‘కెనడాకు హీరో’ అంటూ హిట్లర్ సైన్యంలో పనిచేసిన వ్యక్తికి ప్రశంస.. నిజం తెలిసి నాలుక కరచుకున్న స్పీకర్

ఫొటో సోర్స్, Getty Images
కెనడా పార్లమెంట్ మరోసారి వార్తల్లో నిలిచింది. తమ దేశంలోని సిక్కునేత హత్యలో భారతదేశపు పాత్ర ఉందంటూ హౌస్ ఆఫ్ కామన్స్ ఆ దేశ ప్రధాని ట్రూడో వివాదాస్పద విమర్శలు చేశారు.
అయితే, ఈసారి మరో విషయంలో కెనడా పార్లమెంటు వార్తల్లోకెక్కింది. పార్లమెంటులో జరిగిన సంఘటనకు స్పీకర్ క్షమాపణ కూడా చెప్పారు.
సెప్టెంబర్ 22న యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కెనడా పార్లమెంట్‌లో ప్రసంగించారు.
ఆయన ప్రసంగం తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో రష్యాపై పోరాడిన 98 ఏళ్ల యారోస్లావ్ హుంకాకి గౌరవవందనం చేశారు.
కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో స్పీకర్ సహా ఎంపీలందరూ హుంకా గౌరవార్థం లేచి నిల్చున్నారు. ఆ సమయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఉన్నారు.
హుంకా యుద్ధవీరుడని స్పీకర్ ఆంథోని రోటా ప్రశంసించారు. ఆయన యుక్రెయిన్ మొదటి డివిజన్‌కి చెందిన వారని చెప్పారు.
ఆ తర్వాత హుంకా గురించి మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆయన హిట్లర్ సైన్యంలో పనిచేశారని, నాజీల తరఫున రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారని తెలిసింది.
దీంతో హుంకాను గౌరవించినందుకు స్పీకర్ రోటా క్షమాపణలు చెప్పారు.

ఫొటో సోర్స్, ALAMY/CANADIAN PRESS
స్పీకర్ ఏమన్నారు?
''యుక్రెయిన్ అధ్యక్షుడి ప్రసంగం తర్వాత, గ్యాలరీలో ఒక వ్యక్తిని చూశాను. ఆయనను గౌరవించాను. ఆ తర్వాత ఆయన గురించి మరింత సమాచారం తెలిసింది. నా నిర్ణయంపై విచారం వ్యక్తం చేస్తున్నాను'' అని రోటా చెప్పారు.
రోటా ఉండే ప్రాంతంలోనే హుంకా నివసిస్తున్నారు.
కెనడా ఎంపీలు, యుక్రెయిన్ ప్రతినిధులకు నేను చేసిన దాని గురించి ఏమీ తెలియదని స్పీకర్ తెలిపారు.
''కెనడాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులకు నేను క్షమాపణలు చెబుతున్నా. నేను చేసిన పనికి నాదే బాధ్యత'' అని రోటా తన ప్రకటనలో పేర్కొన్నారు.
హుంకాని సంప్రదించేందుకు న్యూస్ ఏజెన్సీ ఏపీ ప్రయత్నించింది. అయితే, ఆయన అందుబాటులోకి రాలేదు.
కెనడా ఎంపీలు, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పిడికిలి పైకెత్తి హుంకాకు గౌరవ వందనం చేశారు. హుంకా గౌరవార్ధం పార్లమెంట్‌లో ఎంపీలు రెండుసార్లు నిల్చుని అభివాదం చేశారు. వారికి హుంకా సెల్యూట్ చేశారు.
హుంకాని యుక్రెయిన్, కెనడాకి హీరోగా అభివర్ణించారు స్పీకర్ రోటా. మీ సేవలకు రుణపడి ఉంటామని చెప్పారు.
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రస్తుతం కెనడాలో ఉన్నారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంతో పశ్చిమ దేశాల మద్దతు కోరేందుకు ఆయన కెనడా వెళ్లారు.
జెలెన్‌స్కీ స్వతహాగా యూదుడు. ఆయన బంధువులు హిట్లర్ ఆర్మీ సాగించిన యూదుల ఊచకోతలో ప్రాణాలు కోల్పోయినప్పటికీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్‌ను నియో నాజీ రాజ్యంగా పిలుస్తుంటారు.

ట్రూడో కార్యాలయం ఏం చెప్పింది?
అయితే, ఈ సంఘటన జరుగుతున్నప్పుడు కెనడా ప్రధాని ట్రూడో పార్లమెంట్‌లోనే ఉన్నారు. దీనికి ప్రధాని ట్రూడోదే బాధ్యతని కన్జర్వేటివ్ పార్టీ నేత పియెర్రె పిలివియెర్ అన్నారు.
''ఈ ఘటనకు ట్రూడో బాధ్యత వహించాలి. క్షమాపణలు చెప్పాలి'' పియెర్రె డిమాండ్ చేశారు.
న్యూ డెమొక్రటిక్ పార్టీ - ఎన్‌డీపీ నేత జగ్మీత్ సింగ్ కూడా ఈ ఘటనను ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఆయన పార్లమెంట్‌లోకి ఎలా వచ్చారో, ఆయన నేపథ్యమేంటన్నది తమకు కూడా తెలియదని సింగ్ పేర్కొన్నారు.
ఈ మొత్తం సంఘటనకు స్పీకర్ రోటా బాధ్యత వహిస్తారని కెనడా ప్రధాని కార్యాలయం తెలిపింది. ఆయన ఇప్పటికే క్షమాపణలు చెప్పారని, అలా చేయడం సరైనదేనని పేర్కొంది.
''ప్రధాని జస్టిన్ ట్రూడో, యుక్రెయిన్ ప్రతినిధులకు పార్లమెంట్‌లో ఏం జరిగిందో తెలియదు. హుంకాను ఆహ్వానించడం కానీ, ఆయనను గౌరవించడం గురించి కానీ ఏమీ తెలియదు'' అని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
హుంకా పనిచేసిన యుక్రెనియన్ మొదటి డివిజన్‌ను ఎస్ఎస్ 14వ వాఫెన్ డివిజన్ అని కూడా పిలుస్తారు. ఈ వాలంటరీ యూనిట్ నాజీల ఆధీనంలో ఉండేది.
ది ఫ్రెండ్స్ ఆఫ్ సిమన్ వీసెంథల్ సెంటర్ ఫర్ హోలోకాస్ట్ స్టడీస్ ఆదివారం ఒక ప్రకటన చేసింది. ఈ డివిజన్ అమాయకులైన సాధారణ పౌరులు ఎంతోమందిని బలితీసుకుందని తెలిపింది. క్రూరత్వానికి ఈ యూనిట్ పర్యాయపదం లాంటిదని, క్రూరత్వంలో అన్ని హద్దులూ దాటేసిందని అందులో పేర్కొంది.
''నాజీలు సాగించిన మారణహోమం నుంచి బయటపడిన ప్రతి ఒక్కరికీ, నాజీలకు వ్యతిరేకంగా పోరాడిన ప్రతి ఒక్క సైనికుడికీ క్షమాపణలు చెప్పాలి. అతను కెనడా పార్లమెంట్‌లోకి ఎలా ప్రవేశించాడో, గౌరవవందనం ఎలా స్వీకరించాడో అన్ని వివరాలు బయటపెట్టాలి'' అని ఆ సంస్థ డిమాండ్ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
కెనడా యూదు సంస్థ ఏమంటోంది?
బినాయ్ బ్రిత్ కెనడా ఒక యూదు సంస్థ. ఇందులో దాదాపు 4000 మంది సభ్యులున్నారు.
''ఒకప్పుడు నాజీల తరఫున పోరాడిన వ్యక్తిని కెనడా పార్లమెంట్ గౌరవించడం నిజంగా అవమానకరం'' అని సంస్థ సీఈవో మైకేల్ మోస్టిన్ అన్నారు. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాలన్నారు.
అలాగే, కెనడా ప్రజాస్వామ్య సౌధంలో ఈ ఘటన ఎలా జరిగిందో కూడా బహిర్గతం చేయాలని మైకేల్ అన్నారు.
హుంకాను గౌరవించిన జాబితాలో కెనడా ప్రతిపక్ష పార్టీలు కూడా ఉన్నాయి. హుంకా గతం గురించి తమకు తెలియదని కన్జర్వేటివ్ పార్టీ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.
హుంకాకి దారుణమైన చరిత్ర ఉందని తెలిసింది. ఇదెలా జరిగిందో ప్రధాని ట్రూడో సారథ్యంలోని లిబరల్ పార్టీ వివరణ ఇవ్వాలని కన్జర్వేటివ్ పార్టీ కోరింది.
కెనడియన్ జ్యూయిష్ న్యూస్ ప్రకారం, 2021 నాటికి కెనడాలో యూదుల సంఖ్య దాదాపు మూడు లక్షలు. 2011 లెక్కలతో పోలిస్తే కెనడాలో యూదుల సంఖ్య స్వల్పంగా పెరిగింది.

ఫొటో సోర్స్, REUTERS
హిట్లర్ చేతిలో హింసకు గురైన యూదులు
1933లో హిట్లర్ నాజీ పార్టీ జర్మనీలో అధికారంలోకి వచ్చిన తర్వాత యూదుల ఊచకోత మొదలైంది.
1939 నాటికి యూదులపై దారుణాలు పెరిగిపోయాయి. 1945 నాటికి నాజీల చేతిలో లక్షల మంది యూదులు ప్రాణాలు కోల్పోయారు.
''హుంకా పనిచేసిన సైనిక డివిజన్ వేలాది మంది యుక్రెయిన్ వాలంటీర్ల చావులకు కారణమని, వారిలో యుక్రెయిన్‌కి స్వాతంత్ర్యం సాధించగలమని ఆశించిన వారు కూడా ఉన్నారు'' అని ఒట్టావా యూనివర్సిటీకి చెందిన డొమినిక్ ఎర్లే సీబీసీ న్యూస్‌తో చెప్పారు.
అప్పట్లో జర్మన్ ఆర్మీలో కేవలం జర్మన్లను మాత్రమే చేర్చుకునేవారు. అందువల్ల జర్మన్లు కాని వారిని ఎస్‌ఎస్ డివిజన్లలో వేసేవారు.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియాలో చర్చ
కెనడాకి చెందిన రాజకీయ విశ్లేషకులు ఇవాన్ కచనోవ్‌స్కీ సోషల్ మీడియాలో హుంకా ఫోటోలను షేర్ చేస్తూ '' కెనడా పార్లమెంట్‌లో ప్రధాని ట్రూడో, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ లేచి నిల్చుని మరీ గౌరవించిన ఫోటోలు ఇంకా చాలా ఉన్నాయి. జర్మనీలో శిక్షణలో ఉన్నప్పటి ఫోటోలను హుంకా స్వయంగా షేర్ చేశారు. మూడో ఫొటోలో మెషీన్ గన్ పక్కన హెల్మెట్ లేకుండా ఉన్న వ్యక్తి హుంకా'' అని రాశారు.
''రెండో ప్రపంచ యుద్ధంలో రష్యాకి వ్యతిరేకంగా పోరాడిన 98 ఏళ్ల యుక్రెనియన్ వలసదారుడిని కెనడా పార్లమెంట్‌లో గౌరవించారు. ఆయన నాజీల తరఫున పోరాడారు. అంటే, కెనడా పార్లమెంట్‌లో అందరూ లేచి నిల్చుని నాజీలను గౌరవించినట్లే..'' అని వార్‌క్లాండెస్టిన్ అనే మరొకరు ట్వీట్ చేశారు.
''అందరు ఎంపీల మాదిరిగానే నాకు కూడా హుంకా గురించి ఏమీ తెలియదు. నేను ఆయన దగ్గరకు వెళ్లి ఫోటో కూడా తీసుకున్నా. యూదుల ఊచకోత సమయంలో మా పూర్వీకులు కూడా బలయ్యారు. అందువల్ల, ఈ విషయంపై రాజకీయాలు చేయొద్దని అందరు ఎంపీలను కోరుతున్నా. ఎందుకంటే, నాలాగే అది ఎంతోమందిని ఇబ్బంది పెడుతుంది'' అని కెనడా ఎంపీ కెరినా గౌల్డ్ సోషల్ మీడియాలో అభ్యర్థించారు.
ఇవి కూడా చదవండి:
- నేపాల్: లక్షమంది టీచర్లు వీధుల్లోకి ఎందుకు వచ్చారు... వారి ఆగ్రహానికి కారణమేంటి?
- హిట్లర్ పర్సనల్ లైఫ్ గురించి నమ్మలేని నిజాలను బయటపెట్టిన 'వీడియో'
- చంద్రుని మీద టైం ఎంతో చెప్పగలమా...
- నాజీల క్యాంప్ గార్డుగా పని చేసి, వేల హత్యలకు బాధ్యుడైన 101 ఏళ్ళ వృద్ధుడికి అయిదేళ్ళ జైలు శిక్ష
- హిట్లర్‌కు సన్నిహితులైన గోబెల్స్ దంపతులు తమ ఆరుగురు పిల్లలతో పాటు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















