ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఇరాన్‌లో జరిగిన నష్టం ఎంత, ఈ ఉపగ్రహ చిత్రాల్లో ఏముంది?

- రచయిత, బెన్‌డిక్ట్ గార్మాన్, షైయాన్ సర్దారిజాదే
- హోదా, బీబీసీ వెరిఫై
ఇరాన్‌పై ఇజ్రాయెల్ శనివారం జరిపిన వైమానిక దాడుల్లో ఎన్ని సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి? అన్నది తెలుసుకునేందుకు కొన్ని ఉపగ్రహ చిత్రాలను బీబీసీ వెరిఫై బృందం విశ్లేషించింది.
గతంలో ఇరాన్ అణు కార్యక్రమంతో ముడిపడి ఉన్న ఒక ప్రదేశంతో పాటు క్షిపణుల తయారీ, వైమానిక రక్షణ కోసం ఉపయోగిస్తున్న స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లు నిపుణులు చెబుతున్నారు.


ఇజ్రాయెల్ దాడుల తరువాత శాటిలైట్ చిత్రాలు ఏం చెబుతున్నాయి అంటే... తెహ్రాన్‌కు తూర్పు వైపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్చిన్‌లోని ఒక ప్రధాన ఆయుధ అభివృద్ధి, ఉత్పత్తి కేంద్రం భవనాలు దెబ్బతిన్నాయి.
ఆ స్థావరం రాకెట్లు తయారీకి సంబంధించిందని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్(ఐఐఎస్ఎస్) నిపుణులు అంచనా వేస్తున్నారు.
సెప్టెంబర్ 9 నాటి హై-రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాలతో అక్టోబర్ 27 నాటి చిత్రాలను పోల్చి చూడగా, కనీసం నాలుగు నిర్మాణాలు బాగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
ఈ నిర్మాణాలలో ఒకటి ‘తలేఘన్ 2’. ఇది గతంలో ఇరాన్ అణు కార్యక్రమంతో ముడిపడి ఉందని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) తెలిపింది.
ఈ ప్రాంతంలో 2016లో యురేనియం పార్టికల్స్ ఉపయోగించినట్లు ఆధారాలను ఐఏఈఏ కనుగొంది. తద్వారా, అక్కడ నిషేధిత అణు కార్యకలాపాల గురించి అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో లక్ష్యంగా చేసుకున్న మరో కీలక ప్రదేశం ఖోజిర్. ఇది పార్చిన్‌కు ఉత్తరాన 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.
“ఇరాన్‌లోని బాలిస్టిక్ క్షిపణి సంబంధిత మౌలిక సదుపాయాలు అత్యధికంగా ఉన్న ప్రాంతం ఖోజిర్” అని ఐఐఎస్ఎస్‌కు చెందిన ఫాబియన్ హిన్జ్ చెప్పారు.
ఈ ప్రదేశంలో 2020లో ఒక రహస్య పేలుడు సంభవించింది.
ఈ కాంప్లెక్స్‌లో కనీసం రెండు భవనాలు తీవ్రంగా ధ్వంసమైనట్లు ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి.

ఇజ్రాయెల్ దాడుల అనంతరం తీసిన శాటిలైట్ చిత్రాల ప్రకారం... తెహ్రాన్‌కు తూర్పున 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న షహ్రూద్‌లోని ఒక సైనిక స్థావరం కూడా దెబ్బతింది.
సెమ్నాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ ప్రాంతం చాలా కీలకమైనది. ఎందుకంటే, సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్న ఇరాన్ క్షిపణుల విడిభాగాలు ఇక్కడ తయారవుతాయని ఐఐఎస్ఎస్‌కు చెందిన ఫాబియన్ హిన్జ్ చెప్పారు.
దగ్గరలోనే రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ నియంత్రణలోని షహ్రూద్ అంతరిక్ష కేంద్రం ఉంది. ఇక్కడి నుంచే 2020లో ఇరాన్ ఒక సైనిక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది.

అనేక ప్రాంతాల్లోని ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలపై విజయవంతంగా దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే, అందుబాటులో ఉన్న శాటిలైట్ చిత్రాలతో వాటిని నిర్ధరించడం కష్టం.
మాకు లభించిన ఓ శాటిలైట్ చిత్రాన్ని బట్టి.. అది ధ్వంసమైన ‘రాడార్ వ్యవస్థ’కు సంబంధించిన చిత్రంగా నిపుణులు వివరించారు.
ఇది ఇరాన్‌లోని పశ్చిమ నగరమైన ఇలమ్ సమీపంలో ఉన్న షా నఖ్‌జీర్ పర్వతంపై ఉంది. ఇది కొత్తగా అప్‌డేట్ చేసిన రాడార్ డిఫెన్స్ సిస్టమ్ కావొచ్చని జెరెమీ బిన్నీ చెప్పారు. ఈయన ఒక డిఫెన్స్ ఇంటెలిజెన్స్ కంపెనీకి చెందిన నిపుణులు.
ఈ సైట్‌ను దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేశారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా పునర్నిర్మాణాలు జరిగినట్లు ఉపగ్రహ చిత్రాలను చూసి నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లో ఉన్న అబాదాన్ చమురు శుద్ధి కర్మాగారంలోని ఒక యూనిట్‌కు నష్టం జరిగినట్లు మేము గుర్తించాం. అయితే, ఇది ఎలా దెబ్బతిన్నది అన్నది మాత్రం నిర్ధరించలేకపోయాం.
ఇరాన్ అంతటా కొన్ని ప్రాంతాలలో ఢిపెన్స్ సిస్టమ్స్ మిస్‌ఫైరింగ్ వల్ల కూడా కొంత నష్టం సంభవించే అవకాశం ఉంది.
శనివారం ఉదయం జరిపిన వైమానిక దాడుల్లో తాము లక్ష్యంగా చేసుకున్న ప్రదేశాల్లో అబాదాన్ చమురు శుద్ధి కర్మాగారం ఒకటని ఇజ్రాయెల్ అధికారులు చెప్పినట్లుగా న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
ఖుజెస్తాన్ ప్రావిన్స్‌ను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ అధికారులు శనివారం ధ్రువీకరించారు.
ఇరాన్‌లో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం అబాదాన్ రిఫైనరీ. ఆ కర్మాగారం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రకారం ఇది రోజుకు 5 లక్షల బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేయగలదు.
అయితే, దెబ్బతిన్న నిర్మాణాలను గుర్తించడంలో శాటిలైట్ చిత్రాలతో తుది నిర్ణయానికి రాలేం.
ఉదాహరణకు, ఓ శాటిలైట్ చిత్రం ద్వారా హజ్రత్ అమీర్ బ్రిగేడ్ ఎయిర్ డిఫెన్స్ బేస్ సమీపంలో పొగలు దట్టంగా వస్తున్నట్లు మేము ధ్రువీకరించాం. అంటే, దాడులు జరిగినట్లు మేం అంచనా వేశాం.
కానీ, ఆదివారం నాటి శాటిలైట్ చిత్రాలు చూస్తే ఈ ప్రాంతంలో ఎలాంటి నష్టం జరగలేదని చెప్పడానికి చాలా ఆనవాళ్లు ఉన్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇజ్రాయెల్ మీదికి భారీ సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించిన ఇరాన్, అక్టోబర్‌లో రెండోసారి దాదాపు 200 క్షిపణులతో దాడి చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














