ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణను ఘోరమైన సంక్షోభంగా మార్చగల 5 పరిణామాలు ఇవే...

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, పశ్చిమాసియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది మరణించారని ఇరాన్ తెలిపింది.
    • రచయిత, జేమ్స్ లాండేల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రస్తుతం ఘర్షణలు ఇజ్రాయెల్,ఇరాన్‌కే పరిమితమయినట్టు కనిపిస్తోంది.

సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితితో పాటు కొన్నిదేశాలు పదే పదే పిలుపునిస్తున్నాయి.

మరి ఈ పిలుపును ఇజ్రాయెల్, ఇరాన్ వినిపించుకోకపోతే ఏమవుతుంది? ఘర్షణలు మరింత తీవ్రమై, ఇంకా విస్తరిస్తే ఏం జరుగుతుంది?

కొన్ని దారుణమైన పరిస్థితులు చోటుచేసుకునే ప్రమాదముంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, పశ్చిమాసియా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ న్యూయార్క్‌లో నిరసన

1. అమెరికా జోక్యం చేసుకోవచ్చు...

అమెరికా తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ దాడులను ఆ దేశం ఆమోదించిందని, అలా కాకపోయినా వ్యూహాత్మకంగానైనా మద్దతు ఇస్తోందని ఇరాన్ గట్టిగా నమ్ముతోంది.

పశ్చిమాసియా అంతటా అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేయొచ్చు. ఇరాక్‌లోని ప్రత్యేక బలగాలు, గల్ఫ్‌లోని మిలటరీ స్థావరాలు, ఈ ప్రాంతంలోని దౌత్య కార్యాలయాల వంటివాటిని లక్ష్యంగా చేసుకోవచ్చు. ఇరాన్ మిత్రబలగాలు హమాస్, హిజ్బొల్లా చాలా వరకు బలహీనపడి ఉండొచ్చు. కానీ ఇరాక్‌లో దానికి మద్దతు ఇచ్చే మిలీషియాలు బలంగా ఉన్నాయి.

దాడులు జరిగే అవకాశం ఉందని భయపడ్డ అమెరికా, కొంతమంది సిబ్బందిని ఉపసంహరించుకుంది. తమ బలగాలపై, స్థావరాలపై ఏదైనా దాడి జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయనేదానిపై అమెరికా బహిరంగంగానే ఇరాన్‌ను గట్టిగా హెచ్చరించింది.

టెల్ అవీవ్‌లో లేదా మరెక్కడైనా ఒక అమెరికా పౌరుడు హత్యకు గురయితే ఏం జరుగుతుంది?

చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి డోనల్డ్ ట్రంప్‌కు రావొచ్చు. ఇరాన్‌ను ఓడించడంలో సాయం చేయమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చాలాకాలంగా అమెరికాను కోరుతున్నారన్న ఆరోపణలున్నాయి.

ఇరాన్ అణు కేంద్రాల లోపలకి, ముఖ్యంగా ఫోర్డోలోని అణు కేంద్రాలలోకి చొచ్చుకుపోగల బాంబర్లు, బంకర్-బస్టింగ్ బాంబులు అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయని సైనిక విశ్లేషకులు అంటున్నారు.

పశ్చిమాసియాలో ''శాశ్వత ప్రాతిపదికన సాగే యుద్ధాలు'' తాను మొదలుపెట్టబోనని ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (MAGA) మద్దతుదారుల సమావేశంలో ట్రంప్ గతంలో హామీఇచ్చారు.

అయితే చాలామంది రిపబ్లికన్లు ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని, తెహ్రాన్‌లో ప్రభుత్వం మారాల్సి ఉందన్న దాని అభిప్రాయాన్ని సమర్ధిస్తున్నారు.

కానీ అమెరికా పోరాటంలోకి దిగితే పర్యవసానాలు ప్రమాదకరంగా మారతాయి. ఘర్షణ సుదీర్ఘంగా, విధ్వంసపూరితంగా మారే అవకాశముంది.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, పశ్చిమాసియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పశ్చిమాసియాలో తమ బలగాలు కొన్నింటిని అమెరికా ఉపసంహరించుకుంది.

2. గల్ఫ్ దేశాలు రంగంలోకి దిగొచ్చు...

ఇజ్రాయెల్ సైనిక, ఇతర లక్ష్యాలను అడ్డుకోవడంలో ఇరాన్ విఫలమైతే, గల్ఫ్‌లోని తేలికపాటి లక్ష్యాలపై, ముఖ్యంగా తన శత్రువులకు సాయం చేసి ప్రోత్సహించాయని తాను ఏళ్లుగా నమ్ముతున్న దేశాలపై ఇరాన్ మిసైళ్లను ఎక్కుపెట్టొచ్చు.

ఈ ప్రాంతంలో చాలా ఇంధనం, ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యాలు కావచ్చు. 2019లో సౌదీ అరేబియా చమురు నిల్వలపై ఇరాన్ దాడి చేసిందని, ఇరాన్ మిత్రపక్షం హౌతీ, 2022లో యూఏఈని లక్ష్యంగా చేసుకుందని మర్చిపోకూడదు.

ఆ తర్వాత నుంచి ఇరాన్, ఈ ప్రాంతంలోని కొన్ని దేశాల మధ్య ఒకరకమైన సయోధ్య ఏర్పడింది.

అయితే ఈ దేశాలు అమెరికా వైమానిక స్థావరాలకు ఇంకా ఆతిథ్యం ఇస్తున్నాయి. కొన్ని దేశాలైతే గత ఏడాది ఇరాన్ క్షిపణుల దాడి నుంచి ఇజ్రాయెల్‌ను రక్షించడంలో కూడా సాయమందించాయి.

గల్ఫ్‌పై దాడి జరిగితే, ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా కూడా యుద్ధ విమానాలను రంగంలోకి దించాలని గల్ఫ్ దేశాలు డిమాండ్ చేయొచ్చు.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, పశ్చిమాసియా

ఫొటో సోర్స్, EPA-EFE/Shutterstock

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతిదాడులు చేసింది.

3. ఇరాన్ అణు కేంద్రాల ధ్వంసంలో ఫెయిలైతే ఇజ్రాయెల్ మరిన్ని దాడులు చేయొచ్చు...

ఇజ్రాయెల్ దాడి విఫలమైతే ఏమవుతుంది? ఇరాన్ అణు కేంద్రాలు చాలా బలంగా, గట్టి భద్రతతో ఉండి ఇజ్రాయెల్ వాటికి నష్టం కలిగించలేకపోతే ఏం జరుగుతుంది? ఇరాన్ 60శాతం యురేనియం పూర్తిస్థాయిలో ఆయుధాలుగా మారడానికి ఒక చిన్న అడుగు దూరంలో ఉంది. పది బాంబులకు సరిపోయే అణు ఇంధనం అది. దాన్ని ఇజ్రాయెల్ విధ్వంసం చేయలేకపోతే?

రహస్య గనుల లోపల ప్రాంతంలో యురేనియం ఉండవచ్చని భావిస్తున్నారు. కొంతమంది అణు శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ చంపి ఉండొచ్చు. కానీ ఏ బాంబులూ ఇరాన్ జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని నాశనం చేయలేవు.

మరిన్ని దాడులు జరగకుండా నిరోధించడానికి ఏకైక మార్గం వీలైనంత త్వరగా అణ్వాయుధాలను సిద్ధం చేసుకోవడమేనని ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ నాయకత్వాన్ని తొందరపడేలా చేస్తే...

చర్చల్లో కూర్చునే కొత్త సైనిక నేతలు, చనిపోయిన తమ పూర్వీకుల కంటే మరింత దూకుడుగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే..?

ఇది ఇజ్రాయెల్‌ మరిన్ని దాడులకు దిగేలా చేయవచ్చు. తద్వారా ఈ ప్రాంతం నిరంతర దాడులు, ప్రతిదాడులకు వేదిక కావొచ్చు. ఈ వ్యూహాన్ని ఇజ్రాయెల్ ప్రజలు ఒక క్రూరమైన మాటతో అభివర్ణిస్తారు. " గడ్డి కోత అంటే ఊచకోత కోయడం'' అని అంటారు.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, పశ్చిమాసియా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

4. ప్రపంచ ఆర్ధిక రంగం షాక్ గురి కావొచ్చు..

చమురు ధర ఇప్పటికే పెరుగుతోంది. దాని రవాణాను మరింత పరిమితం చేస్తూ హార్ముజ్ జలసంధిని మూసివేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది?

అరేబియా ద్వీపకల్పానికి అవతలి వైపున ఉన్న యెమెన్‌లోని హౌతీలు ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపై దాడులకు తమ ప్రయత్నాలను రెట్టింపు చేస్తే?

ఊహించలేని విధంగా భారీ ఎత్తున సమస్యలు సృష్టించగల ఇరాన్ మిత్రదేశం యెమెన్.

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయం అనే సమస్యను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ సుంకాల యుద్ధం కారణంగా ఇప్పటికే కుదేలైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై చమురు ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ప్రభావం పడుతుంది.

పెరుగుతున్న చమురు ధరల వల్ల ప్రయోజనం పొందుతున్న ఏకైక వ్యక్తి రష్యా అధ్యక్షుడు పుతిన్ అని మనం మర్చిపోకూడదు. యుక్రెయిన్‌ యుద్ధం కోసం ఖర్చు చేయడానికి వీలుగా క్రెమ్లిన్ ఖజానాలోకి అకస్మాత్తుగా బిలియన్ల డాలర్లు వరదలా వచ్చిపడతాయి.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, పశ్చిమాసియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌లో ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోయడం ఇజ్రాయెల్ లక్ష్యంగా కనిపిస్తోంది.

5. ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే ఇరాన్ మరింత తీవ్రంగా ప్రతిఘటించొచ్చు..

ఇరాన్‌లో ఇస్లామిక్ పాలనను లేకుండా చేయాలన్న తన లక్ష్యంలో ఇజ్రాయెల్ విజయం సాధిస్తే ఏమవుతుంది?

ఇరాన్ అణు శక్తిని నాశనం చేయడమే తన ప్రాథమిక లక్ష్యమని నెతన్యాహు చెబుతున్నారు. కానీ తన విస్తృత లక్ష్యం ఇరాన్‌లో పాలన మార్పు అని దాడుల తర్వాతి ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్ ప్రస్తుత ప్రభుత్వాన్ని "దుష్ట, నిరంకుశ"గా అభివర్ణించిన నెతన్యాహు, ఆ పాలన నుంచి ఇరాన్ ప్రజలు స్వేచ్ఛను సాధించడానికి ఇజ్రాయెల్ దాడులు మార్గాన్ని సుగమం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చడం అనేది ఈ ప్రాంతంలోని కొంతమందికి, ముఖ్యంగా ఇజ్రాయెలీలకు బాగా నచ్చే విషయం. కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? ఇంతకు ముందు లేని పరిణామాలు ఏముంటాయి? ఇరాన్‌లో అంతర్గత సంఘర్షణ ఎలా ఉంటుంది?

దేశంలో కేంద్రీకృతంగా ఉండే బలమైన ప్రభుత్వం కుప్పకూలినప్పుడు ఇరాక్, లిబియాలకు ఏం జరిగిందో చాలామందికి గుర్తుంది.

కాబట్టి, వచ్చే రోజుల్లో ఈ ఘర్షణ ఎలా సాగుతుందనే దానిపై చాలా విషయాలు ఆధారపడి ఉన్నాయి.

ఇరాన్ ఏ స్థాయిలో కఠినాతికఠినంగా ప్రతీకారం తీర్చుకుంటుంది? ఇజ్రాయెల్‌ను అమెరికా ఎంతమేర నియంత్రించగలదు?

ఆ రెండు ప్రశ్నలకు సమాధానం మీద చాలా విషయాలు ఆధారపడి ఉన్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)