బ్యాక్టీరియాలు మందులకు లొంగట్లేదు.. చిన్నచిన్న ఇన్ఫెక్షన్లకూ యాంటిబయోటిక్స్ వాడటమే కారణమా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
అనేక రకాల బ్యాక్టీరియా యాంటీబయోటిక్స్‌ను తట్టుకునే సామర్థ్యం సంతరించుకోవటంతో.. ఆ మొండి బ్యాక్టీరియాల వల్ల వచ్చే అంటువ్యాధుల కారణంగా 2019లో ప్రపంచ వ్యాప్తంగా 12లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని తాజా అధ్యయన నివేదిక ఒకటి వెల్లడించింది.
మలేరియా, ఎయిడ్స్ వ్యాధుల వల్ల సంభవించే వార్షిక మరణాల సంఖ్య కంటే ఇది చాలా ఎక్కువ.
పేద దేశాల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉందని, అయితే యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ ప్రతి ఒక్కరి ఆరోగ్యానికీ ముప్పుగా పరిణమించిందని ఆ నివేదిక పేర్కొంది. లాన్సెట్‌లో ప్రచురించిన తాజా అధ్యయనం.. ఈ అంశంపై ఇప్పటి వరకు చేసిన అతిపెద్ద అధ్యయనం.
ఈ ముప్పు నుంచి రక్షణ కోసం.. కొత్త ఔషధాలను తయారు చేయటానికి అత్యవసరంగా పెట్టుబడులు పెట్టటంతో పాటు.. ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న ఔషధాలను మరింత జాగ్రత్తగా ఉపయోగించడం అవసరమని సూచించింది.
చిన్నచిన్న ఇన్ఫెక్షన్లకూ యాంటిబయోటిక్స్ వాడటం ఇటీవలి సంవత్సరాల్లో ఎక్కువయింది. దీనివల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ల మీద అవి చూపే ప్రభావం తగ్గిపోతోంది. దీంతో ఆ ఇన్ఫెక్షన్లు తగ్గటం లేదు.
గతంలో చికిత్స చేసి తగ్గించగల సాధారణ అంటువ్యాధులతో సైతం జనం ఇప్పుడు చనిపోతున్నారు. ఎందుకంటే ఆ అంటువ్యాధులకు కారణమయ్యే బాక్టీరియా.. మందులను తట్టుకోగలుగుతున్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
రహస్య మహమ్మారి...
యాంటీ-మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎమ్‌ఆర్) అనేది రహస్య మహమ్మారి అని బ్రిటన్ ఆరోగ్యశాఖ ఇటీవల హెచ్చరించింది. యాంటీబయాటిక్స్ వాడాలని సిఫారసు చేసేటపుడు బాధ్యతాయుతంగా లేకపోతే.. కోవిడ్ వల్ల ఈ ఏఎమ్ఆర్ పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తంచేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఏఎంఆర్ వల్ల మరణాల సంఖ్యను అంచనా వేయటానికి.. అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం సారథ్యంలో అంతర్జాతీయ పరిశోధకుల బృందం 204 దేశాల సమాచారాన్ని విశ్లేషించింది.
2019లో జబ్బుపడిన వారిలో.. ఏఎమ్ఆర్ ప్రత్యక్ష పాత్ర వల్ల చనిపోయిన వారు 12లక్షల మంది ఉంటే.. దాని పరోక్ష పాత్ర వల్ల మరో 50 లక్షల మంది చనిపోయారని వారు లెక్కించారు.
అదే సంవత్సరంలో ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియెన్సీ సిండ్రోమ్) కారణంగా 8,60,000 మంది; మలేరియా వల్ల 6,40,000 మంది మరణించారని అంచనా.
ఏఎమ్‌ఆర్ వల్ల సంభవించిన మరణాల్లో చాలావరకూ న్యుమోనియా వంటి శ్వాస సంబంధిత వ్యాధులు, సెప్సిస్‌కు దారితీయగల రక్తప్రవాహ ఇన్ఫెక్షన్ల వంటివి కారణమయ్యాయి.
డ్రగ్ రెసిస్టెన్స్ సంతరించుకున్న బ్యాక్టీరియాల్లో.. ఎమ్‌ఆర్ఎస్ఏ (మెథిసిలిన్-రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్) ముఖ్యంగా ప్రాణాంతకమైనది. ఈ-కోలి తదితర మరిన్ని బాక్టీరియాలు కూడా అధిక స్థాయి డ్రగ్ రెసిస్టెన్స్‌ను సంతరించుకున్నాయి.
ఆసుపత్రుల్లో రోగుల రికార్డులు, అధ్యయనాలు, ఇతర సమాచార వనరులను విశ్లేషించిన పరిశోధకులు.. ఏఎంఆర్ వల్ల చిన్నపిల్లలకు అతి ఎక్కువ ప్రమాదం ఉందని చెప్పారు. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో.. ప్రతి ఐదుగురిలో ఒకరు దీనివల్ల చనిపోయారు.
ఏఎమ్ఆర్ వల్ల మరణాలు...
- సబ్-సహారా ఆఫ్రికా, దక్షిణ ఆసియాల్లో అత్యధికంగా ఉన్నాయి.. ప్రతి లక్ష మందికీ 24 మరణాలు చొప్పున నమోదయ్యాయి.
- సంపన్న దేశాల్లో అత్యల్పంగా ఉన్నాయి.. ప్రతి లక్ష మందికి 13 మరణాలు నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ వాస్తవంగా ఎంత తీవ్రస్థాయిలో ఉందో ఈ తాజా సమాచారం బహిర్గతం చేసిందని.. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ విభాగంలో ప్రొఫెసర్ క్రిస్ ముర్రే చెప్పారు.
యాంటీమైక్రోబయాల్ రెసిస్టెన్స్‌ను ఎదుర్కొనే పోరులో ముందంజలో ఉండాలంటే.. తక్షణమే చర్యలు చేపట్టటం అత్యవసరమని ఈ అధ్యయనం స్పష్టంచేస్తోందన్నారు.
అయితే వివిధ దేశాలు, ప్రాంతాల్లో డ్రగ్ రెసిస్టెన్స్ స్థాయిలను పరిశీలించటం అవసరమని ఇతర నిపుణులు అంటున్నారు.
వాషింగ్టన్ డీసీలోని సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసీకి చెందిన డాక్టర్ రమణన్ లక్ష్మీనారాయణ
ఏఎమ్‌ఆర్ సమస్య పరిష్కారానికి.. ప్రపంచవ్యాప్తంగా ఇతర వ్యాధుల కోసం చేస్తున్న వ్యయంతో సమాన స్థాయికి ఈ రంగానికి కూడా కేటాయింపులు పెంచాలని పేర్కొన్నారు.
‘‘ముందుగా అంటువ్యాధులను నివారించటానికి నిధులు ఖర్చుచేయాలి. ఆ తర్వాత ఇప్పటికే ఉన్న యాంటీబయాటిక్స్‌ను సముచితంగా, తెలివిగా ఉపయోగించేలా చూడాలి. ఆపైన కొత్త యాంటీబయాటిక్స్‌ను తయారు చేసి మార్కెట్లోకి తీసుకురావడానికి ఖర్చు చేయాలి’’ అని ఆయన వివరించారు.
ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలకు సమర్థవంతమైన యాంటీబయాటిక్స్ అందుబాటులో లేవని.. అన్నిచోట్లా ఈ విషయాన్ని రాజకీయ, ఆరోగ్య రంగ సారథులు సీరియస్‌గా పట్టించుకోవాల్సిన అవసరముందని డాక్టర్ లక్ష్మీనారాయణ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పిల్లల ఆహారం విషయంలో తల్లులు చేసే నాలుగు తప్పులు
- 10 కోట్ల మంది ఆకలి తీర్చే ఆఫ్రికా అరటి చెట్టు.. దీని పండ్లు మాత్రం తినడానికి పనికిరావు
- భర్తతో సెక్స్‌కు నో చెప్పే హక్కు భార్యకు లేదా? మ్యారిటల్ రేప్‌పై ఎందుకు చర్చ జరుగుతోంది
- ఈ పండ్లను బంగారంలా చూస్తారు.. వీటి కోసం దొంగల ముఠాలు కాపు కాస్తుంటాయి
- ఒమిక్రాన్ సోకిన వారిలో కనిపించే లక్షణాలు ఏంటి... ఈ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












