దక్షిణాఫ్రికా: అధ్యక్షుడు జాకబ్ జుమా రాజీనామాకు స్వపక్షం నుంచి తీవ్రమవుతున్న ఒత్తిడి

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాపై పదవికి రాజీనామా చేయాలంటూ స్వపక్షం 'ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్‌సీ)'లో ఒత్తిడి పెరుగుతోంది.

ఆదివారం ప్రిటోరియాలో అధ్యక్షుడు జాకబ్ జుమా నివాసంలో ఆయనతో ఏఎన్‌సీ సీనియర్ నాయకుల చర్చల తర్వాత ఈ ఒత్తిడి తీవ్రతరం అయ్యింది. ఈ చర్చల వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. జాకబ్ జుమా అంశంపైనే సోమవారం ఏఎన్‌సీ జాతీయ కార్యవర్గ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది.

జాకబ్ జుమా డిసెంబరులో ఏఎన్‌సీ అధ్యక్ష పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆయన స్థానంలో పార్టీ అధ్యక్షుడిగా సిరిల్ రమఫోసా నియమితులయ్యారు.

దక్షిణాఫ్రికాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలకు ముందు పార్టీలో ఆధిపత్య పోరాటం జరగకుండా జాగ్రత్త పడాలని, ఎందుకంటే అలాంటి పోరాటం పార్టీ చీలికకు దారి తీయగలదని ఏఎన్‌సీ అగ్రనేతలు ఆలోచిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

'రీకాల్' ద్వారాగాని లేదా పార్లమెంటులో తీర్మానం ద్వారాగాని జాకబ్ జుమాను దేశాధ్యక్ష పదవి నుంచి తప్పించాలని, ఇందుకు అవసరమైన ప్రక్రియను చేపట్టాలని ఏఎన్‌సీ సీనియర్ నాయకులు యోచిస్తున్నారు.

పాలక ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిరిల్ రమఫోసా

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, పాలక ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిరిల్ రమఫోసా

తాను ఏ తప్పూ చేయలేదని, తానెందుకు రాజీనామా చేయాలని ఆదివారం ఏఎన్‌సీ సీనియర్ నాయకులతో చర్చల్లో జాకబ్ జుమా ప్రశ్నించారని ప్రతిపక్ష 'ఎకనమిక్ ఫ్రీడమ్ ఫైటర్స్(ఈఎఫ్ఎఫ్)' పార్టీ నాయకుడు జూలియస్ మలేమా 'ట్విటర్'లో చెప్పారు.

తనను తప్పించాలనుకుంటే ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని, తానైతే రాజీనామా చేయబోనని జాకబ్ జుమా తేల్చి చెప్పారని ఆయన తెలిపారు.

2014 మేలో వరుసగా రెండో పర్యాయం అధ్యక్ష పదవిని చేపట్టిన జాకబ్ జుమా‌ పదవీ కాలం 2019 జూన్‌ వరకు ఉంది. అయితే దక్షిణాఫ్రికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుండటం, అవినీతి ఆరోపణల కారణంగా తమ పార్టీ పట్ల ప్రజాదరణ తగ్గుతోందని ఏఎన్‌సీ నాయకులు భావిస్తున్నారు.

2019 ఎన్నికల్లో దేశాధ్యక్ష పదవిని దక్కించుకొనే అవకాశమున్న నాయకుల్లో అందరికన్నా రమఫోసా ముందంజలో ఉన్నారు. పార్టీలో ఐక్యత కోసం ఆయన పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)