Playfulness: ఆటలు ఆడట్లేదా? అయితే, మీరు ఏం కోల్పోతున్నారో తెలుసా..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎలీ స్మిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆటలు ఆడడం పెద్దలకు కూడా మానసికారోగ్యాన్ని చేకూరుస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ, చాలామంది ఒక వయసు దాటాక ఆటలు ఆడడం మానేస్తారు. సరదాగా ఉండడం కూడా మర్చిపోతారు.
బాల్యాన్ని దాటి, బొమ్మలతో ఆడడం మానేశాక తిరిగి ఆటల వైపు మనసును మళ్లించడం ఎలా? పెద్ద వయసులో కూడా ఆటల వలన కలిగే ప్రయోజనాలు పొందాలంటే ఏం చేయాలి?
ఫెడరికా పల్లవిసిని తండ్రికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. సర్జరీ చేశారు. ఆయన తొందరగా కోలుకోవడానికి ఏం చేయాలా అని ఆమె మథనపడ్డారు.
"ఆయన మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఏదైనా చేయాలనుకున్నాను. కానీ, అది ఆయనకు భారం కాకూడదు. ఆయనకు తెలియకుండా మెదడు చురుకుదనాన్ని పెంచగలగాలి" అంటూ ఫెడరికా చెప్పుకొచ్చారు.
అప్పుడే ఆమె దృష్టి వీడియో గేమ్స్‌పై పడింది. ఇటలీలోని మిలానో-బికోకా విశ్వవిద్యాలయంలో వర్చువల్ రియాలిటీ, వీడియో గేమ్స్ మానసికారోగ్యం, సంక్షేమంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయనే అంశంపై అధ్యయనం చేస్తున్నారు ఫెడరికా. ఒక సైకాలజిస్టుగా వీడియో గేమ్స్ కలిగించే సానుకూల ప్రభావం ఆమెకు తెలుసు.
అంతే కాకుండా, కాల్ ఆఫ్ డ్యూటీ (సీఓడీ) అనే వీడియో గేమ్స్ ఆడిన తరువాత తన మానసిక ఆరోగ్యం మెరుగుపడడం, ఒత్తిడి తగ్గడం గతంలో ఆమె గమనించారు.
అయితే, సీఓడీ గేమ్స్ (షూటింగ్ గేమ్స్) హింసను ప్రేరేపిస్తాయని, ఒత్తిడి పెంచుతాయన్నది సాధారణ భావన.
కానీ, ఈ ఆట ఆడడం ఆమెకు థెరపీలా పనిచేసిందని, రోజువారి జీవితంలో ప్రయోజనాలు చేకూర్చిందని ఫెడరికా అంటున్నారు. తరువాత, ఈ అంశంలో తాను రిసెర్చ్ చేసేందుకు స్ఫూర్తినిచ్చిందని కూడా చెప్పారు.
ఇవన్నీ ఆలోచించిన తరువాత, తన తండ్రికి కూడా వీడియో గేమ్స్ ఆడడం నేర్పిస్తే లాభం ఉండవచ్చని ఆమె భావించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆమె అలా అనుకోవడానికి కారణాలున్నాయి. ఉల్లాసంగా ఆటలు ఆడుతూ ఉండే వ్యక్తులు స్వాభావికంగా సృజనాత్మకంగా ఉంటారు. అలాంటి వారికి బీపీ కూడా తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే, కొత్త అవకాశాలను అన్వేషించడంలో ముందుంటారు.
అలా కాకుండా, ఆటలకు దూరంగా ఉండేవారు ఖాళీ సమయాల్లో విశ్రాంతి తీసుకోవడానికి కష్టపడతారు. వారికి తొందరగా బోరు కొడుతుంది. హాయిగా సేద తీరలేరు. అది వారి మెదడుపై ప్రభావం చూపిస్తుంది.
మరెందుకు మనమంతా పెద్దయ్యాక ఆటలు ఆడడం మానేస్తాం? ఆ అలవాటును తిరిగి తెచ్చుకోవడమెలా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
సరదాగా ఉండడం, ఆటలు ఆడడం వలన పెద్ద ప్రయోజనాలుంటాయి
ఆటలు ఆడే వ్యక్తులు తమ రోజువారీ కార్యక్రమాలను వినోదభరితంగా, మేధోపరంగా ఉత్తేజం కలిగించేలా రూపొందించుకోగలుగుతారని జర్మనీలోని మార్టిన్ లూథర్ యూనివర్సిటీ హాలే-విటెన్‌బర్గ్‌లోకి సైకాలజీ ప్రొఫెసర్ రెనే ప్రోయర్ చెప్పారు.
వేలంవెర్రిగా క్యాండీ క్రష్ ఆడడం, స్నేహితులతో కలిసి మరే ఇతర వీడియో గేమ్స్ ఆడడం, లేదా మిత్రులతో, కలీగ్స్‌తో ప్రయివేటు జోకులు వేయడం.. ఇవన్నీ ఆటలు ఆడే స్వభావాన్నే తెలియజేస్తాయి. కానీ, వీటి ప్రయోజనాలను చాలావరకు ఎవరూ గుర్తించరు.
అయితే, ఆటలు ఆడే అలవాటును సాధనతో మళ్లీ పొందవచ్చని ప్రోయెర్ అంటారు. ధ్యానం, వ్యాయామం నేర్చుకున్నట్లే ఆటలు ఆడడం కూడా మళ్లీ నేర్చుకోవచ్చు. దీన్ని నేర్చుకోగల ఒక నైపుణ్యంగానే పరిగణించాలని ఆయన అంటారు.
ముందుగా మిమ్మల్ని మీరు గమనించుకోవడం మొదలుపెట్టాలని ప్రోయెర్ సూచించారు. రోజు చివరికొచ్చేసరికి, ఆ రోజులో మీరు అనుకోకుండా చేసిన మూడు విషయాలను రాసి పెట్టుకోవాలి.
కాఫీ కొనుక్కోవడానికి వెళ్లినప్పుడు అక్కడ కొత్తవారితో సరదాగా మాట్లాడిన సందర్భమో లేదా కలీగ్స్‌తో చెప్పిన జోకు.. ఇలా ఒక మూడు విషయాలు, ప్లాన్ చేసినవి కాకుండా, అప్పటికప్పుడు జరిగినవాటిని నోట్ చేసుకోవాలి. ఆ జాబితాను చూస్తే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఉల్లాసభరితంగా ఉండగలరనే నమ్మకం వస్తుంది.
అలాగే, వయసుతో సంబంధం లేకుండా దేన్నైనా చూసి లేదా అనుభవించి ఆనందించడానికి భయపడొద్దని ప్రోయెర్ సలాహా ఇస్తున్నారు.
ఉదాహరణకు పెద్దవాళ్లు ఆడే బోర్డు గేమ్స్‌లో అనేక నియమాలు, నిబంధనలు ఉంటాయి. వాటి ప్రకారమే ఆడితే గెలుపు ఓటములను మనం చాలా సీరియస్‌గా తీసుకుంటాం. ఇది మన మెదడుపై ఒత్తిడి పెంచుతుంది. నిబంధనల ప్రకారం ఆడుకుంటూ వెళ్లిపోతాం తప్పితే సృజనాత్మకంగా ఆలోచించం.
అలా కాకుండా, సరాదాగా, చిలిపిగా అవతలివాళ్లు ఊహించనిది ఏదో చేసి ఆటను ఉల్లాసభరితంగా మార్చే అవకాశముంటే అది మెరుగైన ప్రయోజనాలను అందిస్తుందని ప్రోయెర్ అంటారు.
ఆటను ఆస్వాదించడం అనేది మీ వ్యక్తిత్వంపై, కొత్త సంభాషణలకు, అనుభవాలకు మీరెంత సంసిద్ధంగా ఉన్నారన్న అంశంపై ఆధారపడి ఉంటుంది.
ఇంట్లో మీ భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో మీరు ఎంత సరదాగా ఉంటారో అదే పద్ధతిని ఆఫీసులో కలీగ్స్‌తో లేదా మరీ అంత సన్నిహితులు కానివారితో ప్రయోగించి చూడమని ప్రోయెర్ సూచిస్తున్నారు. సరదాగా ఉండడానికి వెనుకాడకుండా ఉంటే కలిగే సాంఘిక ప్రయోజనాలు అనేకం అని ఆయన అంటారు.
ఇవన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయిగానీ పెద్ద ప్రయోజనాలు చేకూరుస్తాయని ప్రోయెర్ చెబుతున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
'సమాజానికి ఆమోదయోగ్యంగా ఉండే సాకులు వెతుకండి'
పెద్దయ్యాక ఆటలపై ఆసక్తి పోవడానికి ప్రోయేర్ మరో కారణాన్ని వివరిస్తున్నారు. సమాజం అంగీకరించే ఆటలు అంత సరదాగా ఉండవు. చిలిపిగా ఏదైనా చేస్తే సమాజం అదోలా చూస్తుంది. అందువల్ల ఆటలపై ఆసక్తి తగ్గిపోతుంటుందని ఆయన అన్నారు.
అయితే, దీనికో మార్గం ఉందని యూనివర్సిటీ ఆఫ్ యార్క్‌లోని డిజిటల్ క్రియేటివిటీ ప్రొఫెసర్ సెబాస్టియన్ డిటర్డింగ్ చెబుతున్నారు.
అపరాధభావం లేకుండా సరదాగా ఆడాలంటే, సమాజం ఆమోదించే "సాకులు" కొన్ని తయారుచేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు.
ఉదాహరణగా డిటర్డింగ్ "మైండ్‌ఫుల్ కలరింగ్ బుక్: యాంటీ-స్ట్రెస్ ఆర్ట్ థెరపీ ఫర్ బిజీ పీపుల్" పుస్తకాన్ని చూపిస్తున్నారు. ఈ పుస్తకాన్ని ఎమ్మా ఫరారన్స్ రూపొందించారు.
సాధారణంగా పుస్తకాల్లో బొమ్మలకు రంగులు దిద్దడం చిన్నపిల్లలు చేసే పని. అదే పెద్దలు చేస్తే నవ్వుతారు. చిన్నపిల్లాల్లా కలరింగ్ చేస్తున్నారంటూ ఆట పట్టిస్తారు. కానీ, ఈ పుస్తకం పేరులోనే 'ఒత్తిడికి థెరపీ' అని చెప్పడంతో ఇందులో రంగులు దిద్దితే ఎవరూ ఎగతాళి చేయరు. ఇలాంటి సాకులు వెతుక్కోవాలంటారు డిటర్డింగ్.
సోషల్ మీడియా ఆటలు ఆడే అవకాశాలను పెంచింది
అయితే, ఇటీవల కాలంలో సోషల్ మీడియా హవా పెరుగుతుండడంతో సరదాగా ఉండడానికి, ఆటలు ఆడడానికి సిగ్గుపడడం తగ్గిందనే చెప్పాలి. ముఖ్యంగా యూట్యూబ్, ట్విట్చ్‌లాంటి వేదికలు గేమింగ్ సంస్కృతికి ప్రాచుర్యం కల్పిస్తున్నాయి.
హాయిగా, భేషజం లేకుండా వీడియో గేమ్స్ ఆడుకోవడానికి ఈ వేదికలు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కొంతమంది వీడియో గేమ్స్ ఆడడాన్ని కెరీర్‌గా మలుచుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా వీటిని ఆమోదిస్తున్నారు.
వీడియో గేమ్స్ ఆడితే ఒంటరిగా కూర్చున్నట్టు కనిపిస్తుందిగానీ వర్చువల్‌గా ఎందరో స్నేహితులను కూడగట్టుకోగలుగుతామని, ప్రపంచవ్యాప్తంగా మిత్రులు లభిస్తారని గేమర్స్ చెబుతున్నారు.
థెరపీలా పనిచేస్తూ, సాంఘికంగా కొంతవరకూ ఆమోదం ఉన్న ఆటలు వీడియో గేమ్స్ అని ఫెడరికా అంటున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇటీవల కాలంలో మొబైల్ గేమింగ్, వీడియో గేమ్స్ బాగా వృద్ధి చెందాయని, ఆడడం సరదా ఉన్న పెద్దలు కూడా వీటిని హాయిగా ఉపయోగిస్తున్నారని ఆమె అన్నారు.
2020లో గ్లోబల్ గేమింగ్ మార్కెట్ విలువ 174 బిలియన్ డాలర్లు (రూ.12,98,778 కోట్లు). 2026కి దీని విలువ 314 బిలియన్ డాలర్లకు (రూ.23,43,772 కోట్లు) పెరుగుతుందని అంచనా.
వీడియో గేమ్స్ వలన మానసికారోగ్యంపై కలిగే ప్రభావాన్ని ఒక "ప్రవాహం"గా అభివర్ణిస్తున్నారు ఫెడరికా. అంటే "దేని గురించీ పట్టించుకోకుండా, చేస్తున్న పని మీదే దృష్టి పెడుతూ ఆస్వాదిస్తున్నప్పుడు కలిగే ఆనందం". ఆ అనుభవాన్ని "ప్రవాహం" అంటున్నారామె. అది అథ్లెట్లు, క్రీడాకారులకు పొందే అనుభవంలాంటిది.
దీనికి వల్ల ఏ రకమైన ఒత్తిడి లేకుండా మానసికారోగ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశం కలుగుతుందని వివరిస్తున్నారు.
అలాగే ఆ గేమ్స్‌లో వచ్చే అప్‌డేట్స్, స్కోర్ మొదలైనవాటి గురించి ఇతరులతో చర్చించడం కూడా ఉల్లాసాన్ని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.
పెద్దయ్యాక బాధ్యతలు, ఒత్తిళ్లు, లక్ష్యాలతో రోజువారీ జీవితంలో కాసేపైనా సరదాగా ఉండడం, ఆటలు ఆడడం మర్చిపోతాం. కానీ, రోజులో కొంతసేపైనా వీటికి కేటాయించగలిగితే అవి జీవితంలో తీపి గుర్తులుగా మిగిలిపోతాయి.
కాబట్టి, ఇంకొంచం సరదాగా ఉండడానికి, ఇంకొచం ఉల్లాసభరితంగా రోజు గడపడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి.
చిన్నప్పటి ఆటలో, బొమ్మలు తలుచుకుని నిట్టూర్చాల్సిన అవసరం లేదు. కాస్త శ్రమపడితే మళ్లీ చిన్నపిల్లలమైపోవచ్చు.

ఇవి కూడా చదవండి:
- నేపాల్ సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు: బీబీసీ చేతికి నేపాల్ నివేదిక
- కర్ణాటక: హిజాబ్ వివాదంతో రాళ్ల దాడులు, మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు బంద్ ప్రకటించిన ప్రభుత్వం
- ‘పారాసిటమల్ ఎక్కువగా వాడితే రక్తపోటు పెరిగి గుండెపోటు రావొచ్చు’
- అయోధ్య: విశాలమైన రామ మందిర నిర్మాణం ఒకవైపు, శిథిల ఆలయాలు మరోవైపు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- భారీ విగ్రహాలను చైనా నుంచే ఎందుకు తెప్పిస్తున్నారు, ఇక్కడ తయారు చేయలేరా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














