'మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌' కంటే శక్తివంతమైన ఈ అమెరికా బాంబు ఏంటి, ఇది ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ స్వరూపాన్నే మార్చేస్తుందా?

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, అణు కార్యక్రమం, ఫోర్డో అణు స్థావరం, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్

ఫొటో సోర్స్, US Air Force

ఫొటో క్యాప్షన్, జీబీయూ 57 ఏ/బీ బాంబును అమెరికన్ బి-2 యుద్ధ విమానంతో ప్రయోగించేలా రూపొందించారు.
    • రచయిత, లూయిస్ బర్రూచో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భూగర్భంలో ఇరాన్ ఏర్పాటు చేసిన అణు స్థావరాలపై దాడులు చేయగల సత్తా ఉన్నవాటిలో ఒకటిగా చెబుతున్న ఆయుధాన్ని ఇప్పటి వరకు ఉపయోగించలేదు.

అయితే, ఆ ఆయుధం ఇజ్రాయెల్ దగ్గర లేదు. అది GBU-57A/B- MOP( మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్). ప్రపంచంలో బంకర్లను బద్దలు కొట్టే అతి పెద్ద బాంబు. ప్రస్తుతం అమెరికా దగ్గర మాత్రమే ఉందని చెబుతున్నారు.

13,600 కేజీలు బరువు ఉండే ఈ ఆయుధం, టార్గెట్‌లపై కచ్చితత్వంతో దాడి చేయగలదు. ఇరాన్‌ పర్వత ప్రాంతాల్లోని భూగర్భంలో బాగా లోతులో ఉన్న ఫోర్డో యురేనియం శుద్ధి కేంద్రంలోకి ఇది చొచ్చుకుపోగలదు.

ఆమెరికా ఇప్పటి వరకు ఈ ఆయుధాన్ని ఇజ్రాయెల్‌కు ఇవ్వలేదు.

అసలేంటీ ఆయుధం? ఇది ప్రయోగిస్తే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి?

‘‘GBU-57A/B చాలా లోతుల్లోకి చొచ్చుకు వెళ్లగల ఆయుధం. భూగర్భంలో బాగా లోతులో నిర్మించిన సైనిక స్థావరాలు, సొరంగాల్లో దాచిపెట్టిన వాటిని ధ్వంసం చేసే సత్తా దీనికి ఉంది’’ అని అమెరికా ప్రభుత్వం చెబుతోంది.

ఆరు మీటర్ల పొడవు ఉండే ఈ ఆయుధం పేలడానికి ముందు భూ ఉపరితలం నుంచి 200 అడుగుల లోతుకు చొచ్చుకుపోతుంది.

ఒకేసారి వరుసగా అనేక బాంబుల్ని ప్రయోగిస్తే, అవి భూమిలోపలకు వెళ్లి పేలిన ప్రతీసారి చాలా లోతుకు డ్రిల్లింగ్ చేస్తాయి.

ఈ బాంబును బోయింగ్ సంస్థ తయారు చేసింది.

'మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్' ఇప్పటి వరకు ఏ యుద్ధంలోనూ ఉపయోగించలేదు. అయితే న్యూ మెక్సికోలోని అమెరికన్ మిలటరీ టెస్టింగ్ ఏరియాలో ఉన్న వైట్ శాండ్స్ మిసైల్ రేంజ్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు.

"మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్" అని పిలిచే 9800 కేజీల బరువుండే మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ (ఎంఓఏబీ) కంటే మాసివ్ ఆర్టినెన్స్ పెనిట్రేటర్ (ఎంఓపీ) చాలా శక్తిమంతమైనది.

మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ బాంబును 2017లో అఫ్గానిస్తాన్ యుద్ధంలో ఉపయోగించారు.

"మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌ సైజుకు సమానమైన ఆయుధాలు తయారు చేసేందుకు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ గట్టిగా కృషి చేసింది. అయితే పేలుడు పదార్ధాన్ని పటిష్టమైన లోహపు అరలో ఉంచడంతో GBU-57A/B మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ ఏర్పడింది" అని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్‌ఫోర్డ్‌లో పీస్ స్టడీస్ ప్రొఫెసర్ పాల్ రోజర్స్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రస్తుతం ఎంఓపీని ది స్టెల్త్ బాంబర్‌గా గుర్తింపు పొందిన అమెరికన్ బి 2 స్పిరిట్‌ అనే యుద్ధ విమానానికి అమర్చి ప్రయోగించేందుకు ఉపయోగిస్తున్నారు.

బి-2 యుద్ధ విమానాన్ని నార్త్రోప్ గ్రుమ్మన్ సంస్థ తయారు చేసింది. అమెరికన్ వైమానిక దళ ఆయుధాగారంలో ఇది అత్యాధునిక యుద్ధ విమానం.

ఈ విమానం 18 వేల కేజీల పేలుడు పదార్ధాలను మోసుకు వెళ్లగలదని దీన్ని తయారు చేసిన సంస్థ చెబుతోంది.

అయితే 27,200 కేజీలు ఉండే రెండు జీబీయూ-57ఏ/బి బంకర్ బస్టర్ బాంబులను మోసుకెళ్లే బి-2 విమానాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు అమెరికన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది.

ఈ విమానంలో ఒకసారి ఇంధనం నింపితే 11వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

మరోసారి విమానంలోనే ఉండే ఇంధనాన్ని నింపితే 18,500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కొన్ని గంటల వ్యవధిలో ప్రపంచంలో ఏ మూలకైనా చేరుకోగలదని ఈ విమానాన్ని తయారు చేసిన నార్త్రోప్ గ్రుమ్మన్ చెబుతోంది.

ఇరాన్ మాదిరిగా ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్న దేశాలపై ఎంఓపీలను ఉపయోగించేట్లయితే బి-2 బాంబర్లతో పాటు ఇతర యుద్ధ విమానాలను కూడా ఉపయోగించే అవకాశం ఉంది.

ఉదాహరణకు ప్రత్యర్థి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు ఎఫ్- 22 స్టెల్త్ విమానాలతో దాడులు చేయవచ్చు.

ఈ దాడి విజయవంతమైందా లేదా, మరోసారి దాడి చేయాలా అనే దాన్ని విశ్లేషించేందుకు డ్రోన్లను ఉపయోగించవచ్చని ప్రొఫెసర్ రోజర్స్ చెప్పారు.

అమెరికా దగ్గర పరిమిత సంఖ్యలోనే ఎంఓపీ బాంబులు ఉండవచ్చని ఆయన భావిస్తున్నారు.

"ఈ తరహా బాంబులు అమెరికా దగ్గర బహుశా 10 లేదా 20 ఉండవచ్చు" అని ఆయన చెప్పారు.

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, అణు కార్యక్రమం, ఫోర్డో అణు స్థావరం, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్

ఫొటో సోర్స్, Whiteman Air Force Base

ఫొటో క్యాప్షన్, మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ బాంబును ట్రక్ మీద అమర్చుతున్న అమెరికన్ సైనికులు

ఇరాన్ మీద ఎంఓపీ బాంబును ప్రయోగిస్తారా?

ఇరాన్‌లోని యురేనియం శుద్ధి కేంద్రాల్లో నతాంజ్ ప్రధానమైనది. ఆ తర్వాతి స్థానంలో ఫోర్డో ఉంది.

ఈ స్థావరాన్ని తెహ్రాన్‌కు నైరుతి వైపున 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖోమ్ నగరం వద్ద ఉన్న పర్వతాల్లో నిర్మించారు.

ఫోర్డో అణు స్థావరాన్ని 2006లో నిర్మించడం ప్రారంభించారు.

2009లో ఇది పని చేయడం ప్రారంభించింది.

అదే ఏడాది దీని ఉనికిని తెహ్రాన్ నాయకత్వం బహిరంగంగా అంగీకరించింది.

పర్వత ప్రాంతంలో రాళ్లు, మట్టి కింద 260 అడుగుల లోతున ఉన్న ఫోర్డో అణు స్థావరానికి ఇరాన్, రష్యా ఉపరితల, గగనతల మిసైల్ వ్యవస్థల ద్వారా రక్షణ కల్పిస్తున్నారు.

ఈ ప్రాంతాన్ని 2023 మార్చ్‌లో సందర్శించిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ సభ్యులు ఇక్కడ అణ్వస్త్రాలు తయారు చేసేందుకు అనువుగా ఉన్న 83.7శాతం శుద్ధి చేసిన యురేనియం మూలకాలను గుర్తించారు.

ఇరాన్ క్షిపణి, అణు కార్యక్రమాన్ని అంతం చేయడానికే ఆ దేశం మీద దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చెబుతున్నారు.

ఇరాన్ అణు కార్యక్రమం ‘ఇజ్రాయెల్‌ ఉనికిి’కి ప్రమాదకరమనేది ఆయన అభిప్రాయం.

ఇజ్రాయెల్ లక్ష్యాలను సాధించడంలో ఫోర్డో కూడా భాగమని అధికారులు చెబుతున్నారు.

"ఫోర్డోను తుడిచిపెట్టడంతో ఈ ఆపరేషన్ లక్ష్యం పూర్తవుతుంది" అని ఫాక్స్ న్యూస్‌తో చెప్పారు అమెరికాలో ఇజ్రాయెల్ రాయబారి యెచీల్ లెయిటర్.

"ఇజ్రాయెల్‌కు సొంతంగా మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ బాంబును మోహరించే సామర్థ్యం లేదు. నేరుగా యుద్ధంలోకి దిగకుండా అమెరికా దాన్ని ప్రయోగించదు" అని ప్రొఫెసర్ రోజర్స్ అన్నారు.

"ఇజ్రాయెల్ దీన్ని ప్రయోగించేందుకు అమెరికా అంగీకరించదు. ఇజ్రాయెల్ దగ్గర భారీ స్థాయి పెనిట్రేటర్స్ లేవు" అని రోజర్స్ వివరించారు.

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, అణు కార్యక్రమం, ఫోర్డో అణు స్థావరం, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచంలో ఎక్కడికైనా కొన్ని గంటల్లో చేరుకోగల అమెరికన్ యుద్ధ విమానం బి-2 స్పిరిట్

అమెరికా వైఖరి ఏంటి?

అమెరికా ఈ బాంబు ప్రయోగిస్తుందా లేదా అనేది, అది ఈ యుద్ధంలో పాల్గొనాలనే సుముఖత మీద ఆధారపడి ఉంటుంది. అది కూడా ట్రంప్ నాయకత్వంలో.

"ఇది ట్రంప్ ఇజ్రాయెల్‌కు సాయం చేసే విషయంలో పూర్తి సహకారం అందిస్తున్నారా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది" అని రోజర్స్ అన్నారు.

కెనడాలో జరిగిన జీ7 సమావేశంలో వాషింగ్టన్ తన సైన్యాన్ని ఎందుకు రంగంలోకి దించడం లేదని ట్రంప్‌ను అడిగారు. "నేను దాని గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు" అని అన్నారు

ఫోర్డోపై అమెరికా దాడి చేసేందుకు ఎంత వరకు అవకాశం ఉంది అని అమెరికాలో ఇజ్రాయెల్ రాయబారి లెయిటర్‌ను ఇటీవల ఏబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించినప్పుడు, రక్షణపరంగా సాయం అవసరమైతే తాము అమెరికాను మాత్రమే సాయం కోరతామని ఆయన చెప్పారు.

"మాకు అనేక దళాలు ఉన్నాయి. ఫోర్డోను ఎదుర్కోవడానికి అవి చాలు. ప్రతిదీ ఆకాశంలోకి ఎగరడం, దూరం నుంచి బాంబులు వేయడం కాదు కదా" అని లెయిటర్ అన్నారు.

తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాలకు ఉద్దేశించిందని, అణ్వాయుధాలు తయారు చేసే ఆలోచన తమకు ఎన్నడూ లేదని ఇరాన్ పదే పదే చెబుతోంది.

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, అణు కార్యక్రమం, ఫోర్డో అణు స్థావరం, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్, డోనల్డ్ ట్రంప్, కెనడా, జీ7 సదస్సు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జీ 7 సదస్సు నుంచి ముందుగానే వెళ్లిపోయారు.

'గేమ్ చేంజర్'

ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ తాజా దాడుల తర్వాత "భూగర్భంలో చాలా లోతులో ఉన్న ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేయడంలో ఇజ్రాయెల్ విజయం సాధించిందా" అంటే కష్టమేనని ప్రొఫెసర్ రోజర్స్ అన్నారు.

"వాళ్లు స్వయంగా చేయలేని ఆ పనికి భారీ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ లాంటి ఆయుధం అవసరం" అని ఆయన చెప్పారు.

"ఫోర్డో చాలా కాలంగా పని చేస్తోంది. ఇరాన్ నుంచి ఇప్పటికీ అణ్వస్త్ర వ్యాప్తి ప్రమాదం ఉంది. ఫోర్డోలో తెహ్రాన్ ఆయుధాలు తయారు చేసే స్థాయికి యురేనియంను శుద్ధి చేయడం లేదా ప్రపంచానికి తెలియని మరో ప్రదేశానికి దాన్ని తరలించే అవకాశం ఉంది" అని అమెరికాకు చెందిన ఆర్మ్స్ కంట్రోల్ అసోసియేషన్‌లో నాన్ ప్రొలిఫరేషన్ పాలసీ డైరెక్టర్ కెల్సీ డావెన్ పోర్ట్ చెప్పారు.

"ఇరాన్ అణు స్థావరాలు భూమి లోపల ఎంత లోతులో ఉన్నాయో తెలియకుండా భారీ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ ఉపయోగించినా, అది కచ్చితంగా విజయవంతం అవుతుందని గ్యారంటీ లేదు" అని ప్రొఫెసర్ రోజర్స్ అభిప్రాయపడ్డారు.

"అయితే ప్రస్తుతం ఉన్న ఆయుధాలలో ఈ ప్రత్యేక ఆయుధం ఒక్కటే భూగర్భంలో ఉన్న ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేసేందుకు అందుబాటులో ఉన్న బెస్ట్ ఆప్షన్. అయితే అది ఆ పని చేస్తుందా? ఏమో ఎవరికి తెలుసు" అని రోజర్స్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)