#GroundReport ప్రకాశం జిల్లా: తవ్విన కొద్దీ కన్నీరే

- రచయిత, డీఎల్ నరసింహ
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా తీవ్రమైన కరవుతో విలవిలలాడుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ జిల్లాకు అత్యంత కరవు ప్రాంతమనే పేరుంది.
ఏప్రిల్ నెలలో ప్రకాశం జిల్లాలో కేంద్ర కరవు పరిశీలన బృందం పర్యటించింది. అక్కడి పరిస్థితులను పరిశీలించింది. ఇంత కరవును ఎప్పుడూ చూడలేదని.. తమకు ఎడారిలో ఉన్నట్లుగా అనిపిస్తోందని బృందంలోని అధికారులు ఆశ్చర్యపోయారు.
ప్రకాశం జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మెుత్తం 56 మండలాలున్నాయి. అందులో ఒక్క చీరాల మండలం మినహా మిగతా 55 మండలాలను ప్రభుత్వం కరవు మండలాలుగా ప్రకటించింది. మార్కాపురం , కందుకూరు డివిజన్లలోని బెస్తవారిపేట, సి.ఎస్.పురం మండలాల్లో కరవు అధికంగా ఉంది.
ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు కరవు ప్రభావిత ప్రాంతాల్లో బీబీసీ క్షేత్రస్థాయిలో పర్యటించి, అక్కడి ప్రజల కష్టాలను తెలుసుకుంది.

ఫొటో సోర్స్, dl narasimha
ప్రకాశం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నాలుగేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు పడక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చెరువులు, బావులు, బోర్లు ఎండిపోయాయి. జిల్లాలోని చారిత్రక కంభం చెరువు అడుగంటింది.
పశువులకు మేత లేదు. తాగేందుకు నీరులేదు. పశువులే కాదు మనుషులూ తాగునీటి కోసం అనేక అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో ఎటుచూసినా కరవు పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. పంటలు పండక, దిగుబడి లేక రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు.
ఇక్కడి రైతులు ప్రధానంగా కంది, శనగ, పొగాకు, మిర్చి, వరి పంటలు పండిస్తారు. వీటితోపాటు బత్తాయి తోటలను ఎక్కువగా సాగుచేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో దాదాపు అన్ని పంటలూ దెబ్బతిన్నాయి.

'650 అడుగుల లోతు తవ్వినా చుక్కనీరు లేదు'
జిల్లాలోని మార్కాపురం, కందుకూరు డివిజన్లలోని కరవు మండలాల్లో కొందరిని బీబీసీ పలకరించింది. వారి సమస్యలను అడిగి తెలుసుకుంది.
మార్కాపురం డివిజన్‌లోని పెద్ద ఓబినేని పల్లిలో శ్రీకాంత్ రెడ్డి అనే రైతుతో మాట్లాడగా.. ఆయన పూర్తిగా ఎండిపోయిన తన రెండెకరాల బత్తాయి తోటను చూపించారు.
"వర్షాల్లేవు.. బోర్లలో నీళ్లు లేవు.. నాదే కాదు. ఇక్కడ చాలామంది తోటలు ఇలాగే ఎండిపోయినాయి. ఇప్పటివరకూ నేను నాలుగు బోర్లేయించాను. మెుదటిసారి 300 అడుగుల్లోపే నీళ్లు మయంగా (ఎక్కువగా) పడ్డాయి. ఐదారేళ్ళు చెట్లు కూడా బాగానే పెరిగినాయి. తరువాత రానురాను భూమిలో నీళ్లు తగ్గిపోతూ వచ్చాయి."
"రెండో బోరు వేస్తే దానిలోనూ కొద్దిగ నీళ్లు పడ్డాయి. 500 అడుగుల్లోతు మూడో బోరు వేస్తే అసలు నీటి చుక్కే రాలేదు. చివరిగా నాలుగోసారి 650 అడుగుల వరకూ వెళ్లినా చుక్కనీరు కూడా పడలేదు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టినా ఉపయోగం లేకుండాపోయింది. నీళ్లులేక పదేళ్లు కంటికిరెప్పలా కాపాడుకున్న తోట పూర్తిగా ఎండిపోయింది" అని శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు ఆత్మహత్య
కందుకూరు డివిజన్, జరుగుమల్లి మండలం, నరసంహనాయుని కండ్రికలో బొట్లగుంట రాణి అనే మహిళ బీబీసీతో మాట్లాడారు. కరవు వల్ల పంటలు పండక, అప్పుల బాధతో తన భర్త (బొట్లగుంట రామారావు) ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
"మాకున్న ఐదెకరాల్లో మిర్చి, శనగ సాగు చేసేవాళ్ళం. వర్షాలు లేక నాలుగేళ్లుగా పంటలు పండలేదు. పంటలకు చేసిన అప్పులు తీర్చటం కోసం మా ఆయన మరింత అప్పు చేసి ఇరవై ఎకరాలు కౌలుకు తీసుకొని పొగాకు వేశాడు. నీళ్ళు లేక అదీ సరిగా పండలేదు. కనీసం కూలీల ఖర్చులు కూడా రాలేదు. అప్పులిచ్చినోళ్ల టార్చర్ తట్టుకోలేక పురుగులమందు తాగి చనిపోయాడు. నేనెంత ధైర్యం చెప్పినా.. అటువైపు ఒత్తిళ్లు తట్టుకోలేకపోయాడు. ఇలా అయిపోయింది. ఇంతవరకూ ప్రభుత్వం నుంచి మాకే సహాయం రాలేదు. ప్రస్తుతానికి అప్పులు చేసి కాలం గడుపుతున్నాం. నాకు ఇద్దరు పిల్లలున్నారు. మాకెవరికి పొలం పనులు పెద్దగా తెలియవు. పిల్లల భవిష్యత్తు గురించి భయంగా ఉంది".
రామారావు అప్పుల భాదతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానిక రెవెన్యూ అధికారులు ధ్రువీకరించారు.

తాగేందుకు నీళ్లు లేవు
కందుకూరు డివిజన్‌లోని సి.ఎస్.పురంలో రైతులు కరువు వల్ల తీవ్రంగా నష్టపోయామని వాపోయారు.
సుబ్బయ్య అనే రైతు మాట్లాడుతూ..
"నేను మూడెకరాలలో వరి, రెండెకరాలలో కంది వేశా. వర్షాలు లేక రెండు పంటలూ ఎండిపోయాయి. బ్యాంకులో మూడు లక్షల అప్పుంది. కనీసం వడ్డీ కట్టేందుకు కూడా లేకుండాపోయింది. నీళ్ళూ మేత లేక పశువులను కబేళాలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చానా గడ్డు పరిస్థితిలో ఉండాం, ఏమి పాలుపోవడంలేదు" అని దీనంగా చెప్పారు.
మరోవైపు తాగునీటి కోసం సి.ఎస్. పురంతోపాటు కనిగిరి, కందుకూరు, బేస్తవారిపేట, కంభం ప్రాంతాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు.
చంద్రశేఖరపురం(సి.ఎస్. పురం) మండలంలోని మైలచెరువులో మూడొందల ఏళ్ల క్రితం నిర్మించినదిగా చెబుతున్న ఓ దిగుడుబావి ఉంది.
వర్షాలు బాగా కురిస్తే ఆ బావే ఆ గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేది. కొన్నేళ్లుగా వర్షాలు సరిగ్గా పడకపోవటం ప్రస్తుతం అది పూర్తిగా ఎండిపోయింది. చుక్క నీరు కూడా లేదు.
మండల కేంద్రం సి. ఎస్. పురంలో తీవ్రమైన నీటిఎద్దడి ఉంది. పంచాయతీ నల్లా నీటిని అందించే ఒకబోరు మినహా.. ఇతర అన్నిబోర్లు, నాలుగైదు బావులు పూర్తిగా ఎండిపోయాయి.
దీంతో ఇక్కడ పదిహేను రోజులకు ఒకసారి పంచాయతీ సిబ్బంది కుళాయిలకు నీటిని వదులుతున్నారు. అవికూడా తాగేందుకు పనికిరావు. ఇతర అవసరాలకు , పశువులకు వాటిని ఉపయోగిస్తున్నారు.

ఫొటో సోర్స్, dl narasimha
స్నానాలకు అవస్థలు
గ్రామ సర్పంచ్ సాలమ్మ బీబీసీతో మాట్లాడుతూ.. తమ ప్రాంతంలో కరవు తీవ్రంగా ఉందన్నారు. పంచాయతీకి సంబంధించి కేవలం ఒక బోరులోనే నీళ్లున్నాయని, అందులోనూ కొద్దికొద్దిగా వస్తుండటంతో ఊరంతటికి నీళ్ళు చాలడంలేదని తెలిపారు.
పంచాయతీ పరిధిలోని ఇళ్లకు ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నప్పటికీ అవి కూడా అందరికీ సరిపోవటంలేదన్నారు. తాగడానికి అందరూ మినరల్ వాటర్ కొంటున్నారని స్నానాలకు, బట్టలు ఉతుక్కోవటానికి అనేక అవస్థలు పడాల్సివస్తోందన్నారు.
పంటలు పండక, పనులు లేక ప్రజలు వలసబోతున్నారని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, dl narasimha
బేస్తవారిపేటలో ఈ ఏడాది నీటి సమస్య మరీ ఎక్కువగా ఉందని కొందరు మహిళలు చెప్పారు. కుళాయిలకు సరిగా నీళ్లు రాకపోవటంతో అందరూ ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారని.. వీధిలోకి ట్యాంకర్ రాగానే పోట్లాడి మరీ నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.
రంగమ్మ అనే మహిళ మాట్లాడుతూ "ఇరుకు సందులలో ట్రాక్టర్లు తిరగవన్న సాకుతో మూడు నెలలుగా మా సందులోకి ఉచిత ట్యాంకర్లు(పంచాయతీవి) రావడం లేదు. డబ్బులిచ్చి తెప్పించుకునేవారికి మాత్రం ఆ ఇరుకు సందులోకే ట్యాంకర్లు తెచ్చిపోస్తున్నారు. డబ్బు పెట్టలేని మాలాంటివాళ్ల పరిస్థితేంటి? ఎంతకాలం డబ్బుపెట్టి కొనగలం?" అని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా మొత్తం ఎటు చూసినా కరవే..
కరవు బృందానికి కంభం చెరువుతోపాటు, తీవ్ర కరవు ప్రభావిత ప్రాంతాలను చూపించి పరిస్థితిని వివరించినట్లు ప్రకాశం జిల్లా ఆర్డీఓ తెలియజేశారు.
తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు నీళ్లు పడేచోట బోర్లను వేయటంతోపాటు ట్యాంకర్ల సంఖ్యను కూడా పెంచాలని కలెక్టర్ ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









