గుజరాత్ ఫలితాలు: యువనేతలు హిట్టా?.. ఫట్టా?

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్‌లో ఓట్ల లెక్కింపు హోరాహోరీగా జరుగుతోంది. తొలుత ఆధిక్యంలో దూసుకెళ్లిన కాంగ్రెస్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం భాజపా ముందంజలో ఉంది.
యువత నేతల సొంత నియోజకవర్గాల్లో ఫలితాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
స్వంతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దళిత యువ నేత జిగ్నేష్ మేవానీ నియోజక వర్గంలో భాజపా వెనుకంజలో ఉంది.
కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన ఓబీసీ యువ నేత అల్పేష్ ఠాకూర్ కూడా విజయం దిశగా దూసుకెళ్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్‌తో చేతులు కలిపిన హార్దిక్
బీజేపీని ఓడించేందుకు ఈ ఎన్నికల్లో హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపణలు చేశారు.
బీజేపీకి కూడా పాటిదార్లలో చెప్పుకోదగినంత బలముంది. పాటిదార్ల ప్రాబల్యం ఉన్న చోట బీజేపీ విజయం సాధిస్తే అది హార్దిక్ పటేల్ ఇమేజ్‌ను దెబ్బ తీసే అవకాశముంది.
ఈ ఎన్నికల తర్వాత హార్దిక్ పటేల్ తన ఆందోళనను స్వతంత్రంగా కొనసాగిస్తారా? లేక కాంగ్రెస్‌తో జత కడతారా అన్నది వేచి చూడాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఫైర్ బ్రాండ్ జిగ్నేష్ మేవానీ
దళిత యువ నేత జిగ్నేష్ మేవానీ ఉత్తర గుజరాత్‌లోని బనాస్‌కాంఠ జిల్లా వడ్‌గామ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మేవానీకి మద్దతుగా కాంగ్రెస్ అక్కడ పోటీ అభ్యర్థిని పెట్టలేదు.
ఇటీవల గుజరాత్‌లో దళితులపై పెరుగుతున్న దాడుల నేపథ్యంలో జిగ్నేష్ మేవానీ ఎలాగైనా బీజేపీని ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు.
దళిత వ్యతిరేక బీజేపీకి ఓటేయొద్దని మేవానీ తీవ్రంగా ప్రచారం చేశారు. రాష్ట్రంలోని 7 శాతం దళితుల ఓట్లు బీజేపీకి పడకుండా చేయాలనేదే తన లక్ష్యమని ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్
కాంగ్రెస్ తరపున రాధన్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఓబీసీల నేత అల్పేష్ ఠాకూర్ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు.
ఓబీసీలలో మంచి ప్రాబల్యం ఉన్న యువ నేతగా ఆయనకు పేరుంది. ఈ నియోజకవర్గంలోని ముఖ్యంగా 60 వేల మంది ఠాకూర్ ఓటర్లను నమ్ముకుని అల్పేష్ బరిలోకి దిగారు.
ప్రధాని రోజూ 4 లక్షల రూపాయల విలువ చేసే పుట్టగొడుగులు తింటారంటూ అల్పేష్ ఠాకూర్ చేసిన ప్రచారం కూడా వివాదాస్పదమైంది.
గతంలో నల్లగా ఉన్న ప్రధాని తైవాన్ పుట్టగొడుగులు తినడం వల్లే తెల్లబడ్డారంటూ అల్పేష్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
విజయానికి చేరువలో విజయ్ రూపాని
రాజ్‌కోట్- పశ్చిమం నియోజకవర్గంలో గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థి విజయ్ రూపాని విజయానికి చేరువయ్యారు.
బీజేపీకి ఈ నియోజకవర్గం అత్యంత సురక్షితమైన సీటు. 1985 నుంచి ఇక్కడ కమలదళమే విజయం సాధిస్తోంది.
2014లో విజయ్ రూపానీ ఇక్కడి నుంచే విజయం సాధించారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








