కరోనావైరస్: కోవిడ్ మహమ్మారి ముగింపు దశకు చేరుకుందా?

కోవిడ్ వ్యాక్సీన్ అమ్మాయి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జేమ్స్ గళ్లగర్
    • హోదా, బీబీసీ హెల్త్ కరెస్పాండెంట్

‘‘ఈ కరోనా మహమ్మారి పీడ ఎప్పుడు పోతుంది?’’

‘‘మన బతుకులు మళ్లీ గాడిలో పడతాయా?’’

‘‘జనజీవనం మళ్లీ ఎప్పుడు మామూలవుతుంది?’’

గత రెండేళ్లుగా ఈ ప్రశ్నలు వేయని వారు ఉండరంటే ఆశ్చర్యం లేదు. ఈ ప్రశ్నలకు సమాధానం, ‘‘అతి త్వరలో’’ అని రావచ్చు.

ఒమిక్రాన్ వేరియంట్‌తో బ్రిటన్‌లో కరోనా మహమ్మారి తుది దశకు చేరుకుంటోందన్న ధీమా పెరుగుతోంది.

కానీ, ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ వైరస్‌ను చిటికెలో మాయం చేసే మంత్రమేదీ లేదు. మున్ముందు ‘పాండెమిక్’ అనే పదానికి బదులు ‘ఎండెమిక్’ అనే మాటకు మనం అలవాటు పడాల్సి ఉంటుంది. అంటే.. కోవిడ్ మాయమైపోదు, మనతోనే ఉంటుంది. సందేహం లేదు.

మరి సరికొత్త కోవిడ్ శకం రాబోతోందా? వస్తే అది మన జీవితాలపై ఎలా ప్రభావం చూపుతుంది?

‘‘మనం దాదాపు ఒడ్డున పడుతున్నాం. కరోనావైరస్ అంతం ఆరంభమైంది. 2022లో జనజీవనం దాదాపుగా ఈ మహమ్మారి ముందు దశకు తిరిగివస్తుందని నేను భావిస్తున్నా’’ అని యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్‌లో ఇన్ఫెక్షన్ అండ్ గ్లోబల్ హెల్త్ విభాగాధిపతి ప్రొఫెసర్ జూలియన్ హిస్కాక్స్ నాతో చెప్పారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

దీనికి కారణం ఏమిటంటే, మన రోగనిరోధక శక్తి. ఈ కొత్త కరోనావైరస్ రెండేళ్ల కిందట చైనాలోని వూహాన్‌లో తొలిసారిగా బయటపడింది. మనమంతా దానిబారినపడి విలవిలలాడాం. మన రోగనిరోధకశక్తి ఇంతకుముందు ఎప్పుడూ ఎదుర్కోని కొత్త వైరస్ ఇది. దీనిని ఎదుర్కోవటానికి అప్పుడు మన దగ్గర మందులు కానీ, వాక్సీన్లు కానీ లేవు.

ఫలితంగా మందుగుండు తయారీ ఫ్యాక్టరీలోకి నిప్పులు కక్కే యంత్రాన్ని తీసుకెళ్లినట్లయింది. కోవిడ్ ప్రపంచమంతటా ఓ విస్ఫోటనంలా వ్యాపించింది. అయితే, మంట శాశ్వతంగా అత్యధిక తీవ్రతతో మండదు.

అప్పుడు మనకు రెండే దారులున్నాయి. పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వైరస్‌ను తుద ముట్టించినట్లుగా కోవిడ్‌ను కూడా తుద ముట్టించటం ఒకటి. రెండోది, ఆ వైరస్ మనతోనే దీర్ఘకాలం కొనసాగుతూ దానికదే తగ్గిపోవటం. అంటే, సాధారణ జలుబు, హెచ్‌ఐవీ, మీజిల్స్, మలేరియా, ట్యూబర్‌క్యులోసిస్ వంటి స్థానిక అంటువ్యాధుల్లో (ఎండెమిక్ డిసీజెస్) అదికూడా చేరుతుంది.

జలుబు

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఎండెమిక్‌గా మారాలని ఈ వైరస్‌కు రాసి పెట్టి ఉంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లోని సెయింట్ జార్జ్ విద్యాలయం వైరాలజిస్ట్ డాక్టర్ ఎలిసబెటా గ్రోపెల్లి వ్యాఖ్యానించారు.

‘‘నేను చాలా ఆశావహంగా ఉన్నాను. వైరస్ సంచరిస్తూ ఉండటం, దీని నుంచి ముప్పు ఉన్న వారిని మనం జాగ్రత్తగా చూసుకోవటం, మిగతా వారందరికీ ఇది సోకుతుందని అంగీకరించటం – ఇది సోకినా సగటు వ్యక్తి క్షేమంగానే ఉండే పరిస్థితికి మనం త్వరలో చేరుకుంటాం’’ అని ఆమె చెప్పారు.

అంటువ్యాధుల వ్యాప్తిని అధ్యయనం చేసే ఎపిడెమియాలజిస్టులు, ఏదైనా ఒక అంటువ్యాధి వ్యాప్తి స్థాయిలు స్థిరంగా, అంచనావేయగల స్థితిలో ఉన్నపుడు.. వాటిని స్థానిక అంటువ్యాధిగా (ఎండెమిక్)పరిగణిస్తారు. ఒకేసారి విస్ఫోటనం చెంది, అనూహ్యంగా వ్యాపిస్తుంటే దానిని మహమ్మారి(పాండెమిక్)గా పరిగణిస్తారు.

కోవిడ్ ఇంకా మనతోనే ఉంటుంది. కానీ మన, జీవితాలను నియంత్రించుకోవలసిన అవసరం ఉండదని కొందరు దీనికి అర్థం చెబుతున్నారని ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లో ఎపిడెమియాలజిస్ట్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ అజ్రా ఘనీ అన్నారు.

‘‘ఆ స్థితికి మనం వేగంగా చేరుకుంటాం. దీనికి చాలా కాలం పట్టినట్లు కనిపిస్తుంది. కానీ, మనం వ్యాక్సినేషన్ మొదలుపెట్టింది కేవలం ఏడాది కిందటే. దానివల్ల మనం ఇప్పటికే చాలా స్వేచ్ఛగా ఉన్నాం’’ అని ఆమె చెప్పారు.

దీనికి ఏకైక అవరోధం ఒమిక్రాన్‌ను తలదన్నే మరింత తీవ్రమైన వేరియంట్ పుట్టుకొచ్చే అవకాశం.

జపాన్ కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఎండెమిక్ ఎంత చెడ్డది?

ఎండెమిక్ అంటే అది తేలికైనదని అర్థం కాదనేది గుర్తుంచుకోవటం ముఖ్యం. ‘‘కొన్ని భారీ ప్రాణాంతక జబ్బులను కూడా మనం ఎండెమిక్‌గా పరిగణిస్తున్నాం’’ అని చెప్పారు ప్రొఫెసర్ ఘనీ. స్మాల్‌పాక్స్ అనేది వేల సంవత్సరాల పాటు ఎండెమిక్ వ్యాధిగానే ఉంది. అది సోకిన వారిలో మూడో వంతు మందిని అది బలితీసుకుంది. మలేరియా కూడా ఎండెమిక్ వ్యాధే. కానీ దీనివల్ల ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా 6,00,000 మంది చనిపోతున్నారు.

అయితే, కోవిడ్‌తో పోరాడటంలో మన శరీరాలకు అనుభవం పెరుగుతున్నకొద్దీ.. దాని తీవ్రత తగ్గిపోతుండటం మనం ఇప్పటికే చూస్తున్నాం.

బ్రిటన్‌లో వ్యాక్సినేషన్ కార్యక్రమం, బూస్టర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగుతున్నాయి. అదే సమయంలో నాలుగు విభిన్న రకాల కరోనావైరస్ వేవ్‌లు కూడా కొనసాగుతున్నాయి.

‘‘ఒమిక్రాన్ వచ్చి వెళ్లాక బ్రిటన్‌లో రోగనిరోధకశక్తి కనీసం కొంత కాలమైనా అధిక స్థాయిలో ఉంటుంది’’ అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌ ఇమ్యునాలజిస్ట్ ప్రొఫెసర్ ఎలీనార్ రైలీ.

అత్యధిక స్థాయిలో ఇన్ఫెక్షన్లకు బ్రిటన్ భారీ మూల్యం చెల్లించింది. దేశవ్యాప్తంగా 1,50,000 మంది చనిపోయారు. కానీ అది మన రోగనిరోధకశక్తిలో ఒక రక్షణ సామర్థ్యాన్ని మిగిల్చింది. ఆ ఇమ్యూనిటీ తరిగిపోతుంది. కాబట్టి భవిష్యత్తులో మనకు మళ్లీ కోవిడ్ సోకుతుందని భావించాలి. అయితే.. అలా మళ్లీ సోకినా కూడా మనం తీవ్రంగా జబ్బుపడే అవకాశం తగ్గుతుంది.

‘‘కొత్త వేరియంట్ వచ్చినా, పాత వేరియంట్ తిరిగొచ్చినా.. మనలో చాలా మందికి చాలా సాధారణ జలుబు కలిగించే ఇతర కరోనావైరస్‌లలాగానే ఉంటుంది. తుమ్ములు, కొంచెం తలనొప్పి వస్తాయి. ఆ తర్వాత తగ్గిపోతుంది’’ అని కొత్త శ్వాసకోశ వైరస్‌ల ముప్పుపై ప్రభుత్వ సలహా బృందం సభ్యుడు ప్రొఫెసర్ హిస్కాక్స్ వివరించారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఇది మన జీవితాలపై చూపే ప్రభావం

ఎండెమిక్ కోవిడ్ వల్ల చనిపోయే జనం – ప్రధానంగా వృద్ధులు, అరోగ్య బలహీనతలున్నవారు ఉంటారు. కాబట్టి ఈ వైరస్‌తో మనం ఎలా కలిసి జీవించాలి అనేదానిపై ఇంకా ఒక వ్యూహం రూపొందించాలి.

‘‘కోవిడ్ వల్ల మరణాలు జీరోగా ఉండాలనుకుంటే.. అనేక రకాల ఆంక్షలు ఉంటాయి. అంటే ఆట అప్పుడే ముగియదన్నమాట’’ అని వివరించారు ప్రొఫెసర్ హిస్కాక్స్.

అయితే.. ‘‘చలికాలంలో ఫ్లూ సీజన్ తీవ్రంగా ఉన్నపుడు రోజుకు 200 నుంచి 300 మంది చనిపోతుంటారు. కానీ ఎవరూ మాస్కులు పెట్టుకోరు, సామాజిక దూరం పాటించరు’’ అని ఆయన ప్రస్తావించారు.

‘‘లాక్‌డౌన్లు, పెద్ద సంఖ్యలో జనం గుమిగూడటాల మీద ఆంక్షలు తిరిగి రావు. కోవిడ్ కోసం మూకుమ్మడి పరీక్షలు నిర్వహించటం ఈ ఏడాది ముగిసిపోతుంది’’ అని ఆయన అంచనా వేస్తున్నారు.

ఈ వైరస్ వల్ల ఎక్కువ ప్రమాదం ఉన్నవారికి చలికాలంలో వారి రక్షణను బలోపేతం చేయటానికి దానికి ముందుగా బూస్టర్ వ్యాక్సీన్లు అందించటం కచ్చితంగా జరగవచ్చు.

‘‘మన ఫ్లూ సీజన్.. కరోనావైరస్ సీజన్‌గా కూడా మారుతుందని మనం అంగీకరించాల్సిన అవసరముంది. అది మనకు సవాలు అవుతుంది’’ అంటారు డాక్టర్ గ్రోపెల్లి.

అయితే.. చలికాలాల్లో పరిస్థితి ఎంత దిగజారుతుందనేది ఇంకా తెలీదు. ఎందుకంటే ఫ్లూ వల్ల చనిపోయేవారు, కోవిడ్ వల్ల చనిపోయేవారు ఒకే రకంగా ఉంటారు.

ఒమిక్రాన్ తర్వాత తప్పనిసరిగా ఫేస్‌మాస్కులు పెట్టుకోవలసి వస్తుందని తాను భావించటం లేదని ప్రొఫెసర్ రైలీ చెప్పారు. కానీ, మాస్కులు ధరించటం మరింత ఎక్కువగా మామూలు విషయం అవుతుందని అంచనావేశారు.

‘‘ఫ్లూ వ్యాక్సీన్ల కోసం మనమంతా వరుసకట్టిన 2019 చలికాలానికి ముందున్న పరిస్థితికి.. ఇకముందు పరిస్థితికి పెద్ద తేడా ఉండదు’’ అని ఆమె పేర్కొన్నారు.

people walking into the sunset

ఫొటో సోర్స్, Getty Images

మిగతా ప్రపంచం సంగతేమిటి?

వ్యాక్సీన్లు, భారీ సంఖ్యలో ఇన్ఫెక్షన్ల మిశ్రమం కారణంగా.. మిగతా ప్రపంచంతో పోలిస్తే బ్రిటన్ ముందంజలో ఉంది. అయితే మిగతా ప్రపంచం కరోనా మహమ్మారి అంతానికి అంత దగ్గరగా లేదు.

పేద దేశాలు తమ ప్రజల్లో ఎక్కువ ముప్పు ఉన్న వారికి ఇవ్వటం కోసం ఇంకా వ్యాక్సీన్ల కోసం ఎదురుచూస్తున్నాయి. మరోవైపు కోవిడ్‌ను ఆమడదూరంలో పెట్టిన దేశాల్లో మరణాలు తక్కువగానే ఉన్నప్పటికీ.. ఆ దేశాల జనంలో దీనికి ఇమ్యూనిటీ కూడా తక్కువగానే ఉంది.

కోవిడ్‌ను ఎండెమిక్‌గా ప్రకటించటానికి ప్రపంచం ఇంకా చాలా దూరంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంచేసింది.

‘‘ప్రపంచానికి ఇది ఇంకా ఓ మహమ్మారే.. తీవ్ర అత్యవసర పరిస్థితే’’ అంటారు డాక్టర్ గ్రోపెల్లి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)