South Korea: ఒకే వ్యక్తికి మూడు వయసులు, ఈ విధానం ఇకపై మారనుందా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సన్ యంగ్ జియోంగ్
- హోదా, బీబీసీ కొరియా
మీ వయసు ఎంత? ఇది చూడటానికి సాధారణంగా కనిపించే ప్రశ్న. కానీ కొరియన్ల సమాధానం మాత్రం అంత సూటిగా ఉండదు.
ఎందుకంటే దక్షిణ కొరియాలో పుడుతూనే పిల్లలకు ఒక ఏడాది వయసుగా లెక్కిస్తారు. కొత్త సంవత్సరం రోజున మరో సంవత్సరం దానికి కలుపుతారు. ఉదాహరణకు డిసెంబరులో శిశువు జన్మిస్తే, ఆ తరువాత వచ్చే జనవరి 1కి.. అంటే కొన్ని వారాల్లోనే తన వయసు రెండేళ్లు అవుతుంది.
అయితే, శతాబ్దాల నాటి ఈ వయసు లెక్కించే విధానాన్ని త్వరలోనే పక్కన పెట్టేయాలని ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికైన యూన్ సుక్-యోల్ ప్రతిపాదించారు.
దక్షిణ కొరియాలో వయసు లెక్కించే విధానాన్ని మిగతా దేశాల్లో వయసు లెక్కించే విధానంతో సమానంగా మార్చేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు త్వరలో ఏర్పాటయ్యే ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారి లీ యంగ్ హో చెప్పారు.
భిన్న రకాలుగా వయసు లెక్కించే ఈ విధానాలతో గందరగోళం నెలకొంటోందని, దీని వల్ల సామాజిక, ఆర్థిక నష్టం సంభవిస్తోందని ఆయన వివరించారు.
ఈ కొత్త విధానాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు. అయితే, నిజంగానే ఈ విధానాన్ని అమలుచేస్తారా? అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒక ప్రశ్న, చాలా సమాధానాలు..
కొరియాలో వయసు ఎంతనే ప్రశ్నకు మూడు సమాధానాలు ఉంటాయి.
అధికారిక పత్రాల్లో అంతర్జాతీయంగా అనుసరించే విధానాలను ఇక్కడ ఉపయోగిస్తారు. అంటే పుట్టిన రోజు ఆధారంగా వయసు లెక్కించే పద్ధతి ఇది. 1962 నుంచి న్యాయపరమైన, పరిపాలన అంశాలకు ఈ వయసునే పరిగణలోకి తీసుకుంటున్నారు.
మరోవైపు కొరియాలో మరో అధికారిక వయసు లెక్కింపు విధానం కూడా ఉంది. దీని ప్రకారం బిడ్డ పుట్టినప్పుడు వారి వయసు సున్నాగా లెక్కిస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 1నాడు వారికి మొదటి సంవత్సరం వస్తుంది. ఈ విధానం కింద డిసెంబరు 2020న పుట్టిన పాపకు జనవరి 2022కు రెండేళ్లు వస్తాయి. వాస్తవానికి 2022 డిసెంబరుకు మాత్రమే వారికి రెండేళ్లు వస్తాయి.
కొన్ని పత్రాలు, సైన్యంలో చేరిక సమయాల్లో ఈ విధానాన్ని ఉపయోగిస్తుంటారు.
వీటికి అదనంగా ‘‘కొరియన్ వయసు విధానం’’ అని మరొక విధానం ఉంది. దీన్నే ఎక్కువ మంది అనుసరిస్తుంటారు. దీని ప్రకారం పుడుతూనే బిడ్డకు ఒక ఏడాది వయసుగా లెక్కిస్తారు. జనవరి ఒకటో తేదీనాడు ఆ బిడ్డకు మరో ఏడాది వస్తుంది. దీంతో పుట్టిన తేదీకి ఎలాంటి సంబంధమూ లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ విధానం ప్రకారం మెగా కే-పాప్ బ్యాండ్ బీటీఎస్ గాయకుడు కిమ్ తేహ్యుంగ్ వయసు చూద్దాం. ఆయన 1995 డిసెంబరు 30న జన్మించారు. కొరియన్ వయసు విధానం ప్రకారం ఆయన వయసు 28ఏళ్లు. అంతర్జాతీయ విధానం ప్రకారం ఆయన వయసు 26ఏళ్లు. అదే కొరియా అధికార లెక్కల ప్రకారం ఆయన వయసు 27ఏళ్లు.
ఇక్కడ వయసును ఏదో సంఖ్య అనుకుంటే పొరపాటే. దీన్ని కొరియన్లు చాలా సీరియస్‌గా తీసుకుంటారు.
‘‘దక్షిణ కొరియా వాసులు వయసుకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఎవరినైనా ఎలా పిలవాలో ఒక అవగాహనకు వచ్చేందుకు ముందుగా వారు వయసును అడిగి తెలుసుకుంటారు’’అని కొరియా యూనివర్సిటీలోని కొరియన్ లాంగ్వేజీ అండ్ లిటరేచర్ విభాగం ప్రొఫెసర్ షిన్ జీ యంగ్ చెప్పారు.
చైనాలో మూలాలు
కొరియాలో వయసు లెక్కించే విధినాలకు మూలాలు చైనా, కొన్ని ఆసియా దేశాల్లో ఉన్నాయి. అయితే, ఇప్పుడు దక్షిణ కొరియాలో మాత్రమే ఇంకా ఇలాంటి విధానాలను ఉపయోగిస్తున్నారు.
‘‘ప్రపంచీకరణ వల్ల కొరియన్లలో అంతర్జాతీయంగా ఉపయోగించే వయసు లెక్కింపు విధానాలపై అవగాహన పెరిగింది. ముఖ్యంగా యువతపై ఈ ప్రభావం చాలా ఉంది. కొన్నిసార్లు ఈ విధానాల వల్ల తమను విదేశీయులు వెక్కిరిస్తున్నారని వారు చెబుతుంటారు’’అని హన్షుంగ్ యూనివర్సిటీ లా అండ్ పాలసీ విభాగం ప్రొఫెసర్ కిమ్ ఇన్-జు చెప్పారు.
అయితే, ఈ వెక్కిరింపులను పక్కన పెడితే, ఈ విధానాలు నిజంగానే దక్షిణ కొరియా వాసులపై ప్రభావం చూపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఉదాహరణకు మిగతా వారితో పోల్చినప్పుడు డిసెంబరులో పుట్టే పిల్లలకు దీని వల్ల చాలా అన్యాయం జరుగుతుందని కొంతమంది పిల్లల తల్లిదండ్రులు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు.
కరోనావైరస్ మహమ్మారి వ్యాపించిన తొలి నాళ్లలో కూడా అంతర్జాతీయంగా వయసు లెక్కింపు విధానాలను అనుసరించాలని డిమాండ్లు వచ్చాయి. ముఖ్యంగా వ్యాక్సీన్లు వేయించుకునేందుకు అనుమతించే వయసు విషయంలో ఈ గందరగోళం నెలకొంది.
ఈ విధానాలతో అనవసర ఖర్చులు, తలనొప్పులు పెరుగుతున్నాయని లీ వ్యాఖ్యానించారు. ఇటీవల వివాదం రేపిన ఓ కేసు గురించి ఆయన ప్రస్తావించారు. వయసు విషయంలో నెలకొన్న గందరగోళంతో తనకు అదనంగా పింఛను ఇప్పించాలని ఓ వ్యక్తి దేశ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
పక్కన పెట్టేస్తారా?
అంతటా ఒకే రకమైన వయసు లెక్కింపు విధానాల కోసం దక్షిణ కొరియాలో డిమాండ్లు రావడం ఇదేమీ తొలిసారి కాదు.
2019, 2021లో కూడా ఇలాంటి విధానంపై ఇద్దరు చట్టసభ సభ్యులు బిల్లులను ప్రతిపాదించారు. అయితే, ఇవి చట్టరూపం దాల్చలేదు.
ఈ విషయంలో నిపుణుల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. పరిపాలనా పరంగా కొత్త మార్పులతో సౌలభ్యం ఉండేటప్పటికీ సమాజానికి దీని వల్ల ఏం ఉపయోగం ఉంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఇక్కడి సమాజం, సంప్రదాయాలను ఆ వయసు లెక్కింపు విధానం ప్రతిబింబిస్తుందని డాన్‌కుక్ యూనివర్సిటీలోని ఓరియెంటల్ స్టరీస్ రీసెర్చ్ సెంటర్ సీనియర్ పరిశోధకుడు జాంగ్ యూ సీయుంగ్ వ్యాఖ్యానించారు.
‘‘ఏళ్లనుంచి కొనసాగుతన్న ఈ సంప్రదాయాన్ని వదిలేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇలా మన సంప్రదాయాలను పక్కనపెట్టేసే మూసధోరణులకు మనం అలవాటు పడిపోతున్నామా?’’అని ఆయన ప్రశ్నించారు.
అయితే, అంతర్జాతీయ వయసు లెక్కింపు విధానాలను అమలులోకి తీసుకొచ్చినప్పటికీ, కొందరు కొరియన్లు ఇంకా ఈ పాత విధానాన్ని కొనసాగిస్తుంటారనే అంశంపై అందరూ ఏకీభవిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘శ్రీలంకలో అర్యులు రావటానికి ముందునుంచీ ఉన్న తొట్టతొలి ఆదివాసీ ప్రజల్లో మిగిలిన చిట్టచివరి జనం’
- నవనీత్ కౌర్ రానా: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఢీకొడుతున్న తెలుగు మాజీ హీరోయిన్
- కాకాణి Vs అనిల్: 1960ల నుంచీ నెల్లూరు రాజకీయాల్లో వర్గ పోరు చరిత్ర ఇదీ..
- 7 లక్షల జనాభా ఉన్న చిన్న దేశంతో చైనా ఒప్పందం: భయపడుతోన్న ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికా...
- అజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా: మసీదుల్లో మైకులు ఇప్పుడు ఎందుకు వివాదంగా మారాయి? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












