ఒంటరిగా ఎవరెస్టు శిఖరం ఎక్కడంపై నిషేధం

ఫొటో సోర్స్, AFP
పర్వతారోహకులు ఒంటరిగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడాన్ని నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. ప్రమాదాలను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
పర్వతారోహణకు సంబంధించి నేపాల్ తాజాగా విడుదల చేసిన నిబంధనల ప్రకారం.. రెండు కాళ్లు కోల్పోయిన వాళ్లు, చూపులేని వారు ఎవరెస్టును అధిరోహించడానికి అనుమతి ఇవ్వరు.
పర్వతాలు అధికంగా ఉండే నేపాల్‌లో శిఖరాలను అధిరోహించే క్రమంలో ప్రమాదాలు పెరుగుతున్నాయి.
అందులోనూ ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కేందుకు 2017లో అత్యధిక మంది ఔత్సాహికులు ప్రయత్నించారు.

ఫొటో సోర్స్, AFP/Getty
అలాగే ప్రమాదాలు కూడా పెరిగాయి. ఈ ఒక్క సీజన్‌లోనే ఆరుగురు పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు.
ఎవరెస్టును అధిరోహించేందుకు ప్రయత్నించిన 85 ఏళ్ల వృద్ధుడు మరణించారు.
ఎవరెస్టు సమీపంలోని ఓ పర్వతాన్ని అధిరోహిస్తూ స్విట్జర్లాండ్ పర్వతారోహకుడు వెలీ స్టెక్ కూడా ఈ ఏడాదే చనిపోయారు.

ఫొటో సోర్స్, ROBERT KAY
తాజా నిబంధనల ప్రకారం ఇకనుంచి విదేశీ పర్వతారోహకులు తప్పనిసరిగా గైడ్ సహాయం తీసుకోవాలి.
దీంతో దేశంలో గైడ్లకు ఉపాధి అవకాశాలు పెంచవచ్చన్న కోణంలోనూ ప్రభుత్వం భావిస్తోంది.
అయితే.. దివ్యాంగులపై నిషేధం విధించడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
బీబీసీకి అందిన వివరాల ప్రకారం 1920 నుంచి ఇప్పటి వరకు ఎవరెస్టుపై 200 మంది చనిపోయారు. అందులో 1980 తర్వాత అధికంగా మరణాలు నమోదయ్యాయి.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









