‘భారత్‌లో వేగంగా తగ్గుతున్న పేదరికం.. నిమిషానికి 43 మందికి విముక్తి’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ తెలుగు
ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో నిరుపేదలున్న దేశంగా భారతదేశ రికార్డు చెరిగిపోయింది. దేశంలో పేదరికం వేగంగా తగ్గిపోతోందని.. అమెరికాకు చెందిన బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం నిరుపేదలు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో నైజీరియా మొదటి స్థానంలోకి వచ్చింది.
సగటున రోజుకు 130 రూపాయల (1.9 డాలర్లు) కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న వారిని నిరుపేదలుగా ఐక్యరాజ్యసమితి వర్గీకరించింది.
‘‘2018 మే నెలాఖరు నాటికి.. ఇండియాలో నిరుపేదల సంఖ్య 7.3 కోట్లుగా ఉంటే.. నైజీరియాలో దారిద్ర్యంలో ఉన్న వారి సంఖ్య 8.7 కోట్ల మందికి పెరిగింది’’ అని బ్రూకింగ్స్ సంస్థ ‘ఫ్యూచర్ డెవలప్‌మెంట్’ బ్లాగ్‌లో వివరించింది.
‘‘భారతదేశంలో పేదరికం తగ్గటం కొనసాగుతోంటే.. నైజీరియాలో ప్రతి నిమిషానికీ ఆరుగురు చొప్పున పేదల సంఖ్య పెరుగుతోంది. నిజానికి.. 2018 చివరికల్లా ఆఫ్రికాలో పేదల సంఖ్య మరో 32 లక్షలు పెరుగుతుంది’’ అని వెల్లడించింది.
పేదరికం జాబితాలో భారత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. అయితే.. ఈ ఏడాది చివరికల్లా మూడో స్థానానికి వెళుతుందని.. మరో ఆఫ్రికా దేశం కాంగో రెండో స్థానానికి చేరుతుందని ఈ అధ్యయనం చెప్తోంది.

ఫొటో సోర్స్, brookings.edu
దేశంలో నిమిషానికి 43 మందికి పేదరికం నుంచి విముక్తి..
ఇండియాలో ఇప్పుడు సగటున ప్రతి నిమిషానికి 43.7 మంది నిరుపేదలు దారిద్ర్యం నుంచి బయటపడుతున్నారని ‘వరల్డ్ పావర్టీ క్లాక్’ (ప్రపంచ పేదరిక గడియారం) చెప్తోంది.
2030 నాటికి ప్రపంచంలో దారిద్ర్యాన్ని నిర్మూలించటం కోసం ఐక్యరాజ్యసమితి 2016 ఆరంభంలో నిర్దేశించుకున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యం ఎలా పురోగమిస్తోందో పర్యవేక్షించటానికి ఈ గడియారాన్ని రూపొందించారు.
ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ సహా వివిధ సంస్థలు చేపట్టే సర్వేలు, అధ్యయనాలు, పరిశోధనల నివేదికల సమాచారాన్ని క్రోడీకరించి.. ఈ ఆల్గోరిథమ్ ‘వెబ్ టూల్’ను వరల్డ్ డాటా ల్యాబ్ తయారుచేసినట్లు బ్రూకింగ్స్ వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ గడియారం ప్రకారం.. ప్రస్తుతం మన దేశంలో 7,13,44,555 మంది నిరుపేదలు ఉన్నారు. ఇది మొత్తం అంచనా జనాభా 135.79 కోట్లలో 5.3 శాతం.
దేశంలో నిమిషానికి సగటున 10.8 మందిని పేదరికం నుంచి బయట పడేయటం లక్ష్యం కాగా.. భారత్ ఆ లక్ష్యాన్ని నాలుగు రెట్ల వేగంతో అందుకుంటోంది.
ఇదే వేగంతో కొనసాగితే 2020 నాటికి దేశంలో నిరుపేదల సంఖ్య జనాభాలో మూడు శాతానికి తగ్గిపోతుందని.. 2030 నాటికి అది 0.1 శాతానికి పరిమితమవుతుందని.. ఆ గడియారం అంచనా.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలో పేదరిక నిర్మూలన మందగమనం..
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. 2016 ఆరంభంలో 72.5 కోట్ల మంది నిరుపేదలుగా ఉన్నారు. ప్రస్తుతం 64.34 కోట్ల మంది దారిద్ర్యరేఖకు దిగువున జీవిస్తున్నారు. ఇది మొత్తం ప్రపంచ జనాభాలో 8 శాతం.
దారిద్ర్య నిర్మూలన లక్ష్యాన్ని నిర్దేశించిన 2016 జనవరి 1వ తేదీ నుంచి 2018 జూలై మధ్య.. ప్రపంచంలో 8.3 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారు. కానీ.. 2030 నాటికి దారిద్ర్యాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ఇప్పటికే 12 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడి ఉండాల్సింది.
2016 ఆరంభంలో ఉన్న 72.5 కోట్ల మంది పేదలను ‘‘దారిద్ర్యం నుంచి విముక్తి కల్పించడానికి సెకనుకు 1.5 మందిని చొప్పున పేదరికం నుంచి బయటపడేయాల్సి ఉంది. కానీ.. 1.1 మందిని మాత్రమే పేదరికం నుంచి బయటకు రప్పించగలుగుతున్నాం. ఈ వేగం మరింత నెమ్మదిస్తున్నట్లు అవగతమవుతోంది. 2020 నాటికి సెకనుకు 0.9 మందికి, 2022 నాటికి 0.5 మందికి తగ్గిపోతుందని తీరుతెన్నులు చెప్తున్నాయి’’ అని బ్రూకింగ్స్ వివరించింది.
ఇదే తీరు కొనసాగితే.. 2030 నాటికి లక్ష్యం చేరుకోవటం సాధ్యం కాదని.. అప్పటికి ఇంకా 47.17 కోట్ల మంది (అప్పటి జనాభాలో 6 శాతం) పేదరికంలోనే ఉంటారని పేదరిక గడియారం చెప్తోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆఫ్రికా దేశాల్లో పెరుగుతున్న దారిద్ర్యం..
బ్రూకింగ్స్ అధ్యయనం ప్రకారం.. ఇప్పటికే ప్రపంచ నిరుపేద జనాభాలో ఆఫ్రికా వాసులు మూడింట రెండు వంతుల మంది ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే 2030 నాటికి 90 శాతం మంది పేదలు ఆఫ్రికాలోనే ఉంటారు.
ప్రపంచంలో.. దారిద్ర్యం పెరుగుతున్న 18 దేశాల్లో 14 దేశాలు ఆఫ్రికాలోనే ఉన్నాయి. నైజీరియా జనాభాలో దాదాపు సగం మంది (8.69 కోట్ల మంది) దారిద్ర్యంలో ఉన్నారు.
కాంగోలో 6.09 కోట్ల మంది, ఇథియోపియాలో 2.39 కోట్లు, టాంజానియాలో 1.99 కోట్లు, మొజాంబిక్‌లో 1.78 కోట్లు, కెన్యాలో 1.47 కోట్లు, ఉగాండాలో 1.42 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘లక్ష్యం చేరుకోవటానికి అవసరమైన వేగం మందగించటం పెరుగుతూ ఉంటే.. 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించటం అలవికానంత కష్టంగా మారుతుంది. ఎందుకంటే సమయం ముగిసిపోతోంది’’ అని బ్రూకింగ్స్ అభిప్రాయపడింది.
‘‘పేదరిక నిర్మూలన దిశగా సాధించిన విజయాలతో సంతోషించవచ్చు. కానీ లక్ష్య సాధన కోసం.. ప్రత్యేకించి ఆఫ్రికాలో అవసరమైనంత కృషి జరగటం లేదన్నది ఆందోళన పెంచుతోంది’’ అని పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- చైనా బ్యాంకులు స్వదేశంలోకంటే విదేశాల్లోనే ఎక్కువ అప్పులు ఇస్తున్నాయి. ఎందుకు?
- వందేమాతరం గీత రచయిత బంకిమ్ చంద్ర గురించి ఈ విషయాలు మీకు తెలుసా
- #mPassport Seva: దేశంలో ఎక్కడి నుంచైనా పాస్‌పోర్ట్ అందించే సరికొత్త యాప్ విశేషాలు
- ‘కడప ఉక్కు ఆంధ్రుల హక్కు’ ఎందుకు కావడం లేదంటే..
- 'తండ్రి పేరు చెప్పలేక స్కూల్ మానేస్తున్నారు'
- ప్రమాదమని తెలుసు.. కానీ ఆకలే వారిని ఇరాక్‌కు వెళ్లేలా చేసింది!
- ఆహార వృథాయే ఆకలి కేకలకు అసలు కారణమా?
- సిరియా: ‘ఆకలి తీరాలంటే కోరిక తీర్చాలన్నారు’
- కడుపు నింపుకోవడానికి నాలుగు మెతుకులు దొరకని దుస్థితి
- మొట్టమొదటి కేంద్ర బడ్జెట్: 'ఆకలి తీర్చుకునేందుకు విదేశాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








