మహిళలను హింసించేది ఒక్క మానవ జాతేనా? ఇతర జంతువులు ఆడవాటిపై బలప్రయోగం చేయవా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నోబెర్టో పెరేడ్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జెండర్ వయొలెన్స్... స్త్రీల మీద హింస అనేది జన్యు సమస్యా? లేక సాంస్కృతిక సమస్యా?
అనేక పరిశోధనల తర్వాత ఫ్రాన్స్‌కు చెందిన పాలియో ఆంత్రోపాలజిస్టులు (పురాతన మానవులపై పరిశోధనలు జరిపేవారు) ఇది కచ్చితంగా జన్యుపరమైన సమస్య కాదని తేల్చి చెప్పారు.
“హోమోనిడ్ ప్రజాతి (ఇందులో మనుషులు కూడా ఉంటారు)కి చెందిన జంతువులలో తేడాలు ఉన్నాయి. వీరిలో మగ మనుషులు, చింపాంజీలు తమ ఆడవారి పట్ల క్రూరంగా వ్యవహరిస్తాయి. అయితే, చింపాంజీలలో కూడా బోనొబోస్ వర్గానికి చెందిన చింపాంజీలు అలా ప్రవర్తించవు’’ అని ప్రొఫెసర్ పాస్కల్ పిక్ చెప్పారు.
కాలేజ్ ఆఫ్ ఫ్రాన్స్‌లో పాస్కల్ పిక్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. మానవజాతిలోని వైవిధ్యభరితమైన లక్షణాలను అధ్యయనం చేస్తున్న ఆయన వీటిపై పలు పుస్తకాలు కూడా రాశారు.
మనిషి గురించి తెలుసుకోవాల్సిన అనేక అంశాలు ఇంకా మిగిలే ఉన్నాయంటున్నారు పిక్.
ఆయన ఇటీవల రాసిన “అండ్ ఎవల్యూషన్ క్రియేటెడ్ ఉమన్’’ అనే పుస్తకంలో స్త్రీ పురుషుల మధ్య పురాతన కాలం నుంచీ ఉన్న సంబంధ బాంధవ్యాలను విశ్లేషించారు.
హోమోసేపియన్‌ల గురించి ఈ పుస్తకంలో రాసిన ఆయన, గొరిల్లా, ఏప్స్‌తో పోల్చినప్పుడు ఆడవారిపట్ల అత్యంత క్రూరంగా ఉండే జాతి మానవజాతేనని తేల్చిచెప్పారు.
తాను ఇలాంటి అభిప్రాయానికి ఎందుకు వచ్చానో, దానికి కారణమైన నిలిచిన అంశాలేంటో ప్రొఫెసర్ పిక్ బీబీసీ ముండోకు వివరించారు. మనుషులలో ఉన్న మగ ఆధిపత్యం భావన పూర్తిగా పోవడానికి ఎంతకాలం పడుతుందో కూడా ఆయన అంచనా వేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మగవాడే అన్నీ సృష్టించాడా?
ఈ అంశాన్ని పరిశోధన కోసం ఎంచుకోవడానికి కారణమేంటి? దానికి దారి తీసిన పరిస్థితులేంటి? అని ప్రొఫెసర్ పిక్‌ను అడిగినప్పుడు మానవ జాతి పరిణామాన్ని చరిత్రకెక్కించిన తీరే దీనిపై ఆసక్తి కలగడానికి కారణమన్నారు.
మానవ పరిణామ క్రమమంతా మగవాడు కేంద్రంగా సాగినట్లుగా రాశారని ఆయన అంటారు.
మానవ పరిణామంతా మగవాడితోనే మొదలైనట్లు చరిత్ర చెబుతుంది. చరిత్ర పూర్వయుగంలో ఆడవారి ప్రస్తావన తక్కువగా ఉంటుంది. మగవాడే బొమ్మలేశాడు, మగవాడే ఆయుధాలు తయారు చేశాడు, మగవాడే వేటాడాడు.
మగవాళ్లతో కలిసి ఆడవాళ్లు పరిణామం చెందారు తప్ప, విడిగా ఆడవాళ్ల పరిణాక్రమం గురించి ఎక్కడా కనిపించదు.
ఇక రెండో అంశం పాశ్చాత్యులు ప్రతిపాదించిన మానవ జాతి పరిణామ సిద్ధాంతం. తాము ప్రతిపాదించిన సిద్ధాంతమే అసలైన సిద్ధాంతమని పాశ్చాత్య శాస్త్రవేత్తలు ప్రకటించుకోవడం వల్ల దీనిపై వారి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. దీన్నే సాంస్కృతిక పరిణామ క్రమం అంటున్నారు.
ఈ సాంస్కృతిక మానవ పరిణామవాదం 19వ శతాబ్దిలో పుట్టిన ఆలోచన. ఈ సిద్ధాంతంలో పూర్తిగా మగవారి ఆధిపత్యం కనిపిస్తుందని, ఆడవారిపట్ల పూర్తిస్థాయి వివక్ష కనిపిస్తుందని అందువల్లే పరిణామ చరిత్రలో ఆడవారి ప్రస్తావన కనిపించదని కొందరు వాదిస్తున్నారు.
మరోవైపు వివిధ జాతులలో స్త్రీ పురుషుల మధ్య సంబంధాల పరిశోధనపై ఇటీవలి కాలంలో ఆసక్తి పెరిగింది. ఎందుకంటే మానవ ప్రవర్తన సిద్ధాంతాలలో కూడా ఆడవాళ్లకు సరైన ప్రాధాన్యమివ్వ లేదు.

ఫొటో సోర్స్, Getty Images
స్త్రీ పురుషుల అసమానత వివిధ జంతువులలో ఎలా ఉంది?
సాధారణంగా క్షీరదాలలో ఆడవారిపై లైంగిక హింస తక్కువ. చాలా జాతి జంతువులలో మగ జంతువులు ఆడవాటి పట్ల క్రూరంగా వ్యవహరించడం తక్కువగా కనిపిస్తుంది.
వానరాల నుంచి పరిణామం చెందిన లీమర్‌లు, కోతులను గమనించినట్లయితే మడగాస్కర్‌లోని లీమర్‌లు ఆడ లీమర్‌లపై ఆధిపత్యాన్ని చూపిస్తాయి. కానీ వాటిని హింసించే సందర్భాలు మాత్రం చాలా తక్కువ.
దక్షిణ అమెరికాలోని కోతులలో లైంగిక బలాత్కారాలు కనిపించవు. ఒకే కోతితో సంచరించేవి, అనేక కోతులతో లైంగిక సంబంధాలు పెట్టుకునే ఆడకోతులు కనిపిస్తాయి. అయితే వీటిలో మగ కోతులు చాలా బలమైనవైనా ఆడవాటిని హింసించడం కనబడదు.
ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లలోని వానరజాతికి చెందిన బబూన్లు, మకాక్స్ బలమైనవే అయినా ఆడవాటి మీద తమ ప్రతాపం చూపించవు.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడి ఆడ కోతులు ఒక గుంపుగా ఉంటుంటాయి. వాటి ప్రాంతాన్ని రక్షించుకోవడానికి, ముఖ్యంగా మగ కోతులు దౌర్జన్యాల నుంచి కాపాడుకోవడానికి అవి తల్లులు, అక్కా చెల్లెళ్లతో కలిసి జీవిస్తుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
మనుషుల సంగతేంటి?
మహిళలపై హింస ప్రధానంగా సామాజిక, సాంస్కృతిక సమస్య తప్ప జన్యుసంబంధమైనది కాదు. మన పూర్వీకులైన నియాండర్తల్ మహిళలు కూడా లింగ ఆధారిత హింసను అనుభవించి ఉంటారు.
చింపాంజీ నుంచి జన్యువులను పంచుకుని ఎదిగాడు మనిషి. చింపాంజీలలో కూడా హింసాత్మక ధోరణి ఉంటే అది జన్యు సంబంధమైనది అనుకోవచ్చు. కానీ బోనోబోస్ అనే రకం చింపాంజీలు హింసాత్మక ప్రవృత్తితో కనిపించవు. కాబట్టి ఇది జన్యుపరమైంది అనుకోవడానికి వీల్లేదు.
ఆడవారిని మగవారు చంపే ఘటనలు మానవజాతులలో మాత్రమే కనిపిస్తాయి. చింపాంజీలు, కొన్ని రకాల మకాక్ కోతులలో హింసాత్మక ప్రవృత్తి ఉన్నా, ఆడ జంతువులను హత్య చేయడం కనబడదు.
అవి బుద్ధిమంతులు అని చెప్పలేం కానీ హంతకులు కాదని మాత్రం చెప్పొచ్చు. ఒరాంగుటాన్‌లో కూడా ఇలాంటి ప్రవృత్తే కనిపిస్తుంది. కానీ వాటిలో లైంగిక బలాత్కారాలు, హత్యల్లాంటివి కనిపించవు.

ఫొటో సోర్స్, AFP
మానవ చరిత్రలో మహిళల పాత్ర ఎలా మారుతూ వచ్చింది?
మానవ పరిణామ క్రమంలో స్త్రీ పాత్ర పురుషుడికన్నా ఏ విధంగానూ తక్కువ కాదు. కానీ దాన్ని చరిత్రకారులు విస్మరించారు.
ఫ్రెంచ్ విప్లవం, మొదటి ప్రపంచ యుద్ధంలాంటి వాటిలో కూడా మహిళలు పాల్గొన్నారు. కాని చరిత్రను మహిళల కోణం నుండి చూడటానికి రెండో ప్రపంచ యుద్ధం వరకు వేచి ఉండాల్సి వచ్చింది.
మహిళలకు ప్రాధాన్యమిచ్చే విషయంలో సమాజం చాలా వరకు మారింది. చాలా దేశాలలో, ఆరోగ్యం, చదువు, ఉద్యోగాలలో స్త్రీ పురుషుల మధ్య సమానమైన కనిపిస్తున్నాయి.
అయితే, ఇంకా చాలా ప్రాంతాలలో అసమానతలు కొనసాగతున్నాయన్నది మాత్రం నిజం.
రాజకీయ రంగంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇంగ్లండ్, ఇతర ఉత్తర యూరోపియన్ దేశాలలోనే మహిళా నాయకులు, ప్రధాన మంత్రులు కనిపిస్తారు. దక్షిణ ఐరోపా, మిగిలిన ప్రపంచంలో ఇది చాలా అరుదు.
ప్రొఫెసర్ పాస్కల్ పిక్ తేల్చిందేమిటంటే మానవ పరిణామ క్రమంలో మహిళల మీద అనేకరకాల హింస జరిగింది. దానికి రకరకాల సామాజిక పరిస్థితులు కూడా తోడయ్యాయి. అయితే హింస ఉన్నా, ఇప్పటితో పోలిస్తే అప్పుడు చాలా తక్కువ. అంతేకాదు ప్రస్తుత సమాజంకంటే గతంలోనే స్త్రీ పురుషుల మధ్య సమాన పరిస్థితులు ఉండేవి.
ఇవి కూడా చదవండి:
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- కరోనావైరస్: కేరళలో దాచి పెట్టిన కోవిడ్ మరణాల గుట్టు రట్టు చేసిన వలంటీర్లు
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- గంగా నదిలోకి ఘరియల్ మొసళ్లను వదులుతున్నారు.. ఎందుకంటే...
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు
- నన్ను ఇలా వేధించారు!’
- ప్రేమ - శృంగారం - వైకల్యం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








