ఉత్తర కొరియాలో అత్యంత ఎత్తైన పర్వతాన్ని గుర్రంపై అధిరోహించిన కిమ్

ఫొటో సోర్స్, AFP
ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్-ఉన్ దేశంలోనే అత్యంత ఎత్తైన పర్వతాన్ని గుర్రంపై అధిరోహించారని ప్రభుత్వ మీడియా తెలిపింది.
మంచు కప్పుకున్న 'బేక్డూ' పర్వత ప్రాంతంలో ఆయన గుర్రపు స్వారీ చేస్తున్న ఫొటోలను కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) విడుదల చేసింది. శీతాకాలపు తొలి మంచు కురిసే సమయంలో కిమ్ ఓ తెల్లగుర్రంపై స్వారీ చేశారు.
2,750 మీటర్ల ఎత్తైన 'బేక్డూ' ఒక క్రియాశీల అగ్నిపర్వతం. దీన్ని కిమ్ అధిరోహించడం ఇదే తొలిసారి కాదు. కీలకమైన ప్రకటనలు చేయబోయే ముందు ఆయన ఇలాంటివి చేస్తుంటారని విశ్లేషకులు చెబుతున్నారు.
2018 నూతన సంవత్సర ప్రసంగానికి కొన్ని వారాల ముందు 2017లో కిమ్ ఈ పర్వతాన్ని సందర్శించారు. దక్షిణ కొరియాతో చర్చలకు తాను సిద్ధమని కొత్త సంవత్సర ప్రసంగంలో ప్రకటించారు. తద్వారా దక్షిణ కొరియాకు స్నేహహస్తం చాచారు.
అమెరికా మొత్తం ఉత్తర కొరియా అణ్వాయుధాల పరిధిలోనే ఉందని, అణ్వస్త్రాలను ప్రయోగించే మీట ఎప్పుడూ తన బల్లపైనే ఉంటుందని కూడా కిమ్ ఈ ప్రసంగంలో హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Reuters
ఉత్తర కొరియా అస్తిత్వంలో బేక్డూ పర్వతానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. కిమ్ తండ్రి, మాజీ పాలకుడు కిమ్ జాంగ్-ఇల్ తండ్రి జన్మస్థలం ఇదే. దాదాపు నాలుగు వేల ఏళ్ల కింద తొలి కొరియా సామ్రాజ్యాన్ని స్థాపించిన డాంగున్ జన్మస్థలం ఇదేనని చెబుతారు.
బేక్డూ పర్వతంపై కిమ్ గుర్రపు స్వారీకి కొరియా విప్లవంలో చాలా ప్రాధాన్యముందని కేసీఎన్‌ఏ బుధవారం చెప్పింది.
బేక్డూ పర్వతమంత దృఢమైన నమ్మకం, సంకల్పంతో ఉత్తర కొరియాను అత్యంత శక్తిమంతమైన దేశంగా తయారుచేసేందుకు కిమ్ కృషిచేస్తున్నారని, ఈ లక్ష్యాన్ని అందుకోవడం ఎంతో కష్టమైనదని, ఈ దిశగా ఇంతవరకు తాను సాధించిన పురోగతిని బేక్డూ పర్వతంపై గుర్రపు స్వారీలో ఆయన ఉద్వేగంతో గుర్తుతెచ్చుకున్నారని కేసీఎన్‌ఏ వివరించింది.

ఫొటో సోర్స్, AFP
మూడుసార్లు పర్వతారోహణ
బేక్డూ పర్వతాన్ని కిమ్ కనీసం మూడుసార్లు ఎక్కారని చెబుతారు. 2018లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌తో కలసి ఆయన దీనిని సందర్శించారు.
ఉత్తర కొరియా, చైనా సరిహద్దులో తూర్పున బేక్డూ పర్వతం ఉంది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌కు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది.
ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉన్న 'డీమిలిటరైజ్డ్ జోన్ (డీఎంజడ్)'లో కిమ్‌తో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ జూన్లో సమావేశమయ్యారు. ఈ భేటీకి కొనసాగింపుగా ఈ నెల్లో ఉత్తర కొరియా అధికారులు స్వీడన్లో అమెరికా అధికారులతో చర్చలు జరిపారు.
ఈ చర్చలు తమ ఆకాంక్షలకు తగినట్లు జరగలేదని, చివరకు ఇవి విఫలమయ్యాయని ఉత్తర కొరియా అణు కార్యక్రమ ముఖ్య దూత కిమ్ మియాంగ్-గిల్ చెప్పారు. అమెరికా ఇందుకు భిన్నమైన స్వరంలో స్పందించింది. 'మంచి చర్చలు' జరిపామని వ్యాఖ్యానించింది.
ఈ చర్చలకు ముందు ఉత్తర కొరియా కొత్త తరహా బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. ఇది ఈ ఏడాది ఉత్తర కొరియా జరిపిన 11వ పరీక్ష.

ఫొటో సోర్స్, Reuters
బీబీసీ సోల్ ప్రతినిధి లారా బికర్ విశ్లేషణ...
కొరియా ద్వీపకల్పంలో అత్యంత పవిత్రమైనవిగా భావించే ప్రదేశాల్లో బేక్డూ పర్వతం ఒకటి. తమ వంశస్థుల శక్తిని, అధికారాన్ని చాటి చెప్పేందుకే కిమ్ ఇప్పుడు ఈ పర్వతంపై గుర్రపు స్వారీ చేసి ఉండొచ్చు. ఇది ఉత్తర కొరియా ప్రజలకు వారి నాయకుడి శక్తిసామర్థ్యాలను, గుర్రపు స్వారీలో ఆయన నైపుణ్యాన్ని గుర్తుచేసే ప్రయత్నం కూడా.
దీర్ఘశ్రేణి క్షిపణులు, అణ్వాయుధాలను పరీక్షించకుండా సంయమనం పాటిస్తానన్న తన హామీ విషయంలో కిమ్ ఇప్పుడు పునరాలోచన చేస్తుండొచ్చనే ప్రచారం జరుగుతోంది. అమెరికాతో ఉత్తర కొరియా చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర కొరియాపై దృష్టి కేంద్రీకరించలేదు. ఆయన వివిధ స్వదేశీ, విదేశీ వ్యవహారాల్లో తలమునకలై ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ట్రంప్ పాలనా యంత్రాంగం దృష్టిని ఆకర్షించే అవకాశాల గురించి కిమ్ ఆలోచిస్తుండొచ్చు.
అణు నిరాయుధీకరణ ఒప్పందం కుదుర్చుకోవడానికి అమెరికాకు ఈ ఏడాది చివరి వరకు ఉత్తర కొరియా గడువు ఇచ్చింది. ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమానికి సంబంధించి ఏ చర్యలు చేపట్టాలన్నా ముందు తమ దేశంపై ఆంక్షలను సడలించాలని కిమ్ చాలాసార్లు డిమాండ్ చేశారు. దీనికి అమెరికా ఇంతవరకు అంగీకరించలేదు.
ఈ పరిస్థితుల్లో కిమ్ ఏంచేస్తారనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి
- చైనాలో వీగర్ ముస్లింలు ఏమైపోతున్నారు?
- ఉత్తర కొరియా: ప్రజల కూలి డబ్బుతో ప్రభుత్వ పాలన
- 97 ఏళ్ల వయసులో నోబెల్
- ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్‌కు నోబెల్ శాంతి పురస్కారం
- నోబెల్ ప్రైజ్: విశ్వ రహస్యాల శోధనకు, కొత్త గ్రహాన్ని కనిపెట్టినందుకు ముగ్గురు భౌతిక శాస్త్రవేత్తలకు పురస్కారం
- నోబెల్ పురస్కారాలు: పోలండ్ రచయిత్రి ఓల్గా (2018), ఆస్ట్రియా రచయిత పీటర్ హాండ్కే (2019)
- కణాలు ఆక్సిజన్ స్థాయులను ఎలా గుర్తిస్తాయో పరిశోధించిన శాస్త్రవేత్తలకు వైద్యంలో నోబెల్
- విరాట్ కోహ్లీ: బ్రాడ్‌మన్, సచిన్, సెహ్వాగ్‌ల రికార్డ్ బ్రేక్
- బంగ్లాదేశ్ జైలులో విజయనగరం జిల్లా మత్స్యకారులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








