నేపాల్: లక్షమంది టీచర్లు వీధుల్లోకి ఎందుకు వచ్చారు... వారి ఆగ్రహానికి కారణమేంటి?

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, కెల్లి ఎన్జీ, రమా పరంజౌలి
- హోదా, బీబీసీ ప్రతినిధులు
నేపాల్‌లో ఉపాధ్యాయులు చేపట్టిన భారీ నిరసన మూడవ రోజుకు చేరుకుంది. వీరి ఆందోళనలతో దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో లక్షలమంది విద్యార్ధులకు క్లాసులు జరగడం లేదు.
నేపాల్ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణల బిల్లును వ్యతిరేకిస్తూ దాదాపు 1 లక్షా 10,000 మంది ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు.
పాఠశాలలపై స్థానిక ప్రభుత్వాలకు పర్యవేక్షణ బాధ్యతలు ఇవ్వడం, రాజకీయ అనుబంధ సంఘాలలో ఉపాధ్యాయులు చేరికపై నిషేధానికి వ్యతిరేకంగా వారు ఉద్యమిస్తున్నారు.
గురువారంనాడు భారీ సంఖ్యలో ఆందోళనకారులు రాజధాని కాఠ్‌మాండూలో పార్లమెంటు భవనం వైపు కవాతు చేశారు.
నిరసనకారులు బారికేడ్‌లను దాటి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీలతో వారిని అడ్డుకున్నారు. మరోవైపు పిల్లలకు తరగతులు మిస్సవుతున్నాయని, క్లాసులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయ సంఘాలను, ఇటు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
‘‘నా టీచర్లే నా భవిష్యత్తుతో ఎలా ఆడుకుంటారు’’ అని పరీక్షలకు సిద్ధమవుతున్న 16 ఏళ్ల సిమ్రాన్ భట్టాచార్య అన్నారు.
సిమ్రాన్ తల్లి సాబిత్రి ఆచార్య మాట్లాడుతూ, తన కూతురి పరీక్షల కోసం చాలా రోజులు సెలవు తీసుకున్నానని చెప్పారు.
‘‘నేను ఇంకా ఎంతకాలం సెలవు పెట్టి ఉండగలను. పిల్లల విద్యా హక్కును ఉల్లంఘించకుండా టీచర్లు తమ హక్కుల కోసం పోరాడాలి’’ అని సాబిత్రి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉద్యమాలలో టీచర్ల పాత్ర
1959లో నేపాల్ మొదటిసారిగా పార్లమెంటరీ ఎన్నికలను నిర్వహించింది. ఆ దేశంలో ప్రజాస్వామ్య ఉద్యమాలలో నేపాలీ ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారు. రాజకీయ పార్టీలు కూడా ఉపాధ్యాయులను తమ పార్టీలో కార్యకర్తలుగా చేర్చుకోవడానికి చాలా కాలం నుంచి ఆసక్తి చూపుతున్నాయి.
అయితే రాజకీయాలలో ఉపాధ్యాయుల ప్రమేయం విద్యా నాణ్యతను దెబ్బతీస్తుందని, అందువల్ల ఉపాధ్యాయ సంఘాలలో రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా చూడాలని కొంతమంది విద్యా నిపుణులు వాదించారు.
మరోవైపు పాఠశాలల్లో స్థానిక ప్రభుత్వాల పర్యవేక్షణ అంశాన్ని కూడా టీచర్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వానికే ఉండాలని వారు చెబుతున్నారు.
2015లో ఆమోదానికి నోచుకున్న కొత్త రాజ్యాంగం పాఠశాలలు, ఆసుపత్రుల వంటి కొన్ని ప్రభుత్వ సంస్థల పాలనను స్థానిక అధికారులకు మార్చింది. కాఠ్‌మాండూలో అధికారాలు, వనరుల కేంద్రీకరణ జరుగుతోందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే, ఎనిమిదేళ్లు గడుస్తున్నా స్థానిక అధికారులు పాఠశాలల నిర్వహణకు సక్రమంగా సన్నద్ధం కాలేదని, దీంతో విద్యలో నాణ్యత పడిపోతోందని కొందరు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. కానీ, చాలామంది నేపాలీలు ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నారు. ఇది ఉపాధ్యాయులలో జవాబుదారీతనాన్ని పెంచుతుందని అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
టీచర్ల డిమాండ్లు ఏంటి ?
ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లు స్థానిక మున్సిపాలిటీల ద్వారా కాకుండా, రాష్ట్రాల స్థాయిలో జరగాలన్నది వారి డిమాండ్లలో ఒకటి. వేతనాలు పెంచాలని, ఉపాధ్యాయుల శిక్షణను పర్యవేక్షించేందుకు మండలిని ఏర్పాటు చేయాలని, కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన ఉపాధ్యాయులను శాశ్వత ఉద్యోగులుగా మార్చేందుకు అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు.
గతంలో తమ సమస్యల పరిష్కారం కోసం కుదుర్చకున్న ఒప్పందాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నేపాల్ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కమలా తులాధర్ ఆరోపించారు.
"చాలా విషయాలను పరిష్కరించలేదు. అందుకే మేం నిరసనకు దిగాం’’ అని కమలా తులాధర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ప్రభుత్వం ఈ వాదనను తోసి పుచ్చుతోంది. తమ డిమాండ్లేమిటో కూడా చెప్పకుండా టీచర్లు నిరసనలకు దిగారని నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి పూర్ణ బహదూర్ అన్నారు.
ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులతో ప్రభుత్వం గురువారం చర్చించింది. అయితే, ఇవి సానుకూలంగానే సాగినా, ఫలితం లేకుండా ముగిశాయని అధికారులు చెప్పారు. శుక్రవారం మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు.
మరోవైపు తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఆందోళనలు కొనసాగిస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు.
"ఉపాధ్యాయుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు" అని తాత్కాలిక ప్రధానమంత్రి పూర్ణ బహదూర్ మీడియా సలహాదారు కమల్ గిరి బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సిక్కు నేత నిజ్జర్ హత్య: ఇండియా, కెనడా గొడవతో అమెరికా టెన్షన్ పడుతోందా? ఎందుకు?
- కాంగ్రెస్ 6 గ్యారెంటీలు: కర్ణాటక ఫార్ములా తెలంగాణలో నడుస్తుందా?
- హైదరాబాద్ సంస్థానం భారత్లో ఎలా అంతర్భాగమైంది? నిజాం ఎందుకు లొంగిపోయారు? చరిత్ర ఏం చెబుతోంది?
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల: ఇంకా పూర్తికాని ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















