ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఎంతమంది చనిపోయారంటే..

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, మాలు కర్సినో, ఇడో వోక్, ఆండ్రే రోడెన్-పాల్
- హోదా, బీబీసీ న్యూస్
ఇరాన్‌పై ఇజ్రాయెల్ శనివారం తెల్లవారుజామున చేసిన దాడుల్లో నలుగురు సైనికులు మరణించినట్లు ఇరాన్ ఆర్మీ తెలిపింది.
తెహ్రాన్, ఖుజెస్తాన్, ఇలాం ప్రావిన్స్‌లలోని తమ సైనిక స్థావరాలపై దాడులు జరిగాయని ఇరాన్ వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడులను విజయవంతంగా ఎదుర్కొన్నామని ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప నష్టం జరిగిందని తెలిపింది.
ఇరాన్ ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్‌పై చేసిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఈ వైమానిక దాడులు చేసింది.
తెహ్రాన్‌కు, పశ్చిమ ఇరాన్‌కు సమీపంలోని క్షిపణి ఫ్యాక్టరీలతో పాటు, ఇతర సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని శనివారం తెల్లవారుజామున దాడులు జరిపినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది.
తనను తాను రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని ఇరాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. అలాగే, స్థానిక శాంతి, భద్రతల పట్ల తమ బాధ్యతలను గుర్తిస్తున్నట్లు తెలిపింది.
ఈ ప్రకటన రాజీధోరణి మాదిరిగా కనిపిస్తోంది.
అక్టోబర్ 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ సుమారు 200 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఆ దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటుందని చాలామంది అంచనా వేశారు.
జులైలో ఇరాన్ నేలపై జరిగిన హమాస్ రాజకీయ నేత ఇస్మాయిల్ హనియే హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై దాడులు చేసినట్లు తెహ్రాన్ అప్పట్లో చెప్పింది. అప్పుడు చాలా క్షిపణులను ఇజ్రాయెల్, దాని మిత్రదేశాలు అడ్డుకున్నాయి. కొన్ని మాత్రం ఇజ్రాయెల్ భూభాగంలో కొంత ప్రభావం చూపాయి.


ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్ దాడుల తర్వాత, ఇరాన్‌లో ఉన్న పరిస్థితులను ఆ దేశ ప్రభుత్వ మీడియా చూపించింది. పలు నగరాల్లో వాహనాల రాకపోకలు సాధారణంగానే కనిపించాయి. స్కూల్, క్రీడా కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారమే జరిగాయి.
ప్రపంచంలోని ఇతర దేశాల్లాగే ప్రతిస్పందన హక్కు, బాధ్యత ఇజ్రాయెల్‌కు కూడా ఉన్నాయని తమ దాడులను సమర్థించుకుంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చెప్పింది.
"మాకు రక్షణ, ఎదురుదాడి సామర్థ్యాలు చాలా ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశాన్ని, ప్రజలను రక్షించడానికి ఏది అవసరమో అది మేం చేస్తాం’’ అని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి డేనియల్ హగేరి అన్నారు.
ఉద్రిక్తతలను పెంచేందుకు ఇరాన్ మళ్లీ దాడికి దిగితే, తాము ప్రతీకారం తీర్చుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే హెచ్చరించింది.
ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకోవద్దని ఇరాన్‌ను అమెరికా, బ్రిటన్ కోరాయి.
ఇజ్రాయెల్ దాడుల గురించి ముందస్తు సమాచారాన్ని అమెరికాకు అందించిందని, కానీ, ఆ దాడుల్లో తమ ప్రమేయం లేదని వాషింగ్టన్ తెలిపింది.
"ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ప్రత్యక్ష దాడులు ఇంతటితో ముగిసిపోవాలి. లెబనాన్‌లో యుద్ధాన్ని ముగించడంతో పాటు గాజాలో శాంతి నెలకొల్పడానికి, హమాస్ దగ్గర ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయించడానికి కావాల్సిన ప్రయత్నాలు చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది’’ అని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
ఇరాన్‌లోని విద్యుత్, అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేయలేదని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. ఈ లక్ష్యాలపై దాడి చేయవద్దని బైడెన్ కార్యాలయం ఇజ్రాయెల్‌ను కోరింది.
దేశ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఇజ్రాయెల్ దాడులు జరిపిందని, అమెరికా ఆదేశాలతో కాదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యాహు కార్యాలయం పేర్కొంది.
ఇరాన్ దూకుడు ప్రవర్తనకు వ్యతిరేకంగా, తనను తాను రక్షించుకోవాల్సిన హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని యూకే ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్ అన్నారు. ప్రతీకార దాడులకు పాల్పడవద్దని ఇరాన్‌కు సూచించారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారేలా చేసేందుకు బ్రిటన్ కృషి చేస్తుందన్నారు.

ఫొటో సోర్స్, Reuters
తాజా పరిణామాలపై ఖతార్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడిని ప్రమాదకరమైనదిగా జోర్డాన్ అభివర్ణించింది.
ప్రతీకారం తీర్చుకోవాల్సిందిగా ఇరాన్‌ను రెచ్చగొట్టడాన్ని మానేయాలని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా అన్నారు.
శనివారం తెల్లవారుజామున ఇరాన్‌లో కచ్చితమైన లక్ష్యాలపై ఇజ్రాయెల్ చేసిన దాడులకు సంబంధించిన సమాచారం ఇంకా అస్పష్టంగానే ఉంది.
ఇరాన్ ఏవియేషన్ అథారిటీ కొద్దిసేపు పాటు విమానాల రాకపోకలను నిలిపివేసింది. ఆ తర్వాత ఉదయం 9 గంటల (స్థానిక కాలామానం) నుంచి విమానాల రాకపోకలను తిరిగి ప్రారంభించింది.
వైమానిక దాడుల శబ్దాలను విన్నట్లు తెహ్రాన్‌లో పనిచేసే 42 ఏళ్ల ఫ్యాక్టరీ ఉద్యోగి హోమన్ వార్తా సంస్థ ఏఎఫ్‌పీకి చెప్పారు.
‘‘ఇవి చాలా భయకరమైన, ప్రమాదకరమైన శబ్దాలు’’ అని ఆయన తెలిపినట్లు ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.
పశ్చిమాసియాలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం కనిపిస్తోందని, తాము కూడా దీనిలో చిక్కుకుపోతామేమోనని భయమేస్తోందన్నారు.
మధ్య, దక్షిణ సిరియాలో లక్షిత సైట్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిందని సిరియా ప్రభుత్వ మీడియా పేర్కొంది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల తర్వాత, శనివారం మధ్యాహ్నం ఇజ్రాయెల్ సరిహద్దుల్లో 80 క్షిపణులను హిజ్బుల్లా ప్రయోగించిందని ఐడీఎఫ్ తెలిపింది.
ఉత్తర ఇజ్రాయెల్‌లో ఐదు నివాస ప్రాంతాలపై ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా పలు రాకెట్లను ప్రయోగించిందని వార్తా సంస్థ ఏఎఫ్‌పీ కూడా రిపోర్టు చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














