#లబ్‌డబ్బు: గోల్డెన్ వీసా అంటే ఏంటి? ఇది పొందడం ఎలా?

అమెరికా సిటిజెన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం

ఫొటో సోర్స్, Facebook/USCIS

పాస్‌పోర్ట్‌లో ఏదైనా దేశానికి సంబంధించి వీసా స్టాంప్ పడగానే.. ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంటుంది. ఆ స్టాంప్ అమెరికాది అయితే.. ఇక ఆ సంతోషానికి హద్దులుండవేమో!

అమెరికాకు వెళ్లిపోయి ఆ దేశ పౌరసత్వం (గ్రీన్ కార్డు) పొందడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అందులోనూ ప్రవాస భారతీయులు భారీగానే ఉంటారు.

ఈ నేపథ్యంలో గోల్డెన్ వీసా... అదే అమెరికా లాంటి దేశాల్లో శాశ్వతంగా నివసించేందుకు ఇచ్చే వీసా గురించి ఈనాటి 'లబ్‌డబ్బు'లో తెలుసుకుందాం.

అమెరికన్ వీసాలు అనేక రకాలుంటాయి. అక్కడ ఉద్యోగం చేయడం కోసం, అక్కడ ఉద్యోగాలు ఇవ్వడం కోసం, చదువుకోసం.. ఇలా పలు రకరకాల వీసాలుంటాయి.

గడిచిన రెండేళ్లలో ధనవంతులైన భారతీయులు చాలా మంది డబ్బు బాగానే ఖర్చు చేసి అమెరికాలో గ్రీన్ కార్డు పొందారు. అయితే ఒక్కటే షరతు- మీ దగ్గర దండిగా డబ్బుండాలి, అమెరికాలో పెట్టుబడులు పెట్టి అక్కడివారికి ఉద్యోగాలు కల్పించాలి.

అమెరికాలో పెట్టుబడులు పెట్టడం ద్వారా.. గ్రీన్ కార్డు రెండు రకాలుగా పొందొచ్చు. మొదటిది ఈ-2 వీసా, రెండోది ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా.

ఈ-2 వీసాలను అమెరికా కొన్ని ఎంపిక చేసిన దేశాలకు మాత్రమే ఇస్తుంది. భారత్, చైనా దేశస్థులు ఈ వీసా పొందేందుకు అర్హులు కారు.

వీడియో క్యాప్షన్, గోల్డెన్ వీసా అంటే ఏంటి? ఇది పొందాలంటే ఏం చేయాలి?

ఈబీ-5 వీసా అంటే..?

దీన్నే గోల్డెన్ వీసా అని ముద్దుగా పిలుస్తారు.

అమెరికా విదేశాంగ శాఖ అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ వీసాల కోసం ఎంక్వయిరీలు చేసే వారిలో మొదటి స్థానంలో పాకిస్థాన్ ఉంటే, రెండో స్థానంలో భారత్ ఉంది.

ఏటా అమెరికా పదివేల వరకు ఈబీ-5 వీసాలు జారీ చేస్తుంది. అయితే ఒక్కో వీసా కోసం 23 వేలకు పైగా దరఖాస్తులు వస్తుంటాయి. అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత ఏడాది 174 మంది భారతీయులకు ఈబీ-5 వీసాలు మంజూరు చేశారు.

షరతులు వర్తిస్తాయ్..

కనీసం ఐదు లక్షల డాలర్లు అంటే మూడున్నర కోట్ల రూపాయల పెట్టుబడులు ఆ దేశంలో పెట్టాలి. పెట్టుబడులు పెట్టగానే సరిపోదు, పది మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలి.

మీ పెట్టుబడుల పై రాబడికి ఎటువంటి గ్యారంటీ ఉండదు. అలాగే ఈబీ-5 వీసాకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తి కనీసం ఆరు నెలలైనా అమెరికాలో నివాసం ఉండాలి.

ఇటీవలే అమెరికా పౌరసత్వం పొందిన కుటుంబం

ఫొటో సోర్స్, facebook/uscis

ఫొటో క్యాప్షన్, ఇటీవలే అమెరికా పౌరసత్వం పొందిన ఓ కుటుంబం

ప్రయోజనాలు

గోల్డెన్ వీసాతో అనేక లాభాలున్నాయి. ఈ వీసా పొందిన వ్యక్తి భార్య, అలాగే 21 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న అవివాహిత పిల్లలకు శాశ్వతంగా అక్కడ నివాసముండే వెసులుబాటు ఉంటుంది.

అలాగే అమెరికాలో ఎక్కడైనా పని చేసుకోవచ్చు. ఐదేళ్ల తరువాత అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా లభిస్తుంది.

కానీ దీంతో లాభాలే కాదు కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి.

పెట్టుబడులు పెట్టే వ్యక్తి కొన్నిసార్లు నష్టాల్లోనో, లేదా ప్రమాదం పొంచి ఉన్న ఆస్తుల్లోనో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అలాగే పైన చెప్పినట్టు మీరు పెట్టిన పెట్టుబడులపై రాబడులకు ఎటువంటి గ్యారంటీ లేదు. ప్రతి సంవత్సరం ఈ విధానాన్ని ప్రభుత్వం సమీక్షిస్తుంది, ఏవైనా మార్పులు చేర్పులు చేస్తే అవి తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

వీసా దరఖాస్తుదారులు

ఫొటో సోర్స్, FAcebook/USCIS

అమెరికా ఖజానా నింపుతున్న వీసాలు

ఈబీ-5 వీసాల ద్వారా అమెరికాకు ప్రతి సంవత్సరం నాలుగు బిలియన్ డాలర్ల లాభం వస్తోంది.

ప్రస్తుతం ఇరవై మూడు దేశాలలో పెట్టుబడులకు ప్రతిగా ఆ దేశ పౌరసత్వం పొందే అవకాశముంది.

ఇలా వీసాలు, పౌరసత్వాలు పొందే విధానం చాలా లాభదాయకంగానే ఉంది. అదెంతంటే 'సెయింట్ కిట్స్ అండ్ నేవిస్' అనే ఒక చిన్న కరీబియన్ దేశం ఇలా వీసాలు ఇచ్చి, లాభాలు గడించి తన అప్పులన్నీ తీర్చేసుకుని వేగంగా అభివృద్ధి చెందుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)