‘‘శవాలు అప్పగించాలంటే బుల్లెట్లకు డబ్బులు కట్టాలని ఇరాన్ భద్రతా దళాలు డిమాండ్ చేశాయి’’

ఇరాన్ నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రోజా అసాది, సారా నమ్‌జూ
    • హోదా, బీబీసీ పర్షియన్

"వాళ్లు నిరసనకారులపై నేరుగా కాల్పులు జరపడం, ప్రజలు ఉన్నచోటునే కుప్పకూలిపోవడం నేను కళ్లారా చూశాను’’ అని చెబుతున్నప్పుడు ఒమిద్ గొంతు వణికింది. తనను ఎవరైనా గుర్తించి వెంటాడతారేమోనని ఆయన భయపడుతున్నారు.

ఇరాన్‌కు, మిగిలిన ప్రపంచానికి మధ్య ఉన్న నిశ్శబ్ద గోడను బద్ధలు గొట్టడానికి అపారమైన ధైర్యం అవసరం.వారు అధికారుల నుంచి ప్రతీకార ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఒమిద్ వయసు 40 ఏళ్లు. భద్రతా కారణాల రీత్యా ఆయన పేరును మార్చాం. రోజురోజుకు దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితులకు నిరసనగా గత కొన్నిరోజులుగా దక్షిణ ఇరాన్‌లోని ఓ చిన్న పట్టణంలో కొనసాగుతున్న వీధి నిరసనల్లో ఆయన పాల్గొంటున్నారు.

తమ నగరంలో నిరాయుధులైన నిరసనకారులపై ఏకే47 తరహా రైఫిళ్లతో భద్రతా బలగాలు కాల్పులు జరపడం మొదలుపెట్టాయని ఒమిద్ అన్నారు.

"ఉత్త చేతులతో క్రూరపాలనపై పోరాడుతున్నాం" అని ఆయన అన్నారు.

విస్తృతంగా వ్యాపించిన దేశవ్యాప్త నిరసనలపై భద్రతా బలగాలు ఈ తరహా అణచివేతలకు పాల్పడినట్టు బీబీసీకి పలు నివేదికలు అందాయి.

నిరసనలు మొదలైనప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో అధికారులు ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకుండా చేశారు. దీంతో ఇరాన్ నుంచి వార్తలు అందించడం మునుపెన్నడూ లేనంత కష్టంగా మారుతోంది. ఇరాన్‌ నుంచి రిపోర్టింగ్ చేయకుండా బీబీసీ పర్షియన్‌పై ఇరాన్ ప్రభుత్వం నిషేధం విధించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రెజా పహ్లావి పిలుపుతో..

వరుసగా 12వరోజు రాత్రి కూడా కొనసాగిన నిరసనలలో భాగంగా గురువారం దేశవ్యాప్తంగా అతిపెద్ద ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలలో ఒకటి జరిగింది.1979నాటి ఇస్లామిక్ విప్లవంతో పదవీచ్యుతుడైన ఇరాన్ చివరి షా(రాజు) కుమారుడైన రెజా పహ్లావి ఇచ్చిన పిలుపుతో గురువారం, శుక్రవారం నాటి నిరసనల్లో చాలా మంది పాల్గొన్నారు.

ఆ తర్వాతి రోజు, "ఇస్లామిక్ రిపబ్లిక్ వెనక్కి తగ్గదు" అని ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమైనీ వ్యాఖ్యానించారు. ఈ హెచ్చరిక తర్వాత ఆయన నుంచి అందిన ఆదేశాలతో భద్రతా బలగాలు, ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ అక్కడ తీవ్రమైన రక్తపాతం జరిపినట్లుగా కనిపిస్తోంది.

అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌లో సమస్యకు ఆజ్యం పోస్తున్నాయని ఇరాన్ ప్రభుత్వ అధికారులు ఆరోపించారు. "ఈ ఉగ్ర చర్యల"ను తాము ఖండిస్తున్నామని అక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మీడియాలో కథనాలు వచ్చాయి.

ఇరాన్‌లోని బాబోల్‌లో గుమిగూడిన భారీ జనం

ఫొటో సోర్స్, Eyewitness image

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌లోని బాబోల్‌లో గుమిగూడిన ప్రజలు

"ఇది ఏకపక్ష యుద్ధం’’

గత గురువారం తనకు "తీర్పు రోజు"లా అనిపించిందని టెహ్రాన్‌కు చెందిన ఓ యువతి అన్నారు.

"నిరసనలు జరగుతాయని ఎవరూ ఊహించని టెహ్రాన్ చుట్టూ ఉండే మారుమూల ప్రాంతాలు కూడా నిరసనకారులతో నిండిపోయాయి" అని ఆమె అన్నారు.

"శుక్రవారంనాడు భద్రతా బలగాలు నిరసనకారులను చంపడం మాత్రమే పనిగా పెట్టుకున్నాయి. ఎటు చూసినా మరణమే. నేను దాన్ని స్వయంగా చూడడం నన్ను కుదిపేసింది. నాలో ఉత్సాహాన్ని అది పూర్తిగా దెబ్బతీసింది. శుక్రవారం నిజంగా ఓ నెత్తుటిరోజు"

"శుక్రవారం నాటి హత్యల తర్వాత, ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. వారిలో చాలా మంది ప్రస్తుతం సందుల నుంచి తమ ఇళ్ల నుంచే నినాదాలు చేస్తున్నారు" అని ఆమె అన్నారు.

నిరసనకారులు, భద్రతాబలగాలతో టెహ్రాన్ యుద్ధభూమిని తలపిస్తోందని ఆమె చెప్పారు.

"యుద్ధంలో ఇరుపక్షాల వారికి ఆయుధాలు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రజలు కేవలం నినాదాలు చేస్తూ చనిపోతున్నారు. ఇది ఏక పక్ష యుద్ధం" అని ఆమె అన్నారు.

"ప్రతి సందులో ఇద్దరు, ముగ్గురు…"

శుక్రవారం రోజున ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్‌జీసీ) నేతృత్వంలోని పార్లమెంటరీ బసిజ్ సభ్యులు నిరసనకారులపై అకస్మాత్తుగా గంటల తరబడి దాడి చేశారని టెహ్రాన్‌కు పశ్చిమాన ఉన్న ఫర్దిస్ నగరంలో ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

యూనిఫామ్ వేసుకున్న బలగాలు, మోటార్ సైకిళ్లపై వచ్చి, నిరసనకారులపై నేరుగా కాల్పులు జరిపాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సందుల్లోకి గుర్తు తెలియని కార్లు దూసుకువచ్చాయన్నారు. వారు నిరసనలతో సంబంధం లేని వారిపై కూడా కాల్పులు జరిపారని చెప్పారు. "ప్రతి సందులో ఇద్దరు, ముగ్గురు చనిపోయారు" అని ఓ ప్రత్యక్ష సాక్షి ఆరోపించారు .

పశ్చిమ ఇరాన్‌లోని ఖొర్రమాబాద్ నుంచి గురువారం వచ్చిన ఫోటోల్లో, ఒక వ్యక్తి ఇరాన్ పాత జెండాను (విప్లవానికి ముందు ఉన్న జెండాను) పట్టుకుని ఉండటం కనిపించింది.

ఫొటో సోర్స్, Eyewitness image

ఫొటో క్యాప్షన్, పశ్చిమ ఇరాన్‌లోని ఖొర్రమాబాద్ నుంచి గురువారం వచ్చిన ఫోటోల్లో, ఒక వ్యక్తి ఇరాన్ పాత జెండాను (విప్లవానికి ముందు ఉన్న జెండాను) పట్టుకుని ఉండటం కనిపించింది.

అంచనాలకే మీడియా పరిమితం

బయటి ప్రపంచం ఊహించేదాని కంటే ఇరాన్‌ లోపల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని బీబీసీ పర్షియన్‌కు సమచారం అందించినవారు చెప్పారు.

అంతర్జాతీయ మీడియా ఇప్పటివరకు మరణాలసంఖ్యను కేవలం అంచనా వేసి చెబుతోందని తెలిపారు.

అంతర్జాతీయ మీడియా సంస్థలను ఇరాన్‌ లోపల స్వేచ్ఛగా పని చేసేందుకు అనుమతించకపోవడంతో మీడియా సంస్థలు దేశం బయట క్రియాశీలకంగా పనిచేస్తున్న ఇరాన్ మానవ హక్కుల సంస్థలపై ఆధారపడుతున్నాయి. సోమవారం నాడు 18 ఏళ్లలోపువారు 9మందితోసహా మొత్తం 648మంది ఇరాన్ నిరసనకారులు మరణించారని నార్వే కేంద్రంగా పనిచేసే ఇరాన్ హ్యూమన్ రైట్స్ సంస్థ(ఐహెచ్ఆర్ఎన్‌జీ) తెలిపింది.

అయితే, అక్కడ వందల నుంచి వేలాది మంది మరణించారని కొన్ని స్థానిక వర్గాలు, ప్రత్యక్ష సాక్షులు రిపోర్ట్ చేస్తున్నారు.

ప్రస్తుతం బీబీసీ ఈ సంఖ్యలను స్వతంత్రంగా ధ్రువీకరించలేకపోతోంది. ఇప్పటివరకు మరణించిన నిరసనకారుల సంఖ్యకు సంబంధించి ఇరాన్ అధికారులు ఎలాంటి అధికారిక సమాచారాన్ని లేదా పారదర్శక గణాంకాలను ప్రకటించలేదు.

శుక్రవారం తెహ్రాన్ నుంచి వచ్చిన వీడియోలలో కార్లు తగలబడటం కనిపించింది

ఫొటో సోర్స్, Eyewitness image / Reuters

ఫొటో క్యాప్షన్, శుక్రవారం తెహ్రాన్ నుంచి వచ్చిన వీడియోలలో కార్లు తగలబడటం కనిపించింది

స్టార్‌లింక్ శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా..

ఇరాన్‌లో నిరసనల కారణంగా వంద మంది వరకు భద్రతా సిబ్బంది మరణించారని ఇరాన్ మీడియా తన కథనాల్లో చెప్పింది. "అల్లరిమూకలు" అని వారు సంబోధిస్తున్న నిరసనకారులు.. పదుల కొద్దీ మసీదులు, వివిధ నగరాల్లోని బ్యాంకులకు నిప్పంటించారని చెప్పింది.

నిరసనల్లో వివిధ ప్రాంతాల్లో కొన్ని ప్రభుత్వ భవనాలు, పోలీసు వాహనాలకు నిప్పంటించినట్లుగా బీబీసీ పర్షియన్ ఫ్యాక్ట్-చెకింగ్ టీమ్ ధ్రువీకరించిన పలు వీడియోల్లోనూ కనిపించింది.

బీబీసీకి పర్షియన్‌కు పంపిన ఈ సాక్ష్యాలు, వీడియోల్లో ప్రధానంగా టెహ్రాన్, దానికి సమీపంలోని కరాజ్, ఉత్తరాన ఉండే రష్త్, ఈశాన్యవైపున మషాద్, దక్షిణంలో ఉండే షిరాజ్ వంటి పెద్ద నగరాల నుంచే ఉన్నాయి. స్టార్‌లింక్ శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్ యాక్సెస్ అందుబాటులో ఉంది.

అంతకుముందు చాలా మరణాలు చోటు చేసుకున్న చిన్నపట్టణాల నుంచి సమాచారం అందగా.. ప్రస్తుతం వారికి స్టార్‌లింక్ యాక్సెస్ చాలా పరిమితంగా ఉండడంతో అక్కడి నుంచి సమాచారం రావడం లేదు.

అయితే వివిధ నగరాల నుంచి అందిన సమాచార పరిమాణం, ఆ సమాచారంలోని స్థిరత్వం, వాటిలోని పోలికలు… నిరసనకారులను అణచివేయడంలోని తీవ్రత, విస్తృత మారుణాయుధాల వినియోగాన్ని చూపుతున్నాయి.

ఇరాన్‌తో తీవ్ర నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

"ఒక శవంపై మరొక శవాన్ని పేర్చారు"

తాము ఎంతో మంది శవాలను, అలాగే గాయపడ్డ అనేక మంది నిరసనకారులను చూశామని బీబీసీతో మాట్లాడిన నర్సులు, వైద్య సిబ్బంది చెప్పారు.

చాలా నగరాల్లోని ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయని, తీవ్రంగా గాయపడ్డవారికి, ప్రధానంగా తలలో, కంటికి గాయాలైనవారికి తాము చికిత్స అందించలేకపోతున్నామని వారు తెలిపారు.

"ఒక శవంపై మరొక శవాన్ని పేర్చారు" అని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వాటిని కుటుంబ సభ్యులకు అందించలేదని అన్నారు.

నిరసనకారుల ఆధ్వర్యంలో నడిచే వాహిద్ ఆన్‌లైన్ అనే ఓ టెలిగ్రామ్ ఛానల్‌లో ఆదివారం ప్రచురితమైన గ్రాఫిక్ వీడియోల్లో… టెహ్రాన్‌లోని కహారిజాక్ ఫోరెన్సిక్ మెడికల్ సెంటర్‌లో పెద్ద సంఖ్యలో శవాలు ఉన్నట్లుగా కనిపించాయి. ఆ శవాలను చూసి కుటుంబ సభ్యులు రోదిస్తున్నట్లుగా, వాటిని గుర్తించేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించాయి.

కహారిజక్‌కు చెందినదిగా భావిస్తున్న ఓ వీడియోలో గుర్తించని మృతదేహాల ఫోటోలను ఓ స్క్రీన్‌పై ప్రదర్శిస్తుండగా వాటిని వారి బంధువులు చూస్తున్నట్లుగా కనిపించింది.

ఆ కేంద్రంలో చాలా శవాలను నల్ల సంచుల్లో చుట్టి ఉన్నట్లుగా, వీధుల్లోనూ మృతదేహాలనే ఉంచినట్లుగా కనిపించాయి. వాటిల్లో కొన్నింటిని మాత్రమే గుర్తించారు.

ఓ గోదాంలో అనేక శవాలు ఉన్నట్లుగా ఓ వీడియోలో కనిపిస్తుండగా, మరో వీడియోలో ఓ ట్రక్కు నుంచి శవాలను దింపుతున్నట్లుగా కనిపించింది.

శుక్రవారం తెల్లవారుజామున తలకు దెబ్బతగిలిన 180 నుంచి 200 మృతదేహాలను తీసుకువచ్చి, పూడ్చినట్లుగా మషాద్‌లోని ఓ శ్మశాన వాటికలో పనిచేసే ఓ కార్మికుడు తెలిపారు.

గురువారం రోజున 70 మంది మృతదేహాలను ఓ ఆసుపత్రి శవాగారానికి తరలించినట్లుగా రష్త్‌కు చెందిన ఓ వర్గం బీబీసీకి చెప్పింది. ‘‘ఆ మృతదేహాలను బంధువులకు అప్పగించే ముందు బుల్లెట్లకు మూల్యం చెల్లించండి’’ అంటూ భద్రతా బలగాలు డిమాండ్ చేసినట్లుగా పేర్కొంది.

‘40 శవాలను తీసుకొచ్చారు’

మరోవైపు, గురువారం దాదాపు 40 శవాలను తమ వద్దకు తీసుకువచ్చినట్లుగా తూర్పు టెహ్రాన్‌లోని ఓ ఆస్పత్రి సిబ్బంది ఒకరు బీబీసీ పర్షియన్‌కు చెప్పారు. ఆయన గుర్తింపును బహిర్గతం చేయకుండా ఉండేందుకు ఆ ఆస్పత్రి పేరును రాయడం లేదు.

"ఇటీవలి రోజుల్లో నిరసనకారులపై ఇరాన్ అధికారుల హింస, బలప్రయోగం కారణంగా చోటుచేసుకున్న మరణాలు, గాయాలకు దారితీసిన నివేదికలు తమను దిగ్భ్రాంతికి గురిచేశాయి" అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆదివారం అన్నారు.

"మరణాల సంఖ్యతో సంబంధం లేకపోయినప్పటికీ, మారణాయుధాలను భద్రతా బలగాలు ఉపయోగించడం ఆందోళనకరం" అని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌లో మానవ హక్కుల పరిస్థితిపై నియమితులైన ఐక్యరాజ్య సమితి ప్రత్యేక రాయబారి మాయ్ సాటో.. బీబీసీ పర్షియన్‌తో అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)