కర్మ అంటే ఏంటి? మనిషికి పునర్జన్మ నిజంగా ఉంటుందా? హిందూ మతం, బౌద్ధ మతం ఏం చెబుతున్నాయి?

బౌద్ధ మతం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మార్గరిటా రోడ్రిగ్యూజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చాలా మందికి కర్మ అంటే ఏంటి? మనిషికి పునర్జన్మ అనేది నిజంగా ఉంటుందా? అనే సందేహాలు వస్తుంటాయి.

ముఖ్యంగా కర్మ, పునర్జన్మల గురించి బౌద్ధ, హిందూ మతాలు ఏం చెబుతున్నాయో.. ఇద్దరు పరిశోధకుల సాయంతో బీబీసీ ముండో తెలుసుకునే ప్రయత్నం చేసింది.

"కొన్ని ఆలోచించలేనివి ఉంటాయి, ఎవరైనా వాటి గురించి ఆలోచించాలని ప్రయత్నిస్తే, వారు వాటిని ఎప్పటికీ పరిష్కరించలేరు" అని గౌతమ బుద్ధుడు చెప్పారు.

"వాటిలో ఒకటి 'కమ్మ' లేదా 'కర్మ' సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం, విశ్వం మూలాల గురించి ఆలోచించడం, దానిని సృష్టించారా, లేదా అనేది ఊహించడం" అని బౌద్ధ భిక్షువు నందిసేన బీబీసీకి చెప్పారు.

'కమ్మ' అనేది పాళీ బాషలోని ఒక పదం. ఈ భాషలోని చాలా పదాలు సంస్కృత భాషను పోలి ఉంటాయి. గౌతమ బుద్ధుడు స్వయంగా తన బోధనలను పాళీ భాషలోనే ఇచ్చారు. కమ్మ అంటే సంస్కృతంలో కర్మ అని అర్థం.

"బౌద్ధ మతం ఆదరణ పొందడంతో చాలా మంది పండితులు సంస్కృతమే ఉపయోగించడం ప్రారంభించారు. అయితే బుద్ధుడు మాత్రం దానిని ఉపయోగించలేదు" అని మెక్సికోలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ హిస్‌పానిక్‌కు సంబంధించిన నందిసేన చెప్పారు.

బుద్ధుడి అన్వేషణలో 'అంతిమ వాస్తవికత' అనేది ఒక భాగం. ఇది సంప్రదాయ వాస్తవికతకు పూర్తి భిన్నంగా ఉండే ఒక వర్ణించలేని వాస్తవికత.

అయితే పునర్జన్మ లాగే కర్మ కూడా పరిష్కరించలేని అత్యంత సంక్లిష్టమైన ఒక భావన. బౌద్ధం, హిందూ మతంలో వీటికి సంబంధించిన ఎన్నో బోధనలు, సంప్రదాయాలు ఉన్నాయి.

బుద్ధుడు

ఫొటో సోర్స్, Getty Images

బౌద్ధ మతం ఏం చెబుతోంది

గౌతమ బుద్ధుడుగా ప్రసిద్ధిచెందిన సిద్దార్థుడు 2500 సంవత్సరాల క్రితం ప్రస్తుతం నేపాల్‌లో ఒక రాజ కుటుంబంలో జన్మించాడు.

రాజ కుమారుడుగా జీవించాల్సిన ఆయన తన విలాసవంతమైన జీవితాన్ని వదిలి లోతైన ఆధ్యాత్మిక పరివర్తన మార్గంలోకి ప్రవేశించారు. చివరకు జ్ఞానోదయం పొంది బుద్ధుడుగా మారారు.

బౌద్ధమతాన్ని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 37 కోట్ల మంది విశ్వసిస్తున్నారని ఒక అంచనా. నందిసేన థెరవాడ శాఖతోపాటూ బౌద్ధానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శాఖలు ఉన్నాయి.

బౌద్ధ భిక్షువు అయిన నందిసేన బుద్ధుడి బోధనల ప్రకారం కర్మను మూడు తలుపుల రూపంలో వర్ణించారు.

1.శరీరం

2.భాష లేదా మాట

3.చిత్తం లేదా మనసు

భాష, శరీరం ద్వారా మనం ఇతరులతో సంభాషిస్తుంటాం. వాటి ద్వారానే ఇతరులకు మనం మంచి చేయడం, చెడు చేయడం, లేదా హాని తలపెట్టడం చేస్తుంటామని ఆయన చెప్పారు.

చిత్తం అనేది మన ప్రత్యేక గదికి ఉండే తలుపు లాంటిదని నందిసేన చెబుతారు. శరీరం, భాషను మాత్రం బహిరంగ ప్రాంతాల్లో ఉండే తలుపులా వర్ణించారు.

మన వ్యక్తిగత గది తలుపులా ఉండే మన మనసు, మనల్ని శరీరం, భాష అనే తలుపుల వైపు తీసుకెళ్తుంది.

"బౌద్ధంలో నైతికత అనే దానికి శరీరం, భాష అనే ఈ తలుపులతో సంబంధం ఉంటుంది. అందుకే వాటిని మేం బహిరంగ ప్రాంతాల్లో తలుపుల్లా వర్ణిస్తాం" అని భిక్షువు చెప్పారు.

"ఆ తలుపుల ద్వారా అంటే శరీరం, భాష, లేదా మనసు అనే తలుపుల నుంచి వెళ్లి మనం ఏదైనా చేసినపుడు, అలా చేసిన ప్రతిదానినీ కర్మ అంటారు."

వీడియో క్యాప్షన్, ఈ బౌద్ధారామం ఎందుకు భూవివాదాలకు కేంద్రమైంది

"రెప్పపాటులో లెక్కలేనన్ని ఆలోచనలు పుడుతాయి, నశిస్తాయి" అని గౌతమ బుద్ధుడు చెప్పాడు. ఒక మాట, లేదా శరీరం ద్వారా జరిగే కర్మ ఒక నిర్దిష్ట కాలంపాటు ఉండే సమయంలో కొన్ని వందల కోట్ల ఆలోచనలు కలుగుతాయని ఊహించండి.. అవి ఆ కర్మను పూర్తి చేసేలా మనల్ని ప్రేరేపించి నడిపిస్తాయి" అని ఒక నిపుణుడు చెప్పారు.

ఆ క్షణాల్లో ఒక్కో క్షణాన్ని మనం ఒక కర్మ యూనిట్ అంటాం. టెక్నికల్‌గా చెప్పాలంటే అదే కర్మ.

బుద్ధుడి బోధనల ప్రకారం మేం దాన్ని ఇచ్ఛ అంటాం. అలా కర్మలతోపాటూ ప్రతి ఇచ్ఛా స్థితి ఒక సామర్థ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది.

అంటే మనం ఏదైనా మాట్లాడినా, చేసినా లేదా ఆలోచించినా, అక్కడ ప్రతిసారీ మనకు ఒక ఉద్దేశం ఉంటుంది. మన నుంచి ఒక సామర్థ్యం ఉత్పన్నం అవుతుంది.

ఒక కర్మ అంటే ఉదాహరణకు దయ, కరుణ లాంటివైనా, ఇతరులకు హాని కలిగించే పనులైనా అవి చేయడానికి మనలో నిరంతరం ఒక సామర్థ్యం ఉత్పన్నం అవుతుంది.

ఆ కర్మకు సంబంధించి ఏదైనా ఒక ఫలితం, లేదా పరిణామం ఉత్పన్నం అయ్యేవరకూ ఆ సామర్థ్యం అలాగే ఉంటుంది.

"ఈమధ్య చాలా మంది కర్మ ఫలితం గురించి మాట్లాడుతున్నారు.. ఇది నా కర్మ, అందుకే నాకు ఇలా జరిగింది అంటుంటారు. కానీ వాస్తవానికి, కర్మ అనేది ఒక చర్య, ఆ చర్యకు, దాని ఫలితానికి మధ్య సంబంధాన్నే కర్మ లేదా కర్మ సిద్ధాంతం అంటారు" అంటారు నందిసేన.

వీడియో క్యాప్షన్, 2000 ఏళ్ల నాటి కట్టడం ఇది

బౌద్ధంలో పునర్జన్మ

మన మనస్సాక్షి ఆధారంగా కొన్ని లక్షణాలు లేదా భౌతిక గుణాలు ఉంటాయని నందిసేన చెప్పారు.

మనందరికీ ఆరు రకాల స్పృహలు ఉంటాయి. కళ్లు, చెవులు, ముక్కు, నాలుక, స్పర్శ, మనసు.. అవన్నీ మన భౌతిక లక్షణాల ఆధారంగా ప్రేరేపితం అవుతాయి.

ఈ భౌతిక లక్షణాలన్నీ నశించినపుడు మనిషికి మృత్యువు సంభవిస్తుంది.

కానీ, మానసిక స్పృహ అనేది మరణం తర్వాత కూడా జీవించే ఉంటుంది. అది తక్షణం ఒక ప్రక్రియను అనుసరిస్తుంది. అది మరో జీవితం ఆవిర్భావంతో ముడిపడి ఉంటుంది.

"బౌద్ధ మత బోధనల ప్రకారం వీర్యం, అండం కలిసిన క్షణంలో అక్కడ తల్లిదండ్రులతో సంబంధం లేకుండా బయట నుంచి కూడా ఒక అంకురం జరుగుతుంది. దానినే మేము రీ-కనెక్షన్ అంటాం" అని నందిసేన చెప్పారు.

ఆ క్షణంలోనే చైతన్యానికి ఆధారం పుడుతుంది. దాని నుంచే వివిధ ఇంద్రియ సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి.

"మేం పునర్జన్మ అనే మాటను ఉఫయోగించం. ఎందుకంటే ఒక క్షణం నుంచి ఇంకో క్షణానికి అలా జరిగేదేమీ ఉండదు. అక్కడ ఒక కొనసాగింపు మాత్రమే ఉంటుంది. కానీ, దానికి ఎలాంటి గుర్తింపు ఉండదు. అక్కడ గత చేతనకు సంబంధించి తర్వాత చేతనకు సారం లాంటిది ఏదీ చేరుకోదు."

అయితే బౌద్ధమతంలోని కొన్ని శాఖలు 'పునర్జన్మ' అనే మాటను గుర్తిస్తాయని ఆయన చెప్పారు.

"మేం టెక్నికల్‌గా రీ-కనెక్షన్ అనే మాటనే ఉపయోగిస్తాం. ఆ పదం పాళీ నుంచి నేరుగా అనువదించినది. బహుశా పునర్జన్మ అనే పదం ఉపయోగించడం వల్ల జనాలకు, అది మరింత సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది" అన్నారు.

హిందూ మతం

ఫొటో సోర్స్, Getty Images

హిందూ మతం ఏం చెబుతోంది

"పుట్టినవానికి మరణం తప్పదు.. మరణించినవానికి పుట్టుక తప్పదు. అందుకే, తప్పించుకోవడానికి వీలులేని దాని విషయంలో నీవు దుఃఖించడం తగదు"-భగవద్గీత

ప్రాచీన భారత వేదాంతం, ఆలోచనల్లో కర్మ, పునర్జన్మ ఉనికి గురించి పూర్తిగా ఏకాభిప్రాయం ఉందని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం సంస్కృత భాషాశాస్త్ర స్కాలర్ ఆస్కార్ పూజోల్ బీబీసీ ముండోకు చెప్పారు.

"ఇది వింతగా ఉండచ్చు, కానీ ప్రాచీన భారతీయ చరిత్రలో దీని గురించి ఎంత స్పష్టంగా రాశారంటే, బహుశా దీనికి ఎలాంటి ఆధారాలు అవసరం లేదు" అంటారు ఆయన.

ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల మందికి పైగా హిందూమతాన్ని విశ్వసిస్తున్నారు. భారత్, నేపాల్ హిందూ జనాభా ఎక్కువగా ఉన్న దేశాలు.

బీబీసీ రిలిజియస్ యూనిట్ వివరాల ప్రకారం ప్రపంచంలోని ఇతర మతాలకు ఉన్నట్లు హిందూ మతానికి ఒక స్థాపకుడు, ఒక మత గ్రంథంలా విశ్వవ్యాప్తంగా ఆమోదించినవి ఏవీ లేవు.

ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రపంచంలో ఉనికిలో ఉన్న అత్యంత పురాతనమైన మతం.

సైద్ధాంతికంగా ఇది ఎన్నో రకాలుగా జైన, బౌద్ధ, సిక్కు మతాలకు సంబంధించినది కూడా. చాలా మంది పండితులు హిందూ మతాన్ని ఒక మతంగా పరిగణించడానికి బదులు దానిని ఒక జీవిత సారాంశంగా, లేదా వివిధ మతాల కుటుంబంగా వర్ణించారు.

హిందూ మతం

ఫొటో సోర్స్, Getty Images

హిందూ మతం ప్రకారం కర్మ అంటే ఏంటి?

హిందూ మతం దృష్టికోణంలో కర్మ అనేది ముఖ్యంగా ఈ భౌతిక ప్రపంచం కోసం, ఈ ప్రపంచంలో ఉన్నవారికోసం ఒక నియమం లాంటిది అని పూజోల్ చెప్పారు.

కొంతమంది దీనిని భౌతిక శాస్త్రంలో గురుత్వాకర్షణ శక్తిలాంటిది అంటారు.

కారణం, దాని ప్రభావం లాగే కర్మను అర్థం చేసుకోవడం చాలా సులభం. ఒక కారణం, దాని నుంచి ఉత్పన్నమయ్యే ప్రభావం. ఇతర ప్రభావాలకు కారణంగా మారుతాయి.

కారణం, ప్రభావం అనే ఈ నిరంతర ప్రక్రియ విశ్వాన్ని, మానవుడి ఉనికిని సృష్టిస్తుంది. కానీ అది కేవలం భౌతిక కర్మ వరకే పరిమితం కాకుండా, నైతిక కోణాలను కూడా కలిగి ఉంటుంది.

అంటే సానుకూల కర్మ ఫలితం సానుకూలంగానే ఉంటే, ప్రతికూల కర్మ ఫలితం ప్రతికూలంగానే ఉంటుంది.

పూజోల్

ఫొటో సోర్స్, COURTESY: ÓSCAR PUJOL

ఫొటో క్యాప్షన్, పూజోల్

హిందూ మతంలో పునర్జన్మ

ఒక మనిషి చనిపోయినపుడు, అతడి దగ్గర ఉన్న వివిధ రకాల శక్తులు కూడా అంతమవుతాయి అని నిపుణులు చెబుతున్నారు.

మొదట శరీరం చనిపోతుంది, తర్వాత ఇంద్రియాలు, తర్వాత శ్వాస నశిస్తాయి. అన్నీ పోయిన తర్వాత పునర్జన్మ పొందే అత్యంత సూక్ష్మ భాగం మాత్రమే మిగులుతుంది.

చిత్తం అనేది మన శరీరంలో హార్డ్ డిస్క్‌లా ఉంటుంది. మనం చేసిన అన్ని కర్మలూ అక్కడ నమోదవుతాయి.

"మనకు సంబంధించిన సమాచారం పునర్జన్మ తీసుకోదు. అందుకే కొత్త జీవితంలో ఇంతకు ముందు జన్మలో మనం ఎవరు అనేది మనకు తెలీదు. మనం మన గత జన్మ గుర్తింపును కోల్పోతాం" అని నిపుణులు చెబుతున్నారు.

ఎన్ని జన్మలు

"దీనికి సంబంధించి ఎన్నో అభిప్రాయాలు ఉన్నప్పటికీ, సాధారణంగా ఒక మనిషి తన తర్వాత జీవితంలో ఏదో ఒక రూపంలో జన్మించవచ్చని విశ్వసిస్తారు. పునర్జన్మలో అతడు కచ్చితంగా మనిషిగానే పుట్టాలనే ఏం లేదు" అని పూజోల్ అంటున్నారు.

అయితే ఎన్ని జన్మలు ఉంటాయనేదానిపై ప్రముఖుల అభిప్రాయాల ప్రకారం అది ఎప్పటికీ అంతం కాని ఒక చక్రం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)