బ్రహ్మపుత్ర నదిపై భారత్‌కి సమాచారం ఎగవేస్తున్న చైనా
- రచయిత, నవీన్ సింగ్ కడ్కా
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్‌లోని అసోం రాష్ట్రంలో వరదలకు సమాయత్తమవ్వాలంటే చైనా ఇచ్చే సమాచారం కీలకం. కానీ ఇప్పుడు చైనా ఆ సమాచారాన్ని ఇవ్వడం ఆపేసింది. దాంతో బ్రహ్మపుత్ర నది ఎప్పుడు పోటెత్తుతుందోనన్న భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
గతంలో చైనా బ్రహ్మపుత్ర నదిపై భారత్‌కు సమాచారం ఇచ్చేది. అయినా ఆ వరదలను తట్టుకోవడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు చైనా ఆ సమాచారాన్ని కూడా ఆపేయడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది.
ఆసియాలోని భారీ నదుల్లో బ్రహ్మపుత్ర ఒకటి. చైనా అధీనంలో ఉన్న టిబెట్‌లో పుట్టే ఆ నది భారత్ మీదుగా ప్రవహిస్తూ బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది.
దాదాపు ప్రతి వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దాంతో అసోంలోని వేల గ్రామాలు ముంపు బారిన పడతాయి. ఈ ఒక్క ఏడాదిలోనే వరదల కారణంగా అక్కడ దాదాపు ఐదొందల మంది చనిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు ఎగువనుండే చైనా, బ్రహ్మపుత్ర నది పరిస్థితిపై ఇచ్చే సమాచారంతో వరదలకు కొంత వరకూ సన్నద్ధమయ్యే అవకాశం ఉండేది. కానీ సెప్టెంబరు నుంచి చైనా ఆ సమాచారాన్ని ఇవ్వట్లేదు.
నది పరిస్థితిని సమీక్షించే హైడ్రలాజికల్ స్టేషన్లకు మరమ్మతులు చేస్తున్నామనీ, దానివల్ల కొన్నాళ్లు సమాచారం ఇవ్వలేమని చైనా గతంలో పేర్కొంది. కానీ తాజా పరిస్థితి ఏంటన్న భారత్ ప్రశ్నకు మాత్రం ఆ దేశం బదులివ్వలేదు.
‘నేను పుట్టి పెరిగిన ఊరు ఇప్పుడు మునిగిపోయింది. ఇప్పటిదాకా నేను ఐదు ఊళ్లు మారాను. గతంలో నేనున్న నాలుగు ఊళ్లూ వరదల్లో కొట్టుకుపోయాయి. ఇక్కడ కూడా ఎన్నాళ్లు ఉంటానో తెలీదు’ అని బిమతి అనే ఓ వృద్ధురాలు తెలిపారు.
అసోంలోని గోలాఘాట్ జిల్లాలో ప్రస్తుతం ఆమె ఉంటున్న గ్రామానికి కూడా వరద ప్రమాదం పొంచి ఉంది. చుట్టు పక్కల అనేక గ్రామాలదీ ఇదే పరిస్థితి.
చైనా నుంచి వచ్చే సమాచారం కూడా ఆగడంతో భవిష్యత్తు ఎలా ఉంటుందోనని బ్రహ్మపుత్ర తీర వాసులంతా భయపడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘చైనా తీసుకున్న నిర్ణయం గురించి మాకు పత్రికల ద్వారా తెలిసింది. అందుకే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన అందరిలో నెలకొంది’ అంటారు సందీప్ గోగోయ్ అనే ఓ విద్యార్థి.
దిల్లీకి బీజింగ్‌కి మధ్య మే 15 నుంచి అక్టోబర్ 15 మధ్య కాలంలో హైడ్రొలాజికల్ డేటాను పంచుకోవాలన్న ఒప్పందం ఉంది. కానీ ఈ ఏడాది ఇప్పటిదాకా చైనా నుంచి ఆ సమాచారం అందలేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు.
‘గతేడాది వరదల కారణంగా సంబంధిత హైడ్రొలాజికల్ స్టేషన్స్ దెబ్బతిన్నాయి. అందుకే నదీ ప్రవాహానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించే పరిస్థితి లేదు’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ సెప్టెంబరులో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వివరించారు.
భవిష్యత్తులో ఏ మేరకు సమాచారం ఇవ్వగలమనే విషయం సంబంధిత స్టేషన్ల మరమ్మతులు జరిగే తీరుపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ చైనా ఇప్పటికీ బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన సమస్త సమాచారాన్నీ బంగ్లాదేశ్‌కు అందిస్తుందని బీబీసీ పరిశీలనలో తేలింది.
బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చే విషయంలో చైనా ఎప్పుడూ పారదర్శకంగా లేదని అసోంకి చెందిన ఎమ్మెల్యే అశోక్ సింఘాల్ అన్నారు. సేవ్ బ్రహ్మపుత్ర అనే ఉద్యమాన్ని కూడా ఆయన నడిపిస్తున్నారు.
చైనా అనేక హైడ్రోపవర్ డ్యామ్‌లను బ్రహ్మపుత్ర నదిపై నిర్మించింది. తాము నీటిని మళ్లించడమో, దాచుకోవడమో చేయమనీ దిగువనున్న దేశాల ప్రయోజనాలకు భంగం కలిగించబోమనీ చైనా చెబుతుంది.
కానీ పరిస్థితి అలా లేదని అసోం ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హిమంతా శర్మ అంటున్నారు. ‘సాధారణంగా ఏటా ఒకట్రెండు వరదలే వస్తాయి. కానీ ఈ ఏడాది వర్షాలు లేకపోయినా దాదాపు నాలుగు సార్లు వరదల బారిన పడ్డాం’ అని బీబీసీతో మాట్లాడుతూ చెప్పారాయన.

‘ఉన్నట్టుండీ వరదలు వచ్చాయి. అది కూడా ఎలాంటి వర్షపాతం లేకుండానే. ఈ పరిణామానికీ ఢోక్లామ్ వివాదానికీ ముడిపెట్టి చూడాల్సిన అవసరం ఉంది’ అని హిమంతా శర్మ చెబుతున్నారు.
ఈ అంశంపై చైనాతో మాట్లాడమని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు ఆయన తెలిపారు.
శాస్త్రవేత్తలు మాత్రం వరదల్ని ఎదుర్కోవడంలో భారత్ తన శక్తి మేర పనిచేయట్లేదని అంటున్నారు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద సొంత హైడ్రొలాజికల్ స్టేషన్లను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నా భారత్ ఆ పని చేయట్లేదని గువాహటి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ బీపీ బోహ్రా వివరిస్తున్నారు.
‘శాస్త్రవేత్తలూ రాజకీయ నేతలూ అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. ఇప్పుడు చైనా పైన ఉన్న విమర్శే దిగువనున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల నుంచి భారత్‌కూ ఎదురవుతోంది’ అని ఆయన గుర్తు చేస్తున్నారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









