అమెరికా బాంబులకు ఇరాన్ అణు స్థావరాలు దెబ్బతిన్నాయా, లేదా... ట్రంప్, పెంటగాన్ ఇంటెలిజెన్స్ చెరోమాట ఎందుకు?

ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడుల్లో ఆ దేశ న్యూక్లియర్ సెంటర్లకు ఏమీ కాలేదని పెంటగాన్ ఇంటెలిజెన్స్ అసెస్‌మెంట్ రిపోర్టులో వెల్లడైంది.
శనివారం అమెరికా జరిపిన బాంబు దాడుల్లో ఇరాన్ యురేనియం నిల్వలు ధ్వంసం కాలేదని పెంటగాన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంచనా వేసినట్లు దానికి సంబంధించిన వర్గాలు బీబీసీ అమెరికా పార్టనర్ సీబీఎస్‌కు తెలిపాయి.
పెంటగాన్ అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం.
అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ఉటంకిస్తూ...అమెరికాలోని పలు ప్రధాన మీడియా సంస్థలు సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్ కూడా ఈ వార్తను ప్రచురించాయి.

‘ నిఘా సమాచారం లీక్ దేశ ద్రోహం ’
అయితే, ఈ అంచనాలు పూర్తిగా అవాస్తవమని, అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నమని వైట్‌హౌస్ పేర్కొంది.
ఇరాన్‌పై అమెరికా దాడులకు సంబంధించి లీకైన ఇంటెలిజెన్స్ అంచనా రిపోర్టును దేశద్రోహంగా అభివర్ణించారు పశ్చిమాసియాలో ట్రంప్ ప్రధాన రాయబారి స్టీవ్ విట్కాఫ్.
దీనిపై స్పందించాలని అమెరికా రక్షణ శాఖను బీబీసీ కోరింది.
బీబీసీకి అందిన స్పందనలో... ‘‘ ట్రంప్‌ను, ఆయన సక్సెస్‌ఫుల్ మిషన్‌ను కించపరిచే ప్రయత్నాల్లో భాగంగా, ఈ దాడుల్లో ఎలాంటి విధ్వంసం కలగలేదని వారు చెబుతున్నారు’’ తెలిపింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పంద ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని, రెండు దేశాలు దీన్ని అంగీకరించాయని కూడా రక్షణ శాఖ పేర్కొంది.

ఫొటో సోర్స్, Satellite image (c) 2025 Maxar Technologies via Getty Images
లీకైన పెంటగాన్ రిపోర్ట్‌లో ఏముంది?
ఇరాన్‌పై అమెరికా శనివారం జరిపిన దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలు, అణు కార్యక్రమాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని అమెరికా అధికార యంత్రాంగం చెప్పింది. ఈ విషయంపై పెంటగాన్ ప్రాథమిక ఇంటెలిజెన్స్ రిపోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది.
ఫోర్దో, నతాంజ్, ఇస్ఫహాన్ అనే ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై బాంబులతో అమెరికా దాడులు చేసింది. ఈ బాంబులు భూగర్భంలో 61 మీటర్ల లోతు వరకు వెళ్లగలవు.
కానీ, పెంటగాన్ ఇంటెలిజెన్స్ రిపోర్టుకు చెందిన వర్గాలు కొంత సమచారాన్ని లీక్ చేశాయి. అమెరికా దాడులు చేసినా, చాలా వరకు ఇరాన్ సెంట్రిఫ్యూజ్‌లు సురక్షితంగా ఉన్నాయని, కేవలం పైన భవంతులపైనే దాడి ప్రభావం పడిందని పేర్కొన్నాయి.
రెండు అణు కేంద్రాలకు చెందిన ప్రధాన ద్వారాలు మూసివేశారనీ, కొన్ని నిర్మాణాలు మాత్రమే ధ్వంసమయ్యాయని లీకైన నిఘా సమాచారంలో ఉంది.
భూగర్భంలోని న్యూక్లియర్ కార్యక్రమాలు చాలా వరకు సురక్షితంగానే ఉన్నాయని, పెంటగాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
కొన్ని నెలల పాటు మాత్రమే ఈ ప్రభావం ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమాలపై ఉంటుందని అమెరికా మీడియాకు ఈ వర్గాలు చెప్పాయి.
ఇరాన్ ఎంత వేగంగా ఈ శిథిలాలను తొలగించి, మరమ్మతులు చేస్తుందో దానిపైనే ఈ అణు కార్యక్రమాలు తిరిగి మొదలు కావడం ఆధారపడి ఉంటుందని తెలిపాయి.
దాడులకు ముందు ఇరాన్ తమ యురేనియంలో కొంత భాగాన్ని వేరే ప్రాంతానికి తరలించినట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టు పేర్కొంది.
ఈ దాడుల్లో అమెరికా జీబీయూ-57 అనే అతిపెద్ద బాంబును వాడింది. భూగర్భంలోని అణు కేంద్రాలను ధ్వంసం చేయడానికి ఇదే సరైనదని అమెరికా చెబుతోంది.
ఈ దాడుల తర్వాత ఇరాన్‌లోని మూడు న్యూక్లియర్ బేస్‌లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అమెరికా సైన్యానికి చెందిన ఉన్నతాధికారి జనరల్ డాన్ కేన్ చెప్పారు.
ఫోర్దో కేంద్ర సమీపంలోని రెండు ప్రాంతాల దగ్గరున్న ఆరు అతిపెద్ద బిలాలను ఉపగ్రహ చిత్రాలు చూపించాయి.
కానీ, ఈ అణు కేంద్రం లోపలున్న భాగాలకు ఎంత నష్టం వాటిల్లిందో స్పష్టంగా తెలియదు.
ఈ మూడు ప్రాంతాలను అప్పటికే ఖాళీ చేశామని, ఇరాన్‌కు పెద్దగా ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఆ దేశ ప్రభుత్వ టీవీకి చెందిన అధికారి ఒకరు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
డోనల్డ్ ట్రంప్ ఏమన్నారు?
ఈ రిపోర్టుకు సంబంధించిన వార్తలను ఫేక్ న్యూస్ అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.
‘‘ సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్ తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నాయి. చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక దాడుల్లో ఒకదాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ఈ రెండూ ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రజలు న్యూయార్క్ టైమ్స్‌ను, సీఎన్‌ఎన్ రెండింటినీ తీవ్రంగా ఖండిస్తున్నారు'' అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ రాశారు.
పశ్చిమాసియాకు చెందిన అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ప్రకటనను కూడా ట్రూత్ సోషల్‌లో షేర్ చేశారు ట్రంప్.
''ఫోర్దో కేంద్రంపై 12 బంకర్ బస్టర్ బాంబులను వేశాం. ఈ బాంబులు దాని సెక్యూరిటీ లేయర్‌ను చీల్చుకుపోయాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బేస్ పూర్తిగా ధ్వంసమైందనడంలో అనుమానం లేదు. మా లక్ష్యాలను మేం చేరుకోలేదని వస్తోన్న రిపోర్టులు పూర్తిగా అవాస్తవం'' అని ఫాక్స్ న్యూస్‌తో స్టీవ్ విట్కాఫ్ జరిపిన సంభాషణను ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో షేర్ చేశారు.
‘‘ఇది దారుణం, దేశద్రోహం. దీనిపై విచారణ జరిపించాలి’’ అని ఫాక్స్ న్యూస్‌తో స్టీవ్ విట్కాఫ్ అన్నారు. దీనికి బాధ్యులైన వారే జవాబుదారీగా ఉండాలని చెప్పారు.
మా బాంబులు వాటి పని అవి చేశాయి: రక్షణ మంత్రి
దీనిపై రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి కూడా బీబీసీ స్పందనను కోరింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేథ్ నుంచి ఒక ప్రకటనను బీబీసీకి అందించింది పెంటగాన్.
‘‘నేను చూసిన దాని ప్రకారం, అణ్వాయుధాలు తయారు చేయగల ఇరాన్ సామర్థ్యాన్ని మా దాడులు పూర్తిగా నాశనం చేశాయి. మా బాంబులు ప్రతి లక్ష్యాన్ని కచ్చితంగా పేల్చేశాయి. వాటి పనిని పూర్తి చేశాయి. ఈ బాంబుల ప్రభావం ఇరాన్‌లోని పర్వతాల కింద సమాధి అయిన శిథిలాల ద్వారానే తెలుస్తుంది’’ అని ఆ ప్రకటనలో ఉంది.
ఈ రిపోర్టుపై అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) నుంచి కూడా బీబీసీ స్పందనను కోరింది.
ఇదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్న బీ-2 బాంబర్ ఫైటర్ ప్లేన్లు, అవి వేస్తున్న 60 సెకన్ల బాంబుల వీడియోను డోనల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
''బాంబ్ ఇరాన్'' అనే పదాలతో ఈ వీడియోలో పాట వినిపించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














