ప్రమాదమని తెలుసు.. కానీ ఆకలే వారిని ఇరాక్‌కు వెళ్లేలా చేసింది!

ఫొటో సోర్స్, Ravinder Singh/BBC
- రచయిత, అరవింద్ ఛాబ్రా
- హోదా, బీబీసీ ప్రతినిధి
బతుకు దెరువు కోసం వలస బాట పట్టిన 39 మంది భారతీయులు ఇరాక్ మట్టిలో కలిసి పోవడం యావత్ దేశాన్ని కలచి వేసింది.
వారిక లేరన్న నిజం స్పష్టమయ్యాక కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న ఆ 39 మంది కుటుంబాలదీ ఒకే నేపథ్యం - అదే పేదరికం!
ప్రమాదమని తెలిసినా..
ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే.. ప్రమాదమని తెలిసినా వారు ఇరాక్ ఎందుకు వెళ్లారు?
"ఇరాక్‌లో పని చేయడం ప్రమాదమని తెలుసు. అక్కడ మన ప్రాణాలు గాలిలో దీపాలని కూడా తెలుసు. కానీ ఏం చేస్తాం. మా పేదరికం అలాంటిది. ఇక్కడ ఉన్నా ఆకలి చేతిలో చావాల్సిందే కదా."
తన్నుకొస్తున్న దుఃఖాన్ని, ఉబికి వస్తున్న కన్నీళ్లను అతి కష్టం మీద ఆపుకొంటూ 47 ఏళ్ల మన్‌జీత్ కౌర్ అన్న మాటలివి. ఇరాక్‌లోని మోసుల్‌లో అసువులు బాసిన వారిలో ఆమె భర్త దవీందర్ సింగ్ (52) ఒకరు.

ఆమె మాట వినుంటే..
"ఆయనను చివరిసారి చూసిన రోజు ఇంకా గుర్తే. ఇరాక్ బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ యుద్ధం జరుగుతోందని, ఇప్పుడు వెళ్లడం మంచిది కాదని ఆయన సోదరి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించింది. కానీ తనకు ఏమీ కాదని, ధైర్యంగా ఉండాలని ఆయన సర్ది చెప్పారు."
బహుశా ఆ రోజు భర్త తన సోదరి మాట వినుంటే, ఇప్పుడు ఈ గుండె కోత ఉండేది కాదనే భావం బొంగురు బోయిన ఆ గొంతులో ధ్వనించింది.

'మాకేమీ తెలియనివ్వలేదు'
"ఆయన తరచూ ఫోన్ చేస్తూ ఉండేవారు. మాకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నించేవారు. ఎక్కడో దూర ప్రాంతాల్లో యుద్ధం జరుగుతోందని, తాను ఉన్నచోట అంతా బాగానే ఉందని చెప్పేవారు. 2014 జూన్‌లో చివరిసారిగా మాట్లాడారు. అప్పటికే ఆయనను జిహాదీలు అపహరించుకు పోయారు. కానీ మేం కంగారుపడతామని ఆ విషయం మాకు తెలియనివ్వలేదు. ఇప్పుడు మా కన్నీళ్లను తుడవటానికి ఆయన లేరు."
బీబీసీకి ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆమె గుండెల్లో గూడు కట్టుకున్న బాధంతా ఒక్కసారిగా కన్నీళ్ల రూపంలో ఉబికి వచ్చింది.

కల నెరవేరకుండానే
దవీందర్ సింగ్ స్వస్థలం రుర్కా కలాన్ అనే గ్రామం. కూలి పనికి పోతే రోజుకు రూ.200-250 సంపాదిస్తారు. కానీ రోజూ పని దొరకడమే కష్టం.
"మూడునాలుగేళ్లు ఇరాక్‌లో పని చేస్తే, సొంత ఇల్లు కట్టుకోవచ్చన్నది ఆయన కల. అక్కడికి వెళ్లడానికి లక్షా యాభై వేల రూపాయలు అప్పు చేసి, ఏజెంట్‌కు చెల్లించాం. ఆయన పని చేసే ప్రాంతంలో ప్రాణాలకు వచ్చే ముప్పేమీ లేదని, అక్కడ అమెరికా సైనికుల పహారా ఉంటుందని ఏజెంట్లు నమ్మబలికారు." అంటూ నాటి రోజులను మన్‌జీత్ గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ గదే ఇల్లు
ఆమె ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద ఉన్నారు. వీరి ఇంటికి కాస్త దూరంలోనే మన్‌జీత్, దవీందర్ సింగ్‌ల ఇల్లు ఉంది. ఒకే గది. అదీ శిథిలావస్థలో ఉంది. ఆ ఇంట్లోనే తన ముగ్గురు పిల్లలతో ఆమె నివసిస్తున్నారు. ఆ గ్రామంలోని ఓ పాఠశాలలో ఆమె కుట్టుపని నేర్పిస్తుంటారు. నెలకు రూ.2,500 వరకు వస్తాయి.

మిగిలింది ఎదురు చూపులే!
దవీందర్ సింగ్ 2011లో ఇరాక్ వెళ్లేనాటికి.. పెద్ద కుమారునికి ఆరేళ్లు. కవలలైన చిన్నారుల వయసు ఎనిమిది నెలలు.
దవీందర్ అపహరణకు గురయ్యేంత వరకు నెలనెలా రూ.25,000 పంపేవారని ఆమె చెప్పారు.
దాదాపు నాలుగేళ్లపాటు దవీందర్ గురించి ఎటువంటి సమాచారం తెలియలేదు. అయినా వారు అతను తిరిగొస్తాడనే ఆశతోనే ఎదురు చూస్తూ గడిపారు.
విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను ఎప్పుడు కలిసినా, నమ్మకం కోల్పోవద్దని అంతా మంచే జరుగుతుందని చెప్పేవారని మన్‌జీత్ అన్నారు.

ఫొటో సోర్స్, RAVINDAR SINGH ROBIN/BBC
'అప్పుడు కూడా చెప్పలేదు'
కొద్ది నెలల కిందట వారి డీఎన్‌ఏ నమూనాలను ప్రభుత్వం సేకరించింది. అప్పుడు కూడా తమకు ఏమీ చెప్పలేదని మన్‌జీత్ చెప్పారు.
దవీందర్‌కు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే డీఎన్‌ఏ నమూనాలను తీసుకున్నట్లు ఊళ్లో అందరూ అనుకునేవారని ఆమె తెలిపారు.
'కాళ్ల కింద భూమి కదిలినట్టయ్యింది'
ఇస్లామిక్ స్టేట్ అపహరించిన భారతీయ కార్మికులందరూ మరణించారన్న వార్తను ఇరుగుపొరుగు మహిళల ద్వారా ఆమె విన్నారు.
"నేను వెంటనే మా అమ్మవాళ్ల ఇంటికి పరిగెత్తాను. ఆయనిక లేరనే విషయాన్ని తెలుసుకొని హతాశురాలయ్యాను."
ఆ మాటలు అతి కష్టం మీద ఆమె గొంతు గడపదాటి వచ్చాయి. ఇంతకూ వారి మరణానికి కారణం ఇక్కడ నెలకొన్న పేదరికమా లేక అక్కడి మిలిటెంట్లా?

ఫొటో సోర్స్, Ravinder Singh/BBC
నాన్న ఎక్కడమ్మా?
తన చిన్న కుమారుల్లో ఒకరిని చూపిస్తూ మన్‌జీత్ ఇలా అన్నారు - "నాన్న ఎక్కడున్నాడని వీడు అడుగుతుంటాడు. చాలా దూరంగా ఉన్న మరో దేశంలో నాన్న ఉన్నాడని, ఇంటికొచ్చేటపుడు నీకు సైకిల్ తెస్తాడని చెప్పేదానిని. ఇప్పుడు ఆయన తిరిగి రాలేని లోకాలకు తరలి పోయారు. ఇక మీ నాన్న ఎప్పటికీ రాలేడనే విషయాన్ని ఈ పసివాడికి ఎలా చెప్పాలి?"

ఫొటో సోర్స్, Ministry of External Affairs/BBC
పేదరికమే అసలు శత్రువా?
మరణించిన 39 మంది భారతీయ కార్మికుల్లో దాదాపు 31 మంది పంజాబీలే.
సాధారణంగా పంజాబీలు అవకాశాలను వెతుక్కుంటూ విదేశాలకు వెళ్తుంటారు. అయితే ఇరాక్ వంటి కల్లోల ప్రాంతాలకు సైతం వలస వెళ్లేలా వారిని పురిగొల్పుతున్నది ఆకలి, పేదరికాలే.
తలుపులు కూడా లేని ఇంట్లో..
చనిపోయిన 39 మందిలో 32 ఏళ్ల సందీప్ కుమార్ కూడా ఉన్నారు. ఆయన స్వస్థలం మల్సియాన్ దగ్గర్లోని చిన్న గ్రామం. అక్కడ రోజూ కూలీగా కుమార్ పని చేసేవారు. అతనికి నలుగురు అక్కాచెల్లెళ్లు. వారి బాగోగుల కోసం 2012లో అతను ఇరాక్ వెళ్లారు.
ప్రతి నెలా సందీప్ పంపించే డబ్బు కోసం తాము ఎదురు చూసే వాళ్లమని అతని సోదరుడు కుల్దీప్ కుమార్ చెబుతున్నారు. వాళ్లు ఎంత దారిద్ర్యంలో ఉన్నారంటే వారి ఇంటికి కనీసం తలుపు కూడా లేదు.

ఫొటో సోర్స్, Ravinder Singh/BBC
అది 'స్వర్గం' కాదు..
అయితే ప్రాణాలకు తెగించి ఇరాక్ వెళ్తే కష్టాలు తీరుతాయా? అది అంత సులభమేం కాదు. అక్కడ కూడా ఎన్నో బాధలను ఓర్చుకోవాలి.
ఇరాక్‌లో పని దొరకడం అంత సులువు కాదని రాజ్ రజనీ చెప్పారు. అక్కడ మరణించిన వారిలో ఆమె భర్త ప్రీత్‌పాల్ శర్మ కూడా ఉన్నారు. 2011లో అతను ఇరాక్ వెళ్లారు.
"ఇరాక్ వెళితే డబ్బులే డబ్బులని మాకు ఏజెంట్లు చెప్పారు. కానీ అక్కడ నా భర్త పని కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. చివరకు ఆయన కిడ్నాప్ అయ్యేంత వరకు బాధలు అతన్ని వెన్నాడాయి" అని జీరబోయిన గొంతుతో మాటలను కూడదీసుకుంటూ రజినీ చెప్పారు.
మన్‌జీత్, రజినీ వంటి కుటుంబాలు ఎన్నో నేడు దిక్కులేనివిగా అయ్యాయి. ఇందుకు కారణం ఇక్కడి పేదరికమా? లేక అక్కడి యుద్ధమా? అన్నదే అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








