గుజరాత్ ఎన్నికలు: ఫలితాలపై విశ్లేషకులు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘సాధారణంగా ఎన్నికల్లో ఎందరు పోటీ చేసినా ఒకరే గెలవడానికి అవకాశం ఉంటుంది. గుజరాత్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడిన తర్వాత ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో చప్పున చెప్పలేని పరిస్థితి’’ అని సీనియర్ పాత్రికేయుడు, విశ్లేషకుడు భండారు శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కావడం వల్ల గుజరాత్ ఎన్నికల ఫలితాల పట్ల తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆసక్తి వ్యక్తమైంది. వివిధ పార్టీల నేతలు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు టీవీ చానెల్లలో ఈ ఫలితాలను పలు కోణాల్లో విశ్లేషించారు. వారిలో కొందరితో బీబీసీ మాట్లాడింది.
‘‘సాంకేతికంగా బీజేపీ విజేత. అందులో సందేహం లేదు. ఒక్క స్థానం ప్రత్యర్థిపై అదనంగా గెలుచుకున్నా ప్రభుత్వం ఏర్పాటు చేసే వీలు వారికే ఉంటుంది. కాకపోతే ప్రచారం మొదలైనప్పుడు సోదిలో కూడా లేని కాంగ్రెస్ 80 స్థానాలు కైవసం చేసుకోవడమే కాకుండా ప్రత్యర్థి బీజేపీని వంద లోపు సంఖ్యకే పరిమితం చేయగలగడం నిజంగా విశేషమే’’ అని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
‘‘ఇంకా కాస్త ప్రయత్నించి ఉంటే అధికార అందలానికి చేరుకునేదేమో అనేంతగా కాంగ్రెస్ పార్టీ ఫలితాలు సాధించగలిగింది. ఆ విధంగా చూస్తే ఈ ఎన్నికల్లో విజేత గెలిచాడు, పరాజితుడు ఓడిపోలేదు’’ అని భండారు విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Getty Images
’’ఇది బీజేపీకి హెచ్చరిక‘‘
''గుజరాత్ ఫలితాలు బీజేపీకి ఒక హెచ్చరిక. తమను జనం ఎల్లవేళలా అంగీకరిస్తారని బీజేపీ భావించరాదని ఈ ఎన్నికలు హెచ్చరించాయి’’ అని సీనియర్ పాత్రికేయుడు, విశ్లేషకుడు తెలకపల్లి రవి పేర్కొన్నారు.
గుజరాత్ ఎన్నికలపై ఆయన బీబీసీ ప్రతినిధితో మాట్లాడుతూ ‘‘నల్లేరు మీద నడకలా నడిచిన రాష్ట్రంలో అత్తెసరుగా గెలవటం కోసం నానాతంటాలు పడాల్సి వచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి ఎన్నో విన్యాసాలు చేయాల్సి వచ్చింది. ఎన్నికల ప్రచారం పూర్తిగా దిగజారిపోయింది. క్షీణ, దారుణ స్థాయికి పడిపోయింది. సామ, దాన, బేధ, దండోపాయాలతో బీజేపీ గట్టెక్కింది‘‘ అని వ్యాఖ్యానించారు.
‘‘కాంగ్రెస్ కోలుకోవటం ఈ ఫలితాల్లో మరో ముఖ్యాంశం. రాహుల్‌గాంధీ ఫరవాలేదు, పోరాటం చేయగలరు అనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణులకు కల్పించారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావటానికి లాంచింగ్ ప్యాడ్ అయిన గుజరాత్.. రాహుల్ గాంధీకి కూడా స్టార్టింగ్ పాయింట్ కావచ్చు’’ అని రవి విశ్లేషించారు.
‘‘అసలు రాహుల్ పూర్తిస్థాయిలో బీజేపీ విధానాలను వ్యతిరేకించివుంటే కాంగ్రెస్‌కు మరింత మెరుగైన ఫలితాలు లభించి ఉండేవి. కానీ బీజేపీ పెద్ద హిందుత్వ అయితే, తాము చిన్న హిందుత్వ లాగా వ్యవహరించటం వల్ల ఫలితాలు పరిమితంగా ఆగిపోయాయి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘ఇక ఈ ఎన్నికల్లో ముగ్గురు యువనేతలు ముందుకు రావటం ద్వారా.. దేశంలో కొత్త సామాజిక శక్తులు - వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలిచినప్పటికీ - యువనాయకులు రాజకీయ రంగం మీదకు వచ్చి ప్రభావం చూపగలరని స్పష్టమవుతోంది'' అని తెలకపల్లి పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘సంస్థాగత పటిష్టత వల్లే బీజేపీ గెలిచింది‘‘
‘‘గుజరాత్‌లో ఏనాడూ కులాల ప్రస్తావన లేదు. పాతికేళ్ల తర్వాత కుల రాజకీయాలు వచ్చాయి. ఇది ప్రమాదకర పోకడ’’ అని ప్రముఖ పాత్రికేయుడు రాకా సుధాకర్ వ్యాఖ్యానించారు. గుజరాత్ ఫలితాలపై ఆయన బీబీసీ ప్రతినిధితో మాట్లాడుతూ.. గుజరాత్‌లో బీజేపీ సంస్థాగతంగా పటిష్టంగా ఉండటం వల్లే ఈ ఎన్నికల్లో గెలిచిందని అభిప్రాయపడ్డారు.
‘‘కులం అనేది ఓటు వేయటానికి ప్రాతిపదిక కాకూడదు. కాంగ్రెస్ చాలా పెద్ద ప్రయత్నం చేసింది. ఓబీసీ, పటేల్, దళితులు ఇలా కుల రాజకీయాలను ముందుకు తెచ్చింది. ఇది చాలా హేయమైన విషయం’’ అని సుధాకర్ పేర్కొన్నారు.
‘‘మరో ముఖ్య విషయం 2002 తర్వాత మొదటిసారిగా గుజరాత్ ఎన్నికల్లో నాటి గుజరాత్ అల్లర్ల ప్రస్తావన రాలేదు. ఆ మాటే ఎక్కడా రాలేదు. ముస్లింల గురించి కూడా మాట్లాడలేదు. కేవలం కులాల ప్రస్తావనే ఉంది. దేశంలో కులాలను విస్మరిస్తున్న సమయంలో మళ్లీ కుల రాజకీయాలు తలెత్తటం ప్రమాదకరం. ఈ పోకడ మున్ముందు ఇంకా పెరుగవచ్చు. ఎందుకంటే బీజేపీని మరే రకంగా ఓడించలేరు కాబట్టి కుల రాజకీయాలను ఆశ్రయిస్తున్నారు’’ అని ఆయన చెప్పారు.
‘‘ఇన్ని ఉన్నా కూడా బీజేపీ గెలిచింది. ఈ పరిస్థితుల్లో గెలవటం కష్టమైనా బీజేపీ గెలవటానికి కీలక కారణం సంస్థాగత పటిష్టత. కాంగ్రెస్‌కు గుజరాత్‌లో సంస్థాగత పటిష్టత లేనందువల్ల అది ఓడిపోయింది. రెండు పార్టీలకూ ఓట్ల శాతం దాదాపు సమానంగా వచ్చినా బీజేపీ గెలవటానికి కారణం.. అది పటిష్టమైన సంస్థాగత శ్రేణుల ద్వారా తన ఓటర్లతో ఓటు వేయించగలగటమే. ఇక మోదీ ఫ్యాక్టర్ కూడా పనిచేసింది‘‘ అని సుధాకర్ విశ్లేషించారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








