కొరియా: చరిత్రలోనే ‘అత్యంత సుదీర్ఘ యుద్ధం’: మొదలై 70 ఏళ్లు దాటినా ఇంకా ఎందుకు సమాప్తం కాలేదు?

కొరియా యుద్ధం

ఫొటో సోర్స్, US National Archives

ఫొటో క్యాప్షన్, కొరియా యుద్ధం
    • రచయిత, వెంకట కిషన్ ప్రసాద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మరో రెండు రోజుల్లో 2021 సంవత్సరం ముగుస్తుందనగా.. కొరియా యుద్ధం సమాప్తమైందని లాంఛనంగా ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి దక్షిణ కొరియా, అమెరికా. అయితే, చరిత్ర తెలిసిన వారెవ్వరికైనా ఇది కాస్త ఆశ్చర్యమే కలిగిస్తుంది.

ఎందుకంటే, కొరియా యుద్ధం 1953లోనే ముగిసింది. మరి యుద్ధ విరమణ ఒప్పందం అనాడే కుదిరినప్పుడు.. మళ్లీ ఇప్పుడు కొత్తగా యుద్ధం సమాప్తం కావటం ఏంటి? అనే ప్రశ్న ఎవరి మనసులోనైనా మెదులుతుంది.

అవును... 1950 జూన్ 25న మొదలై, 1953 జులై 27న నిలిచిపోయిన కొరియా యుద్ధం అధికారికంగా ఈనాటికీ ముగిసిపోలేదు. కాబట్టి దీన్ని చరిత్రలోనే ‘అత్యంత సుదీర్ఘ యుద్ధం’గా, ‘అంతులేని యుద్ధం’గా కూడా పిలుస్తారు.

ఇంతకూ కొరియా యుద్ధం కథేంటి? అసలు కొరియా ద్వీపకల్పం ఎప్పుడు, ఎలా రెండు దేశాలుగా విడిపోయింది? ఆనాడే నిలిచిపోయిన యుద్ధాన్ని ఇప్పుడు ముగిస్తున్నట్టుగా అధికారిక ప్రకటన చేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాలేంటి?

కొరియా యుద్ధం

ఫొటో సోర్స్, US National Archives

కొరియా యుద్ధం కథ

కొరియా యుద్ధం కథను అది మొదలు కావడానికి 50 ఏళ్ల ముందు నుంచి, అంటే 20వ శతాబ్ది ఆరంభం నుంచి చూడాల్సి ఉంటుంది

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా - ఇలా రెండు దేశాలుగా మనకు పరిచయమైన ఈ ప్రాంతాన్ని భౌగోళిక పరిభాషలో కొరియా ద్వీపకల్పం అని పిలుస్తారు.

ఈశాన్య ఆసియా ప్రాంతంలో ఉండే ఈ ద్వీపకల్పానికి ఉత్తరాన... లేదా ఇప్పటి రాజకీయ చిత్రపటం ప్రకారం చెప్పుకోవాలంటే, ఉత్తర కొరియాకు ఉత్తరాన చైనా, తూర్పున జపాన్ సముద్రం, దాని ఆవల జపాన్ దేశం ఉంటాయి.

ఈనాడు ప్రపంచంలో అమెరికా తర్వాత రెండో అతి పెద్ద ఆర్థికవ్యవస్థ చైనా. ఇప్పుడు మూడో స్థానంలో ఉన్న జపాన్ నిన్నమొన్నటి వరకూ రెండో అతి పెద్ద ఎకానమీ అన్నదీ మనకు తెలుసు. కాబట్టి ఈ రెండు సంపన్నదేశాలకు మధ్యలో ఉన్న కొరియా ద్వీపకల్పం ఎంత వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉందో సులువుగానే అర్థం చేసుకోవచ్చు.

1910 నుంచి 1945 వరకూ - అంటే 35 ఏళ్ల పాటు కొరియా ద్వీపకల్పం జపాన్ వలసగా ఉండేది. ఆనాటికి ఈ ద్వీపకల్పమంతా ఒకే దేశం. ఇక జపాన్ గురించి చెప్పాలంటే... 20వ శతాబ్దం ప్రారంభం నాటికే అదో సూపర్ పవర్‌... ఆర్థికంగా, పారిశ్రామికంగా, సైనికంగా చాలా బలమైన సామ్రాజ్యం.

కొరియాలో జపాన్ వలసపాలన మొదట్లో అత్యంత క్రూరంగా ఉండేది. అయితే, 1919లో జపాన్ వలసవాద పాలనకు వ్యతిరేకంగా జరిగిన దేశవ్యాప్త ఉద్యమం ఫలితంగా కొరియన్లకు ఓ మేరకు భావ ప్రకటన స్వేచ్ఛ లభించింది.

కొరియా యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొరియన్ మహిళలను జపాన్ సైనికుల కోసం సెక్స్ బానిసలుగా తరలించారు.

కానీ, 1939-45 మధ్య, అంటే రెండో ప్రపంచ యుద్ధకాలంలో కొరియన్లపైన మళ్లీ కఠిన ఆంక్షల్ని అమలు చేశారు జపాన్ పాలకులు. వేలాది మంది కొరియన్ మహిళలను జపాన్ సైనికుల కోసం కంఫర్ట్ విమెన్‌... అంటే సెక్స్ బానిసలుగా తరలించారు.

ఆఖరుకు కొరియన్లు తమ పేర్లను కూడా మార్చుకొని జాపనీస్ పేర్లు పెట్టుకొనేలా ఒత్తిడి చేశారు నాటి జపాన్ పాలకులు.

అయితే ఈ కథకు మరో పార్శ్వం కూడా ఉంది. జపాన్ పాలన ఎంతో దుర్భరంగా, మరెంతో దుర్మార్గంగా సాగినప్పటికీ 35 ఏళ్ల కాలంలో అది కొరియాను కొంత వరకు అభివృద్ధి కూడా చేసింది.

పారిశ్రామిక అభివృద్ధితో పాటు కొరియాలో రేడియో, సినిమా లాంటివి మొదలైంది కూడా ఆ కాలంలోనే. 1945లో జపాన్ లొంగిపోయే నాటికి ఆసియాలో బాగా పారిశ్రామీకరణ చెందిన దేశాల్లో జపాన్ తర్వాత, రెండో స్థానం కొరియాదే.

ఇక రెండో ప్రపంచయుద్ధం తర్వాత కొరియా కథ మరో మలుపు తీసుకుంది. దానికి ప్రధాన కారణం - యుద్ధానంతర ప్రపంచంలో అమెరికా, రష్యాల మధ్య మొదలైన ఆధిపత్య పోటీ.

ఆ పోటీ కేవలం రెండు అగ్రరాజ్యాల మధ్య మాత్రమే కాదు... రెండు విభిన్న భావజాలాల పోటీ కూడా. ఒకటి కమ్యూనిజం, మరొకటి క్యాపిటలిజం - అంటే పెట్టుబడిదారీ విధానం.

కొరియా యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

అప్పటికే చైనాలో మావో నేతృత్వంలో కమ్యూనిస్టు విప్లవం పురోగమిస్తూ ఉండటం... చైనా-సోవియట్ యూనియన్‌ల చెలిమి బలపడి అమెరికా నేతృత్వంలోని పెట్టుబడిదారీ ప్రపంచానికి సవాల్ విసురుతూ ఉండటం.. ఈ నేపథ్యంలో ఈశాన్య ఆసియాలో కమ్యూనిస్ట్ ఆధిపత్యానికి చెక్ పెట్టాలంటే కొరియాను ఓ పావులా వాడుకోవాలనే పథకం వేసింది అమెరికా.

ఇక మరోవైపు.. కొరియా గనక అమెరికా పట్టులోకి వెళ్లినట్టయితే అది చైనా మనుగడకే ముప్పులా మారొచ్చనే ఆందోళన కమ్యూనిస్ట్ శిబిరాన్ని వేధించింది.

కానీ జపాన్ వలసవాద పాలనలో నష్టపోయిన కొరియన్ ప్రజల కోణంలో చూస్తే... ఆనాడు జపాన్‌ను ఓడించిన చైనా వారి దృష్టిలో హీరో. ఎందుకంటే, 1935లో చైనా కూడా కొరియా లాగానే జపాన్ ఆక్రమణకు గురైంది.

కానీ అప్పటి వరకూ ఎదురే లేని జపాన్ సామ్రాజ్యవాద సైన్యాన్ని చరిత్రలో మొట్టమొదటిసారి మట్టిగరిపించింది మావో నాయకత్వంలోని చైనా ఎర్రసైన్యం.

అంతేకాదు, ఈశాన్య చైనా సరిహద్దు ప్రాంతాల్లో జపాన్‌ వ్యతిరేక యుద్ధంలో చైనీయులతో పాటు కొరియన్లు కూడా కలిసి పోరాడారు. దాంతో కొరియన్లలో, ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతంలో కమ్యూనిస్టు ప్రభావం బాగా వ్యాపించింది.

కొరియా యుద్ధం

ఫొటో సోర్స్, Historical/Getty

కొరియా విభజన - ఎలా, ఎందుకు, ఎప్పుడు?

1945‌లో హిరోషిమా, నాగసాకిల్లో అణుబాంబు దాడులు.. అగస్ట్ 15న జపాన్ లొంగుబాటుతో కొరియాలో గందరగోళం, అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశంలో అప్పటికే అంతర్యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది.

రెండో ప్రపంచ యుద్ధ విజేతలైన అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య ఈ దేశం రాజకీయంగానే కాదు, భౌగోళికంగా కూడా రెండుగా విడిపోయింది. సమైక్య కొరియా ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైన అమెరికా, సోవియట్ యూనియన్లు... 1948లో రెండు వేర్వేరు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి.

దక్షిణాదిన సోల్ రాజధానిగా ఏర్పడ్డ రిపబ్లిక్ ఆఫ్ కొరియా... అమెరికా వైపుండగా, ఉత్తరాదిన ప్యోంగ్యాంగ్ కేంద్రంగా ఏర్పడ్డ డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా... సోవియట్ యూనియన్ పట్టులో ఉండిపోయింది. రెండింటికీ మధ్య స్థూలంగా 38వ పారలెల్‌ను... అంటే 38వ అక్షాంశరేఖను సరిహద్దుగా నిర్ణయించారు.

అయితే, ఈ విభజనను రెండు పక్షాలూ అంగీకరించలేదు. ఉత్తర, దక్షిణ కొరియాల ప్రభుత్వాలు రెండూ... ద్వీపకల్పానికంతా తామే అసలైన ప్రతినిధులమని చెప్పుకునేవి. రెండు ప్రభుత్వాలూ ఉభయ కొరియాలను ఏకం చేసి మొత్తం దేశాన్నంతా పాలించాలనే పంతంతో ఉండేవి.

అప్పటికి స్టాలిన్ మద్దతు గల కిమ్ ఇల్ సంగ్… అంటే నేటి కిమ్ జోంగ్ ఉన్ తాత నాయకత్వంలోని వర్కర్స్ పార్టీ ఉత్తర కొరియాను పాలిస్తుండగా... అమెరికా దన్నుగల సింగ్మాన్ రీ దక్షిణ కొరియా అధినేతగా ఉన్నారు. దక్షిణ కొరియాలో పార్లమెంటరీ తరహా ప్రజాస్వామిక పాలన మొదలు కాగా, ఉత్తర కొరియాలో మాత్రం చైనా తరహాలో పరోక్ష ఎన్నికలతో కూడిన ఏకవ్యక్తి పాలనే కొనసాగుతూ వచ్చింది.

కొరియా యుద్ధం

ఫొటో సోర్స్, Bert Hardy/Getty

యుద్ధం ఎలా మొదలైంది?

కొరియా యుద్ధాన్ని ఎవరు, ఎలా మొదలుపెట్టారన్నదానిపై భిన్న వాదనలున్నాయి.

రెండుగా విడిపోయిన కొరియాను మళ్లీ ఏకం చేయాలనే పట్టుదలతో ఉన్న కిమ్ ఇల్ సంగ్... దక్షిణ కొరియాపైన దండెత్తడం కోసం ముందుగా రష్యాను, ఆ తర్వాత చైనాను సాయం కోరారు. మొదట తటపటాయించినా ఆ తర్వాత ఇవి రెండూ ఉత్తర కొరియా సైన్యానికి సాయపడేందుకు ముందుకు వచ్చాయని చరిత్రకారుడు బ్రాడ్లీ కే. మార్టిన్ అంటారు.

1950 జూన్ 25న సోవియట్ యూనియన్, చైనా మద్దతు గల ఉత్తర కొరియా సైన్యాలు, 38వ అక్షాంశరేఖను దాటి, 150 టీ-34 రష్యన్ ట్యాంకులతో దక్షిణ కొరియాపై దాడికి దిగాయి.

ఇది రష్యా, చైనాల మద్దతుతో ఉత్తర కొరియా పాల్పడ్డ ఏకపక్ష దాడి అనేది అమెరికా, దక్షిణ కొరియా వైపు నుంచి వినిపించే కథనం.

కానీ అప్పటికే జపాన్, ఒకినావా, ఫిలిప్పీన్స్, గువామ్‌లలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా, వియత్నాంపై ఫ్రాన్స్ చేస్తున్న యుద్ధానికి ప్రత్యక్షంగా అండదండలు అందిస్తున్న అమెరికా... కమ్యూనిస్ట్ చైనాను దెబ్బతీసే వ్యూహంలో భాగంగానే కొరియాలో చిచ్చురేపిందనేది చైనా, ఉత్తర కొరియాలతో పాటు, ఆనాటి సోవియట్ యూనియన్ వాదన.

నిజానికి మొదట ఇది అంతర్యుద్ధం రూపంలోనే ప్రారంభమైంది. కానీ యుద్ధం మొదలైన రెండో రోజే అమెరికా యాక్షన్‌లోకి దిగింది. అదే సమయంలో అమెరికా తైవాన్‌లో కూడా సైన్యాలను దించి చైనాకు చెక్ పెట్టింది. మరోవైపు,దక్షిణ కొరియాకు సాయం అందించేలా యూఎన్‌ను ఒప్పించింది. అలా యూఎన్ తరఫున కొరియా యుద్ధరంగంలో ప్రత్యక్షంగా అడుగుపెట్టింది అమెరికన్ సైన్యం.

మొత్తానికి మొదలుపెట్టింది ఎవరైనప్పటికీ - కొరియా యుద్ధాన్ని ముందుకు నడిపించింది మాత్రం అటు అమెరికా, ఇటు సోవియట్ యూనియన్-చైనాలే అన్నది మాత్రం నిర్వివాదం.

కొరియా యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఎవరూ విజేతగా తేలని మూడేళ్ల యుద్ధం

ఉత్తర కొరియా అధినేత కిమ్ ఇల్ సంగ్ సైన్యాలు 38వ అక్షాంశరేఖను దాటి, చాలా దూకుడుగా ముందుకు సాగి కొద్ది రోజుల్లోనే రాజధాని సోల్‌ను వశపర్చుకున్నాయి. రెండు నెలల్లో, దక్షిణ కొసన ఉన్న బూసాన్ ను వదిలేస్తే... మిగతా దక్షిణ కొరియానంతా ఆక్రమించుకుంది ఉత్తర కొరియా.

మరోవైపు... యూఎన్ కమాండర్ మెక్ ఆర్థర్ నాయకత్వంలోని యూఎన్-అమెరికా బలగాలు ఉత్తర కొరియా సరఫరా వ్యవస్థను దెబ్బతీసే లక్ష్యంతో దాడుల్ని కేంద్రీకరించాయి.

ఒక్కో పట్టణాన్ని మళ్లీ స్వాధీనం చేసుకుంటూ ఉత్తర కొరియా సైన్యాలను ఏడాది లోపే చైనా సరిహద్దులోని యాలూ నది వరకూ తరిమికొట్టాయి యూఎన్-అమెరికా సైన్యాలు.

ఈ యుద్ధంలో ఉత్తర కొరియాపైన అమెరికా 6 లక్షల 35 వేల టన్నుల బాంబుల్ని కురిపించింది. వీటిలో కేవలం 2 లక్షల బాంబుల్ని ఒక్క ప్యోంగ్యాంగ్ నగరంపైనే ప్రయోగించిందంటే... ఆ బాంబుదాడుల తీవ్రతేంటో అర్థం చేసుకోవచ్చు. అంటే నగరంలోని ఒక్కో పౌరుడిపైన ఒక బాంబు చొప్పున ప్రయోగించిందన్నమాట.

ఇక మరోవైపు... ఉత్తర కొరియా మనుగడలో లేకుండా పోయే ప్రమాదాన్ని పసిగట్టిన కమ్యూనిస్ట్ చైనా... మరింత మంది వాలంటీర్ సైన్యాలను రంగంలోకి దించింది.

ఎందుకంటే, చైనా ఈశాన్య ప్రాంతం ఆ దేశ పారిశ్రామిక రంగానికే ఆయువుపట్టు లాంటిది. యుద్ధంలోంచి కోలుకొని అప్పుడప్పుడే ఎదుగుతున్న చైనా భారీ పరిశ్రమల్లో సగభాగం వరకూ ఉన్నది ఈ ప్రాంతంలోనే.

కాబట్టి ఉత్తర కొరియా అమెరికా పట్టులోకి వెళ్తే, దాని బాంబర్ విమానాల రేంజ్ లోకి తమ భారీ పరిశ్రమలు కూడా వచ్చేస్తాయన్నది చైనా భయం.

కొరియా యుద్ధం

ఫొటో సోర్స్, Bettmann/Getty

చైనా-ఉత్తర కొరియా సైన్యాల ఎదురుదాడితో యూఎన్-అమెరికా బలగాలు మళ్లీ వెనక్కి తగ్గాయి. కానీ 1953 మే నాటికి యుద్ధరంగంలో ప్రతిష్టంభన ఏర్పడి, ఎవరూ ఎవరిపైనా నిర్ణయాత్మక విజయాన్ని సాధించలేని స్థితికి చేరుకున్నారు. అలా ఆ యుద్ధంలో ఎవరూ విజేతగా తేలలేదు.

చివరకు, 1953 జులైలో అమెరికా, చైనా, ఉత్తర కొరియాల మధ్య యుద్ధాన్ని నిలిపివేయాలనే ఒప్పందం -అంటే యుద్ధ విరమణ సంధి(armistice) కుదిరింది. కానీ దానికి సౌత్ కొరియా ససేమిరా అనటంతో అధికారిక శాంతి సంధి మాత్రం జరగలేదు. అలా టెక్నికల్‌గా చూస్తే... గత 70 ఏళ్లుగా ఉభయ కొరియాలు ఇంకా యుద్ధంలోనే కొనసాగుతున్నట్టు లెక్క.

మొత్తానికి యుద్ధానికి కారణాలేవైనా... మూడేళ్ల భీకర యుద్ధంలో దారుణంగా నష్టపోయింది మాత్రం కొరియా ద్వీపకల్పమే. 38వ అక్షాంశ రేఖకు రెండు వైపులా ఎన్నో నగరాలూ, గ్రామాలూ వల్లకాడుల్లా మారిపోయాయి.

ఉత్తర, దక్షిణ కొరియాలకు చెందిన 6,20,000 మంది సైనికులు యుద్ధంలో చనిపోయారు. అయితే, అందరికన్నా ఎక్కువ మూల్యం చెల్లించింది మాత్రం సామాన్య కొరియన్లే. నాటి మూడేళ్ల యుద్ధం...దాదాపు 16 లక్షల మంది సామాన్యుల ప్రాణాలు బలితీసుకుందని అంచనా.

ఇక ఈ యుద్ధంలో 36 వేల మంది అమెరికన్ సైనికులు చనిపోగా, లక్ష మందికి పైగా గాయపడ్డారు.

కొరియా యుద్ధం

ఫొటో సోర్స్, Anadolu Agency/Getty

అమెరికా ఆధిపత్యానికి ఈ ప్రాంతం కీలకం

కొరియా ద్వీపకల్పం అమెరికా దృష్టిలో అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. ఇటీవలి లెక్కల ప్రకారం, అమెరికాకు ప్రపంచం మొత్తంలో 80 దేశాల్లో 750 మిలిటరీ బేస్‌లున్నాయి. అన్నింటికన్నా ఎక్కువగా 120 బేస్‌లు జపాన్‌లో ఉండగా, దక్షిణ కొరియాలో 54 అమెరికన్ మిలిటరీ బేసులున్నాయి.

జపాన్‌లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచీ అమెరికా సైనిక స్థావరాలు కొనసాగుతుండగా... దక్షిణ కొరియాలో 1953 యుద్ధం ముగిసినప్పటి నుంచీ ఇవి కొనసాగుతున్నాయి.

కొరియా యుద్ధం

ఫొటో సోర్స్, NurPhoto/Getty

దక్షిణ కొరియాలోని క్యాంప్ హంఫ్రేస్... ఈనాటికీ విదేశీ గడ్డపై ఉన్న అతి పెద్ద అమెరికన్ మిలిటరీ బేస్.

సోల్‌కు దక్షిణాన 65 కిలోమీటర్ల దూరంలో, ఉత్తర కొరియా సరిహద్దుకు కేవలం వంద కిలోమీటర్ల లోపు దూరంలో ఉంటుంది ఈ అమెరికన్ మిలిటరీ బేస్.

అమెరికా 159 దేశాల్లో మొత్తం లక్షా 73 వేల మంది సైనికుల్ని మోహరించింది. జపాన్‌లో మోహరించిన అమెరికన్ సైనికుల సంఖ్య 53 వేలకు పైగా ఉండగా, దక్షిణ కొరియాలో అమెరికన్ సైనికులు 26 వేలకు పైగా ఉన్నారు.

ప్రపంచంలోని వివిధ దేశాల్లో మోహరించిన మొత్తం అమెరికన్ సైన్యాల్లో దాదాపు సగభాగం ఈ రెండు దేశాల్లోనే ఉన్నాయంటే, అమెరికాకు ఈ ప్రాంతం ఎందుకంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ముందే చెప్పుకున్నట్టుగా, చైనాకు ఇవి రెండూ అత్యంత సమీపంలో ఉండటమే దీనికి ప్రధాన కారణం.

కొరియా యుద్ధం

ఫొటో సోర్స్, Hulton Archive/Getty

1953 తర్వాత ఏం జరిగింది?

యుద్ధ విరమణ సంధి కుదిరిన తర్వాత చైనా, సోవియట్ మద్దతుతో నార్త్ కొరియా దక్షిణ కొరియాకన్నా వేగంగా వృద్ధిని సాధించింది. మరోవైపు, 1960ల చివర్లో పార్క్ చెయుంగ్ హీ అధ్యక్షతన దక్షిణ కొరియా భారీ వృద్ధిని సాధించింది.

ఆ తర్వాత, రెండు దేశాల మధ్య యుద్ధమైతే జరగలేదు కానీ, హత్యాయత్నాలు, దాడులు, విచ్ఛిన్నకర చర్యలు మాత్రం లెక్కలేనన్ని జరిగాయి. వీటిలో ఎక్కువ భాగం ఆరోపణలు ఉత్తర కొరియాపైనే ఉన్నాయి.

అయితే, దాదాపు ఇరవయ్యేళ్ల పాటు, అంటే 1971 వరకూ ఉత్తర, దక్షిణ కొరియా ప్రభుత్వాల మధ్య ఎలాంటి అధికారిక సంప్రదింపులూ జరగలేదు.

1991 నాటికి ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతలు కొంత తగ్గాయి. సోల్, ప్యోంగ్యాంగ్‌ల మధ్య నార్త్-సౌత్ బేసిక్ అగ్రీమెంట్ కుదిరింది.

అయితే, ఉత్తర కొరియా అణ్వాయుధాలు సమకూర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టడం, 1994లో కిమ్ ఇల్ సుంగ్ మరణించడంతో రెండు కొరియాల మధ్య కొత్త ఉద్రిక్తతలు మొదలయ్యాయి.

జూన్ 2000 సంవత్సరంలో ఉభయ కొరియాల సదస్సు జరిగింది. ఆ సదస్సులో 'తాను అణ్వాయుధాలు సమకూర్చుకుంటున్నాన'ని బాహాటంగా వెల్లడించింది ఉత్తర కొరియా. దాంతో మరోసారి పీటముడి పడింది.

ఆ తర్వాత ఉత్తర, దక్షిణ కొరియాలతో పాటు చైనా, రష్యా, అమెరికా, జపాన్ - ఆరు దేశాల మధ్య పలు దఫాలు ఈ అంశంపైన చర్చలు జరిగాయి. కానీ 2009లో తన యాంగ్బోన్ న్యూక్లియర్ రియాక్టర్‌ను మళ్లీ ప్రారంభించిన ఉత్తర కొరియా... ఆ సంభాషణల్లోంచి వైదొలిగింది. ఆ తర్వాత వరుసగా పలు మార్లు మిసైల్ పరీక్షలు నిర్వహించింది.

2007లో దక్షిణ కొరియా అధ్యక్షుడు రోహ్ మూ హ్యూన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఇల్‌ల భేటీ ప్యోంగ్యాంగ్‌లో జరిగింది. తాము శాంతి కోసం ప్రయత్నిస్తామని, బయటి పక్షాల జోక్యం లేకుండా ద్వీపకల్పాన్ని పునరైక్యం చేస్తామని ఇద్దరు నేతలూ ప్రకటించారు.

ఆ తర్వాత దక్షిణ కొరియాకు అధ్యక్షుడిగా ఎన్నికైన సంప్రదాయవాద నేత లీ మ్యంగ్-బాక్... ఉత్తర కొరియా పట్ల కఠిన వైఖరిని చేపడుతూ అణ్వాయుధాలనే ప్రధానాంశంగా చేపట్టారు. దాంతో పురోగతి మళ్లీ నిలిచిపోయింది.

ఇక 2018లో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ ఇద్దరూ భేటీ అయ్యారు. 1953 నాటి యుద్ధ విరమణ ఒప్పందాన్ని శాంతి సంధిగా మారుస్తామని ఇద్దరు నేతలూ హామీ ఇచ్చారు.

వీడియో క్యాప్షన్, ట్రంప్-కిమ్ సదస్సు: చరిత్రాత్మక కరచాలనం ఇదే

ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో రెండు సార్లు కిమ్ భేటీ జరిగింది కానీ అణ్వాయుధాల తయారీ విషయంలో కిమ్‌ను ఒప్పించడంలో ఆయన కూడా విఫలమయ్యారు.

తమ దేశంపైన ఆంక్షల్ని ఎత్తివేస్తే తప్ప చర్చల్లో ముందుకు సాగనని కిమ్ మొండికేయడంతో ఆ ప్రక్రియలో మళ్లీ ప్రతిష్టంభన ఏర్పడింది. ఏదేమైనా, అడపాదడపా మిసైల్ పరీక్షలతో ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేయడాన్ని మాత్రం కిమ్ ఈనాటికీ మానలేదు.

కొరియా యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

శాంతి సంధితో ఏం జరుగుతుంది?

నాటి కొరియా యుద్ధం సమాప్తమైనట్టు ఈనాడు అధికారికంగా ప్రకటించడం వల్ల ఏం జరుగుతుంది? ప్రస్తుతానికైతే జరిగేది ఏమీ ఉండదనే చెప్పుకోవచ్చు. ముందుగా, ఈ ఒప్పందం డ్రాఫ్టును సంబంధిత దేశాలన్నీ ఆమోదించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నాడు యుద్ధ విరమణ ఒప్పందంపై సంతకాలు చేసిన ఉత్తర కొరియా, చైనాలు దీనికి ఓకే అనాల్సి ఉంటుంది.

ఉత్తర కొరియా నుంచైతే ప్రస్తుతానికి పాజిటివ్ సంకేతాలే ఉన్నాయి. కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ దీన్ని స్వాగతించారు.

అయితే, ఉత్తర కొరియా పట్ల శత్రుపూరిత వైఖరిని వదులుకోవాలని ఆమె అమెరికా, దక్షిణ కొరియాలను కోరారు. కానీ, దీనిపైఉత్తర కొరియా అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సే ఉంది.

ఇకపోతే, అన్నింటికన్నా ఆసక్తికరంగా వేచి చూడాల్సింది - దీనిపై చైనా వైఖరి ఎలా ఉంటుందనేదే. ఆ తర్వాతే కొరియా పునరేకీకరణ అనే కల నిజమయ్యేందుకు వాస్తవంగా ఉన్న అవకాశాలేంటో స్పష్టం కావచ్చు.

వీడియో క్యాప్షన్, ఉ.కొరియాతో యుద్ధం వస్తే పరిణామాలు ఎలా ఉండొచ్చనే అంశంపై అమెరికా నిపుణులు ఇద్దరు బీబీసీతో మాట్లాడారు.
ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)