ఆస్ట్రేలియా: బాలలపై అకృత్యాలకు పాల్పడుతున్న వారిలో మత గురువులు, టీచర్లే అధికం

ఫొటో సోర్స్, Getty Images
చిన్నారులపై లైంగిక వేధింపుల అంశంపై ఆస్ట్రేలియాలో దాదాపు ఐదేళ్ల పాటు విచారణ జరిపిన కమిటీ తన తుది నివేదికను విడుదల చేసింది. అందులో 400కు పైగా సిఫార్సులు చేసింది.
స్కూళ్లు, ప్రార్థనా మందిరాలు, క్రీడా క్లబ్బులతో పాటు పలు సంస్థల్లో చిన్నారులపై జరిగిన అత్యంత భయంకరమైన దారుణాలకు సంబంధించిన ఆధారాలను రాయల్ కమిషన్ బట్టయబయలు చేసింది.
2013 నుంచి వచ్చిన 2,500కి పైగా అభియోగాల వివరాలను ప్రభుత్వానికి నివేదించింది.
"ఆస్ట్రేలియాలోని అనేక సంస్థల్లో వేలాది మంది చిన్నారులు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. మొత్తం బాధితులు ఎంత మంది ఉంటారో కూడా మనకు స్పష్టంగా తెలియదు. ఇది ఏ కొన్ని కేసుల గురించో కాదు. ఈ నేరాలను అరికట్టడంలో దేశంలోని సంస్థలన్నీ విఫలమయ్యాయి" అంటూ కమిషన్ తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.
చిన్నారులపై ఈ దారుణాలకు పాల్పడుతున్న వారిలో మత గురువులు, పాఠశాల టీచర్ల మీదనే అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని ఆ నివేదిక పేర్కొంది.

ఫొటో సోర్స్, ROYAL COMMISSION

బాలలపై ఆకృత్యాలపైజరిపిన విచారణ తీరిది:
- 2013 నుంచి 2,559 దారుణాలను విచారణ కమిషన్ పోలీసులకు నివేదించింది.
- 230 కేసుల్లో విచారణ ప్రారంభమైంది.
- కమిటీకి ప్రజల నుంచి 41,770 ఫిర్యాదులు వచ్చాయి.
- దాదాపు 60,000 మంది బాధితులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేసింది.

ప్రధానమైన సిఫార్సులు:
- బాలలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు జాతీయ స్థాయిలో వ్యూహాన్ని అనుసరించాలి.
- నేరాలను అరికట్టేందుకు స్కూళ్లలో పిల్లలకు శిక్షణ ఏర్పాట్లు చేయాలి.
- దేశ మంత్రి పర్యవేక్షణలో పనిచేసే 'బాలల భద్రత' విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
- ఎవరైనా ఈ నేరాలకు పాల్పడినట్టు తెలియగానే మత పెద్దలు, ఆయాలు, మానసిక వైద్యులు తప్పనిసరిగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

ఫొటో సోర్స్, Reuters
ఇప్పటి వరకు క్రిస్టియన్ సంస్థల్లోనే ఎక్కువగా ఈ నేరాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని కమిషన్ నివేదికలో పేర్కొంది.
ఐదేళ్లలో బాధితులతో రాయల్ కమిషన్ 8,000కు పైగా సదస్సులు నిర్వహించింది.
క్షేత్ర స్థాయిలో పర్యటించి 15,000 మందిని కలిసింది. బాధితుల బంధులువు, స్నేహితులను సంప్రదించింది. దాదాపు 1,300 రాతపూర్వక ఫిర్యాదులు సేకరించింది.
బాధితుల ఫిర్యాదులను, సందేశాలను 'మెసేజ్ టు ఆస్ట్రేలియా' పేరుతో ఓ పుస్తకంగా ముద్రించారు.
'జాతీయ విషాదాన్ని కమిషన్ బట్టబయలు చేసింది. కమిషన్ సభ్యులకు, ధైర్యంగా బయటకు వచ్చిన బాధితులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్ అన్నారు.
మా ఇతర కథనాలు:
- దుబాయ్‌లో ఖైదీలకు ఈ భారతీయుడే ఆపద్బాంధవుడు
- చైనా సమాచారం ఇవ్వట్లేదు.. అసోంకి వరదలు తప్పట్లేదు..!
- రోహింజ్యా సంక్షోభం: ఒక్క నెలలోనే 6,700కు పైగా హత్యలు
- బుజ్జిగాడి సంపాదన ఏడాదికి రూ.70 కోట్లు
- ట్రాన్స్‌జెండర్ అని ఉద్యోగం ఇవ్వలేదు!
- సల్మా హయెక్: ఒప్పుకోకపోతే చంపేస్తానన్నాడు!
- వివాహేతర సంబంధాల్లో ‘ఆమె’ను ఎందుకు శిక్షించరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








