బలహీన వ్యవస్థతో ఆరోగ్య బీమా పథకం అమలు సాధ్యమేనా?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశంలోని కోట్లాది ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడానికి ఉద్దేశించిన ప్రతిష్టాత్మక నూతన ఆరోగ్య బీమా పథకం చూసేందుకు చాలా బాగా కనిపిస్తోంది.
ప్రజారోగ్యం విషయంలో భారతదేశం రికార్డు చాలా దారుణంగా ఉంది. ప్రజల ఆరోగ్యం మీద కేవలం జీడీపీలో 1 శాతం కంటే కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ప్రజారోగ్యంపై ప్రపంచంలోని అనేక దేశాలు పెడుతున్న ఖర్చు కన్నా ఇది చాలా తక్కువ.
ఆరోగ్యంపై పెడుతున్న ఖర్చులే దాదాపు 3-5 శాతం మంది ప్రజలను దారిద్ర్య రేఖకు దిగువకు నెట్టేస్తున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల ప్రజలైతే తమ ఆరోగ్యం కోసం చేసే ఖర్చులలో పాతిక శాతాన్ని అప్పుల ద్వారానో, ఆస్తులు అమ్ముకోవడం ద్వారానో తీరుస్తున్నారు.
''మోదీకేర్'' అని భారత ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుదారులు పిలుస్తున్న ఈ కేంద్ర బీమా పథకం, దేశంలోని సుమారు 50 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనాన్ని కలిగిస్తుందని, ప్రతి కుటుంబానికి ఏటా 5 లక్షల రూపాయల మెడికల్ కవరేజీ ఇస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి సుమారు రూ.1,090 ప్రీమియం చెల్లిస్తారు. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర నిధుల నుంచి దీని కోసం రూ.11 వేల కోట్లు కేటాయిస్తున్నారు.
ఈ పథకం ద్వారా దేశంలోని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిలో సుమారు 29 శాతం మందికి మరియు దిగువ మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. అలాంటి ప్రజలందరికీ ప్రభుత్వ ఖర్చుతో వైద్య సేవలను అందించడం అన్నది సరైన దిశగా తీసుకున్న చర్యే.
''ఈ పథకం నిజంగా చాలా సాహసంతో తీసుకున్నదే. మన ఆరోగ్య రంగాన్ని చాలా కాలంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే ఈ పథకాన్ని అమలు చేయడం పెద్ద సవాలు'' అని ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి, భారత ఆరోగ్యవ్యవస్థపై ఒక పుస్తకాన్ని రాసిన కె.సుజాతా రావు అన్నారు.
ప్రస్తుతం డజనుకు పైగా రాష్ట్రాలలో 2007 నుంచి ఇలాంటి కేంద్ర ఆరోగ్య పథకాలను, అదే విధంగా ప్రభుత్వ నిధులతో అందించే ఆరోగ్య బీమా పథకాలను - కొంత తక్కువ కవరేజీతోనే అయినా - అమలు చేస్తున్నారు. అయితే వాటి అమలు తీరు అంతంత మాత్రమే.
అలాంటి 13 పథకాలను సమీక్షించగా - తొమ్మిది లోపభూయిష్టంగా ఉన్నాయని, ఆ పథకాల వల్ల ప్రజలు తమ జేబు నుంచి పెడుతున్న ఖర్చులో మాత్రం తరుగుదల లేదని తేలింది.
2008లో ప్రారంభించి, 13కోట్ల మంది ప్రజలకు ప్రయోజనాన్ని అందిస్తున్న అలాంటి ఒక ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాన్ని సమీక్షించగా, దాని వల్ల పేద కుటుంబాలకు చెప్పుకోదగిన ఆర్థిక రక్షణ లభించలేదని వెల్లడైంది.

ఫొటో సోర్స్, AFP
అక్రమ చెల్లింపులు
చత్తీస్‌గఢ్ ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య బీమా పథకాన్ని పరిశీలించగా - ఆ పథకం కింద లబ్ధి పొందుతున్న వారిలో 95 శాతం మంది ప్రైవేట్ ఆసుపత్రులను, 66 శాతం మంది ప్రభుత్వ ఆసుపత్రులను ఉపయోగించుకుంటూ ఇంకా తమ సొంత జేబు నుంచి ఖర్చు పెట్టుకుంటూనే ఉన్నారు.
మనం ఉచిత వైద్య చికిత్స లభిస్తుందని భావించే ప్రభుత్వ ఆసుపత్రులలో తగినన్ని మందులు లేని కారణంగా, చాలా మంది మందులను, ఇతర సరంజామాను ప్రైవేట్ ఫార్మసీల నుంచే కొనుగోలు చేస్తున్నారు. అంతే కాకుండా కొన్నిసార్లు డాక్టర్లు, నర్సులకు కూడా అక్రమ చెల్లింపులు చేయాల్సి వస్తోంది.
రచయిత్రి సులక్షణా నంది పరిశోధన ప్రకారం - ప్రభుత్వం పేర్కొన్న రేట్లకు తాము వైద్య చికిత్సను అందించలేమని, అందువల్ల ఆ తేడాను రోగులే చెల్లించాల్సి ఉంటుందని ప్రైవేట్ ఆసుపత్రులు చెబుతున్నాయి.
భారతదేశంలోని ప్రైవేట్ ఆరోగ్య వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ లేదు, పారదర్శకత లేదు. అవి చాలా సార్లు రోగుల నుంచి అయిన ఖర్చుకన్నా ఎక్కువ వసూలు చేస్తుంటాయి.
ప్రైవేట్ ఆసుపత్రులకు పేదల పట్ల వ్యతిరేకత ఉంటుందని, వారికి సక్రమమైన సౌకర్యాలు ఇవ్వవనే అపవాదు ఉంది.
''ఒక మంచి విషయం ఏమిటంటే - ఆరోగ్యం అన్నది ఇప్పుడు రాజకీయాలతో ముడిపడిన అంశంగా మారింది. అయినా, పేదలకు ఆరోగ్య బీమా విషయంలో మనమింకా ఎలాంటి నియంత్రణా లేని ప్రాథమిక దశలోనే ఉన్నాం'' అని అశోకా యూనివర్సిటీ చీఫ్ ప్రతాప్ భాను మెహతా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మార్పు సాధ్యమేనా?
నాణ్యమైన ఆరోగ్య సేవలు కేవలం పెద్ద నగరాలు, పట్టణాలలోనే లభ్యమౌతాయి. ఈ పథకం కిందికి వచ్చే మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేదలకు ఆ వైద్యసేవలు ఎలా అందుబాటులోకి వస్తాయన్నది ప్రధానమైన ప్రశ్న.
మరో అంశం ఏమిటంటే - నిరుపేదలకు ఆసుపత్రి ఖర్చులకన్నా, ఔట్ పేషెంట్ చెల్లింపుల రీత్యానే ఎక్కువగా ఖర్చవుతోంది. వైద్య పరీక్షలు, డాక్టర్ల ఫాలో అప్ పరీక్షలు, ప్రాథమిక ఔషధాలు (గుండె జబ్బులు, మధుమేహ వ్యాధులకు స్టాటిన్లు మొద.), వైద్యానంతర ఖర్చులపై నిరుపేదలు చాలా ఖర్చు చేయాల్సి వస్తోంది.
అందువల్ల కేవలం ఆసుపత్రి ఖర్చులు మాత్రమే ఇస్తే సరిపోదు. ఉదాహరణకు ఒక దక్షిణాది రాష్ట్రంలో సర్జరీ పూర్తయిన ఏడాది వరకు పేద రోగులకు ఔషధాలను కూడా ఉచితంగా అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమాలో ఇలాంటి సదుపాయం లేదు.
నిజంగా ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయగలిగితే, నిరుపేదల జీవితాలలో ఇది చాలా పెద్ద మార్పే తీసుకురాగలదు. కానీ మన ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థలు చాలా బలహీనమైనవి. పాత అనుభవాల దృష్ట్యా, ఈ పథకం సక్రమంగా అమలు కావాలంటే ప్రభుత్వం చాలా కృషి చేయాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- ‘మీ బిడ్డకు పాలిస్తా.. నా బిడ్డను బతికించండి..!’
- జాకబ్ జుమా రాజీనామాకు స్వపక్షం ఒత్తిడి
- మన దేశానికి సెకండ్ హ్యాండ్ దుస్తులు ఎక్కడి నుంచి వస్తాయి?
- ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- రామ్ గోపాల్ వర్మ 'జీఎస్టీ'పై అభ్యంతరాలెందుకు? ఎవరికి?
- ‘ఆడపిల్ల చదువుకు అంత ఖర్చు దేనికి?’.. ఈ ప్రశ్నకు కారణాలేంటి?
- #BollywoodSexism: బాలీవుడ్, టాలీవుడ్‌లలో లైంగిక వేధింపులపై కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








