బ్రెజిల్ ఎన్నికలు: రెండో రౌండులో ఫెర్నాందో హదాజ్‌తో తలపడనున్నజైర్ బోల్సోనారో

ఫొటో సోర్స్, Reuters
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల మొదటి రౌండ్‌లో సంప్రదాయ అతివాద అభ్యర్థి జైర్ బోల్సోనారో విజయం సాధించారు.
అయితే, పూర్తి స్థాయి విజయానికి అవసరమైన 50% వోట్లు గెల్చుకోవడంలో విఫలమైనందున ఆయన అక్టోబర్ 28న రెండో రౌండు ఎన్నికల్లో పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండో రౌండులో ఆయన లెఫ్ట్-వింగ్ వర్కర్స్ పార్టీ అభ్యర్థి ఫెర్నాందో హదాజ్‌తో తలపడతారు.
వోట్ల లెక్కింపు దాదాపు పూర్తి అయిన తరువాత బోల్సోనారోకు 46% వోట్లు, హడాజ్‌కు 29% వోట్లు వచ్చాయి.
ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణల ఫలితాలు రెండో రౌండులో వీరిద్దరికీ సమానంగా వోట్లు వచ్చే అవకాశాలున్నాయని సూచించాయి.
ఈ ఎన్నికల ప్రచార సమయంలో జోరు మీదున్న లూలా డిసిల్వా అవినీతి కేసులో జైలుకి వెళ్లడం, ఆ తరువాత పోటీ చేయకుండా అనర్హతకు గురికావడం.. ఆయన ప్రధాన ప్రత్యర్థి జైర్ బోల్సోనారో ప్రచార సమయంలో కత్తిపోట్లకు గురవడం తెలిసిందే.
తొలి విడతలో అభ్యర్థులెవరికీ 50 శాతం ఓట్లు రాలేదు. దీంతో రెండో విడత ఎన్నికలు తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఈ ఎన్నికల ద్వారా అధ్యక్షుడిని ఎన్నికోవడంతో పాటు 27 రాష్ట్రాల గవర్నర్లను, సెనేట్‌లోని 81 స్థానాల్లో మూడింట రెండొంతుల సెనేటర్లను.. చాంబర్ ఆఫ్ డిప్యూటీస్‌లోని మొత్తం 513 మంది సభ్యులను ఎన్నుకుంటారు.
తొలి విడత ఎన్నికలు ఆదివారం(అక్టోబర్ 7, 2018) జరిగాయి. ఇందులో ఏ ఒక్క అభ్యర్థికీ పోలయిన ఓట్లలో 50 శాతానికి పైగా రాని పక్షంలో మొత్తం అభ్యర్థుల్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్నవారి మధ్య పోటీ ఉంటుంది. వారిలో ఒకరిని ఎన్నుకునేందుకు అక్టోబరు 28న రెండో విడత ఎన్నిక నిర్వహిస్తారు.
ఈ పోటీలో నెగ్గిన అభ్యర్థి 2019 జనవరి 1 నుంచి నాలుగేళ్ల పాటు పదవిలో ఉంటారు.

ఫొటో సోర్స్, Reuters
బరిలో 13 మంది
మొత్తం 13 మంది అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. అధ్యక్ష పదవి రేసులో ముందున్న ఇద్దరిలో ఒకరైన సోషల్ లేబర్ పార్టీ నేత జైర్ బోల్సానరో తాను అధికారంలోకి వస్తే బ్రెజిల్‌లో పెచ్చుమీరుతున్న నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతానని హామీలిస్తున్నారు. నీరుగారుతున్న చట్టాలను కఠినతరం చేస్తానని, తుపాకుల వినియోగాన్ని నియంత్రిస్తానని చెబుతున్నారు.
మాజీ అధ్యక్షుడు లూలా డిసిల్వా ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా నిషేధానికి గురైన తరువాత నుంచి బోల్సానరో ముందంజలోకి వచ్చారు. అక్కడి సర్వేల ప్రకారం ఆయనకు 38 శాతం ఓటర్ల మద్దతు ఉంటుందని అంచనాలున్నాయి. అయితే, అదే సర్వేల్లో 45 శాతం ప్రజలు ఆయనకు ఓటేయబోమని చెప్పారు.
ఇక వామపక్షం వర్కర్స్ పార్టీకి చెందిన నేత ఫెర్నాండో హదాద్‌కు 21 శాతం ఓట్లు దక్కుతాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి. వర్కర్స్ పార్టీకి చెందిన లూలా డిసిల్వాపై నిషేధం వేటు పడడంతో ఈ తెరపైకి వచ్చారు. సర్వేల్లో ఆయన్ను తిరస్కరిస్తున్న ప్రజలు 42 శాతం మంది ఉన్నారు.

ఫొటో సోర్స్, AFP
దిల్మా రౌసెఫ్ వారసుడూ అంతేనా?
పదవిని వీడుతున్న ప్రస్తుత అధ్యక్షుడు మిషెల్ తెమెర్‌కు తాజా సర్వేల్లో 2 శాతం ప్రజల మద్దతే దొరికింది. అంతకుముందు అధ్యక్షురాలిగా ఉన్న దిల్మా రౌసెఫ్ 2016లో అవినీతి కేసుల్లో చిక్కుకుని అభిశంసనకు గురికావడంతో ఆమె స్థానంలో మిషెల్ అధ్యక్షుడయ్యారు. ఆయనపైనా అవినీతి ఆరోపణలున్నాయి.
ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల బరిలో ఆయన లేరు.
కొన్నేళ్లుగా బ్రెజిల్ అధ్యక్షులు పదవులను అడ్డంపెట్టుకుని అక్రమాలు, అవినీతికి పాల్పడుతుండడంతో అక్కడి ప్రజలు తమకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయిందంటున్నారు.
లాటినో బారోమెట్రో సంస్థ సర్వేలో కేవలం 13 శాతం ప్రజలే ఇంకా తమకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచయుద్ధంలో మునిగిన చమురు ట్యాంకర్‌తో ముప్పు
- సూర్యుడు సరిగ్గా మీ ఎదురుగా ఉదయించడం ఎప్పుడైనా చూశారా?
- #లబ్‌డబ్బు: గోల్డెన్ వీసా అంటే ఏంటి? ఇది పొందడం ఎలా?
- ఎన్టీఆర్: సోలోపాటల్లో ‘సదా స్మరామి’
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
- మహారాష్ట్ర: మనుషుల్ని చంపి తింటున్న పులి
- బిగ్ బాస్: పోటీదారులను ఎలా ఎంపిక చేస్తారు? నిబంధనలేంటి?
- జోసెఫ్ విర్షింగ్: బాలీవుడ్‌తో ప్రేమలో పడ్డ జర్మన్ సినిమాటోగ్రాఫర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








