ఎవరెస్ట్ రూపం మారుతోందా? ఒక్కసారిగా మరణాలు ఎందుకు పెరిగాయి?

ఎవరెస్టు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జోయెల్ గింటో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి ముందు ఆస్ట్రేలియన్ ఇంజనీర్ జాసన్ కెన్నిసన్ తన తల్లికి వీడియో కాల్‌ చేశారు. ఎవరెస్ట్ దిగిన తర్వాత మళ్లీ ఆమెతో మాట్లాడతానని చెప్పారు.

కెన్నిసన్ ఎవరెస్టును అధిరోహించడం ద్వారా తన జీవితంలోని అతిపెద్ద కలను నెరవేర్చుకున్నారు. కానీ, ఆ వీడియో కాల్ అతనికి చివరిదని తర్వాత తెలిసింది. గిల్ కెన్నిసన్ తన తల్లితో మళ్లీ మాట్లాడలేదు.

జాసన్ (40) ఎవరెస్టు దిగాక అస్వస్థతకు గురయ్యారు. తరువాత చనిపోయారు.

ఈ వేసవికి ముందు ఎవరెస్ట్ అధిరోహణ లేదా అవరోహణలో మరణించిన 12 మందిలో కెన్నిసన్ ఒకరు. ఇటీవలి సంవత్సరాలలో నమోదైన అత్యధిక మరణాల సంఖ్య ఇది.

ఇప్పుడు ఎవరెస్ట్ అధిరోహణ సీజన్ ముగిసింది. కానీ, ఇప్పటికే ఐదుగురు తప్పిపోయారు.

2019లో ఎవరెస్ట్ అధిరోహకులు బారులు తీరినట్లు ఉన్న ఓ చిత్రం వైరల్‌గా మారింది. ఆ ఏడాది 11 మంది చనిపోయారు.

ఈ ఏడాది మంచు కారణంగా ముగ్గురు షెర్పాలు చనిపోయారు. కెన్నిసన్ వంటి కొంతమంది కిందకి దిగిన తర్వాత అనారోగ్యానికి గురై మరణించారు.

కాగా, నేపాల్‌లో ఎవరెస్టు అధిరోహణకు అనుమతుల మంజూరు తీరుతో మరోసారి ఇది చర్చల్లోకి వచ్చింది. పర్వతం మీద వాతావరణ మార్పులపై మరింత ఆందోళన చెందుతున్నారు.

కోవిడ్ మహమ్మారి కారణంగా ఎవరెస్ట్ అధిరోహణ తగ్గిపోవడంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో నేపాల్ వైపున గల జంప్ ఆఫ్ పాయింట్ నుంచి 900 మందికి అనుమతులు ఇచ్చారు.

ఎవరెస్ట్‌ మార్గంలో అధిరోహకుల సంఖ్య పెరుగుదల 'ట్రాఫిక్ జామ్‌‌' (రద్దీ)కి కారణమవుతోందని అమెరికాలోని మాడిసన్ మౌంటెనీరింగ్ కంపెనీకి చెందిన గారెట్ మాడిసన్ రాయిటర్స్‌ వార్తా సంస్థతో చెప్పారు.

ఎవరెస్ట్ అధిరోహకుల క్యూ పెరుగుతూ వస్తోంది. అందరూ పర్వతం ఎక్కడానికి అనుకూలమైన వాతావరణం కోసం ఎదురు చూస్తున్నారు. వారంతా బలమైన గాలులు లేనప్పుడు వెళ్లాలని వేచిచూస్తున్నారు.

ఇది కాకుండా అనుభవం లేని అధిరోహకుల కారణంగా కూడా భారీ క్యూ ఏర్పడుతోంది.

ఎవరెస్టుపై ట్రాఫిక్ జాం

ఫొటో సోర్స్, Getty Images

అధిరోహకులు ఎందుకు అనారోగ్యానికి గురవుతారు?

8 వేల మీటర్ల ఎత్తులో తేలికైన గాలి కారణంగా అధిరోహకులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. కొందరు ఆక్సిజన్ క్యాన్లతో నెట్టుకురాగలుగుతారు.

ఎత్తైన ప్రదేశానికి వెళ్తే శరీరంలో ఎక్కువ ద్రవం ఉత్పత్తి అవుతుంది. ఇది ఊపిరితిత్తులు , మెదడులో వాపుకు కారణమవుతుంది.

ఆ తర్వాత మనిషి అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలను ఎదుర్కొంటారు.

అమెరికాలోని అల్పెంగ్లో ఎక్స్‌పెడిషన్స్‌కు చెందిన అడ్రియన్ బలింగర్ చైనా నుంచి ఎవరెస్ట్ అధిరోహణ క్యాంప్ నిర్వహిస్తున్నారు.

నేపాల్‌లో ఉన్న కంపెనీలు ఎవరెస్ట్‌ పైకి వెళ్లేందుకు తక్కువ అనుభవం ఉన్న వారికి కూడా అనుమతులు ఇస్తున్నాయని బలింగర్ ఆరోపించారు.

ఎవరెస్ట్ యాత్ర ద్వారా నేపాల్ చాలా సంపాదిస్తోంది. ఇదే క్రమంలో పాశ్చాత్య దేశాలకు చెందిన చాలామంది పర్వతారోహకుల నుంచి నేపాల్ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోంది.

ఎవరైనా 9 లక్షల రూపాయలు చెల్లిస్తే నేపాల్ పర్వతారోహణకు అనుమతి ఇస్తోందని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను నేపాల్ ప్రభుత్వం ఖండిస్తోంది.

అయితే, నేపాల్‌లో ఒక్కో పర్వతారోహకుడు అనుమతి పత్రానికి అయ్యే ఖర్చులతో కలిపి దాదాపు 22 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని షెర్పాలు అంటున్నారు. ఇందులో గ్యాస్, ఆహారం, గైడ్‌లు, స్థానిక ప్రయాణ ఖర్చులు ఉంటాయని చెబుతున్నారు.

ఎవరెస్టు

ఫొటో సోర్స్, Getty Images

నేపాల్ ఏమంటోంది?

పర్మిట్ విధానంపై వస్తున్న విమర్శలు, లేవనెత్తిన ప్రశ్నలను నేపాల్ పర్యాటక శాఖ డైరెక్టర్ యుబ్రాజ్ ఖతివాడ ఖండించారు.

ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌లో మొత్తం సీజన్‌ను సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వ అధికారులు, వైద్యులతో కూడిన బృందాన్ని మోహరిస్తామని గత నెలలో ఆయన చెప్పారు.

"వారి భద్రత గురించి ఆందోళన చెందుతున్నాం. బృందాలకు మార్గదర్శనం చేయడానికి మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం" అని ఖతివాడా ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో తెలిపారు.

లూకాస్ ఫుర్ట్‌బాచ్ ఆస్ట్రియాకు చెందిన వ్యక్తి. 2016 నుంచి ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు ఆయన కంపెనీ 100 మందిని నేపాల్‌కు తీసుకొస్తోంది. పర్వతారోహకుల రద్దీకి సరిపడా ఆక్సిజన్‌ ​​సదుపాయం ఉండాలని వారు చెబుతున్నారు.

పర్వతారోహకులకు ఆక్సిజన్‌ ​​కొరత రాకుండా తమ సంస్థ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటుందని, అందుకే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన చెప్పారు.

"ఎవరెస్ట్‌పై చాలామంది అధిరోహకులు ఉంటే, తగినంత ఆక్సిజన్ కలిగి ఉండటం ముఖ్యం. ఆపరేటర్లందరూ భద్రత విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటే, మనం చాలామంది ప్రాణాలను కాపాడగలం'' అని బీబీసీతో లూకాస్ ఫుర్ట్‌బాచ్ తెలిపారు.

ఎవరెస్టు

ఫొటో సోర్స్, Reuters

'ఎవరెస్ట్ అప్పటిలా లేదు'

ది హిమాలయన్ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది మంచు తుపాను వల్ల ఒక్క ప్రాణం కూడా పోలేదు. అయితే సాధారణంగా ఎవరెస్ట్‌పై 40 శాతం మరణాలు ఈ తుఫానుల కారణంగానే సంభవిస్తాయి.

2014లో ఇలాంటి మంచు తుపాను కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఎవరెస్ట్‌పై జరిగిన పెద్ద ప్రమాదంగా గుర్తుండిపోతుంది.

ఇది కాకుండా కొన్నిసార్లు అధిక ఉష్ణోగ్రత కారణంగా మంచు కరిగి సరస్సులు ఏర్పడటంతో ఆ మార్గంలో పర్వతారోహకులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

వాతావరణ మార్పుల కారణంగా 1979 తర్వాత ఎవరెస్ట్ టిబెటన్ పీఠభూమి ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలో 2 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల కనిపించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మైనే యూనివర్సిటీకి చెందిన క్లైమేట్ చేంజ్ ఇనిస్టిట్యూట్ 2022లో ప్రచురించిన రిపోర్టు ప్రకారం మంచు కరిగినప్పుడు హిమానీనదం నీరు కిందకి వస్తుంది. ఈ నీరు వాలు వైపు కదులుతుంది లేదా బలమైన గాలుల కారణంగా కొంత ఆవిరిగా మారుతుంది.

మంచు కరగడం కారణంగా భూమి బహిర్గతం అవుతుంది. దీంతో సముద్రపు తుపాన్లు పెరుగుతాయని ఈ అధ్యయనం తెలిపింది.

కరుగుతున్న హిమానీనదాలు ఎవరెస్ట్ బేస్ క్యాంపులను అస్థిరంగా మార్చగలవు. అటువంటి శిబిరాల్లో 1,000 మంది వరకు అధిరోహకులు ఉంటారు.

అయితే, ఇలాంటి శిబిరాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే యోచన ప్రస్తుతానికి వాయిదా పడింది.

శిబిరాన్ని తరలించే ప్రతిపాదనలు ఆచరణ సాధ్యం కావని గత నెలలో షెర్పాస్ నాయకుడు ఒకరు బీబీసీతో తెలిపారు.

మరోవైపు ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి రెగ్యులర్‌గా వచ్చే వారు పర్వతం రూపు మారుతోందని అంటున్నారు.

“ప్రజలు ఎవరెస్ట్ అధిరోహించడానికి తిరిగి వచ్చినప్పుడల్లా పర్వతం కొద్దిగా మారినట్లు భావిస్తున్నారు. గత సంవత్సరం మంచు ఉన్న చోట ఇపుడు నీరు ఉంది. గట్టి మంచు ఉన్న చోట ఈ ఏడాది తేలికైన మంచు కురుస్తోంది'' అని అనుభవజ్ఞుడైన గైడ్ పసాంగ్ యిచి షెర్పా 2022లో ఒక పోడ్‌కాస్ట్‌తో తెలిపారు.

సాధారణంగా శీతాకాలంలో వచ్చే హిమపాతం ఈ సంవత్సరం ఇపుడు ఉందని నేపాల్ మౌంటెనీరింగ్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ అంగ్ షెరింగ్ షెర్పా చెప్పారు.

దీని వల్ల మంచు తుఫానులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన అంటున్నారు. వాతావరణ మార్పు ఎవరెస్ట్ మార్గాన్ని బాగా ప్రభావితం చేసిందని, ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఇది ఉందని ఫర్టెన్‌బాచ్ అభిప్రాయపడ్డారు.

''రాబోయే ఐదు నుంచి పదేళ్లలో ఎవరెస్టు అధిరోహణపై ఈ మార్పులు ఎలాంటి ప్రభావాన్ని చూపనున్నాయో తెలుస్తుంది’’ అని ఆయన బీబీసీతో అన్నారు.

ఎవరెస్ట్ ప్రజలను ఎందుకు ఆకర్షిస్తోంది?

అయితే, ఈ సీజన్ నాటకీయ రెస్క్యూలు, పలు ఘనతలను కూడా చూసింది.

గత నెలలో సముద్ర మట్టానికి 8,500 మీటర్ల ఎత్తులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మలేషియా అధిరోహకుడిని నేపాలీ గైడ్ గెల్జే షెర్పా ఆరు గంటల వ్యవధిలో కిందకి తీసుకువెళ్లారు.

నేపాల్‌కు చెందిన కమీ రీటా షెర్పా ఒక్కరే రికార్డు స్థాయిలో 28వ సారి శిఖరాగ్రానికి చేరుకుని "ఎవరెస్ట్ మ్యాన్"గా తన ఖ్యాతిని పదిలపరుచుకున్నారు.

అంతకుముందు బ్రిటన్‌లో నివసిస్తున్న గూర్ఖా మాజీ సైనికుడు హరి బుధా మగర్ కృత్రిమ కాళ్లతో ఎవరెస్ట్‌ను అధిరోహించారు. ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచారు.

ఎవరెస్ట్‌ను జయించటానికి అత్యంత ప్రతికూల పరిస్థితులలో మనుగడ సాగించడానికి కఠినమైన సన్నద్ధత అవసరాన్ని చూపిస్తుందని నిపుణులు అంటున్నారు.

"విషాదం, మరణాలు, నాటకీయత ముఖ్యపాత్ర పోషిస్తున్నా ఎవరెస్ట్‌ ప్రజలను ఎందుకు ఆకర్షిస్తోంది?. ఇది ఈ గ్రహం ఎత్తైన ప్రదేశం, భూమిపై అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో ఒకటి. ఈ కలయికే ప్రజలను ఆకర్షిస్తుంది" అని ఫుర్ట్‌బాచ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)