ఎవరెస్ట్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ శిఖరంపై యుక్రెయిన్ యుద్ధ ప్రభావం

ఎవరెస్ట్ బేస్ క్యాంప్

ఫొటో సోర్స్, BBC/Anbarasan

    • రచయిత, అంబరసన్ ఎతిరాజన్
    • హోదా, బీబీసీ న్యూస్

ఆంగ్ సర్కి షెర్పా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగం చేస్తున్నారు. కానీ, ఆయన పొంచి ఉన్న ప్రమాదాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటారు. ఆయన వయసు 50 ఏళ్లు.

నేపాల్‌లోని అత్యంత అనుభవమున్న పర్వతారోహక గైడ్ షెర్పా. ఈ గైడ్స్‌ను 'ఐస్ ఫాల్ డాక్టర్స్' అని పిలుస్తుంటారు.

ఎవరెస్ట్ మహా పర్వతాన్ని అధిరోహించే పర్వతారోహకులకు వీరు అల్యూమినియం నిచ్చెనలు, తాళ్లను ఏర్పాటు చేస్తారు. ఎవరెస్ట్ ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం అని తెలుసు కదా.

భారీ మంచు పలకాల పై ఉన్న పగుళ్లు, హిమనీ నదాలను పర్వతారోహకులకు అనుగుణంగా షెర్పాలు సరిచేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ప్రతీ సంవత్సరం నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్ అధిరోహించేందుకు కొన్ని వందల మంది పర్వతారోహకులకు వీలవుతుంది. వీరంతా ఏప్రిల్-మే నెలల మధ్యలో ఎవరెస్ట్ బేస్ క్యాంపు దగ్గరకు చేరుకొని అక్కడ నుంచి పర్వతారోహణకు బయలుదేరుతారు.

గత రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి, ఎవరెస్ట్‌లో ఆకస్మికంగా చోటు చేసుకున్న ఉత్పాతాలు పర్వతారోహణ చేసేవారి సంఖ్యను బాగా తగ్గించాయి. ప్రస్తుతం యుక్రెయిన్ లో చోటు చేసుకుంటున్న యుద్ధం కూడా పర్వతారోహకుల సంఖ్య పెరుగుతుందనే ఆశను అణిచివేస్తోంది.

షెర్పా విశాలమైన బేస్ క్యాంప్ దగ్గర పసుపు రంగు టెంటు బయట నిల్చుని, అక్కడి నుంచి కనిపిస్తున్న ఎత్తయిన ఖుంబు మంచుపర్వతాన్ని చూపించారు.

ఖుమ్బు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఖుంబు

"ప్రమాదకరమైన ప్రాంతాల్లో అదొకటి. అక్కడ భారీ మంచు ఫలకాల మధ్యలో చాలా చీలికలుంటాయి. జాగ్రత్తగా ఉండకపోతే, వాటిలో జారి పడిపోయే ప్రమాదముంది. తాళ్లతో ఒక ట్రయల్ నిర్వహించినా కూడా నెల రోజుల తర్వాత ఆ జాడలు మాయమైపోతాయి. ఇది చాలా ముప్పుతో కూడుకున్న పని" అని ఆయన బీబీసీతో చెప్పారు.

షెర్పా ఆరుగురు సభ్యులున్న స్థానిక గైడ్ల బృందానికి నాయకత్వం వహిస్తారు. బీబీసీ ఆ ప్రాంతాన్ని సందర్శించే సమయానికి వారంతా అక్కడున్న వాతావరణ పరిస్థితులకు అలవాటు పడే ప్రయత్నాలు చేస్తున్నారు. వారి టెంట్ల చుట్టూ తాళ్లు కట్టి, నిచ్చెనలు వేలాడదీసి ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, హైదరాబాద్ హలీం ఎందుకు ఇంత ఫేమస్

దగ్గర్లో ఉన్న బేస్ క్యాంపులో రకరకాల కార్యకలాపాలు సాగుతున్నాయి. పర్వతారోహణ చేసే కొన్ని బృందాలు టెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. వసంత కాలం రానుండటంతో పర్వతారోహణకు అవసరమయ్యే ఇతర సరఫరాలను సమకూర్చుకునే పనుల్లో ఉన్నారు.

"ఈ ఐస్ ఫాల్ డాక్టర్లు సురక్షితమైన మార్గాన్ని గుర్తించి క్యాంపు 1, 2కు వెళ్లేందుకు తాళ్లను ఏర్పాటు చేస్తారు. మరొక బృందం పర్వతారోహణ వరకు చేయాల్సిన కార్యకలాపాలను నిర్వహిస్తుంది.

ఆంగ్ సర్కి షెర్పా

ఫొటో సోర్స్, BBC/Anbarasan

ఫొటో క్యాప్షన్, ఆంగ్ సర్కి షెర్పా

ఈ పర్వతారోహణలో పొంచి ఉన్న ప్రమాదాల గురించి షెర్పాకు, ఆయన సహచరులకు అవగాహన ఉంది.

ఖుంబు మంచు పర్వతంలో అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఉత్పాతం వల్ల 2014లో తాళ్లను బిగిస్తుండగా 16 మంది షేర్పాలు మరణించారు. ఒక ఏడాది తర్వాత నేపాల్‌లో అనేక ప్రాంతాల్లో వినాశనం సృష్టించిన భారీ భూకంప ప్రమాదంలో మరో 19 మంది మరణించారు.

"యుక్రెయిన్‌లో యుద్ధం వల్ల ఆ ప్రాంతం నుంచి పర్వతారోహణకు రావల్సిన వాళ్లంతా తమ ప్రణాళికలను రద్దు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఏడాది ఎక్కువ మంది పర్వతారోహణకు రాకపోవచ్చు" అని షెర్పా చెప్పారు.

ఎవరెస్ట్ బేస్ క్యాంప్

ఫొటో సోర్స్, BBC/Anbarasan

ఫొటో క్యాప్షన్, ఎవరెస్ట్ బేస్ క్యాంప్

8,848 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనుకునే వారికి ఈ బేస్ క్యాంప్ చాలా ముఖ్యం. నిజానికి, ఈ బేస్ క్యాంపు కూడా ఇక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణ. సముద్ర మట్టానికి సుమారు 5400 మీటర్ల ఎత్తున ఉండే ఈ బేస్ క్యాంపునకు చేరుకోవడం కూడా టూరిస్టులకు ఒక ఉత్తేజకరమైన అనుభవం.

లుక్లా అనే పట్టణంలో మొదలైన ట్రెక్ ముగించడానికి కనీసం రెండు వారాలు పడుతుంది. దీనిని ఎవరెస్టుకు ముఖ ద్వారం అని అంటారు.

2020లో కోవిడ్ మహమ్మారి తర్వాత నేపాల్ 2021 నుంచి పర్వతారోహకులను అనుమతించడం మొదలుపెట్టింది. ఇందుకోసం 408 అనుమతులను జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 19 నాటికి నేపాల్ పర్యటక మంత్రిత్వ శాఖ 287 పర్మిట్ లను ఇచ్చింది.

"ఈ ఏడాది రష్యా, యుక్రెయిన్ నుంచి వచ్చే పర్వతారోహకులపై యుక్రెయిన్ యుద్ధం ప్రభావం చూపించింది. ఇప్పటి వరకు యుక్రెయిన్ నుంచి ఎవరెస్ట్ అధిరోహణకు ఒకరు మాత్రమే వచ్చారు" అని నేపాల్ పర్యటక శాఖ పర్వతారోహణ విభాగంలో డైరెక్టర్ ప్రసాద్ ఉపాధ్యాయ్ చెప్పారు.

ఎవరెస్ట్ అధిరోహణకు 17 మంది రష్యన్ లకు అనుమతులు ఇచ్చారు. కానీ, అందరూ తమ ప్రణాళికలను రద్దు చేసుకున్నారు.

ఎవరెస్ట్ బేస్ క్యాంప్

ఫొటో సోర్స్, BBC/Anbarasan

ఫొటో క్యాప్షన్, ఎవరెస్ట్ బేస్ క్యాంప్

రష్యా కరెన్సీ రూబుల్ విలువ పడిపోవటం ఆ దేశ ప్రజల ఆర్థిక స్థితిపై ప్రభావం చూపించింది. దీనికి తోడు రష్యా పై విధించిన అంతర్జాతీయ ఆంక్షలు కూడా విదేశీ కరెన్సీని పొందే అవకాశాలను దూరం చేశాయి. బేస్ క్యాంపునకు వెళ్లే దారిలో ఉన్న చిన్న చిన్న గ్రామాలు కొన్ని వేల మంది ట్రెక్కర్లు, పర్వతారోహకులకు జీవనాడిలా ఉండేవి. వీరి పై కూడా యుక్రెయిన్ యుద్ధం ప్రభావం చూపించింది.

"యుద్ధం మొదలైన తర్వాత ఇంధన ధరలు పెరిగాయి. మా వ్యాపారం నడవాలంటే ఇవి చాలా ముఖ్యం. ఈ ధరలు మరింత పెరుగుతాయి. ఇది చాలా ఆందోళనకరంగా ఉంది" అని ఆంగ్ దావా షెర్పా అన్నారు. ఆయన ఫాక్ డింగ్ గ్రామంలో షెర్పా గ్రామంలో గెస్ట్ హౌస్ నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు నేపాల్ ప్రభుత్వం నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. దీంతో సరకుల రవాణా మరింత భారంగా మారింది.

2019లో పర్వతారోహణ కోసం మంచు కప్పిన దారిలో వందల మంది క్యూలలో నిల్చుని ఎదురు చూస్తున్న దిగ్బ్రాంతి కలిగించే ఫోటో కనిపించింది. అక్కడ నెలకొన్న భద్రత గురించి ఈ ఫోటో అనేక ప్రశ్నలను లేవనెత్తింది.

అయితే, ఇలాంటి పరిస్థితిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

"ఎవరెస్ట్‌లో నెలకొన్న రద్దీని నివారించేందుకు మేం కృషి చేస్తున్నాం. పర్వతారోహణలను నియంత్రించేందుకు దీర్ఘకాల పర్మిట్‌లను ఇచ్చేందుకు చూస్తున్నాం" అని ఖాట్మండు పర్యటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి మహేశ్వర్ న్యూపానే చెప్పారు. పర్వతారోహణ సీజన్ జరుగుతున్నంత కాలం పర్వతారోహణ చేసే బృందాలను పర్యవేక్షించేందుకు బేస్ క్యాంపు దగ్గర ఐదుగురు సభ్యులతో కూడిన అధికారుల బృందాలను పంపిస్తామని చెప్పారు.

ఎవరెస్ట్ బేస్ క్యాంప్

ఫొటో సోర్స్, Dom Sherpa/AFP

ఫొటో క్యాప్షన్, ఎవరెస్ట్ బేస్ క్యాంప్

పర్వతారోహణకు వచ్చే వారు పడేసే వ్యర్ధాలు కూడా మరో సమస్యగా మారాయి.

"ఇది మాకు చాలా ఆందోళన కలిగించే విషయం. ఎవరెస్ట్ శిఖరం పైన, ఇతర పర్వతాల పైన విసిరి పడేసిన వ్యర్ధ పదార్ధాలు, శవాలు ఉన్నాయి" అని సాగర్ మాత నేషనల్ పార్క్ చీఫ్ వార్డెన్ భూమిరాజ్ ఉపాధ్యాయ బీబీసీకి చెప్పారు.

"నేపాల్ సైన్యం వీటిని తొలగించే పనుల్లో ఉంది. కానీ, ఇదొక కష్టతరమైన ప్రక్రియ" అని అన్నారు.

బేస్ క్యాంపు దగ్గర ఆంగ్ సర్కి షెర్పా, బృంద సభ్యులతో కలిసి మరుసటి రోజు జరిగే పర్వతారోహణ గురించి చర్చించుకుంటున్నారు.

ఎవరెస్ట్ లాంటి స్థలాలు పని చేసేందుకు చాలా ప్రమాదకరమైనవని వాళ్లకు తెలుసు. కానీ, ఈ ఈ శిఖరాలు ఈ ప్రాంతంలో నివసించే వారి లాంటి కొన్ని వేలాది మందికి జీవనోపాధిని కూడా కలిగిస్తున్నాయి.

అదనపు రిపోర్టింగ్: సురేంద్ర ఫూయల్

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)