చైనాలో వీగర్ ముస్లింలు ఏమైపోతున్నారు?

చైనాలో లక్షలాది మంది వీగర్ ముస్లింలను నిర్బంధించడంపై బ్రిటన్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమ చైనాలోని షిన్‌జాంగ్ ప్రాంతంలో భారీ నిర్బంధ కేంద్రాలను నిర్మించి అందులో వీగర్ ముస్లింలను బంధిస్తున్నారని బీబీసీ పరిశోధనలో వెల్లడైన విషయం తెలిసిందే. ఈ శిబిరాల నుంచి తప్పించుకున్న కొంత మందితో మా ప్రతినిధి జాన్ సుద్వర్త్ మాట్లాడారు. వీరిలో బ్రిటిష్ సంతతికి చెందిన వీగర్ ముస్లింలు కూడా ఉన్నారు. తమకు బ్రిటన్ ప్రభుత్వం సహాయం చేయాలని వీరు విజ్ఞప్తి చేస్తున్నారు.
షిన్‌జాంగ్‌లోని ముస్లింలకు పొడవాటి గడ్డాలు కనిపించవు. అలా గడ్డం పెంచుకోవడం ఇప్పుడు అక్కడ నిషిద్ధం. అక్కడి మసీదులు ప్రార్థనలు లేకుండా మూగబోయాయి. ఇంత జరుగుతున్నా ఎవ్వరూ నోరు మెదిపే సాహసం చేయరు. ప్రజలపై నిరంతరం నిఘా, పర్యవేక్షణ ఉండటమే దానికి కారణం.
అయితే కొంతమంది మాత్రం ఎలాగోలా తప్పించుకుని టర్కీకి శరణార్థులుగా వెళ్లారు. టర్కీతో వీగర్ ముస్లింలకు భాషతో పాటు, విశ్వాసాల్లో సారూప్యం ఉంటుంది. ఇస్లాంకు చెందిన ఒక్క సూక్తిని చదివినా చైనాలో తమను నిర్బంధ శిబిరాలకు తరలిస్తారని ఈయన అంటున్నారు. తన కుటుంబ సభ్యులు ఇంకా ఆ శిబిరాల్లో బందీలుగా ఉన్నారనే ఆందోళనతో ఉన్నారు అబ్దుస్సలామ్.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
‘‘మా అమ్మ, నాన్న, అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఎక్కడున్నారో నాకు తెలీదు. మా నమ్మకాలను, జాతిని, మానవత్వాన్ని కూడా త్యజించాలని చైనా ప్రభుత్వం అంటోంది’’ అని ఒకప్పటి బందీ అబ్దుస్సలామ్ మూహేమెత్ చెప్పారు.
తనని కమ్యూనిస్ట్ పార్టీ పాటలను పాడాలని బలవంతం చేశారనీ, అలాగే నూతన తీవ్రవాద వ్యతిరేక చట్టంలోని అంశాల్ని వల్లించమనేవారనీ, లేదంటే చిత్రహింసలు పెడతామని భయపెట్టేవారనీ మరొక బందీ అబ్లేత్ తూర్సన్ తొహ్తి చెప్పారు.
‘‘ప్రతిరోజూ ఎవరో ఒకరిని కొట్టేవారు. ఇద్దరు వ్యక్తులుండేవారు. ఒకరి చేతిలో బెల్ట్ ఉండేది. మరొక వ్యక్తి కాలితో తన్నేవాడు. మేం పడిపోతే లేపి మళ్లీ మోకాళ్లపై కుర్చోపెట్టేవారు ’’ అని అబ్లేత్ తెలిపారు.

మమ్మల్ని కలిసి మాట్లాడినవాళ్లు అదృష్టవంతులు. వీళ్లు 2015లో చైనా శిబిరాల నుంచి తప్పించుకుని టర్కీకి వెళ్లారు. ఆ తరువాత ఈ నిర్బంధ శిబిరాల నుంచి మరెవ్వరూ విడుదలైనట్టు సమాచారం లేదు.
ఈ సాక్ష్యాలను ఒక్కొక్కటిగా సరైనవి అని ధ్రువీకరించడం కష్టం. కానీ వీళ్ళు చెప్పిన నిశ్చితమైన విషయాలు, క్యాంపుల్లో ప్రతిరోజూ ఉండే పరిస్థితులు, మత విశ్వాసాల్ని మార్చేందుకు చేసే ప్రయత్నాలు, వీటి వల్ల వస్తోన్న ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఈ చర్యలు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీపై ప్రేమ, విధేయతలకన్నా ఆ పార్టీపై ఆగ్రహాన్నే పుట్టిస్తాయి.
కుటుంబంతో పాటు నమ్మకం కూడా విచ్చిన్నమైపోయింది. బిల్ కిస్ అనే ఈ మహిళ సికీనే అనే తన పసిబిడ్డతో పాటు తన పిల్లలతో షిన్ జాంగ్ నుంచి పారిపోయినపుడు సికీనే దగ్గర పాస్ పోర్ట్ కూడా లేదు. ఆ పసికందును తరువాత తీసుకెళ్దాం అనుకున్నారు తండ్రి. కానీ ఇప్పుడు అతన్ని కూడా నిర్బంధించారు.


‘‘నా బిడ్డ నా మాటలు వినగలిగితే నేను తనకి క్షమాపణలు చెబుతున్నాను. నా బిడ్డ ఎక్కడుందో, ఏం చేస్తోందో, అసలు బతికుందో లేదో తెలియదు. ఇంతకంటే దారుణమైన పరిస్థితి వేరే ఉండదేమో’’ అని బిల్ కిస్ హిబీబుల్లా అన్నారు.
‘‘షిన్‌జాంగ్‌లో దాదాపు పది వేల మందిని బంధించారని భావిస్తున్న ఒక క్యాంప్‌కు మేం వెళ్లాం. కానీ అక్కడకు చేరుకునే రహదారిని మరమ్మతులు చేస్తున్నామని చెప్పి పోలీసులు మూసేశారు. మేం ఇతర దారుల్లో అక్కడకు చేరేందుకు ప్రయత్నించాం. కానీ ప్రతి చోటా అవరోధాలూ, అడ్డంకులే. క్యాంప్‌కు చేరుకోవడానికి అన్ని దారులు మూసేశారు. చివరికి ఒక భారీ క్యాంపు మాకు కనిపించింది. ఆ క్యాంపు చుట్టూ నిఘా టవర్లు ఉన్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ మేం అక్కడికి వెళ్లలేమని భావించి మా ప్రయత్నాల్ని విరమించుకున్నాం’’ అని మా ప్రతినిధి జాన్ సుద్వర్త్ వెల్లడించారు.

చైనా పోలీసుల ప్రభావం సుదూర ప్రాంతాల వరకూ ఉన్నట్టు కనిపిస్తోంది. మహ్మూత్ తుర్ది అనే బ్రిటిష్ వీగర్ ముస్లిం లండన్లో నివసిస్తున్నారు. తన ప్రచార కార్యక్రమాల వల్ల షిన్‌జాంగ్‌లోని తన కుటుంబాన్ని చైనా పోలీసులు వేధిస్తున్నారని ఈయన అంటున్నారు.
‘‘నా గొంతు నొక్కేందుకు నా కుటుంబ సభ్యులను చైనా పోలీసులు వేధిస్తున్నారు. నన్ను మాట్లాడొద్దని చెప్పాలని వాళ్ళను పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పల్లెత్తు మాట కూడా మాట్లాడొద్దు అని వారంటున్నారు" అని మహ్మూత్ తుర్ది మాతో అన్నారు.
రేయిలా అబులాటి, బ్రిటన్‌లోని మరొక వీగర్ ముస్లిం. తన తల్లిని అధికారులు తీసుకెళ్లారని అతనికి గత సంవత్సరం సమాచారం వచ్చింది. అప్పటినుంచి ఆమె తల్లి క్యాంపులో బందీగానే ఉన్నారు. ఆమెకు 66 ఏళ్లు.

‘‘ప్రపంచంలో వీగర్ ముస్లిం జాతిని పూర్తిగా నిర్మూలించాలని చైనా ప్రభుత్వం భావిస్తోంది. ఇతర దేశాల ప్రభుత్వాలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తగిన చర్యలు చేపట్టాలి" అని రేయిలా అబులాటి కోరారు.
అయితే వీగర్లు ఎక్కడికీ వెళ్లిపోలేదని, తాము ఏర్పాటు చేసిన కేంద్రాలలో వాళ్లంతా విజ్ఞానవంతులు అవుతున్నారని చైనా అంటోంది. కానీ తల్లిదండ్రులను పట్టుకెళ్లారు. కుటుంబసభ్యులందరినీ తీసుకెళ్లిపోయారు. ఒక సంస్కృతి, ఒక మతం, ఒక సముదాయం మొత్తంగానే ఈ సంక్షోభంలో చిక్కుకుపోయారు.
ఇవి కూడా చదవండి:
- హజ్ యాత్రపై మోదీ తప్పు దోవ పట్టిస్తున్నారా?
- ఇది హిందూ-ముస్లింల ఘర్షణా లేక అస్సామీలకూ బెంగాలీలకూ మధ్య ఘర్షణా?
- యాదాద్రి: ముస్లిం శిల్పులు చెక్కుతున్నారు
- BBC INVESTIGATION: అలీగఢ్‌లో ముస్లిం యువకుల ఎన్కౌంటర్లో వాస్తవమెంత?
- ప్రాణాలు నిలుపుకోడానికి.. మతం మారుతున్నారు!
- రోహింజ్యా ముస్లింలు క్రైస్తవులుగా ఎందుకు మారుతున్నారు?
- టర్కీ: ఇస్లాంను తిరస్కరిస్తున్న యువత
- తిరుమలలో తన మతం గురించి సోనియా ఏం చెప్పారు?
- ఎన్నికల్లో వాట్సాప్ దుర్వినియోగం, ఒకేసారి 3 లక్షల మందికి మెసేజ్‌లు
- దీపావళి: హరిత టపాసులు అంటే ఏంటి?
- పటేల్ విగ్రహానికి రూ.2989 కోట్లు.. స్థానిక రైతులకు నీళ్లు కరువు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









