ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ 'మొసాద్' చేసిన 5 డేంజరస్ ఆపరేషన్స్ ఇవే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నితిన్ శ్రీవాత్సవ
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
2023 జూన్ 18న కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రే పట్టణంలో సిక్కు నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యారు.
ఈ హత్య వెనక భారత ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. భారత్ ఆ ఆరోపణలు కొట్టిపారేసింది. అలా భారత్, కెనడాల మధ్య మొదలైన వివాదం కొనసాగుతూనే ఉంది.
అయితే, చాలా దేశాల సీక్రెట్ ఏజెన్సీలు విదేశాల్లో నిఘా ఆపరేషన్లు నిర్వహించడం కొత్తేమీకాదు.
సీక్రెట్ ఆపరేషన్లకు సంబంధించి చాలా దేశాలపై ఆరోపణలు ఉన్నాయి. తమ దేశ రక్షణ కోసం సీక్రెట్ ఏజెంట్లు విదేశాల్లో ఉన్న శత్రువులను చంపడానికి కూడా వెనుకాడరు.
అమెరికా, చైనా, రష్యా, ఇజ్రాయెల్, బ్రిటల్ వంటి దేశాలపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి.
భారత్, పాకిస్తాన్‌లు చాలాసార్లు పరస్పరం సీక్రెట్ ఆపరేషన్‌ల గురించి ఆరోపణలు చేసుకున్నాయి.
నిఘా సంస్థల పేరు ఎప్పుడు చర్చల్లోకి వచ్చినా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన మొసాద్ సంస్థ గురించి ప్రస్తావన తప్పకుండా వస్తుంది.
జేమ్స్‌బాండ్ సినిమాలో లాగానే ఈ సంస్థ సీక్రెట్ ఏజెంట్లు విదేశాల్లో ప్రమాదకరమైన ఆపరేషన్‌లు నిర్వహిస్తుంటారు.
ఇజ్రాయెల్‌కు చెందిన గూఢచర్య సంస్థ 'మొసాద్' నిర్వహించిన ఆపరేషన్లలో ప్రధానమైనవిగా చెప్పుకునే తొలి ఐదు ఆపరేషన్‌ల గురించి చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
ఆపరేషన్ ఫినాలే 1960
ఇజ్రాయెల్ సంస్థ మొసాద్ చేపట్టిన ఆపరేషన్లలో ఇదే ప్రధానమైనదని చెబుతారు. 1933 నుంచి 1945 మధ్య కాలంలో జర్మనీ నియంత హిట్లర్ ఆధ్వర్యంలో యూదులపై సాగించిన మారణహోమంలో సుమారు 40 లక్షల మందికి పైగా యూదులు చనిపోయారని అంచనా.
హోలోకాస్ట్‌గా పిలిచే ఈ మారణహోమంలో జర్మనీ లెఫ్ట్‌నెంట్ కల్నల్ అడాల్ఫ్ ఈచ్‌మెన్ కీలకంగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ దారుణాలు జరిగాయి.
జర్మనీ సరిహద్దుల్లో ఉన్న దేశాల నుంచి యూదులను పట్టుకొచ్చి కాన్సన్‌ట్రేషన్ క్యాంపుల్లో ఉంచి, దారుణంగా హత్యలు చేశారు.
రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమి తర్వాత ఈచ్‌మెన్‌ను పట్టుకోవాలని ప్రయత్నించారు. మూడు సార్లు దొరికినట్లే దొరికి ఆయన తప్పించుకున్నారు.
అప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రతీకారం కోసం ప్రయత్నిస్తూనే ఉంది.
1957లో జర్మనీకి చెందిన యూదుడు, పశ్చిమ జర్మనీ చీఫ్ ప్రాసిక్యూటర్ అయిన ఫ్రిట్జ్ బౌర్ ఈచ్‌మెన్ బతికే ఉన్నారని, అర్జెంటినాలోని రహస్య స్థావరంలో తలదాచుకుంటున్నారని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్‌కు సమాచారం ఇచ్చారు.
ఈ రహస్యం కూడా అర్జెంటీనాలో ఉండే యూదు వ్యక్తి కుమార్తె, ఈచ్‌మెన్ కుమారుడితో అఫైర్ పెట్టుకున్న సందర్భంలోనే బయటపడింది.
మొదట మొసాద్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. స్వయంగా నిఘా పెట్టాక సమాచారం నిజమే అని నిర్థారించుకుంది.
‘ది కాప్చర్ అండ్ ట్రయల్ ఆఫ్ అడాల్ఫ్ ఈచ్‌మన్’ పుస్తకం రచించిన ఛార్లెస్ రివర్స్ ఈ ఆపరేషన్ గురించి ప్రస్తావించారు.
''ఈచ్‌మెన్ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉండి ఉండొచ్చు కానీ, నాజీల ప్రభుత్వంలో అతడి స్థాయి చాలా పెరిగింది. ఒకానొక సమయంలో జనరల్ స్థానానికి సమానంగా ఎదిగారు. ఈ సమయంలో నేరుగా హిట్లర్ ప్రధాన బృందానికే రిపోర్ట్ చేసేవారు’’ అని పేర్కొన్నారు.
అర్జెంటినాలో ఈచ్‌మెన్ నివసిస్తున్నారన్న సమాచారం నిర్థరణ అయిన వెంటనే మొసాద్ సంస్థ ఆపరేషన్ మొదలుపెట్టింది.
రఫీ ఐతన్ కమాండర్‌గా కొంతమంది ఏజెంట్లు నియమితులయ్యారు. ఈచ్‌మెన్‌ను బంధించి ప్రాణాలతో దేశానికి తీసుకురావడం వారి బాధ్యత.
ఇందుకోసం బ్యూనస్ ఎయిర్స్‌కు చేరుకున్న బృందం 'క్యాసిల్' అన్న కోడ్ పేరుతో పిలుచుకునే ఇంటిని అద్దెకు తీసుకుంది. అదే సమయంలో అర్జెంటీనా 150వ స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్నాయి.
ఈ వేడుకలకు ఇజ్రాయెల్ విద్యాశాఖ మంత్రి అబ్బా ఇబాన్‌కు కూడా ఆహ్వానం అందింది. ఆయన ప్రయాణించేందుకు ప్రత్యేక విమానం ‘విస్పరింగ్ జెయింట్’ను కేటాయించారు.
ఈచ్‌మెన్‌ను కిడ్నాప్ చేసి అదే విమానంలో మంత్రికి తెలియకుండా ఇజ్రాయెల్‌కు తీసుకువెళ్లాలని వ్యూహం రచించారు.
ఈచ్‌మెన్ రోజూ సాయంత్రం 7.40 గంటలకు 203 నంబరు గల బస్సు నుంచి దిగి, నడుచుకుంటూ తన ఇంటికి వెళతారు. ఈ సమయంలోనే ఆయన్ను కిడ్నాప్ చేయాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే కిడ్నాప్ చేశారు.
మే 20వ తేదీన మంత్రి విమానంలోనే ఈచ్‌మెన్ ఐడెంటిటీ మార్చి జిక్రోనీ అన్న పేరుతో దేశానికి తీసుకుని వెళ్లారు.
అతడిని ఇజ్రాయెల్‌కు తీసుకువెళ్లిన రెండు రోజుల తర్వాత ఈ వార్త ప్రపంచానికి తెలిసింది.
15 కేసుల్లో ఈచ్‌మెన్‌ను దోషిగా నిర్థరించి, మరణశిక్ష విధించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్
1972లో జర్మనీలో మ్యూనిక్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి.
సెప్టెంబర్ 5వ తేదీన ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వచ్చిన ఇజ్రాయెల్ అథ్లెట్లు మ్యూనిక్‌లో తమకు కేటాయించిన అపార్ట్‌మెంట్‌లో నిద్రిస్తున్నారు. ఆ రాత్రి అపార్ట్‌మెంట్ మొత్తం మిషన్ గన్‌ల శబ్దంతో నిండిపోయింది.
పాలస్తీనా ‘బ్లాక్ సెప్టెంబర్ లిబరేషన్ ఆర్గజైనేషన్’కు చెందిన ఎనిమిది మంది పాలస్తీనీయులు ఇజ్రాయెల్ ఆటగాళ్ల వేషధారణలో ఆ అపార్ట్‌మెంట్‌లోకి జొరబడి 11 మంది ఇజ్రాయెల్ ఆటగాళ్లని చంపేశారు.
ఈ ఘటన జరిగిన 10 రోజుల తరువాత సిరియా, లెబనాన్‌లలోని 10 పీఎల్ఓ శిబిరాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి చేసి ధ్వంసం చేసింది.
కొన్నేళ్ల తర్వాత ఇజ్రాయెల్ పార్లమెంటరీ కమిటీ ఈ దాడికి ప్రణాళికలు రచించినట్లుగా తెలిపింది.
సిమన్ రీవ్ రాసిన 'వన్ డే ఇన్ సెప్టెంబర్' పుస్తకంలో ఈ ఆపరేషన్ కోసం ఇజ్రాయెల్ ఎలా ప్రణాళికలు రచించినదీ ప్రస్తావించారు.
16 అక్టోబర్ 1972లో మొసాద్ ఏజెంట్లు పీఎల్ఓ ఇటలీ రిప్రజెంటేటివ్ అబ్డెల్-వెయిల్ జవైటర్‌ను రోమ్‌లోని తన నివాసంలోనే హత్య చేశారు అని పుస్తకంలో పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ ప్రతీకారానికి ఇది మొదటి అడుగుగా చెప్పారు. ఆ తరువాత 9 ఏప్రిల్ 1973లో బేరూత్‌లో మొసాద్ జాయింట్ ఆపరేషన్ ప్రారంభించింది.
మొసాద్ ఏజెంట్లు, ఇజ్రాయెల్ కమాండోలు కలిసి రాత్రి సమయంలో లెబనాన్ బీచ్‌కు మిస్సైల్, పెట్రోలింగ్ బోట్స్‌లో చేరుకున్నట్లు రాశారు.
మరుసటి రోజు మధ్యాహ్నం 'బ్లాక్ సెప్టెంబర్ లిబరేషన్ ఆర్గనైజేషన్'ను నడిపించిన ఫతా ఇంటెలిజెన్స్ విభాగం హెడ్ అయిన ముహమ్మద్ యూసఫ్/ అబు యూసఫ్, అతడితోపాటు పీఎల్ఓ అధికార ప్రతినిధి కమల్ నజీర్‌లు విగతజీవులుగా కనిపించినట్లు పేర్కొన్నారు.
ఇవే కాక తరువాతి ఐదేళ్లూ ఇజ్రాయెల్ తన ఆపరేషన్లు కొనసాగించిందని నిపుణులు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆపరేషన్ సిరియా
1960ల సమయంలో సిరియా, ఇజ్రాయెల్ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దు ప్రాంతాన ఉన్న ప్రజలకు సిరియా ఆర్మీ నుంచి బెదిరింపులు రావడంతో వారు భయపడిపోయారు. ఈ ప్రభావం ఇజ్రాయెల్‌లో అనిశ్చితిని పెంచింది.
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా సిరియా రచిస్తోన్న ప్రణాళికలు, ఆ దేశంలో పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, సైనిక కదలికలు తెలుసుకోవడానికి ఒక ఏజెంట్ అవసరం ఏర్పడింది. ఈ పని పూర్తి చేసేందుకు ఎలీ కోహెన్ నియమితులయ్యారు.
ఈయన ఈజిప్టులో జన్మించారు. ఎలీ కోహెన్ తల్లిదండ్రులు సిరియాలోని యూదుల సంతతికి చెందినవారు. ఎలీ గతంలో రెండుసార్లు సంస్థలో చేరడానికి ప్రయత్నించారు కానీ విఫలం అయ్యారు.
అయితే, 1960లో మొసాద్ సంస్థ ఎలీ కోహెన్‌ను గూఢచారిగా నియమించుకుని, శిక్షణ ఇచ్చింది. సిరియా వెళ్లి గూఢచారిగా పనిచేసేందుకు సిద్ధం చేసింది. శిక్షణ అనంతరం ఎలీ కోహెన్ అర్జెంటీనాకు వెళ్లి తన ఐడెంటిటీ మార్చుకున్నారు. సిరియా తల్లిదండ్రులకు జన్మించినట్లు, విజయవంతమైన వ్యాపారవేత్తగా అక్కడ మెదిలారు. అక్కడే సిరియన్ ఇమ్మిగ్రెంట్స్ గ్రూపులతో కలసి పనిచేయడం మొదలుపెట్టారు.
సిరియాలోని రాజకీయ నాయకులు, సీనియర్ మిలటరీ అధికారులు, దౌత్యవేత్తలు ఇలా అందరితోనూ పరిచయాలు పెంచుకున్నారు. ఆ తరువాత సిరియా అధ్యక్షుడిగా ఎదిగిన వ్యక్తితో కూడా స్నేహం చేశారు.
1962లో సిరియాలో ప్రభుత్వం మారింది. బాత్ పార్టీ అధికారం చేపట్టింది. ఈ అవకాశం కోసమే కోహెన్ ఎదురుచూశాడు. అధికారుల నమ్మకాన్ని పొందారు.
1964లో సిరియా ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు నీటి సరఫరా అందించే జోర్డాన్ నది దగ్గర పెద్ద కాలువను నిర్మించాలని చూస్తోందన్న సమాచారం మొసాద్ సంస్థకు చేరవేశారు.
మొసాద్ ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడంతో, ప్రభుత్వం వెంటనే స్పందించి నీటిని మళ్లించే ప్రణాళికలు అమలు చేసి, సిరియా వ్యూహాన్ని దెబ్బతీసింది.
మరోసారి సిరియా ముఖ్యమైన మిలిటరీ అధికారులతో కలిసి సిరియా-ఇజ్రాయెల్ సరిహద్దు దగ్గర ఉన్న క్యాంప్‌కు వెళ్లారు. అక్కడి సైనికులు, ఆయుధాలు, సైనిక వ్యూహాలు అన్నింటిని తెలుసుకుని, ఆ నిఘా సమాచారం అంతా మొసాద్‌కు చేరవేశారు ఎలీ.
దేశ రహస్యాలు శత్రుదేశానికి చేరడం సిరియాకు తలనొప్పిగా మారింది. ఎవరో సమాచారాన్ని చేరవేస్తున్నారని పసిగట్టి, వారిని పట్టుకునేందుకు సోవియట్ యూనియన్ సాయం తీసుకుంది.
1965లో ఎలీ నిఘా రహస్యాన్ని ఇజ్రాయెల్‌కు పంపుతున్న సమయంలో అధికారులకు దొరికిపోయారు.
కోహెన్‌ను సిరియా రాజధాని డమాస్కస్‌లో బహిరంగంగా ఉరి తీశారు. అయితే కోహెన్ గొప్ప దేశభక్తుడిగా ఇజ్రాయెల్ కీర్తించింది.

ఫొటో సోర్స్, Getty Images
మిషన్ ఇరాన్
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఎప్పుడూ ఘర్షణ వాతావరణమే కనిపించేది. ముఖ్యంగా ఇరాన్ చేపట్టిన న్యూక్లియర్ ప్రయోగాలపై ఇజ్రాయెల్ దృష్టి సారించింది.
2012లో ప్రచురితమైన ‘మొసాద్:ది గ్రేటెస్ట్ మిషన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ సీక్రెట్ సర్వీస్’ పుస్తకంలో మొసాద్ నిఘా వ్యవస్థ గురించే కాకుండా, జేమ్స్ బాండ్ సినిమాల తరహాలో వారు చేపట్టిన ప్రమాదకరమైన ఆపరేషన్ల గురించి కూడా ప్రస్తావించారు పుస్తక రచయితలు మైకెల్ బార్ జోహర్, నిస్సిం మిషల్‌లు.
పుస్తకంలో ప్రచురించిన కథనం ప్రకారం, ఇరాన్ న్యూక్లియర్ ప్రయోగాలను ఆపేందుకు సెంట్రిఫ్యూజ్‌లను నాశనం చేయాలని మొసాద్ నిర్ణయించుకుంది. అందుకోసం ఈస్ట్రన్ యూరోపియన్ ఫ్రంట్ కంపెనీలను ప్రారంభించి, ఇరాన్‌కు నాణ్యతలేని ఇన్సులేషన్‌ను విక్రయించింది. దీని వలన ప్లాంట్‌లోని సెంట్రిఫ్యూజ్‌లు పనికిరాకుండా పోయాయి. ఇరాన్ ప్రయోగాలపై దెబ్బ పడింది.
ఇదే పుస్తకంలో 2010లో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అడ్వైజర్ హత్యకు గురయ్యారని పేర్కొంది. అతడి కార్ సమీపంలో పార్క్ చేసిన మోటర్ సైకిల్‌లో పేలుడు పదార్థం అమర్చడం వలన, విస్ఫోటనం జరిగి చనిపోయనట్లు పేర్కొంది.
2011లో ఇరాన్ న్యూక్లియర్ ప్రాజెక్ట్ హెడ్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో పక్కనే వచ్చిన మోటర్ సైకిలిస్ట్ ఒక చిన్న పరికరాన్ని కారుకు అమర్చి, వేగంగా వెళ్లిపోయారని, కొన్ని క్షణాలకు ఆ పరికరం వలన కారు పేలి సైంటిస్ట్ మరణించినట్లుగా న్యూయార్క్ టైమ్స్ న్యూస్‌పేపర్ వార్త ప్రచురించింది.
2021లో ఇరాన్ న్యూక్లియర్ సైట్‌లో భారీ పేలుడు సంభవించి, యురేనియాన్ని వృద్ధి చేసే సెంట్రిఫ్యూజ్‌లు దెబ్బతిన్నాయి. ఇది మొసాద్ పనేనని నిపుణులు అభిప్రాయపడ్డారు. కానీ మొసాద్ మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ఫొటో సోర్స్, Getty Images
‘హమాస్’ ప్రతీకారం
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ ‘హమాస్’ మొసాద్ సంస్థపై ఆరోపణలు చేస్తూనే ఉంది.
2016లో ట్యూనిసియాలో ఉంటోన్న హమాస్ కమాండర్ ముహమ్మద్ అల్ జ్వారీని తన ఇంటి దగ్గరే కదులుతున్న కారులో నుంచి బుల్లెట్ల వర్షం కురిపించి హతమార్చారు కొంతమంది దుండగులు.
ఈ కమాండర్ ఎరోనాటికల్ ఇంజినీర్. ఇతను హెజ్‌బోల్హా మిలిటెంట్ గ్రూప్ కోసం డ్రోన్‌లను ప్రత్యేకంగా రూపొందించాడని వార్తలు ఉన్నాయి. అంతేకాకుండా సముద్రంలో పడవలను ధ్వంసం చేసే మానవరహిత షిప్‌ను కూడా రూపొందించాడనే నిర్థరణ లేని వార్తలు కూడా ఉన్నాయి.
అయితే, ముహమ్మద్‌ను చంపినవారు ఎవరనేది తెలీయలేదు. వారు వాడిన కార్,. వినియోగించిన సెల్‌ఫోన్ వేరే వ్యక్తి పేరుమీద ఉన్నట్లు తేలింది.
ఏడాది పాటు జరిగిన దర్యాప్తు అనంతరం ఈ పని చేసింది మొసాద్ అని హమాస్ ఆరోపించింది. కానీ మొసాద్ సంస్థ మాత్రం స్పందించలేదు.
అయితే, మొసాద్ దాడులు చేసేవారిని మాత్రమే కాక, వారికి మద్దతుగా ఉన్న వ్యవస్థలను కూడా నాశనం చేస్తుందని హమాస్ నిపుణులు ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
- కేసీఆర్‌ను ఓడించిన ఒకే ఒక్కడు
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













