సింధుతాయి సప్కాల్: అనాథల అమ్మ ఇక లేరు... చేతిని ముంగిస కొరికేస్తున్నా ఆమె ఓ కాగితం కోసం ఎందుకంత పోరాటం చేశారు?

సింధుతాయి

ఫొటో సోర్స్, Getty Images

ప్రముఖ సామాజిక కార్యకర్త సింధుతాయి సప్కాల్ సోమవారం కన్నుమూశారు. గుండెనొప్పి కారణంగా పుణేలోని గెలాక్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆమె జనవరి 4న తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమెకు 75 ఏళ్లు.

సామాజిక రంగంలో ఆమె చేసిన సేవకు గుర్తుగా, 2021లో కేంద్ర ప్రభుత్వం, ఆమెను 'పద్మశ్రీ' పురస్కారంతో గౌరవించింది.

మహారాష్ట్రలో అనాథల అమ్మగా ప్రసిద్ధి పొందిన సింధుతాయి, తన జీవితంలో చాలా కష్టాలను అనుభవించారు. ఒక పబ్లిక్ కార్యక్రమంలో తన జీవిత అనుభవాల గురించి తెలిపారు. ఆమె జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్ల గురించి ఆమె మాటల్లోనే...

''నేను, ఇంట్లో ఎదురించి చదువుకోవడానికి ప్రయత్నిస్తున్నానని తెలియగానే మా అమ్మ నాకు పెళ్లి చేయాలని నిశ్చయించారు. పెళ్లి సమయంలో నా వయస్సు 10 ఏళ్లు. నా భర్త వయస్సు 35 ఏళ్లు. దురదృష్టవశాత్తు, నేను చదవడం, రాయడం నా భర్త సహించలేకపోయారు. ఆయన నిరక్షరాస్యుడు. ఏదీ చదువలేరు. దీంతో నేను చదువుతుండటాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. ఈ విషయంలో చాలా కోపగించుకునేవారు. నేను చదువుకోవడం చూడలేక, నన్ను కొట్టడం ప్రారంభించారు.''

''అప్పుడు నేను ఎలా చదువుకునేదాన్నంటే... ఆ రోజుల్లో కిరాణా దుకాణాల్లో కరపత్రాలు దొరికేవి. వాటికి ఒకవైపు రాసి ఉండేది. అందులో ఏం రాసి ఉందో చదువుతూ, దాని వెనుక భాగంలో రాయడానికి ప్రయత్నించేదాన్ని. ఎందుకంటే చదువడానికి నాకు అప్పుడు ఏమీ అందుబాటులో ఉండకపోయేవి. మా అత్తమామలు నన్ను గమనించేవారు. 'నీ భార్య ఇంట్లో పనులు చేయట్లేదు. చదువుకునేందుకు నాటకాలు చేస్తోంది' అంటూ నా భర్తకు నాపై ఫిర్యాదు చేసేవారు.''

వీడియో క్యాప్షన్, చీరకట్టి కర్రసాము చేస్తూ.. ఔరా అనిపిస్తున్న పాలకుర్తి ZPTC టాలెంట్ చూశారా..

''ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉండటంతో... నేను రాసుకున్న కాగితాలను ఇంట్లో ఉండే ఎలుకల కలుగుల్లో దాచిపెట్టుకునేదాన్ని. ఎలుకలు, కలుగు లోపలకి వెళ్లినప్పుడు దాంతోపాటే కాగితాలు కూడా లోపలికి వెళ్లిపోయాయి. ఒకరోజు, మా ఇంట్లో నేను ఒక పెద్ద ఎలుకను చూశాను. దాని కలుగు కూడా మిగతా వాటి కంటే పెద్దగా ఉంది. ఎందుకంటే అది ఎలుకలు ఉండేది కాదు ముంగిస నివసించే కలుగు.''

''పాము, ముంగిసల మధ్య ఉండే శత్రుత్వం గురించి మీకందరికీ తెలుసు. ఒకరోజు నేను, దాని కలుగులో ఒక కాగితాన్ని దాచిపెట్టాను. మరాఠీ కవి గజానన్ దిగంబర్ మద్గుల్కర్ రాసిన కవిత అందులో ఉంది. 'ఇంట్లో చదవడం కుదరదు కాబట్టి... ఇంట్లోని మహిళలంతా నీళ్లు తీసుకురావడానికి బయటకు వెళ్లినప్పుడు, ఆ సమయంలో అయినా కాస్త చదవడం నేర్చుకోండి' అనేది ఆయన రాసిన కవితలోని నిగూఢార్థం.’’

‘‘నేను కలుగులో పెట్టిన కాగితాన్ని ముంగిస శత్రువుగా భావించింది. కాగితాన్ని తీసుకునేందుకు నేను కలుగులోకి చేతిని పెట్టగానే, నా చేతిని పాముగా భావించింది. అది నా ఎడమ చేతి చిటికెన వేలును కరిచి పట్టుకుంది. ఇప్పటికీ కూడా నా వేలు కాస్త వంకరగానే ఉంటుంది. ముంగిస, నా వేలిని కొరికేయడమే కాకుండా దాన్ని అలాగే గట్టిగా పట్టుకుంది. కానీ నేను ఆ కాగితాలను మాత్రం వదిలిపెట్టలేదు. కాగితాలతో పాటు ఆ ముంగిసను కూడా బయటకు లాగాను. నాకు చదువుకోవాలనే కోరిక ఉండేది. అందుకే దాన్ని బయటకు లాగాను. కాగితంపై రక్తపు ధారలు కారుతున్నాయి. ఆ కాగితం చదవడం కోసం నేను ముంగిసతో పోరాటం చేయడంతో పాటు నా రక్తాన్ని కూడా చిందించాను.''

సింధుతాయి

ఫొటో సోర్స్, BARCROFT MEDIA

'నేను చదవడం, రాయడం అమ్మకు ఇష్టం లేదు'

''మా అమ్మకు నేను చదువుకోవడం ఇష్టం ఉండేది కాదు. నన్ను గేదెలను కాయడానికి పంపించేది. గేదెలు నీళ్లలోని వెళ్లగానే, నేను పాఠశాలకు వెళ్లేదాన్ని. ఈ కారణంగానే పాఠశాలకు ఆలస్యమయ్యేది. దీంతో టీచర్లు రోజూ తిట్టేవారు.''

'' ఒకరోజు, ఒక గేదె నీళ్లలో నుంచి బయటకొచ్చి, ఎవరో పంటపొలంలోకి వెళ్లింది. పంటనంతా గేదె తినేసిందని ఆ రైతు, పాఠశాలకు వచ్చి నాకు చెప్పారు. అప్పుడు నా విషయం మా టీచర్‌కు తెలిసి ఆయన చాలా బాధపడ్డారు. ఆయన పేరు వందిలె. ఆయన నా పట్టుదలను చూసి ఆశ్చర్యపోయారు. నేను పరీక్ష రాయకపోయినా ఆయన నన్ను నాల్గవ తరగతిలో పాస్ చేశారు.''

''నాకు 20 ఏళ్ల వయస్సున్నప్పుడు, నా భర్త బాగా కొట్టి నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు. అప్పుడు బంధువులు కూడా నాకు సహాయం చేయలేదు. అప్పటికే మా నాన్న చనిపోయారు. మా అమ్మ కూడా నాకు తన ఇంట్లో చోటివ్వలేదు. చేతిలో 10 రోజుల పసిపాపతో నేను రోడ్డున పడ్డాను. భిక్షాటన చేసుకుంటూ, పాటలు పాడుతూ ఎలాగోలా జీవనం సాగించాను.''

వీడియో క్యాప్షన్, ‘ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివిన నేను స్వీపర్‌గా పనిచేయాల్సి వచ్చింది.. ఇదీ నా కథ’

గేదెల కొట్టంలో నివసిస్తూ నా పోరాటాన్ని ప్రారంభించాను. ఆవుల పేడను ఎత్తినందుకు కూలీ పొందడం కోసం చాలా కష్టపడ్డాను. ఆవు పేడను సేకరించి అడవికి తీసుకెళ్తున్నందుకుగానూ కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశాను. ఆ సమయంలో వార్ధా కలెక్టర్‌గా ఉన్న రంగనాథన్ నాకు న్యాయం చేశారు. నాకు జీతం రావడం లేదని ఫిర్యాదు చేస్తూ ఆయనకు లేఖ రాశాను. నా డిమాండ్ ఆయనకు సబబుగా తోచడంతో నాకు న్యాయం జరిగింది.''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)