బ్రెజిల్: ఎన్నికల్లో వాట్సాప్ దుర్వినియోగం, ఒకేసారి 3 లక్షల మందికి మెసేజ్‌లు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మాథ్యూస్ మజెంటా, జులియానా గ్రగ్నానీ, ఫెలిపె సౌజా
- హోదా, బీబీసీ ప్రతినిధులు
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల వేళ కొందరు రాజకీయ ప్రచారకర్తలు వాట్సాప్‌ను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో బీబీసీ పరిశీలనలో బయటపడింది.
ఓ సాఫ్ట్‌వేర్ సాయంతో ఫేస్‌బుక్ వినియోగదారుల ఫోన్ నంబర్లను భారీగా సేకరిస్తున్నారు. ఆ నంబర్లకు ఆ సాఫ్ట్‌వేరే ఆటోమేటిక్‌గా వాట్సాప్ సందేశాలు పంపుతుంది. అంతేకాదు, వినియోగదారుల ప్రమేయం లేకుండానే ఆ నంబర్లను వివిధ వాట్సాప్ గ్రూపుల్లో చేర్చేస్తుంది.
అక్టోబర్ 7న బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల మొదటి రౌండ్‌లో దాదాపు 14.7 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఆ రౌండ్‌లో ఏ ఒక్క అభ్యర్థికీ 50 శాతానికి మించి ఓట్లు రాలేదు. దాంతో మొత్తం అభ్యర్థుల్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న వారిలో ఒకరిని దేశాధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు అక్టోబరు 28న రెండో విడత ఎన్నిక జరగనుంది.
ఎన్నికల బరిలో నిలిచిన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేసేందుకు కొందరు బల్క్ మెసేజింగ్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించినట్లు బీబీసీ పరిశీలనలో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
వాట్సాప్‌నే ఎందుకు ఎంచుకున్నారు?
బ్రెజిల్‌లో వాట్సాప్ వినియోగం భారీగా ఉంది. ఈ దేశంలో తమకు 12 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారని వాట్సాప్ చెబుతోంది.
ఇక్కడి మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలు వాట్సాప్‌ను ఉచితంగా వాడుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. అంటే, ఫోన్‌లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ లేకున్నా ఈ మెసేజింగ్ యాప్ పనిచేస్తుంది.
అంతగా విస్తరించిన ఈ యాప్‌ను వేదికగా చేసుకుని కొందరు తమ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం మొదలుపెట్టారు.
ఫేస్‌బుక్ నుంచి ఫోన్ నంబర్లు సేకరించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే పరికరాలను వినియోగించారు. ఆ పరికరాలు ఒకేసారి 3,00,000 ఫోన్లకు వాట్సాప్ సందేశాలు పంపగలవని తేలింది.
ఈ తరహా ప్రచారం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాలేదు. సౌందర్య సాధనాలు, ఆహార పదార్థాలు, ఇతర వస్తువులను ప్రమోట్ చేసేందుకు కూడా మార్కెటింగ్ ఏజెన్సీలు వినియోగించాయి.
ఇలాంటి ప్రచారాలతో సంబంధం ఉన్న పలువురు వ్యక్తులతో బీబీసీ న్యూస్ బ్రెజిల్ మాట్లాడింది. వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని చెబితేనే వాళ్లు బీబీసీతో మాట్లాడేందుకు అంగీకరించారు.
ఫేస్‌బుక్ నుంచి ఫోన్ నంబర్లు సంపాదించి, ఏకకాలంలో లక్షల మందికి ఎలా బల్క్ మెసేజ్‌లు పంపుతున్నారో వారు వివరించారు.
దాంతో పాటు, ఈ సాఫ్ట్‌వేర్‌ను అమ్మిన కంపెనీలతోనూ బీబీసీ బృందం మాట్లాడింది. రాజకీయ పార్టీలకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో తమ ప్రమేయం లేకుండానే తమ నంబర్లు చేరిపోయాయని అంటున్న వినియోగారులను సంప్రదించింది.
ఇలా ప్రచారాలు నిర్వహించడం వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్‌బుక్ నిబంధనలకు విరుద్ధం. అంతేకాదు, బ్రెజిల్ ఎన్నికల నిబంధనల ప్రకారం అది నేరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
అందుకే, వాట్సాప్‌ను దుర్వినియోగం చేస్తున్న వేలాది వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేశామని ఫేస్‌బుక్ తెలిపింది. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న బోల్సోనారోకు మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లుగా అనుమానిస్తున్న ఓ మార్కెటింగ్ సంస్థ ఫేస్‌బుక్ పేజీలను, ఖాతాలను కూడా తొలగించామని వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
10 నిమిషాల్లో 1000 నంబర్లు
ఆ సాఫ్ట్‌వేర్ సాయంతో ఫేస్‌బుక్‌లో కొన్ని ముఖ్యమైన పదాలు, గ్రూపులు, పేజీల పేర్లను టైప్ చేసి వినియోగదారుల ఫోన్ నంబర్లను సులువుగా సేకరిస్తారు. ఓ పది నిమిషాల్లోనే వెయ్యి మంది నంబర్లను పట్టేస్తారు.
ప్రాంతాల వారీగా, మహిళలు, పురుషులు, ఆసక్తుల వారీగా కూడా ఫోన్ నంబర్ల జాబితాను ఆ సాఫ్ట్‌వేర్ రూపొందిస్తుంది.
"నాకు తెలియకుండానే నా ఫోన్ నంబర్ నాలుగు వాట్సాప్ గ్రూపుల్లో చేరింది. వాళ్లకు నా నంబర్ ఎలా దొరికిందో నాకు అర్థం కావట్లేదు" అని తన పేరు వెల్లడించానికి ఇష్టపడని ఓ మహిళ బీబీసీతో చెప్పారు.
"ఆ గ్రూపులోని కొందరు అడ్మిన్‌లు, సభ్యులు విదేశీయులు. దాంతో నాకు భయమేసింది. దాంతో ఆ గ్రూపుల నుంచి వెంటనే బయటకు వచ్చేశాను. దీని గురించి వాట్సాప్ సంస్థకు ఫిర్యాదు కూడా చేశాను" అని ఆమె వివరించారు.
అయితే, ఆ తర్వాత రెండు రోజుల్లోనే మరో ఎనిమిది గ్రూపుల్లో తన నంబర్ ప్రత్యక్షమైందని ఆమె వెల్లడించారు.
తన నంబర్‌ను ఏ రాజకీయ పార్టీ వారికీ ఇవ్వలేదని, అయినా అది ఫేస్‌బుక్‌లోకి ఎలా వెళ్లిందో అర్థం కావడంలేదని ఆమె అన్నారు.
తన ఫోన్ నంబర్ మూడు గ్రూపుల్లో చేరిపోయిందని కాంపినాస్ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల ఓ యూనివర్సిటీ విద్యార్థి తెలిపారు. ఆ గ్రూపుల్లో ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా రోజూ సందేశాలు, వీడియోలు పెడుతుంటారని అతడు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బల్క్ వాట్సాప్ మెసేజింగ్
బల్క్ మెసేజ్‌లను పంపేందుకు వాట్సాప్ గ్రూపుల్లో ఫోన్ నంబర్లను తాము చేర్చిన మాట వాస్తవే అని జీనియస్ పబ్లిసైడేడ్ అనే మార్కెటింగ్ సంస్థకు చెందిన లూయిజ్ రోడ్రిగ్ జూనియర్ అంగీకరించారు.
అయితే, తాము నిబంధనల ప్రకారం సేకరించిన నంబర్లనే తీసుకున్నామని, దాన్ని కూడా ఉపయోగకరంగా లేదని తర్వాత ఆపేశామని ఆయన చెప్పారు.
ఏ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేశారన్న విషయాన్ని మాత్రం వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.
"మా అభ్యర్థికి అనుకూలంగా గ్రూపును ప్రారంభించలేను. ఎందుకంటే, అందులో ఎవరైనా ఆయనను వ్యతిరేకిస్తే, మిగతావారంతా గ్రూపులోనే తిరగబడతారు. అప్పుడు పరిస్థితి నా చేతిలో ఉండదు. అందుకే, 'ఈ ఎన్నికల్లో అవినీతికి ముగింపు పలకుదాం' లాంటి పేర్లతో గ్రూపులు ప్రారంభిస్తాం. సాఫ్ట్‌వేర్ సాయంతో అందులో నంబర్లను చేర్చుతాం. అందులో సగం మంది బయటకు వెళ్లిపోయారు" అని ఆయన చెప్పుకొచ్చారు.
"ఈ గ్రూపులో ఇద్దరు ముగ్గురు అనుభవజ్ఞులు మాకు అనుకూలమైన అంశాలను పోస్ట్ చేస్తారు. వాటిపై చర్చ మొదలుపెడతారు. అలా 50 నుంచి 100 గ్రూపుల్లో అదే చర్చ పెడతాం" అని వివరించారు.
బల్క్ మెసేజింగ్ ప్రోగ్రాం ఎలా పనిచేస్తుంది?
సాధారణంగా వాట్సాప్‌లో క్లిక్ చేస్తేనే మెసేజ్ వెళ్తుంది. కానీ, కొన్ని ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ కలిగిన కంప్యూటర్‌లో ఫోన్ నంబర్లను నమోదు చేయగానే మెసేజ్‌లు వెళ్లిపోతాయి.
అలా, బ్రెజిల్‌లో 6 లక్షల రూపాయలకు పది లక్షల మార్కెటింగ్ వాట్సాప్ మెసేజ్‌లు పంపే సంస్థలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
వాట్సాప్‌లో పరిమితులు
వాట్సాప్‌లో వినియోగదారులు తమకు నచ్చినన్ని గ్రూపుల్లో ఉండొచ్చు. కానీ, కొన్ని పరిమితులు ఉన్నాయి.
ఒక వ్యక్తి గరిష్ఠంగా 9,999 గ్రూపులు మాత్రమే ప్రారంభించే వీలుంది. ఒకే సందేశాన్ని పలుమార్లు ఫార్వర్డ్ చేయడానికి కూడా పరిమితి ఉంది. గతంలో ఒక మెసేజ్‌ని 256 సార్లు ఫార్వర్డ్ చేసేందుకు వీలుండేది. తాజాగా నకిలీ వార్తలు విస్తరించకుండా కట్టడి చేసే ఉద్దేశంతో వాట్సాప్ ఆపరిమితిని 20కి తగ్గించింది. భారత్‌లో 5 సార్లు మాత్రమే ఒక మెసేజ్‌ను ఫార్వర్డ్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
బ్రెజిల్‌లోనూ భారత్‌లో మాదిరిగానే ఫార్వర్డ్ మేసేజ్‌లను కట్టడి చేయాలన్న డిమాండ్ ఉంది. కానీ, ఎన్నికల్లోపు అందుకు అవసరమైన మార్పులు చేసేందుకు సరిపడా సమయం లేదని వాట్సాప్ అంటోంది.
"స్పామ్ మెసేజ్‌లను గుర్తించే అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నాం. అనుమానాస్పద ప్రవర్తన కలిగిన ఖాతాలను అది గుర్తిస్తుంది. దాని ద్వారా నకిలీ సమాచారం వ్యాప్తి చెందకుండా అడ్డుకోగలుగుతాం" అని వాట్సాప్ తెలిపింది.
బ్రెజిల్‌లో తమ నిబంధనలకు విరుద్ధంగా బల్క్ మెసేజ్‌లు పంపిన సంస్థలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే ఆ కంపెనీలకు చెందిన ఖాతాలను నిషేధించామని వాట్సాప్ వెల్లడించింది.
వాట్సాప్ లేదా అలాంటి యాప్‌ల కోసం ప్రత్యేకంగా ఎన్నికల నిబంధనలు లేవు, కానీ, ఇంటర్నెట్‌లో ఎన్నికల ప్రచారానికి మాత్రం పరిమితులు ఉన్నాయని బ్రెజిల్ ఎన్నికల సంఘం తెలిపింది.
ఇవి కూడా చదవండి
- ఫేస్‌బుక్‌కు రూ.4.7కోట్ల జరిమానా
- ఎవరు ఎక్కువ ఆరోగ్యవంతులు.. మగవాళ్లా లేక ఆడవాళ్లా?
- ట్రాఫిక్ జాం: వాళ్లు రోజూ హెలికాప్టర్లో ఆఫీసుకెళ్తారు
- వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి: శ్రీనివాస రావు ఎవరు? ఎందుకు దాడి చేశాడు?
- పటేల్ విగ్రహానికి రూ.2989 కోట్లు.. స్థానిక రైతులకు నీళ్లు కరువు
- జంతువులతో ఆటాడుకున్న భారతీయ రింగ్ మాస్టర్
- నాసా: అంటార్కిటికాలో దీర్ఘచతురస్రం ఆకారంలో ఐస్‌బర్గ్
- హాంకాంగ్ - జుహాయ్ మార్గం: ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన ప్రారంభం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








