వెనెజ్వేలా సంక్షోభం: బ్రెజిల్లో వలసదారులపై దాడులు, అయినా ఆగని వలసలు

వెనెజ్వేలా వలసదారులు

ఫొటో సోర్స్, AFP

వెనెజ్వేలా నుంచి బ్రెజిల్‌కి వలసలు భారీగా పెరిగాయని బ్రెజిల్ అధికారులు తెలిపారు. సోమవారం ఒక్కరోజే 900 మంది సరిహద్దు దాటి వచ్చారని వివరించారు.

అయితే, బ్రెజిల్‌‌లో గుడారాలు వేసుకుని ఉంటున్న వెనెజ్వేలా వలసదారులపై శనివారం స్థానికులు దాడి చేశారు.

గుడారాలను, అందులోని సామాగ్రిని కాల్చివేశారు. దీంతో వందలాది మంది వెనెజ్వేలా పౌరులు సరిహద్దు దాటి స్వదేశం వెళ్లాల్సి వచ్చింది.

కానీ, ఆ దాడుల తర్వాత వెనెజ్వేలా నుంచి వలసలు మరింత పెరిగాయని బ్రెజిల్ అధికారులు అంటున్నారు.

బ్రెజిల్‌లోని రొరైమా రాష్ట్రంలోకి ఆదివారం 800 మంది, సోమవారం 900 మంది వచ్చారని బ్రెజిల్ ఆర్మీ తెలిపింది.

గతంలో రోజువారీ సగటుతో పోల్చితే ఇది చాలా ఎక్కువని వెల్లడించింది.

వెనెజ్వేలా వలసదారులు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, బ్రెజిల్లో వలసదారుల గుడారాలు, సామగ్రిని కాల్చేసిన స్థానికులు

బ్రెజిల్‌లో ఏం జరుగుతోంది?

వెనెజ్వేలాలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు అనేకమంది పొరుగు దేశాలకు వలస వెళ్తున్నారు. బ్రెజిల్, కొలంబియా, ఈక్వేడార్, పెరూ, చీలీ తదితర దేశాలకు వెళ్తున్నారు. అయితే ఈ వలసదారుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం కొంతకాలంగా ప్రాంతీయ ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

ఇటీవల బ్రెజిల్‌లోని రొరైమా రాష్ట్రంలో ఉన్న పకరైమా పట్టణం సమీపంలో కొందరు వ్యక్తులు ఓ రెస్టారెంట్ యజమానిని తీవ్రంగా కొట్టి, డబ్బు దోచుకెళ్లారు. ఈ దాడి చేసింది వెనెజ్వేలా వలసదారులే అంటూ ఆగ్రహించిన స్థానికులు వారి గుడారాలపై దాడి చేశారు.

ఆ గుడారాలకు, అందులోని సామాగ్రికి నిప్పంటించారు. దాంతో వందలాది మంది వెనెజ్వేలా వసలదారులు సరిహద్దు దాటి స్వదేశానికి వెళ్లారు.

తాము వలసదారులకు వ్యతిరేకం కాదని, హింసాత్మక చర్యలకు మాత్రమే వ్యతిరేకమని బ్రెజిల్ వాసులు అంటున్నారు.

శనివారం జరిగిన ఈ ఘటన తర్వాత బ్రెజిల్ ప్రభుత్వం సరిహద్దు వద్ద అదనపు బలగాలను మోహరించింది.

మరోవైపు, వెనెజ్వేలా వాసుల ప్రవేశాన్ని తాత్కాలికంగా మూసివేయాలని రొరైమా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.

అయితే, సరిహద్దును మూసేయడం "భావ్యం కాదని, అది చట్టవ్యతిరేకం" అవుతుందని బ్రెజిల్ భద్రత మంత్రి సర్జియో ఇచ్చిగోయెన్ అన్నారు.

వెనెజ్వేలా వలసదారులు

ఫొటో సోర్స్, Reuters

'వలసలతో తలనొప్పి'

కొలంబియా, ఈక్వెడార్‌తో పాటు పెరూ, దేశాలకు కూడా వెనెజ్వేలా నుంచి కొన్నేళ్లుగా వలసల ప్రవాహం కొనసాగుతోంది.

ఈ వలసలు తమకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయని ఆ దేశాలు అంటున్నాయి.

వలసలను నియంత్రింస్తూ ఈక్వెడార్ ప్రభుత్వం శనివారం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.

గత మూడేళ్లలో వెనెజ్వేలా నుంచి రోజుకు సగటున 3,000 మంది కొలంబియాకు వెళ్లారు. మొత్తం 8 లక్షల మందికి కొలంబియా ప్రభుత్వం తాత్కాలిక నివాస అనుమతి ఇచ్చింది.

తమ దేశంలోకి గడచిన ఒక్క వారంలోనే 20,000 మంది వెనెజ్వేలా వలసదారులు వచ్చారని పెరూ చెబుతోంది.

వెనెజ్వేలా కరెన్సీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కిలో టొమాటోల ధర 50,00,000 బొలీవర్లు మాత్రమే!!

26 రోజులకు ధరలు రెట్టింపు

వెనెజ్వేలా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ దేశంలో గడచిన ఏడాది ద్రవ్యోల్బణం 83,000 శాతం పెరిగినట్టు జూలై గణాంకాల్లో వెల్లడైంది.

ఈ ఏడాది అది 10,00,000 శాతం పెరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది.

దేశంలో ప్రతి 26 రోజులకో సారి ధరలు రెట్టింపు అవుతున్నాయని ప్రతిపక్ష పార్టీ నేతృత్వంలోని నేషనల్ అసెంబ్లీ పరిశీలనలో తేలింది.

వెనెజ్వేలా వలసదారులు

ఫొటో సోర్స్, Reuters

కొత్త కరెన్సీ

సోమవారం దేశవ్యాప్తంగా ప్రభుత్వం కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది.

దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకే కొత్త నోట్లను తీసుకొచ్చామని ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మడూరో అంటున్నారు. విమర్శకులు మాత్రం పరిస్థితి మరింత అస్తవ్యస్తంగా తయారయ్యే ప్రమాదముందని వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మంగళవారం నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని విపక్షాలు పిలుపునిచ్చాయి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.