లెబనాన్: ‘‘భయంగా ఉంది, ఏం చేయాలో తెలియడం లేదు’’

మహిళను ఓదార్చుతున్న మరో మహిళ

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,
    • రచయిత, ఓర్లా గ్యురిన్, నఫీసేహ్ కోహ్నావార్డ్, కారిన్ టోర్బే
    • హోదా, బీబీసీ న్యూస్

హిజ్బుల్లా గ్రూపు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భారీ స్థాయిలో వైమానిక దాడులకు దిగడంతో దక్షిణ లెబనాన్ ప్రాంతంలోని ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు.

కార్లు, ట్రక్కులు, మోటారుసైకిళ్ళపై ప్రజలు ఉత్తర లెబనాన్‌కు వెళ్లిపోతున్నారు.

ఇరాన్ మద్దతు కలిగిన హిజ్బుల్లా గ్రూపు స్థావరాలున్న సమీప ప్రాంతాలను విడిచి వెళ్లాలంటూ ఇజ్రాయెల్ సైన్యం నుంచి సంక్షిప్త సందేశాలు, వాయిస్ రికార్డింగ్ హెచ్చరికలు అందాయని కొంతమంది స్థానికులు తెలిపారు.

బాంబు దాడులు తీవ్రంగా ఉన్నాయని నబాటిహ్ పట్టణానికి చెందిన జహ్రా సావ్లి అనే విద్యార్థి ‘బీబీసీ న్యూస్‌అవర్‌’తో చెప్పారు.

‘‘బాంబుల మోతతో ఉదయం 6 గంటలకు నిద్రలేచాను. మధ్యాహ్నానికి దాడులు తీవ్రమయ్యాయి. మా ప్రాంతంలో అనేక దాడులను చూశాను. అద్దాలు పగిలిన శబ్దాలు అనేకం విన్నాను’’ అని ఆమె వివరించారు.

అయితే, మిగిలినవారిలాగా ఆమె, ఆమె కుటుంబం ఇల్లు వదిలి వెళ్లిపోవడానికి ధైర్యం చేయలేకపోయారు.

‘‘మేం ఎక్కడికి వెళ్ళాలి? చాలామంది ప్రజలు వీధుల్లోనే చిక్కుకుపోయారు. ఇతర ప్రాంతాలకు తరలిపోయేవారితో రోడ్లన్నీ రద్దీగా మారాయి. దాంతో, నా స్నేహితులు చాలామంది ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోయారు’’ అని జహ్రా చెప్పారు.

ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు ఒకే ద్విచక్ర వాహనంపై బేరూత్‌కు చేరుకున్నారు. వారితో బీబీసీ మాట్లాడింది.

దక్షిణ లెబనాన్ ప్రాంతంలోని ఓ గ్రామం నుంచి వారు ఉత్తరాన ఉన్న ట్రిపోలి వైపు వెళుతున్నారు. వారు బాగా అలసిపోయారు.

‘‘మేం వెళ్ళిపోతున్నాం’’ అని ఆ కుటుంబ పెద్ద చెప్పారు.

సోమవారం నుంచి ఇజ్రాయెల్ చేస్తున్న బాంబు దాడుల్లో 550 మందికి పైగా మరణించారని, 1,800 మందికిపైగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. మృతుల్లో 50 మంది చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొంది.

హిజ్బుల్లా సీనియర్ కమాండర్‌ను లక్ష్యంగా చేసుకుని దక్షిణ బేరూత్‌లో జరిపిన వైమానిక దాడి సహా గడిచిన 24 గంటలలో మొత్తం 1100 దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మోటారుసైకిల్‌పై కుటుంబం

ఫొటో సోర్స్, Hassan Harfoush

ఫొటో క్యాప్షన్, ఇల్లు వదిలి వెళ్లిపోతున్న కుటుంబం

‘మాపై యుద్ధాన్ని రుద్దుతున్నారు’

తన భార్యతో కలిసి బేరూత్‌కు వెళ్లే దారిలో ఉన్న మొహమ్మద్ అనే పాలస్తీనీయునితో బీబీసీ మాట్లాడింది.

మీరు రాజధానిలో ఉంటారా? అని అడిగినప్పుడు, "లెబనాన్‌లో ఎక్కడా సురక్షితం కాదు, ప్రతిచోటా బాంబులు వేస్తామని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్ళాలి? భయంగా ఉంది, ఏం చేయాలో తెలియడం లేదు’’ అని ఆయన చెప్పారు.

ఇంతలో రోడ్డుకు ఒకవైపుగా ఉన్న బీబీసీ సిబ్బందిని ఇంధన సంక్షోభం గురించి తెలుసా? అని ఓ ట్యాక్సీ డ్రైవర్ అడిగారు. బేరూత్‌కు చాలా మంది వస్తున్నారని చెప్పారు.

దక్షిణాది నుంచి వచ్చే నిర్వాసితుల కోసం బేరూత్, ట్రిపోలితో పాటు తూర్పు లెబనాన్‌లోని పాఠశాలలను ఆశ్రయాలుగా మార్చారు.

బేరూత్‌ అంతటా ఆందోళన నెలకొంది. కొంతమంది బేరూత్ నగరవాసులు కూడా తమ ఇళ్లను వీడి వెళ్లిపోతున్నారు.

ఈశాన్య లెబనాన్‌లో హిజ్బుల్లాకు బాగా పట్టున్న బెకా లోయ నుంచి వచ్చే ప్రజల కోసం పశ్చిమ బేరూత్‌లోని బిర్‌ హసన్‌లో ఒక ప్రభుత్వ పాఠశాలను బీబీసీ పరిశీలించింది.

బడిలోని తరగతి గదులన్నీ పరుపులతో నిండిపోయాయని అక్కడివారు చెప్పారు.

మరోవైపు ఆస్పత్రులలో అత్యవసరం కాని శస్త్ర చికిత్సలన్నింటినీ రద్దు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

బేరూత్‌లోని ఉద్రిక్తతలు, అనిశ్చితి వాతావరణం నడుమ కొంతమంది ధైర్యంగా కనిపించారు.

‘‘పూర్తిస్థాయి యుద్ధం మొదలైతే లెబనాన్ ప్రజలుగా మా రాజకీయ అభిప్రాయాలకు అతీతంగా అంతిమంగా మేం ఏకతాటిపై నిలబడతాం. మా దేశంపై బాంబులు పడుతున్నాయి’’ అని ఓ పౌరుడు బీబీసీతో చెప్పారు.

‘‘వారు యుద్ధాన్ని కోరుకుంటే మేమేం చేయాలి? మా పైన యుద్ధాన్ని రుద్దుతున్నారు. మేం ఏమీ చేయలేం’’ అని మొహమ్మద్ సిబాయ్ అనే ఓ దుకాణ యజమాని వార్తా సంస్థ రాయ్‌టర్స్‌తో చెప్పారు.

లెబనాన్ రాజధానిలోని హిజ్బుల్లా ప్రధాన స్థావరం అయిన దక్షిణ బేరూత్ శివారు దహియెహుకు చెందిన 57 ఏళ్ల మహ్మద్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ఇదంతా సాధారణమే. 1975 నుంచి నేను అన్ని యుద్ధాల నుంచీ బయటపడ్డాను. నేను ఎక్కడికీ వెళ్లను. ఇంట్లోనే ఉంటాను’’ అని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)