తెలంగాణ: స్కూల్ ఫీజులకు లింగవివక్షకు సంబంధం ఉందా?

ఫొటో సోర్స్, iStock
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
'లక్షల రూపాయిల ఫీజులు కట్టి ఒకరినైతే చదివించగలం కానీ, ఇద్దరిని అంటే ఎలా సాధ్యం. ఆడపిల్ల చదువుకు అంత ఖర్చు దేనికి ? అబ్బాయికైతే భవిష్యత్తులో ఉపయోగం ఉంటుంది' అని అభిప్రాయపడుతున్నారు హైదరాబాద్‌కు చెందిన కృష్ణ.
ఈయనకు ఇద్దరు పిల్లలు. ఒక పాప, ఒక బాబు. అమ్మాయిని వీధి చివరలో ఉన్న ప్రైవేటు స్కూల్‌లో చదివిస్తున్నారు. అబ్బాయిని మాత్రం లక్షల రూపాయల ఫీజులు కట్టి ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివించాలని అనుకుంటున్నారు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కృష్ణ ఏడాదికి రూ. 8 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఆయన భార్య కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పిల్లలను చూసుకునేందుకు ఇంట్లోనే ఉంటున్నారు.
ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు గత కొన్నాళ్లుగా ఫీజులు విపరీతంగా పెంచుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఫొటో సోర్స్, iStock
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పలుమార్లు ఈ అంశంపై స్పందించారు.
"కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో రుసుములు అధికంగా ఉన్నాయన్నది వాస్తవమే. ఈ అంశంపై ఇప్పటికే కమిటీ వేశాం. అది ఇచ్చే నివేదిక ప్రకారమే స్కూల్ ఫీజులు పెంచే అంశంపై నిర్ణయం తీసుకుంటాం' అని 2017 నవంబర్ 6న శాసనసభలో ఆయన తెలిపారు.
ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల పెంపును సమీక్షించి తగిన సిపార్సులు చేసేందుకు 2017 మార్చిలో ప్రభుత్వం ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.
రాబోయే విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రైవేటు స్కూళ్లు నవంబర్‌లోనే అడ్మిషన్ల ప్రక్రియ మొదలుపెడుతాయి.

ఫొటో సోర్స్, iStock
ఈసారి మాత్రం తిరుపతిరావు కమిటీ నివేదిక వచ్చాకే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం మొదటి ఆదేశాలు జారీ చేసింది.
ఆ తర్వాత 2018 జనవరి 2 నుంచి 12 వరకు షరతులకు లోబడి అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది.
తిరుపతిరావు కమిటీ నివేదికను పూర్తిస్థాయిలో సమీక్షించాకే ఫీజులు నిర్ణయిస్తామని,
అప్పటి వరకు యధాతథ స్థితి అమల్లో ఉంటుందని పేర్కొంది.
ప్రస్తుతానికి అడ్మిషన్లకు సంబంధించి కిందటి విద్యాసంవత్సరం ఫీజునే కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఫొటో సోర్స్, iStock
తల్లిదండ్రుల్లో ఆందోళన
ఫీజుల పెంపుపై ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. కొన్ని విద్యాసంస్థలు 10శాతం ఫీజు పెంచుతున్నట్లు తెలుస్తోంది.
"మా పిల్లలు చదువుతున్న స్కూల్లో 10 నుంచి 12 శాతం ఫీజు పెంచేందుకు ప్రతిపాదనలు ఉన్నట్లు నోట్ పంపారు' అని అల్వాల్‌లోని పల్లవి మోడల్ స్కూల్‌లో తన ఇద్దరు పిల్లలను చదివిస్తున్న రాజశేఖర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
యాజమాన్యాలు ఏమంటున్నాయంటే?
ఫీజులకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు తమకు అందలేదని, ప్రస్తుతం 'షరతులతో కూడిన ప్రవేశాలు' కల్పిస్తున్నామని ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ రాజు బీబీసీకి తెలిపారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకున్నాకే ఫీజుల వివరాలు చెబుతామని అన్నారు.
తెలంగాణలోని దాదాపు 50వరకు ఇంటర్నేషనల్ స్కూళ్లు ఈ అసోసియేషన్ కిందే ఉన్నాయి.
ప్రభుత్వం ఫీజుల పెంపుపై కాకుండా, విద్యాసంస్థల లాభార్జనలను నియంత్రించగలితే బాగుంటది అని ప్రవీణ్ రాజు అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, iStock
"హైదరాబాద్ ఇప్పుడు అంతర్జాతీయ నగరం. అదే స్థాయిలో విద్యాప్రమాణాలు ఉండాలని పిల్లల తల్లిదండ్రులు, ఇతర దేశాల నుంచి ఇక్కడికొచ్చిన వృత్తి నిపుణులు కోరుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫీజుల వసూలు చేస్తున్న స్థాయిలో విద్యాసంస్థలు వసతులు కల్పిస్తున్నాయా, ప్రమాణాలు పాటిస్తున్నాయా? అనేది ప్రభుత్వం పర్యవేక్షించాలి" అని ప్రవీణ్ రాజు పేర్కొన్నారు.
ఏటా పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా ఫీజులు పెంచకపోతే ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వటం కష్టమవుతుందని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఎన్.రెడ్డి అన్నారు.
"తెలంగాణలో 80 శాతం ప్రైవేట్ స్కూళ్లకు సొంత భవనాలు లేవు. కార్పొరేట్, అంతర్జాతీయ విద్యా సంస్థలకు దీటుగా నాణ్యమైన విద్య అందించాలంటే ఫీజు పెంచక తప్పదు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, iStock
గణాంకాలు
- తెలంగాణలోని మొత్తం పాఠశాలలు: 52,359
- మొత్తం ప్రభుత్వ పాఠశాలలు: 40,818
- ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య: 22,38,721
- తెలంగాణలోని మొత్తం ప్రైవేటు పాఠశాలలు: 11,541
- ప్రైవేటు పాఠశాలల్లోని మొత్తం విద్యార్థులు: 26,90,844
- ఆధారం: విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాలు 2015-16 ప్రకారం.

ఫొటో సోర్స్, iStock
వివిధ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వివరాలు:
గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఫీజులు: ఏటా రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు (ఒకటో తరగతి నుంచి 10 వ తరగతి వరకు)
కార్పొరేట్ స్కూళ్లలో ఫీజు: రూ.50 వేల నుంచి రూ.3 లక్షలు
ఇంటర్నేషనల్ స్కూళ్లు: రూ.లక్ష నుంచి రూ.3 లక్షలకు పైగా.
(2016-17 వార్షిక ఫీజులపై తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఇచ్చిన వివరాలను అనుసరించి.)

ఫొటో సోర్స్, iStock
కొన్ని పాఠశాలల్లో ఫీజుల వివరాలు:
ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్
- కిండర్ గార్టెన్: రూ.5,00,000
- గ్రేడ్ 1-5: రూ. 5,76,500
- గ్రేడ్ 6-8: రూ. 5,76,500
- గ్రేడ్ 9-10: రూ. 7,60,000
స్కూల్ వెబ్‌సైట్ నుంచి సేకరించిన సమాచారం.
మన్‌థన్ ఇంటర్నేషనల్ స్కూల్
- కిండర్ గార్టెన్: రూ.85,000
- గ్రేడ్ 1-5: రూ.98,000
- గ్రేడ్ 6-8: రూ 1,11,000
- గ్రేడ్ 9-10: రూ1,32,000
గ్లెండేల్ అకాడమీ, బండ్లగూడ
- గ్రేడ్ 1-5: రూ 1,95,000
- గ్రేడ్ 6-8: రూ 2, 50,000
- గ్రేడ్ 9-10: రూ 2,55,000
శాంక్టా మేరియా
గ్రేడ్ 1-4: రూ.2,40,000
- గ్రేడ్ 5-7: రూ.2,76,146
- గ్రేడ్ 8-9: రూ.3,14,635
- గ్రేడ్ 10: రూ.3,39,275
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్
- గ్రేడ్ 1-5: రూ 75,521
- గ్రేడ్ 6-10: రూ 89,562
భారతీయ విద్యాభవన్
- కిండర్ గార్టెన్ : రూ 2,25,000
- 1-10 తరగతి : రూ 2,75,000
హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ నుంచి సేకరించిన గణాంకాలు

ఫొటో సోర్స్, iStock
వ్యాపారంగా మారుతోందా?
దేశంలో ప్రైవేట్ స్కూళ్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలు ముందున్నాయి. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం పలుమార్లు చర్యలు తీసుకుంది.
విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ కోసం 2009లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో 91ను తీసుకొచ్చింది. అయితే దీన్ని హైకోర్ట్ కొట్టేసింది.
నియంత్రణ కమిటీ ఏర్పాటు కోసం 2010లో ప్రభుత్వం జారీ చేసిన జీవో42పై కూడా కొన్ని విద్యాసంస్థలు కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాయి.
ఇప్పుడు తిరుపతిరావు కమిటీ సిఫార్సులను సమీక్షించి ఫీజు నియంత్రణపై నిర్ణయం తీసుకుంటామని
విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు.

ఫొటో సోర్స్, iStock
'ఫీజులు పెంపు లింగ వివక్షకు దారితీయోచ్చు'
'స్కూల్ ఫీజులు ఏటా పెరుగుతూ ఉంటే ఇంట్లో ఎవరినో ఒకరినే ఉన్నత స్థాయిలో చదివించే పరిస్థితి తల్లిదండ్రులకు వస్తుంది. అప్పుడు చాలా మంది తల్లిదండ్రులు అమ్మాయిలను పక్కన పెట్టి అబ్బాయిలనే చదివిస్తారు. ఇది చివరకు లింగ వివక్షతకు దారి తీసే ప్రమాదం ఉంది' అని విద్యావేత్త చావా రవి అన్నారు.
'ప్రభుత్వ పాఠశాలల్లో కంటే ఇంటర్నేషనల్ స్కూళ్లలోనే నాణ్యమైన విద్య అందుతుందనే అపోహ తల్లిదండ్రుల్లో బాగా ఉంది. అందుకే చాలా మంది పేరెంట్స్ తమ స్థోమతకు మించి పిల్లలను ఇంటర్నేషనల్ స్కూళ్లలోనే చదివిస్తున్నారు. ఇదే అదనుగా అలాంటి విద్యాసంస్థలు భారీగా ఫీజులు పెంచుతున్నాయి' అని రవి పేర్కొన్నారు.
'కొన్ని విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చేశాయి. కొంతమంది తల్లితండ్రులు కూడా అంతర్జాతీయ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించడం 'స్టేటస్ సింబల్'గా భావిస్తున్నారు. అయితే అక్కడ నాణ్యమైన విద్య అందుతుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితే ఉంది' అని రవి వివరించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








