ఒమిక్రాన్: కేసులు పెరుగుతున్నప్పుడు ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకోవడం మంచిదేనా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒమిక్రాన్ రూపంలో మూడో వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో కరోనా టెస్టులు ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అన్న అంశంపై భారత ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
కరోనా ఉన్న వ్యక్తితో మీరు సన్నిహితంగా మెలిగినప్పటికీ, మీలో ఎలాంటి లక్షణాలు లేకపోతే టెస్టు చేయించుకోవాల్సిన అవసరం లేదు. కానీ, మీరు 60 ఏళ్లు పైబడిన వారైనా, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా టెస్ట్ చేయించుకోవాల్సిందే.
భారత ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, హోమ్ ఐసోలేషన్ పూర్తయిన తర్వాత లేదా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన సమయంలో, లేదంటే ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి ప్రయాణించేటప్పుడు కూడా కోవిడ్-19 పరీక్షను నిర్వహించాల్సిన అవసరం లేదు.
మరోవైపు రోజురోజుకూ కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటి వద్దకే టెస్ట్ కిట్ లను తెప్పించుకోవడం వల్ల కరోనా టెస్టర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.
డిసెంబర్ చివరి నుండి జనవరి మొదటి వారం వరకు, ఇంట్లో కోవిడ్-19 పరీక్షలు చేసుకునే టెస్ట్ కిట్ల అమ్మకం 400-500 శాతం పెరిగిందని ఈ టెస్ట్ కిట్లను తయారు చేసే కంపెనీ మైలాబ్స్ మేనేజింగ్ డైరెక్టర్ హస్ముఖ్ రావల్ బీబీసీతో అన్నారు.
ఇంట్లోనే కరోనాను పరీక్షలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గత ఏడాది మే నెలాఖరున ఆమోదించింది. అప్పటికి కరోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజ్ దాదాపు ముగింపుకు వచ్చింది. ప్రస్తుతం ఏడు రకాల కిట్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Science Photo Library
ఈ కిట్లు ఎలా పని చేస్తాయి?
కిట్ ఎప్పుడు ఉపయోగించాలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, వాటితో ముడిపడి ఉన్న సమస్యలపై నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంట్లో కూర్చొని ఈ కిట్ ద్వారా కరోనాను పరీక్షించుకోవడానికి, వ్యక్తులు ముందుగా Google Play-Store లేదా Apple Storeలో హోమ్ టెస్టింగ్ గురించి సమాచారాన్ని అందించే మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం ముఖ్యం. తర్వాత అందులో మిమ్మల్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
టెస్ట్ కిట్‌లో స్వాబ్ స్టిక్, సొల్యూషన్, టెస్ట్ కార్డ్, టెస్ట్ చేసే విధానాన్ని తెలిపే మాన్యువల్ ఉంటాయి.
ముందుగా స్వాబ్ స్టిక్‌తో శాంపిల్‌ను తీసుకోవాలి. ఆపై దానికి ద్రావణాన్ని కలపాలి. తర్వాత దానిలో ఒక చుక్కను టెస్ట్ కార్డ్‌పై వేయాలి.
15 నిమిషాల లోపు టెస్ట్ కార్డ్‌పై రెండు ఎర్రగీతలు కనిపిస్తే( సి అండ్ టి), రిజల్ట్ పాజిటివ్ అని, ఒకే ఎరుపు గీత (సి) కనిపిస్తే నెగెటివ్ అని అర్ధం.
ఇంట్లో పరీక్ష చేసుకున్న ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ ద్వారా యాప్‌లో పరీక్ష ఫొటోను అప్‌లోడ్ చేయడం తప్పనిసరి. కానీ, చాలామంది పరీక్ష ఫలితాల గురించి ప్రభుత్వానికి తెలియజేయకుండా కూడా టెస్ట్ కిట్‌లను ఉపయోగిస్తున్నారు.
కొత్త వేవ్‌లో రోజు వారీగా వస్తున్న కొత్త కేసుల సంఖ్య వాస్తవమైన సంఖ్య కాదని నిపుణులు అంచనా వేయడానికి ఇదే కారణం.
''ఆర్టీపీసీఆర్ పరీక్ష పాజిటివ్‌గా ఉన్నప్పటికీ ఐసోలేషన్ పాటించడాన్ని ప్రభుత్వం ప్రజల విచక్షణకే వదిలేసింది. హోమ్ కిట్‌లు తయారు చేసే కంపెనీ అలాగే భావిస్తుంది. ప్రజలు కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తారు. వారి రిపోర్టులను సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. మేము ప్యాకెట్లలో కూడా ఆ విధంగా చేయాలని కోరుతున్నాము'' అని మైలాబ్స్ మేనేజింగ్ డైరెక్టర్ హస్ముఖ్ రావల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సమస్య ఎక్కడ రావచ్చు ?
టెస్ట్ కిట్‌ను ఉపయోగించడంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయన్నదానిపై దిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జుగల్ కిశోర్ వివరంగా చెప్పారు.
''ఇది ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లాగా గోల్డెన్ స్టాండర్డ్ టెస్ట్ కాదు. ఇంట్లో పరీక్షలు చేయడంవల్ల పాజిటివ్ వచ్చిన వారిలో ఒత్తిడి పెరుగుతుంది. పైగా ప్రతిసారి సరైన రిపోర్ట్ వస్తుందన్న గ్యారంటీ లేదు. చాలామంది తమ టెస్ట్ ఫలితాలు పాజిటివ్‌గా వచ్చినప్పుడు ఆ విషయం ప్రభుత్వానికి చెప్పడం లేదు. దీనివల్ల కేసులను ట్రాక్ చేయడం, ట్రేస్ చేయడంలో ఇబ్బంది ఏర్పడుతోంది. మనం ఎంతో కష్టపడి రూపొందించిన నిఘా వ్యవస్థ బలహీనంగా మారుతుంది'' అని కిశోర్ అన్నారు.
''నెగెటివ్ రిజిల్ట్ వచ్చినప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. పాజిటివ్ రిపోర్ట్ వచ్చినప్పుడు అవసరాన్నిబట్టి ఐసోలేషన్, లేదా ఆసపత్రికి వెళ్లాల్సి ఉంటుంది'' అన్నారు కిశోర్.
తక్కువ ధరకే ఈ టెస్ట్ కిట్‌లు అందుబాటులో ఉండడంతో ఇంట్లోనే పాజిటివ్ అని తేలినప్పుడు ఆసుపత్రిలో చేరేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారని, దీంతో ఆసుపత్రులపై ఒత్తిడి కూడా పెరుగుతోందని కొందరు వైద్యులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలి?
కానీ, కొంతమంది వైద్యులు ఈ టెస్ట్ కిట్ కూడా మంచిదేనంటారు.
"ఇప్పుడు ప్రజలు పరీక్ష కోసం లైన్‌లో వేచి ఉండాల్సిన అవసరం లేదు. చాలాసార్లు ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకునే క్రమంలో కరోనా బాధితులవుతారు. ఈ టెస్ట్ కిట్ ఆ సమస్యను రానివ్వదు. లేబరేటరీలపై తక్కువ భారం పడుతుంది. రిపోర్టు కోసం చాలా రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చు కారణంగా మళ్లీ మళ్లీ పరీక్షలు చేయించుకోవడంలో ఇబ్బంది లేదు" అన్నారు డాక్టర్ సునీలా గార్గ్. ఆమె ప్రభుత్వ కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యురాలు.
ఈ టెస్ట్ కిట్‌తో ఆరు గంటల వ్యవధిలో రెండుసార్లు టెస్టు చేసుకోవచ్చని ఆమె తెలిపారు.
కానీ, ఈ టెస్ట్ కిట్‌ను ఉపయోగించిన వారు ఫలితాలను అప్‌లోడ్ చేయడం లేదని, దీని కారణంగా సరైన డేటాను సేకరించడంలో ఇబ్బంది పెరుగుతోందని డాక్టర్ సునీల అభిప్రాయపడ్డారు.
''ప్రజలు తమ అలవాట్లను మార్చుకోవాలి. ప్రతిదీ ప్రభుత్వమే చేయదు. కోవిడ్ ఒక వ్యాధి. కానీ ప్రజలు దానిని ఒక కళంకంలా దాచి పెడుతున్నారు. ఇది సరికాదు'' అన్నారామె.
టెస్టులు ఎలా చేసుకోవాలో షాపుల్లో కూడా అవగాహన కలిగిస్తారని, అందువల్ల ప్రజలు దీనిని అప్‌లోడ్ చేయడం చాలా సులువని ఆమె అన్నారు.
పాజిటివ్ వచ్చిన వెంటనే ఆసుపత్రుల్లో చేరడానికి ఎందుకు పరుగులు పెడుతున్నారు అన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు.
''ఇదంతా హోమ్ టెస్టింగ్ కిట్స్ వల్లేనని చెప్పలేం. కరోనా చికిత్సకు కూడా బీమా వర్తించడం కూడా దీనికి ఒక కారణం. అందుకే ప్రభుత్వ ఆసుపత్రులలోకంటే, ప్రైవేట్ ఆసుపత్రులలోనే ఎక్కువమంది చేరుతున్నారు'' అన్నారామె.
ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందువల్ల అన్ని పాజిటివ్ కేసులను ఆర్టీపీసీఆర్ టెస్టుల ద్వారానే నిర్ధారించడం కష్టమని, సిబ్బంది ఒత్తిడి పెరుగుతుందని సునీలా గార్గ్ అన్నారు.
ఇంత పెద్ద మొత్తంలో టెస్టులు నిర్వహించే సామర్ధ్యం భారత్ లేదని ఆమె అభిప్రాయపడ్డారు. అందుకే టెస్టింగ్, ఐసోలేషన్ కోసం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాన్ని విడుదల చేసిందని సునీలా వెల్లడించారు.
ఇంట్లోనే కరోనా టెస్టులు చేసుకోవడం వల్ల ఎటువంటి హాని జరగదని నిపుణులు చెబుతున్నారు. కానీ, దానిని సరిగ్గా ఉపయోగించాలని, భయపడాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇంటర్వ్యూ మధ్యలోనే లేచి వెళ్లిపోయిన యూపీ డిప్యూటీ సీఎం, ఏ ప్రశ్న అడిగితే ఆయనకు కోపం వచ్చిందంటే..
- కజకిస్తాన్ సంక్షోభం: భద్రతా బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన డజన్ల కొద్దీ నిరసనకారులు
- ప్రధాన మంత్రి భద్రత ఎలా ఉంటుంది? పంజాబ్ పర్యటనలో పొరపాటు ఎలా జరిగింది?
- హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన ఉత్తర కొరియా
- అమరావతి: క్యాపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ వ్యవహారం మళ్లీ ఎందుకు ముందుకొచ్చింది?
- కాలిఫోర్నియాలో వేర్వేరు సంవత్సరాల్లో జన్మించిన కవలలు
- సింధుతాయి సప్కాల్: అనాథల అమ్మ ఇక లేరు... చేతిని ముంగిస కొరికేస్తున్నా ఆమె ఓ కాగితం కోసం ఎందుకంత పోరాటం చేశారు?
- మనిషి, మొసళ్ల మధ్య మనుగడ పోరాటం
- కొంపముంచిన అలెక్సా, పదేళ్ల చిన్నారికి ప్రమాదకరమైన చాలెంజ్
- గోవాలో క్రిస్టియానో రొనాల్డో విగ్రహ ఏర్పాటుపై వివాదం
- అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామిని భూమిపైకి తెచ్చేందుకు డబ్బుల్లేక ప్రభుత్వం అక్కడే ఉంచేసింది
- WAN-IFRA ‘సౌత్ ఏసియా డిజిటల్ మీడియా అవార్డ్స్’లో బీబీసీకి 4 పురస్కారాలు
- స్పైడర్ మ్యాన్ జోరుకు అల్లు అర్జున్ పుష్ప, రణ్వీర్ సింగ్ 83 తగ్గక తప్పలేదా? బాక్సాఫీస్ వద్ద మార్వెల్ సినిమా కలెక్షన్ల జోరుకు కారణాలేంటి?
- మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?.. ‘24 గంటల్లో డబ్బు రెట్టింపు.. 50 వేలు పెట్టుబడి పెడితే ఆరు లక్షలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














