ఒక దేశం - ఒక ఓటు... ఎంతవరకూ సాధ్యం?

పార్లమెంటు భవనం

ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP/Getty Images

    • రచయిత, జుబైర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒక దేశం ఒక ఓటు.. ఈ ఆలోచనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ అంశాన్ని సమర్థిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం జరిగిన జాయింట్ బడ్జెట్ సెషన్‌లో ప్రసంగించారు.

దానర్థం ఏమిటంటే పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు జరగాలని. దీని ప్రధాన ఉద్దేశం డబ్బు ఆదా చేయడమే అని రాష్ట్రపతి నొక్కి వక్కాణించారు.

ఆయన మాటల్లో.. "దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరంతర ఎన్నికల వలన ఆర్థిక వ్యవస్థ మీద, అభివృద్ధి మీద వచ్చే ప్రతికూల ప్రభావాల గురించి కొంత ఆందోళన ఉంది. కాబట్టి దీని గురించి ఆలోచించి, చర్చలు జరిపి, అన్ని రాజకీయ పార్టీలు ఏక కాల ఎన్నికలపై ఒక అవగాహనకు రావల్సిన అవసరం ఉంది."

ప్రధానమంత్రి, ఆయన సహచరులు ఈ ప్రసంగాన్ని చాలా ఉత్సాహంగా విన్నారు. ఈ ప్రణాళికకు ప్రభుత్వ మద్దతు బలంగా ఉందనడానికి ఇదే నిదర్శనం.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

ఫొటో సోర్స్, MONEY SHARMA/AFP/Getty Images

అయితే దీనర్థం, జనరల్ ఎలక్షన్లు, మే 2019 లో జరగవలసినవి, ఇప్పుడు అతకుముందే జరగవచ్చనా? లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరిగే అవకాశం ఉందా? ప్రతిపక్షం దీనికి అంగీకారం తెలియజేస్తుందా? రాజ్యాంగంలో ఈ అంశంపై సవరణలు చేయవలసిన ఆవశ్యకత ఉందా?

ఇది ఒక భవిష్యత్తు ఆలోచనగా విశ్లేషకులు భావిస్తున్నారు. "అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకుండా ఇది జరగదు. 2024 పార్లమెంటరీ ఎన్నికల సమయానికి ఈ ప్రణాళిక అమలులోకి రావొచ్చేమో! దానికి ముందు కష్టం" అని ప్రముఖ రాజనీతి విశ్లేషకుడు ప్రదీప్‌సింగ్ పేర్కొన్నారు.

"ఈ ప్రణాళికను గత కొంత కాలంగా ప్రధానమంత్రి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారన్నది వాస్తవం. ఎందుకంటే దీనివల్ల డబ్బు చాలావరకు ఆదా అవుతుంది, అభివృద్ధి‌పై కూడా సానుకూల ప్రభావం ఉండవచ్చు. కానీ, ప్రతిపక్షం సమ్మతి తెలుపకుండా ఇది అమలుచేయడం సాధ్యం కాదు" అని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆయన తల్లి సోనియాగాంధీ

ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP/Getty Images

ఒకవేళ, బీజేపీ మొత్తం 29 రాష్ట్రాలలోనూ ఆధిపత్యంలో ఉండి ఉంటే ఈ ప్రణాళికకు విస్తృత అంగీకారం ఉండి ఉండేదని ప్రదీప్‌సింగ్ అభిప్రాయపడ్డారు.

మోడీ ప్రభుత్వం ఈ ప్రణాళికను ఆలశ్యంగా అమలు చేయడం ద్వారా ఎక్కువ లాభాలు పొందగలదనే అభిప్రాయాన్ని సింగ్ తోసిపుచ్చారు. జీఎస్‌టీ అమలుచేయటంలో ప్రభుత్వం చాలా శ్రమపడిందని, అయినాగానీ ప్రభుత్వం ఈ ప్రణాళిక అమలు విషయంలో కొంత నిదానంగా ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

"జీఎస్‌టీ ఈ ఏడాది కాలంలో వ్యవస్థలో బాగా వేళ్ళూనుకుంది. ఇది మంచి ప్రతిఫలలాను అందించబోతోంది. ఈ ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందడానికి ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది" అని ఆయన అన్నారు.

వేళ్ల మీద ఓటు ఇంకు గుర్తులు

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఏకకాల ఎన్నికలకు, రాజ్యాంగ సవరణ అవసరమని న్యాయశాస్త్ర నిపుణులు అంటున్నారు.

రాజ్యాంగ విషయాల నిపుణుడు, సుప్రీం‌కోర్టు లాయర్ అయిన సూరత్‌సింగ్ "లోక్‌సభ ఎన్నికలు నిర్ణీత సమయానికి ముందే జరపాలని ప్రధానమంత్రి భావిస్తే అందులో చట్టపరమైన ఇబ్బందులేమీ ఉండవు. కానీ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటరీ ఎన్నికలు ఒకేసారి జరగాలంటే మాత్రం రాజ్యాంగంలో కచ్చితంగా సవరణలు చేయవలసి ఉంటుంది" అని అన్నారు.

ఆయన ఉద్దేశంలో ఇది రాజకీయపరమైన ప్రణాళిక. ఆర్థిక లేదా రాజ్యాంగ సంబంధిత ప్రణాళిక కాదు. "ఈ ఏకకాల ఎన్నికలు డబ్బుని ఆదా చేయగలవనేది సమర్థనీయమైన కారణం కాదు. ఇది ఒక రాజకీయ ఆలోచన మాత్రమే. అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించకపోతే ఈ ఆలోచన అమలు జరగలేదు" అని ఆయన పేర్కొన్నారు.

ఓటు వేసి వేలు చూపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ

ఫొటో సోర్స్, SAM PANTHAKY/AFP/Getty Images

పార్లమెంటరీ ఎన్నికలు ముందుకు జరపాలనే ఆలోచన వెనుక అసలు కారణం గుజరాత్ ఎన్నికలలో బీజేపీ అనుకున్నంత మంచి ఫలితాలు సాధించలేకపోవడమే అని కొందరు నిపుణుల వాదన. ఆ ఎన్నికలలో బీజేపీకి 49 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 42 శాతం వచ్చాయి.

పార్లమెంటరీ ఎన్నికలు జరిగే విధానానికి, అసెంబ్లీ ఎన్నికల విధానానికి ఉన్న తేడా బీజేపీకి బాగా తెలుసు అని ప్రదీప్‌సింగ్ చెప్పారు. గుజరాత్ ఎన్నికలు జరిగిన 20 రోజుల తరువాత, పార్లమెంటరీ ఎన్నికలు జరిగితే ఎవరికి ఓటు వేస్తారని గుజరాత్ ప్రజలను అడిగితే 54 శాతం బీజేపీకి వేస్తామని, 35 శాతం కాంగ్రెస్‌కి వేస్తామని అన్నారు.

అన్ని అనుకున్నట్టు జరిగి ఈ ప్రణాళిక అమలులోకి వస్తే అన్ని ఎన్నికలూ ఏకకాలంలో జరపడానికి కావలసిన సౌకర్యాలను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చెయ్యగలదా? కష్టమే అని నిపుణులు అంటున్నారు.

రక్షణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చనీ, ఎన్నికల తేదీలు ఎక్కువ రోజులు ఉంటే కొంతవరకు సవ్యంగా జరిగే అవకాశాలు ఉన్నాయని వారంతా అభిప్రాయపడ్డారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)