం, ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న సంఘర్షణలు కొన్ని దేశాలలో పురోగతికి ఆటంకంగా మారాయని ప్రపంచ బ్యాంకు నివేదికలు చెబుతున్నాయి.
ఈ మధ్య కాలంలో భారత్, చైనాలో కలిపి 100 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. సబ్- సహరన్ ఆఫ్రికాలో మాత్రం అత్యంత పేదరికంలో ఉన్న వారి సంఖ్య 25 ఏళ్ల క్రితం కంటే ఎక్కువగా ఉంది.
"గత దశాబ్ద కాలంలో ప్రపంచం రెండింతల వేగంతో ముందుకు వెళ్లింది" అని ప్రపంచ బ్యాంకులో పేదరికం, ఈక్విటీ గ్లోబల్ ప్రాక్టీస్ విభాగం ప్రపంచ డైరెక్టర్ కరోలినా సాంచెజ్-పెరామో బీబీసీతో చెప్పారు.
1. ఆర్థిక వృద్ధిలో హెచ్చుతగ్గులు
"ఈ రెండున్నర దశాబ్దాలలో తూర్పు ఆసియా, దక్షిణాసియాలతో పోలిస్తే, సబ్- సహరన్, లాటిన్ అమెరికాలో వృద్ధి చాలా తక్కువగా ఉంది. చాలా దేశాల్లో అత్యంత వేగంగా పెరుగుతున్న జనాభాతో, ఆర్థిక వృద్ధిని పోల్చి చూస్తే తలసరి అభివృద్ధి తగ్గుతుంది. దేశాలు ఆర్థికంగా వృద్ధి సాధించకపోతే, పేదరిక నిర్మాలనలో పురోగతి సాధించడం చాలా కష్టం" అని సాంచెజ్-పెరామో అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
2. సమగ్ర అభివృద్ధి
పేదరిక నిర్మూలనకు సుస్థిర ఆర్థికాభివృద్ధి అవసరమే కానీ, పేదరికాన్ని తరిమేయాలంటే అదొక్కటే సరిపోదని ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ అంటున్నారు.
చాలా దేశాలలో సమగ్ర అభివృద్ధి జరగడంలేదు. ఉదాహరణకు సబ్- సహరన్ ప్రాంతాన్ని తీసుకుంటే, ఇక్కడ పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పన చాలా తక్కువగా ఉంది.
"పేదలకు ప్రధాన ఆదాయ వనరు ఉపాధి. కాబట్టి, ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. సరైన ఉపాధి అవకాశాలు లేని ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కష్టమైన పని" అని సాంచెజ్-పెరామో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
3. మౌలిక సదుపాయాలు
ప్రజల చేతుల్లో డబ్బు ఉన్నంత మాత్రాన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందినట్లు కాదు, వారికి విద్య, వైద్యం, రుణ సదుపాయం, మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలి. అవన్నీ లేవంటే సమగ్ర అభివృద్ధి జరగడంలేదని భావించాలని సాంచెజ్-పెరామో అభిప్రాయపడ్డారు.
ఉదాహరణకు దక్షిణ, తూర్పు ఆసియా దేశాలను తీసుకుంటే, ఈ మౌలిక సదుపాయాలలో కనీసం కొన్ని అయినా ఇక్కడ సమాంతరంగా మెరుగుపడుతున్నాయి.
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం, 2013 నుంచి మలేషియాలో పేదరికం లేదు (దేశీయ ప్రమాణాల ప్రకారం కాదు).
దానికి విరుద్ధంగా, నగదు బదిలీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టిన బ్రెజిల్‌లో పేదరికం 1990లో 21.6 శాతం ఉండగా, 2014 నాటికి 2.8 శాతానికి తగ్గింది. కానీ, 2017 నాటికి అది మళ్లీ పెరిగి 4.8 శాతానికి (దాని ప్రభావం కోటి మంది మీద పడింది) చేరడం గమనార్హం.
4. సంఘర్షణలు
గత కొన్నేళ్లుగా చోటుచేసుకుంటున్న రాజకీయ అస్థిరత, హింసాత్మక సంఘర్షణలు కొన్ని దేశాల్లో గతంలో సాధించిన పురోగతిని తుడిచేశాయి.
"పేదరిక నిర్మూలనలో ఇతర దేశాలు పురోగతి సాధిస్తుండగా, బలహీనమైన ఆర్థిక వ్యవస్థ, హింసాత్మక ఘర్షణలతో సతమతమవుతున్న దేశాల్లో పేదరికం పెరుగుతోంది" అని సాంచెజ్-పెరామో చెప్పారు.
2015లో ప్రపంచంలోని పేదల్లో సగం మంది భారత్, నైజీరియా, డీఆర్‌సీ కాంగో, ఇథియోపియా, బంగ్లాదేశ్‌లో ఉన్నారు.
ఇప్పుడు అత్యధిక మంది పేదలున్న దేశంగా భారత్‌ను నైజీరియా దాటేసిందని కొన్ని గణాంకాలు, త్వరలో దాటేయనుందని మరికొన్ని అంచనాలు సూచిస్తున్నాయి. ఈ రెండు దేశాలలోనూ పేదల సంఖ్య 10 కోట్లకు చేరువలో ఉంది.
పేదరికాన్ని నిర్మూలించడంలో పలు ఆఫ్రికన్ దేశాలు ముందడుగు వేస్తున్నప్పటికీ, 2030 నాటికి ప్రపంచంలోని ప్రతి 10 మంది పేదల్లో తొమ్మిది మంది సబ్-సహరన్ ఆఫ్రికాలోనే ఉంటారని అంచనాలు చెబుతున్నాయి.
పేదలకు ఫలాలు అందుతున్నాయా?
ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించాలన్నది ఒకటి. కానీ, ఆ గడువు పూర్తయ్యే నాటికి కూడా ప్రపంచ జనాభాలో ఆరు శాతం మంది అంతర్జాతీయ దారిద్ర్య రేఖకు దిగువనే ఉంటారని 2019 జూలైలో ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక పేర్కొంది.
ప్రస్తుత అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు "పేదలకు బాగానే అందుతున్నాయి. కానీ, నిరుపేదలకు అందడం లేదు" అని రావల్లియన్ చెప్పారు.
"ప్రస్తుతం ఆఫ్రికాలో పేదలు ఎలా ఉన్నారో, నేటి ధనవంతులు 200 సంవత్సరాల క్రితం అలాగే ఉన్నారు. అప్పట్లో అంత పేదరికంలో ఉన్నవారు ఇవాళ ఈ స్థాయికి వచ్చారంటే కారణం అభివృద్ధి ఫలాలను సమర్థవంతంగా అందుకోవడం వల్లే. అప్పట్లో అభివృద్ధి ఫలాలు నిరుపేదలకు నెమ్మదిగా అందినా, సమర్థవంతంగా చేరాయి. అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత ప్రపంచంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది" అని రావల్లియన్ వివరించారు.
"అందరికీ విద్య, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాలను కల్పించే సామర్థ్యాన్ని ధనిక దేశాలు పెంచుకున్నాయి. కానీ, ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ విషయంలో వెనుకబడి ఉన్నాయి. పేదల సంఖ్యను త్వరగా తగ్గించడంలో ఈ దేశాలు ఎంతో కృషి చేస్తున్నాయి. అయినా, అందాల్సిన వారికి ఆ ఫలాలు అంత సమర్థవంతంగా చేరడంలేదు" అని రావల్లియన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ప్రభుత్వ ఉద్యోగాలు: పోస్టులు వందల్లో.. దరఖాస్తులు లక్షల్లో
- బలహీన వ్యవస్థతో ఆరోగ్య బీమా పథకం అమలు సాధ్యమేనా?
- 'తండ్రి పేరు చెప్పలేక స్కూల్ మానేస్తున్నారు'
- క్రికెట్: భారత్‌లో బెట్టింగ్ చట్టబద్ధమైతే ఏమవుతుంది? బుకీలు ఏమంటున్నారు?
- కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను బీబీసీ ఎలా కనిపెట్టిందంటే...
- హైటెక్ వ్యవసాయం: ఆహార ఉత్పత్తుల దిగుబడిని పెంచడంలో టెక్నాలజీ పాత్ర ఏమిటి...
- భారతదేశ వాతావరణం: ఒకవైపు వరదలు, మరోవైపు కరవు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








