మద్యం తాగితే రిలాక్స్‌గా ఉంటుందని ఎందుకు చెబుతారు.. ఆ భావన ఎలా కలిగింది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎడ్వర్డ్ ఆర్మ్‌స్టన్-షెరెట్
- హోదా, ది కన్వర్జేషన్*
రోజంతా పనిఒత్తిడిలో గడిపాక, నేను సాయంత్రం ప్రశాంతంగా కూర్చుని బీర్ తాగడమో లేదా ఒక గ్లాస్ వైన్ తాగడమో చేస్తుంటాను.
నేను అలా చేస్తున్నానంటే ఆ రోజు నా పని పూర్తైపోయిందని, సరదాగా రిలాక్స్ కావాల్సిన సమయం వచ్చిందని నాకు అనిపిస్తుంది.
ఇక్కడ సమస్య ఏంటంటే.. ఇలాగే కొనసాగుతూ అలా సర్ది చెప్పుకుని బాటిళ్లు ఖాళీ చేస్తూ పోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
ఎప్పుడూ(అతిగా) మద్యం తాగేవారు డిప్రెషన్‌కు గురవుతారు. అలాంటివారికి కంటినిండా నిద్ర కూడా ఉండదు.
మద్యం తాగడం వల్ల దీర్ఘకాలికంగా ఆందోళన స్థాయిలు కూడా పెరుగుతాయని ఒక పరిశోధనలో తేలింది.
అయితే, మద్యం తాగితే మనసుకు హాయిగా ఉంటుందనే భావన ప్రజల్లో చాలా కాలంగా బలంగా నాటుకుపోయింది.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా రిలాక్స్ కావాలనే ప్రయత్నంలో జనం మరింత ఎక్కువగా మద్యం తీసుకోవడం ప్రారంభించినట్లు ఆధారాలు చెబుతున్నాయి.
మద్యం చరిత్రను పరిశీలించడం వల్ల జనాల్లో అసలు ఇలాంటి అపోహ ఎందుకు వేళ్లూనుకుందనే విషయాన్ని తెలుసుకోవచ్చు.

ఫొటో సోర్స్, GETTY/UNIVERSAL HISTORY ARCHIVE
వైద్య ప్రయోజనాలే కారణమా
చరిత్రను పరిశీలిస్తే మద్యాన్ని తరచూ ఔషధంలా సేవిస్తూ వచ్చారు. ఒక క్రిమినాశకంలా, మత్తుమందులా దీనికి ఎన్నో ప్రయోజకరమైన లక్షణాలు ఉన్నట్లు చెబుతారు.
19వ శతాబ్దంలో, 20వ శతాబ్దం ప్రారంభంలో వివిధ దేశాల్లో పర్యటించిన యాత్రికులు మద్యం ఎలా తీసుకునేవారనే దానిపై నేను పరిశోధనలు చేశాను.
మద్యం తాగే యాత్రికుల ప్రవర్తనను గమనించడం ద్వారా మద్యం తాగడం వెనుక ఉన్న వారి శాస్త్రీయ, వైద్యపరమైన అవగాహనను గుర్తించవచ్చు.
ఎందుకంటే వైద్య పరీక్షలు చేయడానికి ముందు కాలంలో వివిధ రకాల ఆహార పదార్థాలు, పానీయాలు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆధారాలు సేకరించడానికి వైద్య రచయితలు ఇలాంటి యాత్రికులు చెప్పే విషయాల మీదే ఆధారపడేవారు.
అందుకే, ఆరోగ్యంపై మద్యం గతంలో ఎలాంటి ప్రభావం చూపింది అనేది తెలుసుకోడానికి మనకు వారి రచనలు సాయం చేయవచ్చు.
నిజానికి చాలా మంది విక్టోరియా యాత్రికులు రోజంతా ప్రయాణించి అలిసిపోయిన తర్వాత చల్లటి సాయంత్రం సేదదీరడానికి, వెచ్చదనం కోసం ఒక గ్లాస్ రమ్ము తీసుకునేవారు.
బాగా నిద్ర పట్టడానికి, ప్రశాంతతకు, ప్రయాణ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి అది తమకు సాయం చేసిందని వారు చెప్పారు.
తూర్పు ఆఫ్రికాలోని బ్రిటిష్ పర్యటకులు కూడా రోజంతా చేసిన ప్రయాణం ముగిసిన తర్వాత తరచూ మితంగా మద్యం తాగేవారు.
ప్రయాణాల వల్ల వచ్చే జ్వరం, బడలిక లాంటి ప్రభావాలను తగ్గించడానికి మద్యం ఒక ప్రయోజకరమైన ఔషధంలా పనిచేసినట్లు వారు భావించారు.
జార్జ్ డాబ్సన్ అనే ఒక బ్రిటిష్ ఆర్మీ సర్జన్ 1883లో ఒక ట్రావెల్ గైడ్ ప్రచురించారు.
"ప్రయాణికులు, క్రీడాకారుల లాంటి వారు వేడి వాతావరణంలో ఉన్నప్పుడు, అప్పుడప్పుడూ కొద్దిగా మద్యం పుచ్చుకోకపోతే వారు తమ పనిని కొనసాగించలేరు" అని ఆయన అందులో చెప్పారు.
ఆరోగ్యం కోసమా, ఉత్తేజం కోసమా
తక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా మొదట మద్యం ఒక స్టిములంట్(ఉత్తేజకం)లా పనిచేస్తుంది. ఎందుకంటే గుండె వేగంగా కొట్టుకునేలా చేసే మద్యం, శరీరానికి మరింత శక్తిని అందిస్తుంది.
అయితే, అది కాసేపట్లోనే డిప్రెస్సంట్(చురుకుదనం తగ్గించే)గా పనిచేస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థ చర్యలను నిరోధిస్తుంది. అంటే మనం ఆలోచించడానికి, ప్రతిస్పందించడానికి పట్టే సమయాన్ని ఒక్కోసారి తగ్గించేస్తుంది.
కొంతమంది వైద్య సిద్ధాంతకర్తలు మనిషి శరీరాన్ని సంతులనంలో ఉంచాల్సిన ఒక వ్యవస్థలా భావించారు. దాంతో ఇలాంటి ఆరోగ్య ప్రభావాలను, ముఖ్యంగా 19వ శతాబ్దం మొదట్లో వీటిని వైద్య రంగంలో చాలా ముఖ్యమైనవని భావించారు.
ఎవరైనా జబ్బు పడినపుడు వారిని మళ్లీ మామూలు మనిషిగా చేయాలంటే స్టిములంట్స్(ప్రేరేపకాలు) లేదా డిప్రెస్సంట్‌లను ముఖ్యమైన ఔషధాలుగా భావించారు.
కానీ, రానురానూ శాస్త్రవేత్తలు, వైద్యుల వాదనతో ఇలాంటి అభిప్రాయాలకు పెద్దగా విలువ లేకుండా పోయింది.
మద్యంను ఉపయోగించడానికి బదులు ఒక వ్యాధి సంక్రమణకు సంబంధించి నిర్దిష్ట కారణాలను గుర్తించగలిగేలా వ్యాధి సిద్ధాంతాలను రూపొందించారు.
ఉదాహరణకు 'క్రిమి సిద్ధాంతం (జర్మ్ థియరీ)ను మొదట 1861లో ప్రతిపాదించారు. మనుషులకు వచ్చే చాలా వ్యాధులకు సూక్ష్మజీవులే కారణం అని, వాతావరణం కారణం కాదని దీని ద్వారా స్పష్టం చేశారు.
అలాగే, మలేరియా వ్యాధి వ్యాపించడంలో దోమలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు బ్రిటిష్ వైద్యులు కనుగొన్నారు.
ఇలాంటి వ్యాధి సిద్ధాంతాలు వేడిగా ఉండే ప్రాంతాల్లో సాధారణంగా వ్యాపించే వ్యాధులను నివారించడానికి, వాటికి తగిన చికిత్సలు అందించడానికి సరికొత్త వైద్య విధానాలు రూపొందించడానికి కారణం అయ్యాయి.
అయితే, ఆల్కహాల్‌ను మిగతా ఔషధాల్లో కలపడానికి ఉపయోగించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
మద్యం తాగడంపై విమర్శలు
కానీ యాత్రికులు మద్యంను ఔషధంలా వినియోగించడం తగ్గించడానికి వైద్య విధానాలు మారడం ఒక్కటే కారణం కాదు.
యాత్రికులు మద్యపానం చేయడం గురించి విమర్శలు కూడా ఎక్కువయ్యాయి. దీంతో మద్యం పట్ల అప్పటివరకు ఉన్న వైద్యపరమైన, సామాజిక దృక్పథం మారడానికి దోహదపడింది.
ఇది ఎక్కువగా నిగ్రహ ఉద్యమం కారణంగా జరిగింది. ఇది ఎవాంజెలికల్ క్రిస్టియానిటీలో వేళ్లూకుపోయిన ప్రచారం. అది మద్యం అమ్మకాలను నీరుగార్చడానికి(కొన్నిసార్లు పూర్తిగా నిషేధించడానికి) ప్రయత్నించింది.
దీంతో అప్పటివరకూ మితంగా మద్యం తాగడం ఆరోగ్యకరమే అని భావించిన వారు కూడా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మద్యపానం మరింత ప్రమాదకరం అవుతుందని ఆందోళనకు గురయ్యారు.
ఉదాహరణకు ది నేషనల్ అర్కిటిక్ ఎక్స్‌పెడిషన్(1875-1876)లో రమ్‌ను పరిమితంగా పంపిణీ చేశారు. దాంతో ఆ యాత్రపై విమర్శలు వచ్చాయి. ఎందుకంటే సాహసయాత్రల్లో అధికంగా తాగేవారిలో స్కర్వీ వ్యాధి మొదటిసారి కనిపించింది.
దీంతో తమ మద్యపానం కవర్ చేసుకోడానికి కొందరు యాత్రికులు తాము మితంగా, ఔషధంలా మాత్రమే మద్యం తాగుతున్నామని గట్టిగా వాదిస్తూ వచ్చారు.
వారు తరచూ కొన్ని రకాల ఆల్కహాల్ పానీయాలను మాత్రమే తీసుకుంటూ అలా చెప్పుకునేవారు. వాటికి, ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పుకునేవారు. వాటిలో సాధారణంగా బ్రాందీ, షాంపేన్, లేదా కొన్ని రకాల వైన్స్ ఉండేవి.
ఈరోజుల్లో కూడా ఇలాంటి ఆల్కహాల్ రకాలను అరుదుగా ఔషధాలుగా పరిగణిస్తున్నారు. కానీ శరీరంపై ఆల్కహాల్ ప్రభావం గురించి వైద్యపరమైన ఆందోళనలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
విక్టోరియా యాత్రికుల కాలంలోని చాలా మంది వైద్య నిపుణులు కొన్ని రకాల పానీయాలను మిగతా వాటికంటే ఆరోగ్యకరమైనవిగా సూచించారు.
ఆల్కహాల్ కంటే కెఫీన్ మంచిది
నేను, నా సహచరుడు కిమ్ వాకర్ ఇటీవల చేసిన ఒక పరిశోధనను బట్టి చూస్తే, 19వ శతాబ్దంలో, 20వ శతాబ్దం ప్రారంభంలో ఆఫ్రికాలోని యూరోపియన్ యాత్రికులు ఉత్తేజకాల(ఆల్కహాల్ సహా)ను ప్రముఖ ఔషధాలుగా ఉపయోగిస్తున్నారు.
అవి చౌకగా ఉండడం, సులభంగా తయారు చేయగలగడం, తాగేవారి శరీరం, మనసుపై ఏర్పడే ప్రభావాలు సులభంగా గుర్తించగలిగేలా ఉండడం దీనికి కొంతవరకూ కారణం అయ్యింది.
వేడి వాతావరణం సాధారణంగా శరీరానికి హాని కలిగిస్తుందని. నిరుత్సాహంగా ఉంటుందని అనుకునేవారు. మద్యం తాగడం వల్ల ఆ సమస్య తగ్గుతుందని కూడా భావించారు.
1883 నాటి ట్రావెల్ గైడ్‌లో ఆల్కహాల్ తీసుకోవచ్చనే తన వాదనను సమర్థించుకున్న డాబ్సన్ ఎలాంటి వాతావరణం ప్రభావం వల్ల నిరుత్సాహంగా అనిపిస్తుందో చెప్పారు.
ఫలితంగా కొంతమంది యాత్రికులు మద్యపానంను ఇలాంటి ప్రభావాలను తట్టుకోడానికి ఉపయోగపడే ఔషధంగా భావించారు.
సాహసయాత్రల్లో మద్యపానాన్ని వ్యతిరేకిస్తూ వచ్చినవారు, ఉత్తేజం కలిగించే పానీయాలు తాగడం చాలా ముఖ్యం అని భావించారు. కానీ, ఆ సమయంలో మద్యానికి బదులు ఒక కప్పు కాఫీ తాగడం మంచిదని సూచించారు.
మద్యం పట్ల వైద్యపరంగా ఉన్న అవగాహన గత 150 ఏళ్లుగా పూర్తిగా మారిపోయింది. కానీ విక్టోరియన్, ఎడ్వర్డియన్ యాత్రికులు మద్యపానంపై పరిశోధన చేయడం వల్ల, వారు దానిని ఎలా ఉపయోగించేవారు అనేది స్పష్టంగా తెలిసింది.
(ఎడ్వర్డ్ ఆర్మ్‌స్టన్-షెరెట్ లండన్ రాయల్ హాలోవే యూనివర్సిటీ జాగ్రఫీ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నారు)
ఇవి కూడా చదవండి:
- కోవిడ్19 లక్షణాలు ఉన్నవారికి టెస్టులు చేయకుండానే కరోనా కిట్లు పంచడం కరెక్టేనా?
- బ్యాంకు హ్యాక్ అయితే ఖాతాదారుల పరిస్థితి ఏంటి? వారి డబ్బు ఎవరు చెల్లిస్తారు?
- అమెరికాలో పరమహంస యోగానంద ఆశ్రమంలో మహాత్ముడి అస్థికలు.. గాంధీ వారసులకు దీనిపై అభ్యంతరం ఎందుకు
- సీనియర్ సిటిజన్లను టార్గెట్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు.. తప్పించుకోవడం ఎలా
- బ్యాక్టీరియాలు మందులకు లొంగట్లేదు.. చిన్నచిన్న ఇన్ఫెక్షన్లకూ యాంటిబయోటిక్స్ వాడటమే కారణమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















