#BollywoodSexism నేను ఫెమినిస్టునని చెప్పగానే అంతా అదిరిపడ్డారు: సోనమ్ కపూర్

ఫొటో సోర్స్, Sonam Kapoor/Facebook
- రచయిత, హరూన్ రషీద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
లైంగిక వేధింపులకు, లైంగిక దాడులకు గురయ్యేవారిని చిన్నచూపు చూడటం దేశంలో ఇప్పటికీ కొనసాగుతోందంటూ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విచారం వ్యక్తంచేశారు.
బాలీవుడ్‌లో లింగ వివక్ష, లైంగిక వేధింపులు ఉన్నాయా, ఉంటే వాటిపై చిత్రపరిశ్రమలోని కొందరు మహిళలు ఎలా పోరాడుతున్నారు అనే అంశంపై బీబీసీ అందిస్తున్న సిరీస్‌లో ఈ ఇంటర్వ్యూ ఒక భాగం.
లింగ వివక్ష, లైంగిక వేధింపుల సమస్యకు మూడు కోణాలు ఉన్నాయని సోనమ్ చెప్పారు.
''వీటిలో మొదటిది- చాలా మంది మహిళలు తమకు ఏం జరుగుతోందో గుర్తించరు. తమకు వేధింపులు ఎదురవడం మామూలేనని అనుకొంటుంటారు. మొదటి నుంచీ చుట్టూ ఉన్న వాతావరణం, పరిస్థితులు వారిని ఇలా అనుకొనేలా చేస్తాయి. రెండోది- వేధింపులు ఎదురైతే, వాటి గురించి బయటకు చెప్పొద్దని, మౌనంగా ఉండాలని చెబుతుంటారు. అసలేమీ జరగనట్లు వ్యవహరించాలని చెబుతుంటారు. మూడోది- 'మహిళకు ఏమైనా జరిగితే మహిళదే తప్పు' అనే భావన ఉండటం, బాధితులనే నిందించడం'' అని ఆమె వివరించారు.
వారికి రెండు భయాలు
లైంగిక వేధింపుల గురించి మాట్లాడితే కెరీర్ దెబ్బతింటుందనే భయం నటీనటులకు ఉందా అని బీబీసీ ప్రశ్నించగా- కెరీర్ దెబ్బతింటుందని మాత్రమే కాదని, సమాజంలో పలుచన అవుతామనే భయం కూడా ఉంటుందని, ఈ విషయంలో మన సమాజం చాలా వెనకబడి ఉందని సోనమ్ సమాధానమిచ్చారు.
ఓ యువతితో అమెరికా నటుడు అజీజ్ అన్సారీ అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణలతో మీడియాలో వెలువడిన ఒక కథనాన్ని, దీనిపై చర్చను బీబీసీ సోనమ్ వద్ద ప్రస్తావించింది. ఈ కథనాన్ని విమర్శించేవారు కొందరు, ఇది వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడమేననే వాదించడంపై మీరేమంటారని ప్రశ్నించగా, ఇది ఏ మాత్రం అర్థంలేని వాదనని ఆమె కొట్టిపారేశారు.
లైంగిక వేధింపులపై బాధితులు మౌనం వహిస్తున్నారని, వారు పెదవి విప్పినప్పుడే నిజమేమిటో తెలుస్తుందని సోనమ్ పేర్కొన్నారు. ఎప్పుడైనా నిజం బయటకు వచ్చి తీరుతుందని తెలిపారు.

ఫొటో సోర్స్, Sonam Kapoor/Twitter
ఈ పదేళ్లలో మార్పు వచ్చింది
మహిళా సాధికారతపై ప్రస్తుతం జరుగుతున్నచర్చ పట్ల ఆశావహంగా ఉన్నానని సోనమ్ ఇటీవల చెప్పారు. ఈ అంశాన్ని ప్రస్తావించగా- తాను సినిమాల్లోకి వచ్చినప్పుడు తనకు 20-21 సంవత్సరాలు ఉంటాయని, అప్పుడు ''నేను స్త్రీవాదిని'' అని చెబితే, తానేదో పొరపాటు చేసినట్లు అందరూ చూశారని, తాను లౌక్యంగా వ్యవహరించలేనని అనుకున్నారని పేర్కొన్నారు.
ఈ పదేళ్లలో మార్పు వచ్చిందని, ఇప్పుడు పరిస్థితి అలా లేదంటూ ఆమె ఒకింత సంతోషాన్ని వ్యక్తంచేశారు.
''లింగ వివక్షకు వ్యతిరేకంగా మీరో వైఖరిని తీసుకున్నారు. కథానాయకుడితో సమానంగా పారితోషికం చెల్లించడం లేదనే కారణంతో ఒక సినిమాను కూడా వదులుకున్నారు. మగవారికి, ఆడవారికి మధ్య పారితోషికం, వేతనాల విషయంలో అసమానత తొలగింపుకు హిందీ చిత్రపరిశ్రమ ఎంత దూరంలో ఉంది'' అని ప్రశ్నించగా- చాలా దూరంలో ఉందని సోనమ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Sonam Kapoor/Facebook
ప్రస్తుతం పురుష పాత్రలే ప్రధానంగా సినిమాలు తీస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కథానాయకులు, ఇతర పురుష పాత్రలు పోషించే నటులే ప్రేక్షకులను పెద్దసంఖ్యలో థియేటర్లకు రప్పించగలుగుతున్నారని ప్రస్తావించారు.
వాణిజ్య కోణంలో చూసినప్పుడు వారికి అధిక పారితోషికం సబబుగానే అనిపిస్తుందని, అయితే మహిళలు ప్రధాన పాత్రధారులుగా ఉండే వాణిజ్య సినిమాలు మరిన్ని తీయాల్సి ఉందని, లేదా ప్రేక్షకుల దృష్టిలో స్త్రీ, పురుష పాత్రలకు సమ ప్రాధాన్యం ఉండే సినిమాలు తీయాలని సోనమ్ చెప్పారు. అయితే ఇది సాకారమయ్యే రోజు చాలా దూరంలో ఉందని వ్యాఖ్యానించారు.
చిత్ర పరిశ్రమతోపాటు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, అసమానతలు, అన్యాయాలను ఎదుర్కొనేందుకు, బాధితులకు అండగా నిలిచేందుకు హాలీవుడ్ నటీమణులు, రచయితలు, దర్శకులు చేపట్టిన 'టైమ్ ఈజ్ అప్' కార్యక్రమానికి మద్దతుగానూ సోనమ్ సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు.
ఇవి కూడా చదవండి:
- #BollywoodDreamgirls: 'ఒక్కోసారి ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చానా అనిపిస్తుంది!'
- #HerChoice: మహిళలు తమకు నచ్చినట్లు ఉంటే ఏం జరుగుతుంది?
- #HerChoice: 'తమ ప్రేమ వ్యవహారాల కోసం అమ్మా నాన్నా నన్నొదిలేశారు'
- #HerChoice: 'ఒక మహిళతో కలసి జీవించాలని నేనెందుకు నిర్ణయించుకున్నానంటే..'
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- #HerChoice: ‘ఆడవాళ్లకు కోరికలుండవా?’
- #HerChoice: భర్త వదిలేశాక, నాతో నేను ప్రేమలో పడ్డాను సరికొత్తగా!
- #HerChoice: చివరికి తిట్లు కూడా మహిళలకేనా!
- లైంగిక వేధింపుల బాధితులకు హాలీవుడ్ నటీమణుల మద్దతు
- బడ్జెట్ అర్థం కావాలంటే ఈ 10 విషయాలు తెలియాల్సిందే!
- బడ్జెట్2018: మీరు తెలుసుకోవాల్సిన 19 ముఖ్యాంశాలు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









