లెబనాన్‌ను ఎవరు పాలిస్తున్నారు? హిజ్బుల్లాకు ఉన్న శక్తి సామర్థ్యాలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జెరెమీ హోవెల్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
లెబనాన్ గత రెండు వారాలుగా ఇజ్రాయెల్ నుంచి తీవ్రమైన మిస్సైళ్ల దాడులను ఎదుర్కొంటోంది. ఈ దాడుల్లో 1,000 మందికి పైగా ప్రజలు మరణించారు. ఇజ్రాయెల్ బలగాలు భూతల దాడులను కూడా ప్రారంభించాయి.
ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య జరుగుతున్న ఘర్షణలే దీనికంతటికీ కారణం.
లెబనాన్‌లో హిజ్బుల్లా ఒక రాజకీయ పార్టీ, మిలీషియా కూడా.
లెబనాన్‌లో ప్రభుత్వ ఆర్మీ కంటే హిజ్బుల్లా మిలీషియా చాలా శక్తిమంతమైనది. దేశీయంగా షియా ముస్లింల నుంచి ఈ సంస్థకు మంచి మద్దతు ఉంది.
ఇది లెబనాన్ అధికారిక సంస్థ కాదు. అయితే, గత నాలుగు దశాబ్దాల కాలంలో ఆ దేశంలో ఇదొక ఆధిపత్య శక్తిగా మారింది.


ఫొటో సోర్స్, Getty Images
లెబనాన్‌ను ఎవరు పాలిస్తున్నారు?
లెబనాన్‌లో రాజకీయ అధికారం వివిధ మతాల మధ్య విభజించి ఉంటుంది.
ఫ్రాన్స్ నుంచి లెబనాన్ స్వాతంత్య్రం పొందినప్పుడు 1943లో ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం, అధ్యక్షుడు మారోనైట్ వర్గానికి చెందిన క్రిస్టియన్ అయి ఉండాలి. అలాగే ప్రధానమంత్రి సున్నీ ముస్లిం, పార్లమెంట్ స్పీకర్ షియా ముస్లిం అయి ఉండాలి.
ఆ సమయంలో లెబనాన్‌లో ఉన్న వివిధ మత సముదాయాల పరిమాణానికి అనుగుణంగా ఈ పదవులను కేటాయించారు. అప్పుడు, సున్నీ, షియా ముస్లింలను మించి ఆ దేశ జనాభాలో సగానికి పైగా క్రిస్టియన్లు ఉండేవారు.
క్రిస్టియన్లు, సున్నీ ముస్లింలు, షియా ముస్లింలు ప్రస్తుత జనాభాలో ఒక్కో వర్గం 30 శాతానికి పైగా చేరుకోవడంతో ఈ ఒప్పందం గడువు తీరిపోయిందని చాలా మంది చెబుతున్నారు.
ఒప్పందం ద్వారా, పార్లమెంట్‌లో క్రిస్టియన్లకు, ముస్లింలకు సమాన సంఖ్యలో సీట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు జనాభాలో మెజార్టీ ముస్లింలు ఉన్నారు.
లెబనాన్‌లో మొత్తం అధికారం ఇప్పుడు ఏ ఒక్క పార్టీ లేదా మత సముదాయం చేతుల్లోనో లేదు.
పార్లమెంటరీ కూటముల ద్వారా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అన్ని కీలకమైన నిర్ణయాలు కూడా కూటముల అంగీకారంతోనే తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల కొన్నిసార్లు రాజకీయ ప్రతిష్టంభన నెలకొంటోంది.

లెబనాన్‌లో హిజ్బుల్లా స్టేటస్ ఏంటి?
లెబనాన్ అంతర్యుద్ధం సమయంలో 1982లో షియా ముస్లిం మిలీషియాగా హిజ్బుల్లా ఏర్పాటైంది. ఆ ఏడాది దక్షిణ లెబనాన్‌ను ఆక్రమించిన ఇజ్రాయెల్ దళాల చర్యలను వ్యతిరేకిస్తూ ఈ మిలీషియా ఏర్పడింది.
హిజ్బుల్లాకు ఇరాన్ భారీ ఎత్తున నిధులు, ఆయుధాలను సమకూరుస్తోంది. హిజ్బుల్లా అంటే అరబిక్‌లో ‘ది పార్టీ ఆఫ్ గాడ్’ అని అర్థం.
హిజ్బుల్లా తన ఉనికిని 1985లో అధికారికంగా ప్రకటించింది. ఇరాన్‌లో మాదిరిగా లెబనాన్‌లో ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. దక్షిణ లెబనాన్, పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెల్ ఆక్రమణలను అంతం చేస్తామని ప్రతిన బూనింది.
2009లో హిజ్బుల్లా విడుదల చేసిన తన మేనిఫెస్టోలో ఇస్లామిక్ రాజ్యాన్ని నెలకొల్పుతామనే ప్రస్తావన లేనప్పటికీ, ఇజ్రాయెల్ పట్ల తన వ్యతిరేకతను కొనసాగించింది.
1990లో లెబనాన్ అంతర్యుద్ధం ముగిసినప్పుడు, ఆ యుద్ధంలో పాల్గొన్న మిగతా అన్ని వర్గాలూ తమ మిలీషియాలను రద్దు చేశాయి. హిజ్బుల్లా మాత్రం అలానే ఉంది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ ఆక్రమణలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉందని హిజ్బుల్లా అప్పుడు ప్రకటించింది.
2000 సంవత్సరంలో లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ తన బలగాలను ఉపసంహరించుకున్నప్పుడు, తామే వారిని తరిమి కొట్టామని హిజ్బుల్లా చెప్పుకుంది. అది తమ గెలుపుగా అభివర్ణించింది.

ఫొటో సోర్స్, EPA
లెబనాన్‌లో హిజ్బుల్లా శక్తిమంతమైన సంస్థగా ఎలా ఎదిగింది?
లెబనాన్‌లోని షియా ముస్లింల నుంచి రాజకీయంగా హిజ్బుల్లాకు విస్తృతమైన మద్దతు లభిస్తోంది.
1992లో హిజ్బుల్లా తన సభ్యులను పార్లమెంట్‌కు పంపడం ప్రారంభించింది.
ప్రస్తుతం దీనికి పలువురు ఎంపీలున్నారు. ప్రభుత్వంలో హిజ్బుల్లా మంత్రులు ఉన్నారు.
లెబనాన్‌లో షియా కమ్యూనిటీలు ఎక్కువగా ఉన్నప్రాంతాల్లో హిజ్బుల్లా విద్య, వైద్య, సామాజిక సేవలను అందిస్తోంది.
లెబనాన్‌లో ఇతర పార్టీలు కూడా తమ నియోజకవర్గాల్లో ఇలాంటి సేవలను అందిస్తున్నాయి. కానీ, హిజ్బుల్లాకు అన్నింటికంటే పెద్ద నెట్‌వర్క్ ఉంది.
తన దగ్గర 1,00,000 మంది ఫైటర్లు ఉన్నారని హిజ్బుల్లా చెబుతోంది. కానీ, వాస్తవ అంచనాల ప్రకారం ఈ సంఖ్య 20,000 - 50,000 ఉండవచ్చని తెలుస్తోంది.
అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అనే మేధోమథన సంస్థ ప్రకారం, హిజ్బుల్లా దగ్గర 1,20,000 నుంచి 2,00,000 రాకెట్లు, క్షిపణులు ఉన్నాయని అంచనా.

ప్రపంచంలో అత్యంత బలమైన ప్రభుత్వేతర సైన్యాల్లో ఒకటి హిజ్బుల్లా మిలీషియా. లెబనాన్ సైన్యంతో పోలిస్తే శక్తిమంతమైనదిగా దీన్ని పరిగణిస్తారు.
లెబనాన్ దేశ ప్రభుత్వ బలహీనతల నుంచి ఇది లబ్ది పొందుతోంది. ఉదాహరణకు, ఈ దేశంలో 2022 నుంచి అధ్యక్షులు లేరు. ఎందుకంటే, ఎవరు అధ్యక్షులుగా ఉండాలనే విషయంపై రాజకీయ పార్టీలు ఒక అంగీకారానికి రావడం లేదు.
హిజ్బుల్లా తన సొంత విధానాలను అమలు చేయకుండా అడ్డుకునేందుకు అక్కడి కేంద్ర ప్రభుత్వానికి తగినంత బలం లేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














